25, జనవరి 2010, సోమవారం

హెచ్చెమ్ టీవీ వరంగల్లు సమావేశం

రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో తరువాతిది వరంగల్లులో జనవరి 24, ఆదివారంనాడు జరిగింది. సమావేశం బాగా జరిగింది. కొందరు మాట్టాడుతున్నపుడు గోల జరిగిందిగానీ, పెద్దలు శాంతపరచడంతో వెంటనే సద్దుమణిగింది. మిగతా సమావేశాల్లో లాగానే, ఇక్కడ కూడా సరుకున్న ప్రసంగాలు కొన్నే! ఎక్కువ ప్రసంగాలు బాగా నలిగిన పాత సంగతులే చెప్పగా, కొద్ది మంది చేసిన ప్రసంగాలు ఉత్త ఊకదంపుడే!


సహజంగానే అందరూ తెలంగాణకు అనుకూలంగా మాట్టాడారు. ఒకటి రెండు ఆశ్చర్యపరచే ప్రసంగాలు, ఒక అదరగొట్టే ప్రసంగం చూసాను. కొన్ని అనుచితమైన నిందలు కూడా వినబడ్డాయి. కొన్ని ముఖ్యమైన ప్రసంగాలు:

ముందుగా కోస్తా ప్రాంతం నుండి వచ్చిన  ఎమ్.సి.దాస్, (విజిటింగ్ ప్రొఫెసరు, కృష్ణా యూనివర్సిటీ) మాట్టాడాడు. ఆయన చరిత్ర గురించి మాట్టాడాడు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాము వ్యతిరేకంగా మాత్రమే కాదు, జాతి ఏకీకరణ కోసం కూడానని ఆయన చెప్పినపుడు సభ్యులు గోల చేసి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని శాంతపరచేందుకు ప్రయత్నం చేసాడు. తిరుపతిలో ప్రకాష్ గారిని, విశాఖలో హరగోపాలును, విజయవాడలో వేణుగోపాలును అడ్డుకోలేదు. ఇక్కడ మనం అడ్డుకుంటే, ఆయా ప్రాంతాల ప్రజలు మన గురించి ఏమనుకుంటారు? అని అడిగాడు.

హరగోపాల్ కూడా జోక్యం చేసుకుని, అల్లరి చేసి, ఆయన్ను మాట్టాడనివ్వకపోతే, తెలంగాణ ఆలస్యమౌతుందేమోగానీ తొందరగానైతే రాదు. ఆయన మటలు విని ఆయన చెప్పేదానిలో తప్పులేమైనా ఉంటే చెబుదాం. ఇలా అడ్డుకోడం మన సంస్కారం కాదు. అని చెప్పాడు.

ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాక..ఆయన చెప్పిన ప్రతిపాదనలివి:
  1. ఈ రాష్ట్రానికి ఒక కొత్త రూపాన్నిచ్చి పేరు మార్చి, తెలుగునాడు అని మారుద్దాం. మూడు ప్రాంతాలకూ ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసుకుందాం. వనరులను ఒక నిష్పత్తిలో పంచుకుందాం. రాజకీయాధికారాన్ని నిష్పత్తిలో పంచుకుందాం ఈ అంశాల అమలును ఏటా సమీక్షించుకుందాం
  2. ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధినీ విశ్లేషించడం.
  3. ఇన్నాళ్ళు కలిసున్నాం. ఇంకొక్క ఏడు ఇలాగే ఉండి, ఆలోచించుకుని, అప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం.
  4. ఉద్యమాలను ఆపేదాం. అంతర ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసుకుని సమీక్షించుకుందాం.
తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో తన ప్రసంగాన్ని ముగించాడు.

టి. పురుషోత్తమరావు - లోతట్టు ప్రాంతాల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు. ఈ కాంగ్రెసు నాయకుడు ఈమధ్య ఎందుకో ఎక్కడా వినబడ్డంలేదు, కనబడ్డంలేదు. ఆయన చెప్పినదిది:

"తెలంగాణ ఉద్యమం, అసాధారణమైన అపూర్వమైన ఉద్యమం. పార్టీ రహిత, ప్రజాస్వామిక ఉద్యమం. అహింసాయుత ఉద్యమం. జాతి సమగ్రత కొరకు, జాతి ఐక్యతను కాపాడేందుకు, చిన్న రాష్ట్రాలు కావాలి, తెలంగాణ కావాలి. ఈ సమస్యకు ప్రత్యేక తెలంగాణ తప్ప మరో పరిష్కారం లేదు. "

రాయలసీమ నాయకుడు ఎమ్,వి రమణారెడ్డి అంత బలంగా తెలంగాణ అనుకూల వాదన వినిపించిన తెలంగాణేతర నాయకుణ్ణి నేను చూళ్ళేదు. నిజానికాయనది కోస్తా వ్యతిరేక వాదన! నా శత్రువు శత్రువు నాకు మిత్రుడే అనేది ఆయన వాదనా ధోరణి. కోస్తా ప్రాంత వాసులపై -ముఖ్యంగా కృష్ణా జిల్లా వాసులపై - ఈయనకు ఉన్న వ్యతిరేకత (ద్వేషమనొచ్చు) ఆయన ప్రసంగంలో మారుమోగింది. ఆయన అలా మాట్టాడుతూంటే సదస్యులకు బాగా నచ్చింది. ఓ సమయంలో ఇక సమయం ఐపోయిందని రామచంద్రమూర్తి చెప్పినపుడు, కాదు మాట్టాడనివ్వాల్సిందేనని సదస్యులు గోల చెయ్యగా పొడిగించారు. ఆయన మాట్టాడిందిది:

"ఆంధ్రా యూనివర్సిటీని ఎక్కడ పెట్టాలి అనే చర్చ జరిగినపుడు విశాఖలోనని, విజయవాడలోననీ తగదా పడినపుడు, రాయలసీమ వాళ్ళు ఈ గొడవంతా ఎందుకు, మా ప్రాంతంలో పెట్టొచ్చుగదా అని అడిగారు. వెంటనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వాళ్ళంతా కలిసిపోయారు. అది చూసిన సీమ నాయకులకు, 'కోస్తా వాళ్లతో కలిసి బతగ్గలమా అనే అనుమానం కలిగింది.' రాజధాని ఎక్కడుండాలి అనే విషయమై, సిద్ధేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కోస్తా నాయకులు సీమకు అన్యాయం చేసారు".

"పెద్దమనుషుల ఒప్పందాన్ని కూడా కోస్తా నాయకులు ఉల్లంఘించారు. తమ పని కావడం కోసం కోస్తావాసులు దేనికైనా ఒప్పుకుంటారు. శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమ అవసరాలు తీరాకే కోస్తాకు నీళ్ళని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. "

ఈయన మాట్టాడినదానిలో అనుచితమైన విషయాల గురించి చూస్తే..
"అసలు సదస్సు విజయవాడలోనే ఎందుకు జరిగిందంటే.. విజయవాడ కోస్తాకే నడిబొడ్డు కాదు, రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికే నడిబొడ్డని అంటారు వాళ్ళు. అసలు ప్రజల మధ్య విభేదాలకు కేవలం కృష్ణా జిల్లావాళ్ళ ప్రవర్తనే కారణం. ఇంకోటి చూడండి.. సీమాంధ్ర అని అంటారు. అంటే సీమవాసులు , ఆంధ్రులూ అని వాళ్ళ అర్థం. వాళ్ళు మాత్రమే ఆంధ్రులని, మేము సీమవాసులని కృష్ణాజిల్లా వాళ్ళ ఉద్దేశం.  కేవలం ఇటు గుంటూరు వాళ్ళను, అటు గోదావరి జిల్లాల వాళ్లను మాత్రమే ఆంధ్రులని వాళ్ళు భావిస్తారు. మిగతా వాళ్ళెవరూ ఆంధ్రులు కాదు వాళ్ళ లెక్కలో."

చుక్కా రామయ్య: ఈయనది ముఖ్యంగా ఐఐటీ గొడవ! "ఒప్పందాల ఉల్లంఘన జరిగినపుడే, తెలంగాణవారికి అన్యాయం జరిగినప్పుడే సమైక్యంధ్ర ఉద్యమాన్ని తీసుకు వచ్చి ఉంటే నేను సమర్ధించేవాణ్ణి. "

"ఐఐటీని హైదరాబాదుకు తెచ్చి పెట్టారు. అదేమంటే అది రాష్ట్రమంతటిదీ అన్నారు. మరి వైద్య విశ్వవిద్యాలయం ఎక్కడపెట్టారు? విజయవాడలో! అది హైదరాబాదులో పెట్టనక్కరలేదా? కడపలో 400 కోట్లు పెట్టారు. నల్లగొండలో కేవలం 1.5 కోట్లు పెట్టారు."

"మా పోరాటం ఆంధ్ర ప్రజల్తో కాదు ఆంధ్ర ప్రదేశ్‌తో అని చెబుతున్నాను. విశాలాంధ్ర స్ఫూర్తి పోయింది. ఇంకా కలిసుందామని అంటే అది మోసం చెయ్యడం తప్ప మరోటి కాదు."

కత్తి పద్మారావు ఘాటుగా మాట్టాడాడు. ఆయన వాదన పూర్తిగా దళిత వర్గాల తరపున సాగింది. సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర కావాలి అనేది ఆయన వాదన.  కారంచేడులో దళితులపై కమ్మవారు (కులం పేరు ఆయన చెప్పాడు) చేసిన దాడిని ఉటంకించాడు. భూమిపై ఆధిపత్యం కోసం ఆ దాడి జరిగిందని ఆయన వాదన. పనిలోపనిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల మీద విసుర్లు వేసాడు. ఆ దాడికీ వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధాన్ని సూటిగా చెప్పకున్నా తెలిసేట్టుగానే చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలు:

"ఏలూరు ఎంపీ తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? హైదరాబాదులో ఆయనకు పెట్టుబడులున్నాయి. జలయజ్ఞంలో ఆయనకు కాంట్రాక్టులున్నాయి. వ్యక్తుల గురించి చెప్పదం నా ఉద్దేశం కాదు, వాళ్ళు ఒక వ్యవస్థకు ప్రతీక."

"ప్రాజెక్టుల కారణంగా, కోస్తాలో 48 లక్షల ఆయకట్టుకు నీళ్ళొచ్చాయి. 30 వేల ఎకరాలకు మాత్రమే దళితులకు ఉంది. అంచేత ప్రత్యేకాంధ్ర కావాలని కోరుతున్నాం."

"తెలంగాణలో మీకు జీవించే హక్కు ఉంది. ఇక్కడ సభ పెట్టగలిగారు. మాకా అవకాశం లేదు. మా మాలలు, మా మాదిగలు, మా బెస్తలు, మా యాదవులు, మా దళితులు,.. మాకెవరికైన భూములున్నాయండి? మేము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడపలేము. మీరు మా వద్దకొచ్చి, మాకు మద్దతిచ్చి ఉద్యమం నడపాలని కోరుతున్నాం."

"హైదరాబాదు మీకే ఇవ్వాలి, అది న్యాయం. దాన్నీ మీకే ఇచ్చేస్తున్నాం. అది మీరే తీసుకోండి. అయితే మాకు ముఖ్యపట్నం  కావాలి, అది కట్టుకునేదాకా, ఓ పది సంవత్సరాలపాటు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వాలి." ఈమాట చెప్పగానే జనం గోల మొదలెట్టారు. దాంతో దాన్ని రెండు మూడేళ్ళుగా మార్చాడు.

"మేము ప్రత్యేక తెలంగాణ కోరుతున్నాం. కానీ ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చెయ్యమని అడుగుతున్నాం. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక, అక్కడా ఇక్కడా కూడా దళిత ముఖ్యమంత్రినే పెట్టుకుందాం. ఏఁ, కడియం శ్రీహరి ముఖ్యమంత్రిగా పనికిరాడా?", అని అన్నాడు. ఆమధ్య కంచె అయిలయ్య ఈ కుల ప్రసక్తి తెచ్చినపుడు, మంద కృష్ణను ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని గట్టిగా వినిపించాడు. అలాగే కడియం శ్రీహరి గురించి కూడా అన్నాడు. కత్తి మాత్రం మంద కృష్ణ మాదిగను తలవలేదు.

ప్రొఫెసరు సీతారామ్ నాయక్: ఈయన గిరిజనుల గురించి ప్రధానంగా మాట్టాడాడు. తెలంగాణ ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని ఇక్కడి గిరిజనులు అనుకుంటున్నారు. తెలంగాణలో 14 % గిరిజనులున్నారు. ఆంధ్రలో 3% ఉన్నారు. ఉన్న 6% రిజర్వేషన్లలో అధికభాగం ఆంధ్ర వాళ్ళకే పోతున్నాయి. మా పిల్లలకు 3500 ర్యాంకు వచ్చినా మాకు మెడిసిన్ సీటు రాదు, కానీ అక్కడ 10500 వచ్చినవాడికి కూడా రాదు. దీనిమీద చర్చకు నేను సిద్ధం. నిరూపించలేకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మాకు సామాజిక న్యాయం జరుగుతుందని మా భావన. ఇప్పుడు కలిసుండే పరిస్థితి లేదు. తెలంగాణ ఒక్కటే పరిష్కారం.

చందా లింగయ్య ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు: ప్రత్యేక గిరిజన రాష్ట్రం కావాలంటూ కోరి, ఈయన కొంత కలకలం రేపాడు. ఆదివాసీల గురించి మాట్టాడాడు. "1/70 చట్టం ద్వారా ఆదివాసీల ప్రాంతంలోని అన్ని స్థిర చరాస్తులన్నీ ఆదివాసీలకే చెందుతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వాలేవీ చట్టాలను అమలు చెయ్యలేదు. ఆదివాసీల ఆస్తులను, వనరులను తరలించి వలసవాదులు దోపిడీ చేసారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేసిందేమీ లేదు."

"ఎప్పుడైతే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందో, వాళ్ల హక్కులు హరింపబదతాయో, అప్పుడు ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం 6 వ అధికరణంలో చెప్పింది. తెలంగాణలో మేమూ భాగమే. తెలంగాణయే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఆదివాసీలున్నారు. ఆదివాసీల సంక్షేమం, హక్కులను గుర్తించాలి. మీకు రాష్ట్రం కావాలంటే తెచ్చుకోండి. కానీ మా హక్కులను గుర్తించండి. ముందు మా సంగతేందో తేల్చండి. మమ్ములను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కావాలని మేమూ డిమాండు చేస్తాం. మా ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, అందుకు డిమాండు చేస్తాం. "  ఈమాట చెప్పగానే పెద్ద గోల రేగింది. ఆ గోల మధ్యనే ఆయన ప్రసంగం ముగించి కూచ్చున్నాడు.

తరవాత రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్టాడబోగా, మంద కృష్ణ మాదిగను మాట్టాడనివ్వమని సదస్యులు గోల చేసారు. ప్రకాష్‌రెడ్డి మాట్టాడిన తరవాత ఆయన మాట్టాడతాడని కె రామచంద్రమూర్తి ప్రకటించాడు. అయినా గోల ఆపకపోయేసరికి, వాళ్ళను సమాధానపర్చమని  ఆయన మంద కృష్ణనే అడిగాడు. ఈలోగా రేవూరి తన ప్రసంగాన్ని స్వచ్ఛందంగా ఆపేసాడు. అప్పుడు మంద కృష్ణను మాట్టాడమని చెప్పాడు.

మంద కృష్ణ మాదిగ కులప్రస్తావనను తీసుకొచ్చాడు. తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి కంటే తక్కువ పదవిని ఆశిస్తున్నటు లేదాయన. "ఇక్కడ వేదికపై కూర్చోపెట్టినవాళ్లను ఎందుకు పిలిచారో, ఏ ప్రాతిపదికతో పిలిచారో నాకు తెలవదు. వేదికపై కేవలం రెండు సామాజిక వర్గాల వాళ్లు మాత్రమే ఉన్నారు" -బ్రాహ్మలతోపాటు ఇంకోటి కూడ ఏదో చెప్పాడు. కానీ ఆ పేరు నాకు అర్థం కాలేదు. "ఇకముందు పెట్టే సభల్లో అన్ని కులాలకు గుర్తింపు నివ్వాలని కోరుతున్నాను.", అని అన్నాడు. కొంతసేపటి తరవాత రామచంద్రమూర్తి దీనికి వివరణ ఇచ్చుకున్నాడు.

"మీరు ఇంగ్లీషోడి ప్రభుత్వంలో ఉన్నారు, కానీ మాది స్వతంత్ర రాజ్యం. మేము మా రాజు పాలనలోనే ఉన్నాం. మా రాజ్యాన్ని తెల్లోడు ఆక్రమించుకోలేదు. ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది మీకు, మాక్కాదు. దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని, భారత్, పాకిస్తాను అనే రెండు దేశాలను ఏర్పాటు చేస్తున్నామనీ తెల్లోడు ఇంగ్లండులో ప్రకటన చేసినపుడు, 15 రోజుల్లోపే మేం ఇద్దరితోటీ కలవమని మా రాజు ఒక ప్రకటన చేసాడు. ఆ విధంగా మా రాజు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు."

"మాకు రాజు, ప్రధానమంత్రి, సేనాధిపతి కూడా ఉన్నారు. అంచేత మాది ఒక ప్రత్యేక దేశమని నిర్ధారణ అయింది. మమ్మల్ని భారత్‌లో కలిపేసాక, మాకు దేశం పోయింది. ఇప్పుడు మీరు వచ్చి మాకు రాష్ట్రం కూడా లేకుండా చేసారు. పెద్దమనుషుల ఒప్పందం మీద సంతకాలు చేసిన కేవలం నలుగురు నాయకులు మా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు."

అ తరవాత ఆయన మళ్ళీ కులం ప్రసక్తి తీసుకొచ్చి, సామాజిక తెలంగాణను లేవనెత్తాడు. "సోదరులారా, తెలంగాణ వచ్చాక, దొరల రాజ్యం ఏర్పడకూడదని మేం అనుకుంటున్నాం. పేదలు, అణగారిన వర్గాల కోసం తెలంగాణ ఏర్పడాలని అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమ సమావేశాలకు వచ్చేవాళ్ళు- నాయకులను చూసి రావడం లేదు, రసమయి బాలకిషన్ను చూసి, గద్దర్ను చూసి, ఇతర కళాకారులను చూసీ వస్తున్నారంతే. వాళ్లంతా మావాళ్ళే, మా దళితులే! తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నది మావాళ్ళే! కానీ, ఉద్యమ నాయకత్వంలో ముందున్నది ఎవరూ..  కేసీయార్, జానారెడ్డి, దామోదరరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,.. ఇలా అందరూ అగ్రకులాలవాళ్ళే! వీళ్ళు ఇక్కడ వేదిక మీద ఎట్టైతే ఉన్నారో, అక్కడ కూడా అలాగే ఉన్నారు."

ప్రసంగం పెడదారి పడుతోందంటూ కె రామచంద్రమూర్తి ఆయన్ను ఆపమని చెప్పాడు. దానికాయన, 'మేము తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేస్తూ కూడా, ఇక్కడ మాట్టాడే అవకాశం పొదలేకపోతున్నాం. దీన్నిబట్టి మాకు అన్యాయం జరుగుతున్నదని తెలుస్తూనే ఉన్నది' అని అన్నాడు.

తెలంగాణ వస్తే అణగారిన వర్గాలకు, పేదల కోసం రావాలి అని చెబుతున్నాను అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించాడు.

ఇప్పుడిక నేను నల్లగొండ నుండి వచ్చిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రసంగం గురించి చెప్పాలి -అదరగొట్టేసాడాయన. నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య గురించి చాలా ప్రభావవంతంగా చెప్పాడు. అక్కడి ప్రజల వేదనను బాగా వినిపించాడు. కృష్ణ నీళ్ళు తమకు చుక్క కూడా అందకుండా పట్నానికి (హైదరాబాదు) ఎలా పోతున్నాయో వివరించాడు. నీళ్ళ కోసం తాము ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఎవరెవరిని కలిసామో చక్కటి భాషలో చెప్పుకుపోయాడాయన. మానవహక్కుల కమిషన్ను, ఇద్దరు ప్రధానమంత్రులను కలిసిన సంగతి చెప్పాడు.  ఫ్లోరోసిస్ సమస్య గురించి చెప్పినప్పుడు ప్రధాని వాజపేయి జేబుగుడ్దతో కన్నీళ్ళు తుడుచుకున్నాడని చెప్పాడు.

"ప్రపంచంలో ఏ తల్లీ విష రసాయనాలతో కూడిన నీళ్లను బిడ్డకు ఇవ్వదు. కానీ నల్లగొండ తల్లి మాత్రం తన పిల్లలకు బొట్టుబొట్టుగా విషం ఇస్తోంది."
"గుక్కెడు నీళ్ళివ్వలేని దేశమూ ఒక దేశమేనా? ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా?"
"నేరం వాళ్ళు చేసారు, శిక్షలు మాకు పడ్డాయి. తరతరాల దెబ్బ ఇది. 20 తరాల దెబ్బ, వెయ్యేళ్ళ దెబ్బ కొట్టారు."
"మేం తిరుపతి పోయి, వెంకటేశ్వర స్వామీ, తెలుగు గంగ ద్వారా కృష్ణమ్మ నీళ్ళు నీ పాదాల దాకా వచ్చాయి. పక్కనే ఉన్న మాకు మాత్రం బొట్టు దక్కకపోయె, ఏంది స్వామీ ఈ అన్యాయం అని అడిగినం"
"ఈ దోపిడీకి దుష్పరిపాలనకు ప్రతీకారం ప్రకృతే సెప్టెంబరు 2 న, అక్టోబరు 2 నా తీసుకుంది." అని అన్నాడు.

ఒడంబడికలు, ఒప్పందాలన్నీ ఇక రద్దు, మన రాష్ట్రాన్ని తిరిగి ఏర్పాటు చెయ్యాల్సిందేనని గట్టిగా చెప్పాడాయన.

వరవరరావు కొన్ని నిర్దుష్టమైన సూచనలు చేసాడు.
సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన చెయ్యండి. పన్నులు కట్టకండి, బిల్లులు కట్టకండి. ఈ ప్రభుత్వాన్ని గుర్తించకండి. గాంధీ చెప్పిన మాట ఇది.
అన్ని పార్టీల నాయకులూ రాజీనామా చెయ్యాలి. రాజీనామాను స్పీకరు అంగీకరిస్తాడా లేదా మీకు అనవసరం.. మీ క్వార్టర్లు ఖాళీ చేసి హై.ను వదిలేసి, గ్రామాలకు రండి. అక్కడే సభలు పెట్టండి. తెలంగాణ ఏర్పడ్డాకే తిరిగి హై.కు పోదురుగాని.

చివరగా పాండురంగారావు అనే ఆయన మాట్టాడాడు. ఈయన నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామానికి ప్రెసిడెంటు (ఇప్పుడు ప్రెసిడెంటో కాదో నాకు తెలవదు). ఆదర్శ ప్రెసిడెంటుగా పేరుతెచ్చుకున్నాడు. ఓ నాలుగైదేళ్ళ కిందట ఈయన తన ఊరిలో తెలంగాణపై ప్లెబిసీట్ పెట్టాడు. 90 శాతం పైగా అనుకూలంగా వోటేసారు.  చాలా పరుషంగా మాట్టాడాడు. కోస్తా సీమల వాళ్లను మిత్రులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడలేదాయన!

చివరిగా హరగోపాల్ మాట్టాడుతూ, అల్లరి చేసిన సదస్యులను మెత్తగా మందలించాడు.  "చర్చ జరిగిన విధానం నాకు బాధ కలిగించింది. నేను విశాఖలో 40 నిముషాలు మాట్టాడితే నన్నెవరూ అడ్డగించలేదు. తరువాత మాట్టాడినవాళ్ళు నన్నెవరైనా విమర్శించినపుడు అక్కడి పెద్దలు నావద్దకు వచ్చి, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. దాసు గారు మాట్టాడుతున్నపుడు, ఆయన్ను మీరు అలా అడ్డుకోవడం మన ఉద్యమంపై తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. రెండోది, తెలంగాణకు చెందిన గిరిజన నాయకుడు మాట్టాడుతున్నపుడు ఆయన్ను అడ్డుకోవడం బాగాలేదు. (చందా లింగయ్యను మాట్టాడకుండా అడ్డుకున్న ఘటనను ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు)" -


4 కామెంట్‌లు:

  1. >> "ఆ విధంగా మా రాజు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు"

    మరే. మా రాజుగారి రజాకార్లు కూడా మా ఆత్మగౌరవాన్ని రంజుగా నిలబెట్టారు. సాయుధ పోరాటం పేరుతో ఆంధ్రా వలస దోపిడీదార్లే ఆ మంచిరాజుగార్ని రాచిరంపాన పెట్టి భారద్దేశంలో విలీనమయ్యేలా చేసి మా ఆత్మ గౌరవానికి గండికొట్టారు.

    రిప్లయితొలగించండి
  2. చుక్కా రామయ్య గారికి మీద అంత పట్టింపు ఎందుకో గానీ ఆయన చెప్పింది అబద్ధం. రాష్ట్రానికి అంతటికీ చెందింది అని హై. లో పెట్టలేదు(ఆ మాటకొస్తే అది రాష్ట్రానిది ఎలా అవుతుంది, దేశం మొత్తానికి సంబంధించింది). వైయెస్ ఈ విషయం స్పష్టం గా చెప్పాడు. మారుమూల పెడితే ప్రొఫెసర్లు రారు అని. ఉదాహరణకు ఇప్పుదు హై. IIT ని చెన్నై IIT నుంచి వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్లచే నడిపిస్తున్నారు. బాసరలో పెట్టి ఉంటే వారు వచ్చి వెళ్ళటానికి ఎంత కష్టంగా ఉండేది?.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు