5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యలు బాబోయ్ సమస్యలు

ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి:

మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు.

కిరణ్ కుమార్ రెడ్డి:  మంత్రులు, అధికారులూ నా మాట వినేలా చెయ్యి దేవుడా. అట్టాగే తెలంగాణ గొడవ వచ్చే ఎన్నికల్దాకా ఇట్టాగే సాగేట్టుగా చూడు. అదే నా పదవికి శ్రీరామరక్ష!

చంద్రబాబు: ఈ వేర్పాటు గొడవేంటోగానీ.., తెలంగాణలో నాకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేకుండా పోయింది. ఈ సమస్య తొందరగా తేలిపోయేట్టుగా, తెలంగాణలో నా పరపతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేట్టుగానూ దీవించు స్వామీ!

కేసీయారు: తెగేదాకా లాగామేమో అనే డౌటు వచ్చేస్తోంది. నా తిప్పలేవో నేను పడి, ఏదో ఒకటి చేసి తెలంగాణ రాకుండా ఆపుకుంటాను. ఒకటే కోరిక, రాశేరె లాగా పేపరు పెట్టాను, టీవీ పెట్టాను, ముఖ్యమంత్రి యోగం మాత్రం ఇంకా రాలేదు. అంచేత దేవా, రాష్ట్రం విడిపోయినా కలిసే ఉన్నా.. మా పార్టీ కాంగ్రెసులో కలిసాక మాత్రం ముఖ్యమంత్రి నయ్యే అవకాశం కల్పించు. ఆ తరవాత, రాశేరె సంపాదించుకున్నవి నేనూ సంపాదించుకుంటాను. ఇంకో కోరిక దేవా.. రాశేరె లాగా హెలికాప్టరు యోగం మాత్రం ఇప్పించకు.

జగన్: అక్రమార్జన అంటూ నామీద కేసులు పెట్టేస్తున్నారు ప్రభూ. నా అక్రమాలన్నీ సక్రమాల్లా కనబడేట్టుగా డాక్యుమెంట్లు  సృష్టించి పెట్టాను. అవి చూసిన వాళ్ళకు తల తిరిగిపోవడం ఖాయం. కానీ అర్థం చేసుకోగలిగే బుర్ర ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని భయం కలుగుతోంది.. అలాంటివాళ్ళు ఆ డాక్యుమెంట్లు చూస్తే, వాళ్ళకు వెంటనే పిచ్చి ఎక్కేలా ఆశీర్వదించు ప్రభూ.

రాజీనామా చేసిన ఎంపీ: రాజీనామాల విషయంలో ఎనక్కి పోదామంటే జనం ఊరుకోరు. ముందుకుపోదామంటే ఆమోదించేస్తారేమోనని భయమేస్తోంది. ఎటూ పోకుండా ఉందామంటే ఎటూ కానివాళ్ళమని ఆ కోదండరామ్ తిడతాడు. అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయాను. ప్రభూ, రాజీనామాల కట్టలోంచి నా రాజీనామాను బైటికి లాగి, దానిలో  నా పేరు, సంతకం తీసేసి వాటి ప్లేసులో సర్వే సత్యనారాయణ పేరు, సంతకం పెట్టెయ్యి. జనానికి రాజీనామా చేసినట్టు నేను కనబడతాను. పదవంటూ పోతే గీతే సర్వేది పోద్ది. అదన్నమాట!

చిరంజీవి: స్వామీ, నాకు ఏ సమస్యా లేదు, అదే నా సమస్య. సమస్యేమీ లేకపోవడంతో నన్నెవుడూ పట్టించుకోడం లేదు. కనీసం తిట్టడం కూడా లేదు. పోనీ నేను మాట్టాడదామంటే.., దేని గురించి మాట్టాడాలో తెలవడం లేదు. పేపర్లలో నా పేరు కనబడ్డమే లేదు. నాక్కూడా ఏదైనా సమస్య తెచ్చిపెట్టు! దేవా.., ఒక్క సమస్యైనా ఇవ్వు! ఒకే ఒక్ఖ సమస్య ఇవ్వు ప్రభూ! 

4 కామెంట్‌లు:

  1. మన్‌మోహన్ సింగు ని వదిలేసారు.

    కాముధ

    రిప్లయితొలగించండి
  2. ఆశ్చర్యంగా ఉందండీ.. ఆఖరికి చిరంజీవి కూడా గుర్తున్నాడు గానీ, మన్మోహన్ సింగు మాత్రం గుర్తుకు రాలా - ఎంత ’అ’ప్రధానమంత్రి అయినప్పటికీ!

    రిప్లయితొలగించండి
  3. చదువరి గారు, అసలు టపాకంటే కొసరుగా మీరు వ్రాసిన కామెంటు అధిరింది. పాపం మన మోహనుడు :)

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు