16, ఏప్రిల్ 2011, శనివారం

విజయపు తొలిమెట్టు

అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‍పాల్ కోసం అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షకు విస్తృతంగా మద్దతు వచ్చింది. ఉన్నత పదవుల్లో ఉన్న అవినీతిపరుల్ని శిక్షించడానికి గట్టి చట్టాలు చెయ్యండి, ఆ చట్టాన్ని అమలు చేసేందుకు కట్టుదిట్టమైన యంత్రాంగం పెట్టండి అని అన్నా హజారే అడిగాడు. దేశం ఆయన వెనక నడిచింది. తొలి విజయాన్ని సాధించాడు.


అసలు ఈ మాత్రపు దానికి ఆ డెబ్భైయ్యైదేళ్ళ పెద్దాయన నిరాహారదీక్ష చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందిదంటేనే అర్థమౌతోంది -మన నాయకులకు చట్టం చెయ్యడం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో. దాన్ని అధిగమించాలంటే అన్నా హజారే దీక్షకు దిగక తప్పలేదు. దాని ఫలితంగానే ఇవ్వాళ బిల్లు డ్రాఫ్టు తయారుచేసే కమిటీలో ప్రజలకూ స్థానం దక్కింది. అది దీక్ష సాధించిన విజయం! ఆయన ఆ దీక్ష చెయ్యకపోతే, ఈ విజయం దక్కేదే కాదు.  [రాజకీయ నేతల అవినీతిని నిర్మూలిస్తే సగానికి పైగా అవినీతి తగ్గినట్టే. మిగతా అవినీతిని వాళ్ళే నిర్మూలిస్తారు. తమకు అవినీతి చేసే అవకాశం లేనపుడు ఇతరులకు ఉండనిస్తారా? ప్రశ్నే లేదు! నీచస్వార్థం! :) ]

అవినీతి పట్ల, అవినీతిపరుల పట్లా మనలో ఒక రకమైన నిర్లిప్తత చోటుచేసుకుంది. ’ఈ నాయకులంతా ఇంతే, ఎవడూ సరైనవాడు లేడు, వీళ్ళను మనమేమీ చెయ్యలేం’ అనే స్థితికి చేరుకున్నాం. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తెలిసాక కూడా మనకు చీమ కుట్టినట్టైనా ఉండదు. ఐదారేళ్ళలో కోటానుకోట్లు దోచేసుకున్నా అడిగే దిక్కు లేదు.  మనలోని ఈ నిర్లిప్తతను తొలగించి, క్రోధాన్ని వెలికితీసింది ఈ దీక్ష. ఇది ఈ దీక్ష సాధించిన మరో విజయం.

దీక్ష చెయ్యగానే ఠక్కున దిగొచ్చి, కమిటీని ఆయన అడిగిన విధంగా కూర్చిందంటే దానికి కారణం హజారే వెనక ప్రజలు చేరడం, ఉద్యమం ఉధృతమయ్యే సూచనలు కనబడడమే. ఆ వత్తిడి వలననే ఈ కమిటీ ఏర్పడింది. అయితే, దీక్ష వత్తిడితో కమిటీ ఏర్పాటు చేసినా, అనుకున్న రూపంలో బిల్లు రూపొందడం, అది పార్లమెంటు ముద్ర వేయించుకుని చట్టంగా మారడం, ఇవన్నీ తేలిగ్గ్గా జరిగేవేమీ కావు. ఎక్కడికక్కడ బొక్కలుపెట్టేసే పందికొక్కు లుంటూనే ఉంటై. కమిటీ సభ్యులపై అవినీతి ముద్రలు వెయ్యడం, అన్నా హజారేపై విమర్శలు చెయ్యడం వగైరాలు అప్పుడే మొదలయ్యాయి. వాళ్ళపై చెడు ప్రచారాలు చేసి, ఉద్యమాన్ని నీరుగార్చే పనులు చేస్తాయి పార్టీలు. వాళ్ళ ఎత్తుల్ని హజారే ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

----------------------------
హజారే దీక్షపై విమర్శలూ వచ్చాయి -సూటిగాను, అన్యాపదేశంగానూ.

’దేశంలో చాలామంది అవినీతిపరులే, ఏదో ఒక స్థాయిలో అవినీతి చేస్తూనే ఉన్నారు. రాజకీయనాయకుల అవినీతి గురించి ఉద్యమం చేసేముందు మన సంగతి ఆలోచించుకోవాలి’ అని అనడం విన్నాం. ’మనలో పాపం చెయ్యనివాడే ఆ రాయి విసరాలి’  అనేవాళ్ళూ ఉండొచ్చు. (అలా అనగా ఎక్కడా వినలేదుగానీ అనేవాళ్ళు కూడా ఉంటారులెమ్మని రాస్తున్నాను). 

నేను అవినీతిపరుణ్ణి. రోజూ ఏదో ఒక అవినీతి పని చేస్తూనే ఉంటాను. కొట్టుకెళ్ళి సరుకులు కొంటానా.. బిల్లడగను, వాళ్ళివ్వరు. కూరగాయలు కొంటానా.. వాళ్ళు బిల్లివ్వరు, నే నడగను! ఇలాంటి పనులు కోకొల్లలుగా చేస్తూంటాను. నచ్చిన పాటలు జాలంలో దొరికితే దించుకున్నాను (పైరసీ). మామూలుగా జరగాల్సిన పని కూడా జరక్కపోతే,  గతిలేక లంచమిచ్చి చేయించుకున్న చరిత్ర కూడా ఉంది నాకు.

అయినా సరే, అన్నా హజారేను సమర్ధించాను. సాక్షాత్తూ అన్నా హజారే కూడ గతంలో లంచాలిచ్చాడు అని తెలిసినా నేను ఆయన ఉద్యమాన్ని సమర్ధిస్తాను. లంచాలిచ్చి పనులు చేయించుకునే ఖర్మ మనకు తప్పాలంటే, టూజీలు, ధనయజ్ఞాలు, భూభోజనాలు వగైరాలు జరక్కుండా ఉండాలంటే, నేతలు చేసే మేళ్ళకు మనం బలికాకుండా ఉండాలంటే హజారే ఉద్యమం లాంటివి రావాల్సిందే, మరో దిక్కు లేదు. ఆ ఉద్యమాలను నీరుగార్చేస్తే మనకు నిష్కృతి లేదు.

11 కామెంట్‌లు:

  1. బాగుంది మీ వ్యాసం.

    >>> వాళ్ళ ఎత్తుల్ని హజారే ఎలా ఎదుర్కొంటాడో చూడాలి

    హజారే ఒక్కడే ఎదుర్కోలేడు. అవినీతిపై ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సి ఉంది.

    రిప్లయితొలగించండి
  2. చదువరిగారూ
    మతిలేని వాళ్లు ఎన్ని మాటలంటే ఏమి!
    అన్నా ఆ మాత్రమైనా చేశాడు. ఈ సొల్లు కబుర్లు చెప్పేవాళ్లు అదీ చెయ్యలేదుగా.
    అన్నాహజారేపై ఈనాడు ఆదివారం (రేపటి) సంచికలో ఒక వ్యాసం రాశాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ నేతల అవినీతిని నిర్మూలిస్తే సగానికి పైగా అవినీతి తగ్గినట్టే. మిగతా అవినీతిని వాళ్ళే నిర్మూలిస్తారు. తమకు అవినీతి చేసే అవకాశం లేనపుడు ఇతరులకు ఉండనిస్తారా? ప్రశ్నే లేదు! నీచస్వార్థం....

    నాకు దక్కనిది మరోడికి దక్కనివ్వను పాలసీ ఏ మిగిలిన పని చేయిస్తుందంటారు.... బావుంది.
    ఇన్నాళ్ళూ మనలాంటి సామాన్యులం అవినీతిని భరిస్తూ, కొండొకచో కొద్దోగొప్పో తోడ్పడుతూ, సహిస్తూనే ఉన్నాం.
    హజారే స్ఫూర్తితో అవినీతి లేని కొత్త సమాజానికి పునరంకితం కావలసిన అవసరం ఉంది. కనీసం మన పిల్లల తరానికయినా మనం ఆదర్శం కావాలి.

    రిప్లయితొలగించండి
  4. అవినీతి విషయంలో కేవలం రాజకీయాలని విమర్శిస్తే ప్రయోజనం ఉండదు. అవినీతికి మూలాలు సామాజిక భావజాలంలో ఉన్నాయి. తమ ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు, సమాజం ఏమైతే తమకేమిటి అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న మా ఇంటిలో అద్దెకి ఉండే అతనితో దొంగ నోట్ల గురించి మాట్లాడుతున్నాను. ATM నుంచి దొంగ నోట్లు వస్తే ఏమీ చెయ్యలేము అని అతని మేనల్లుడు అంటే ATM నుంచి దొంగ నోట్లు వచ్చినా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలని అని చెప్పాను. వాళ్ళకి ఇంకో విషయం కూడా చెప్పాను. నకిలీ కరెన్సీ పెరిగితే నోట్ల సంఖ్య మాత్రమే పెరుగుతుంది కానీ సామాజిక వనరులు పెరగవు, సామాజిక వనరులని వృద్ధి చేసుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పాను. కేవలం నోట్ల సంఖ్య పెరిగితే కరెన్సీ విలువ తగ్గిపోతుందని కూడా చెప్పాను. అప్పుడు పెద్దాయన ఏమి సమాధానం చెప్పాడో తెలుసా? అవన్నీ ఎవడు చూస్తాడు? ఎవరి ఇల్లు చక్కబెట్టుకోవడం వాళ్ళకి ముఖ్యం అని అతను అన్నాడు. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో దిగి వచ్చినవాళ్ళు కాదు. సాధారణ పౌరులలో సంకుచిత భావాలు ఉంటే రాజకీయ నాయకులలోనూ అవే ఉంటాయి. సినిమాలలోలాగ రాజకీయ నాయకులందరూ దుర్మార్గులనీ, రాజకీయాలే చెడ్డవనీ అనుకుంటే సమాజంపై అవగాహన లేనట్టే అనుకోవాలి.

    రిప్లయితొలగించండి
  5. టెన్స్‌మోర్ ప్రవీణ్. అంటే మరో 10మార్లు కట్& పేస్ట్ చేయమని అడుగుతున్నాను.

    'లగే రహో మున్నా భాయ్' సినిమా చూశావా?

    రిప్లయితొలగించండి
  6. నేను చెప్పేది నిజం. చాలా మంది ఇంకా తమ ఇల్లు చక్కబెట్టుకోవడం అనే confinement నుండి బయటకి రాలేదు.

    రిప్లయితొలగించండి
  7. ఇల్లు చక్కబెట్టుకుంటే దేశం చక్క బడుతుందన్న బెజాడ వెంకట్రావుతోనే విభేదిస్తావా?

    రిప్లయితొలగించండి
  8. ఇల్లు చక్కబెట్టుకుంటే దేశం చక్క బడుతుందన్న బెజవాడ వెంకట్రావుతోనే విభేదిస్తావా?

    రిప్లయితొలగించండి
  9. అనాథాశ్రమం పెట్టి విరాళాలు అడిగితే గుండె కరిగి విరాళాలు ఇస్తారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం పెట్టి ఉద్యమ ఖర్చుల కోసం విరాళాలు అడిగితే ఎంత మంది ఇస్తారు? అందుకే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే confinement నుంచి బయటకి రావాలనేది.

    రిప్లయితొలగించండి
  10. సంకుచిత హిందూ భావజాలం మీదో, తెలంగాణా మీదో రాసినప్పుడు వందలకు వందలు రాసే కామెంటాగ్రేసరులు అవినీతి విషయం వచ్చేసరకి తేలుకుట్టిన దొంగల్లా కూచునప్పుడు తెలియలేదా చదువరి, ఈవిషయమై వారందరికి ఎంత నిబద్దత ఉందో.

    కాముధ

    రిప్లయితొలగించండి
  11. కెక్యూబ్ గారి బ్లాగ్‌లో చదివారా? సినిమా థియేటర్ దగ్గర అరగంట క్యూలో నిలబడలేక బ్లాక్‌లో టికెట్లు కొనే మనవాళ్ళు అవినీతి విషయంలో ఏమి పోరాడుతారు అని ఆయన కూడా అడిగారు. నేనూ ఒకప్పుడు థియేటర్ల దగ్గర బ్లాగ్ టికెట్లు కొనేవాడ్ని. సాక్షాత్తూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతున్న వ్యక్తే అధికార వర్గానికి చెందిన నాయకుడిని పొగిడి ఉద్యమాన్ని నయవంచన చేసినప్పుడు నిజాయితీ ఎంత ముఖ్యమో అర్థమయ్యింది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు