4, ఆగస్టు 2011, గురువారం

ఈ రోజుల్లో ఢిల్లీలో ఒకరోజు

ఢిల్లీ నుంచి అందిన రెండు వార్తల గురించిన వివరాలివి, చదవండి.
.................................................................................

కాంగీసాఫీసులో విలేఖరుల సమావేశం జరుగుతోంది. అధికార ప్రతినిధి మాట్టాడుతున్నాడు..

మా మేడమ్మకు ఒంట్లో బాగోకపోడం మూలాన అమెరికా వెళ్ళారు. రెండు మూడు వారాల దాకా తిరిగి రారు. ఈ లోగా తాననుభవిస్తున్న అధికారాలను ఇలా సర్దారు..


పార్టీలోని అధికారాలను రాగుల్, ఏంటోగానీ, అహ్మద్ జటిల్, పరాజయ్ సింగుకు కట్టబెట్టారు. నిర్ణయాలు ఎవరు తీసుకున్నా పర్లేదుగానీ, సంతకాలు మాత్రం పై నలుగురిలో కనీసం ఇద్దరు పెట్టాలి. అందులో రాగుల్ సంతకం తప్పనిసరి.

ప్రభుత్వ అధికారాలను మొహమ్మొత్తెన్ సింగ్, ప్రణబ్ బెనర్జీ, అంబాలికా సోనీలకు కట్టబెట్టారు. నిర్ణయాలు ఎవరు తీసుకున్నా పర్లేదు. సంతకాలు పెట్టేముందు మాత్రం ప్రతీ రోజూ రాత్రి పదింటికి మొహమ్మొత్తెన్ సింగ్, ప్రణబ్ బెనర్జీలు వీడియో కాన్ఫరెన్సులో మేడమ్మతో మాట్టాడి, ఆమె అనుమతి తీసుకున్నాకే సంతకాలు పెడతారు. ఆ తరవాత అంబాలికా సోనీ విడిగా ఆమెతో మాట్టాడి తన రోజువారీ నివేదికలిస్తారు.

                 సార్, ప్రభుత్వ అధికారాలు ప్రధానమంత్రి దగ్గర కదా ఉండేది. ఇదేంటీ మీరు ఇలా చెబుతున్నారు?
                 ఏం బాబూ, ఇండియాకు కొత్తా? కూచ్చో కూచ్చో!

ఓ ముఖ్యమైన విషయం.. మేడమ్మ అమెరికాలో ఉన్నన్ని రోజులూ పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా రాత్రి తొమ్మిదింటి నుంచి తెల్లారు జామున ఐదింటి దాకా పని చేస్తాయి. అమెరికాలో ఉంది కాబట్టి, మేడమ్మకు ఈ టైములైతేనే వీలుగా ఉంటది.

మరో విషయం - మేడమ్మకు బాధ్యతలేమీ లేవు కాబట్టి, ప్రత్యేకించి వాటిని డెలిగేటు చెయ్యాలన్న ప్రశ్నే తలెత్తదు.

ఇంకో విషయం - తాను తిరిగి వచ్చేదాకా తెలంగాణ సమస్య మీద ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకూడదని ఆదేశించారు.
==============
ఇది విన్న తెలంగాణ కాంగ్రెసు ఎంపీలంతా గుడ్ల నీళ్ళు కుక్కుకున్నారు. ఓ ఎంపీ ఇంట్లో సమావేశమయ్యారందరూ.


"ప్చ్, అమ్మగారికి ఇప్పుడే అనారోగ్యం కలగాలా? ",  నిట్టూర్చాడొకాయన.
"మూడు వారాల పాటు ఏమీ జరక్కపోతే జనం ఊరుకుంటారా? ",  దిగాలు పడ్డాడొకాయన.
"జనం ఏమీ అనరయ్యా బాబూ. కేడీయారే.. ఎన్నెన్ని బూతులు తిడతాడోనని నాకు బయంగా ఉంది" ,  దిగులు పడ్డాడో నేత.
"మరీ ఏం చెయ్యకుండా ఉండేబదులు  మనల్ని ఓసారి పిలిచి టీపార్టీ ఇవ్వమని చెప్పొచ్చుగా’",  నిరసించాడు మరో నేత.  
"హుఁ, మళ్ళీ మూడు వారాల పాటు  ఎవడికీ కనబడకుండా దాక్కోవాలి కాబోలు", నీరసించాడు ఇంకో నాయకుడు.

మిగిలినవాళ్ళు కూడా దీర్ఘంగా నిట్టూర్చాక, మొదటాయన మళ్ళీ.. "దీనిపై ఏం చెయ్యాలో చర్చించుకునేందుకు రేపు బొంద జనార్దనం గారింట్లో బోయినాల టైముకు మీటౌదాం" అని అన్నాడు.
జనార్దనం వెంటనే లేచి పెద్దగా, "న్నో!! నేనొప్పుకోను, పద్దాక మా ఇంట్లోనేనా? ఇప్పుటికే ఇరవై సార్లయింది. టీపార్టీ అని, డిన్నరనీ, లంచనీ, నా బొందనీ.. ఇక ఈ ఖర్చులు పెట్టుకోడం నావల్ల కాదు. మీ ఇంట్లోనే పెట్టు" అని అన్నాడు.
’అది కుదరదులే’ అని మనసులోనే అనుకుని, "పోనీ కలామ్ నబీ గారికి ఫోన్చేసి, రేపు ఒకసారి అపాయింటుమెంటివ్వమని అడుగుదాం. లంచి అక్కడ చేసెయ్యొచ్చు.", అన్నాడు.
"సరే, సరే, అలాగలాగే", అన్నారు అంతా.
సెల్లుకు ఫోను చేసాడు. లక్కీగా తీసాడు కలామ్ నబీ.. "ఏందయా, మీరింకా ఢిల్లీలోనే ఉన్నారా? హైదరాబాదు పోలేదా!!?"  కొద్దిగా విసుగు ధ్వనించింది ఆయన గొంతులో (కనీసం కోపం కూడా కాదు).
"లేదు సార్, ఈ పరిస్థితుల్లో పోలేం సార్"
"స్సరే, ఇప్పుడు ఫోనెందుకు చేసినట్టూ?"
"మరొక్కసారి మీ అపాయింటుమెంటు కావాలి సార్"
"ఇదుగో మీకు మొన్నే చెప్పా.. నా క్కుదరదని"
"సార్, రేపు మధ్యాహ్నం లంచప్పుడు ఒక్ఖ అరగంట తీరిక చేసుకోండి సార్"
"లంచికా.. న, న్నహ్.., కుదరదు!"
"...పోనీ, లంచి అయ్యాక? ఒక్ఖ పావుగంట సార్.."
"లంచి తరవాతా? ఇహ నే న్నిదర పోనక్కర్లేదా?"
"పోనీ నిదర లేచాక కలుద్దాం సార్, ప్లీ..జ్"
"... సరే, రేపు మజ్జాణం రొండింటికి రండి. ఓ ఐదా ర్నిముషాలు మాట్టాడదాం"
"సార్, థ్యాంక్యూ సార్. అలాగే వస్తాం సార్"

ఫోనయ్యాక, అందరూ మొహాలు కడుక్కుని, తలా కాసిని నవ్వు లతికించుకుని బైటికొచ్చారు. అక్కడే తచ్చాడుతున్న విలేఖరులతో మాట్టాడుతూ, "ఇప్పుడే మేడంతో మాట్టాడాం. తెలంగాణ విషయమ్మీద సత్వరమే నిర్ణయం తీసుకుంటామని మేడం మళ్ళీ చెప్పారు. వెం..ఠనే మాతో మాట్టాడమని ఆమె అప్పటికప్పుడే కలామ్ నబీ గారిని ఆదేశించారు. త్వరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని మాకు నమ్మకం కలిగింది. రేపు మళ్ళీ కలామ్ నబీ గారిని కలిసి ఇక తెలంగాణ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తెగేసి చెప్పేస్తాం, అంథే!", అని పళ్ళు నూరారు.

10 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. హాస్యస్ఫోరకంగా ఉన్నప్పటికీ ఇందులో వ్యంగ్యం ఏమీ లేదే. కరెక్టుగా అక్కడ రోజూ జఱుగుతున్నదే మీరు వ్రాశారు. అయితే అక్కడిదాకా వెళ్ళకుండానే మీరు ఇదంతా మనోనేత్రంతో గ్రహించడం చూస్తూంటే "తెలబాన్ కాంచనిచో తెలుగు బ్లాగరు కాంచున్" అనిపిస్తున్నది.

    కానీ T-కాంగీవాళ్ళకి కేసీయార్ ఒక సూపర్-హైకమాండ్ అయిపోవడం చూస్తూంటే "పాపం !" అనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  3. గురూగారూ
    మీకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయండీ? క్రితం జన్మలో మీరు పక్కా నెహ్రూ గారి కుడి భుజంగా ఉండేవారా?
    మీలాంటి వాళ్ళ బదులు నికృష్టపు వెధవలందరూ రాజకీయనాయకులవడం ఇండియా చేసుకున్న దౌర్భాగ్యం కాదూ?
    నవ్వలేక చచ్చిపోతున్నాను.

    రిప్లయితొలగించండి
  4. ఇది చదివిన తరువాత నకు మరో సందేహం వచ్చింది. అసలు మన టి.విల వాళ్ళు వీళ్ళ దగ్గరకి రోజూ వెళుతుంటారా లేక ఎప్పుడు పాడినా అదే పాట కాదా అని వేసిందే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారా అని!

    రిప్లయితొలగించండి
  5. ఆఁయ్ మీరెవరినో రెచ్చగొడుతున్నారట?! మూసినీళ్ళు తాగి చస్తామని ఎవరో బెదిరి చస్తున్నారు. :P
    :))))

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు