13, జనవరి 2010, బుధవారం

ది ఫౌంటెన్ హెడ్ - ఎ కొయ్యగుర్రం రైడ్!

ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్‌వర్డు అనుకుంటా.  పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ  అయన్ ర్యాండ్  (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు.  ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి  మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన  కథ ఒకదానిలో  ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. 'అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి' అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా 'అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ' అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!


ర్యాండు గారి పుస్తకాలు చూడాలన్న కుతూహలం కలగడానికి ఇంకో కారణం కూడా ఉంది. జాలజనుల ప్రొఫైళ్ళు చూడండి.. ఒక వంద ప్రొఫైళ్ళు చూస్తే ఓ ఇరవై ముప్పై దాకా అభిమాన పుస్తకం స్థానంలో ది ఫౌంటెన్ హెడ్ గానీ, అట్లాస్ ష్రగ్‌డ్‌గానీ ఉంటది. జాలజనులంటే.. తెలుగు జాలజనుల సంగతే నేఁజెబుతున్నది, ఇంగ్లీషోళ్ళు కాదు! 'ఏంటి, త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా' అనే స్థాయిలో నేను ఆశ్చర్యపడిపోతూ ఉండేవాణ్ణి. ఈ పుస్తకం పేరును నా ప్రొఫైల్లో కూడా పెట్టుకుంటే, కుసింత తూకంగా ఉంటది గదా, సమకాలికుల్తో సమానంగా ఉంటాం గదా అని ఆశపడేవాణ్ణి.

'ఓహో, అయితే ఈడసలు ఇంగ్లీషు పుస్తకాలేమీ చదవలేదన్నమాట ' అని గబుక్కున తీసిపారెయ్యకండి. ఎప్పుడో పాతికేళ్ళ కిందటే ఓ రెండు పుస్తకాలను - సిడ్నీ షెల్డన్ రాసిన బ్లడ్‌లైన్, ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ (లేక ఎ మిర్రర్ ఇన్ ది స్ట్రేంజరా?)  - జయప్రదంగా చదివేసాను. ఆ తరవాత ఎక్కడ ఇంగ్లీషు పుస్తకాల చర్చ వచ్చినా, ఈ రెండు పేర్లనూ విరివిగా వాడేవాణ్ణి. సిడ్నీ షెల్డన్ ఏదో మావాడే అన్నట్టు మాట్టాడేవాణ్ణి. అయితే మన మైనంపాటి రామ్మోహనరావులు, సూర్యదేవర భాస్కరులు, మల్లాది వీరేంద్రనాథులు, యండమూరి వెంకట కృష్ణమూర్తులూ ఆయన్ని తమవాడిగా చేసేసుకుని ఆయన పుస్తకాలను బాగానే వాడేసారంట. మా సిడ్నీ షెల్డన్ రాసిన ఆ రెండు పుస్తకాలనూ నా ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. అయితే, పాతికేళ్ళ కిందటెప్పుడో చదివినవేమో.., కథ కూడా  కొద్దికొద్దిగానే  గుర్తుంది, అదీ ఒక పుస్తకంలోదే! ఒకవేళ ఆ పుస్తకాలు నచ్చినవాడెవడైనా బ్లాగులోకొచ్చి, అందులో నీకు ఏ పాత్ర నచ్చింది? ఫలానా విలియమ్స్ అలా చెయ్యడంపై నీ అభిప్రాయమేంటి? అంటూ ప్రశ్నలేసాడనుకోండి.. అసలుకే మోసం వస్తది. అంచేత ఆ పని పెట్టుకోలేదు.

సరే, ఆ కొట్లో ర్యాండు గారి పుస్తకాలు చూసాక, కొనెయ్యాల్సిందే, కొని చదివెయ్యాల్సిందే, చదివి నా ప్రొఫైల్లో కూడా పెట్టేసుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నాను. అయితే, మమ్మాయి 'ఎందుకైనా మంచిది నానా, ఒక్కటి కొనుక్కో, అది చదివాక రెండోది కొన్నుక్కుందూగాన్లే'  అని చెప్పింది. అదీ నిజమేలే అని బాలవాక్కును మన్నించి, ఫౌంటెన్ హెడ్డొక్కటే కొన్నాను.

ఇంగ్లీషు పుస్తకాలు అంతంత లావుగా ఎందుకుంటాయో అర్థం కాదు. పైగా, వాటి పొడవు వెడల్పులు ఆ లావుకు సరిపడా సరైన నిష్పత్తిలో ఉండవు. మనిషికి ఏనుగు చెవులు తగిలించినట్టో.. ఎలాగో ఉంటై. ఫౌంటెన్ హెడ్డూ అంతే!  (మన "కోతికొమ్మచ్చి" చూడండి, ఎంత ముచ్చటగా ఉంటదో!) అంత లావు పుస్తకాన్ని కూడా చదివెయ్యాల్సిందే అని కృతనిశ్చయంతో మొదలెట్టాను.

అసలు ఫిక్షనంటే నాకు గభాలున ఎక్కదు. దానికి తోడు ఇంగ్లీషు! ఇక చెప్పేదేముంది. ఇంగ్లీషు నవల్లు మామూలుగా ఒకసారి చదివితే గబుక్కున అర్థం కావు. అర్థం కాలేదుగదా అని ముందుకు పోకుండా ఉండలేం గదా. పేజీ చదివేసి పక్క పేజీకి పోగానే పాత పేజీకీ దీనికీ లంకె తెగుతుంది. అంచేత మళ్ళీ వెనక పేజీకి పోయి ఓసారి నెమరు వేసుకొస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇంకా వెనక పేజీలక్కూడా పోవాల్సి వచ్చేది. ఉదాహరణకు రోర్కు క్వారీ పనిలో ఎందుకు చేరాడో గుర్తుకు కావాలంటే మళ్ళీ ఓ నాలుగైదు పేజీలు వెనక్కి పోవాల్సొచ్చేది (రోర్కంటే ఎవరో తెలీనివాళ్ళు తెలుగు బ్లాగరుల్లో ఉన్నారని  నేననుకోను). దానికితోడు, కొన్ని పాత్రలు ఒక్కోసారి యాభై అరవై పేజీల దాకా అసలు కనబడేవే కావు. హఠాత్తుగా టూహే అనో పోహే అనో కనబడితే ఈడెవడ్రా బాబూ అనుకోని మళ్ళీ ఎనక్కెక్కడికో పోయి, ఆ శాల్తీ ఆచూకీ కనుక్కుని తిరిగి రావాల్సొచ్చేది.

పైగా ఎన్ని పేజీలు చదివేసాను అనే ఉత్సుకతొకటి.. పేజీ చదవడానికి ముందొకసారి, చదవగానే ఇంకోసారీ పేజీనంబరును చూస్తూంటాను. స్పీడుగా పేజీలు తరక్కపోయేసరికి (అసలు పేజీలు తిరిగితేగా తరగడానికి) తిక్క వచ్చేసేది. ఒక్కోసారి పేజీలు తరక్క పోగా, పేజీ నంబర్లు తగ్గేవి. ప్రస్తుతం నూటనాలుగో పేజీలో ఉన్నాననుకోండి, నిన్న నూట పదకొండో పేజీలో ఉండేవాణ్ణన్నమాట! అదిచూసి, నీరసమొచ్చేది. ఇలా రెండు పేజీలు ముందుకీ, మూడు పేజీలు ఎనక్కీ పోతూ ఉండటంతో, రోజులు వారాలై, వారాలు నెలలైపోయాయిగానీ పుస్తకమింకా పూర్తి కాలేదు. చిన్నప్పుడు చిక్కులెక్క ఒకటి చెప్పేవాళ్ళు.. ఒక కోతి ఓ 30 అడుగుల బావిలో పడిపోయింది.  బావి వరలు పట్టుకుని పైకి ఎక్కాలని ప్రయత్నిస్తోందిగానీ, అవి పాచి పట్టి ఉండటం చేత కాళ్ళు జారిపోతున్నాయి. కష్టపడి రోజుకు ఓ మూడడుగులు ఎక్కితే, కష్టపడకుండా రెండడుగులు కిందకి జారుతూ ఉండేది. ఈ లెక్కన అది ఎన్ని రోజులకు బైట పడుతుంది? అనేది ప్రశ్న. కోతి ఇరవయ్యెనిమిదో రోజునో ఎప్పుడో బైటపడుద్ది గానీ..,  నాకీ పుస్తకం అసలు ఏనాటికైనా పూర్తవుద్దో లేదో తెలీడంలా. కొయ్యగుర్రమ్మీద స్వారీ చేస్తున్నట్టైపోయింది నా పని. (మాలతిగారి తూలిక నుంచి కాపీ కొట్టేసానీ పోలికను). ఈ పుస్తకం చదువుతూ మధ్యలో అప్పుడప్పుడూ ఏ శ్రీరమణ పేరడీలో, మిథునమో, అమరావతి కథలో చదూతూంటే, మాంఛి ఎండన పడి వచ్చాక, చల్లటి కుండలోనీళ్ళు తాగినట్టుండేది. 

పుస్తకం కొని ఏడాదిన్నర పైనే అయింది. కొయ్యగుర్రపుస్వారీ ఆపేసి కూడా ఇప్పటికే ఏడెనిమిది నెల్లైపోయింది. ఈలోగా ఎన్నికలు, రాశేరె చచ్చిపోడం, వాళ్ళబ్బాయి ముఖ్యమంత్రి కాకపోడం, వరదలు, తెలంగాణ ఉద్యమం.. వీటన్నిటితోటీ నేను బాగా బిజీ అయిపోయాను. ;)  ముఖ్యమంత్రి రోశయ్యకంటే కూడా బిజీ (రాష్ట్రంలో సగం మంది రోశయ్య కంటే బిజీయే ననుకోండి). పుస్తకాన్ని మళ్ళీ మొదట్నుంచీ మొదలెట్టాల్సొచ్చేట్టుంది. ఈసారి మాత్రం "ఆరంభింపరు నీచమానవులు.." అనే పద్యాన్ని మననం చేసుకుని మరీ మొదలెడతాను.

ఏంటో.. 'కోతికొమ్మచ్చి' చదివేసినంత చులాగ్గా ఇంగ్లీషు పుస్తకాలు కూడా ఎప్పటికి చదువగలనో!

25 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాశారు. ఏదో స్టేటస్ సింబల్ కోసం, ఇంగ్లీషు పుస్తకాలు చూడడం కానీ, ఛస్తే అర్ధం అవవు ( ఇప్పుడు అనుకోండి).'స్వర్ణయుగం'లో ఉన్నప్పుడు ఏవో చదివేవాడిని.మీరు అన్నట్లుగా 'కోతి కొమ్మచ్చీ', 'మిథునం' లో ఉన్న కమ్మదనం ఎక్కడనుండి వస్తుందండీ, ఈ పుస్తకాల్లో !

    రిప్లయితొలగించండి
  2. షేమ్ టూ షేమ్ నాకు గూడా అయన్ ర్యాండు అలాగే పరిచయము, ప్రార్ధన నవల ద్వారా. పోతే అది చదవటము కుదరలేదు అని పెద్ద బెంగ పెట్టేసుకోవద్దు. చాలా dry పుస్తకము.

    రిప్లయితొలగించండి
  3. భలే భలే, శెబాష్, చప్పట్లు, ఓ రెండు ఈలలు కూడా!
    మనలోమాట .. ఈ కింది రగస్యం మీరు చదివేశ్శాక తనంతతాను అదృశ్యమైపోతుంది. మళ్ళీ సాటి తెలుగు జాలజనులు మనల్ని అండరెస్టిమేటు చెయ్యకూడదు కదా!
    మీకది ఎక్కకపోతే అంత కష్టపడి చదవాల్సిందేమీ లేద్సార్. ఆవిడేమీ గొప్ప స్టైలిస్టు కాదు, ఆ రచనా చాతుర్యాన్ని అనుభవించి తీరాలి అనుకునేందుకు. ఇక మిగిలింది ఆవిడ ఫిలాసఫీ. దానికి సుబ్బరంగా వికీపీడియా చదివేశ్శెయ్యండి .. రాండ్ రచనల గురించి ఎట్టాంటి చర్చ వచ్చినా రఫ్ఫాడించెయ్యొచ్చు. రాండ్ వీర పంకా కూడా తేడా కనిపెట్టలేడు. నే చెప్తున్నాగా! అనవసరంగా శ్రమపడమాకండి. అంతకంటే హాయిగా శ్రీపాద కథలు చదూకోండి మళ్ళీ ఇంకోసారి.

    రిప్లయితొలగించండి
  4. బావుంది. నేను మొదటి నవల చదివినప్పుడు ఎలా ఉండేదో గుర్తొచ్చింది. ఇప్పుడు కొంచం బెటర్ లెండి కొంచం తేలికగా చదవగలుగుతున్నా.

    మీరు అన్నట్టు చాలా బ్లాగుల్లో చూడడం, ప్రతీ వాడూ ఈ పుస్తకాని ఉటంకించి మాట్లాడడం (ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బ్లాగ్ లో ) చూసి ఇది చదవకపోతే మనల్ని ఆది మనవుల్లా చూస్తారేమో అనిపించి, వికీ లో చాలా చదివి ఆవిడ గురించి మొత్తానికి కొన్నాను ఈ పుస్తకం. మొదలెట్టి ఒక ఆర్నెల్లు ఐంది ఇప్పటికి సగానికి వచ్చాను. కొన్నాళ్ళు మొత్తం చదవడమే మానేసాను అనుకోండి. ఈ ఏడాది ఎలాగయినా ముగించాలి అనుకుంటున్నా :)

    ఈ లోపు ప్రొఫైల్ లో పెట్టేయాలి.

    రిప్లయితొలగించండి
  5. చదువరికి చదువుట సమస్యయా! హతవిధీ :) తెలంగాణ ఉద్యమం త్వరగా చప్పబడిపోయి చదువరి గారికి చదవటానికి అవకాశమివ్వాలని కోరుకుంటున్నాను. :)

    అన్నట్టు చదువరి గారు, మీ వల్ల ఒక ఇంగ్లీషు రచయిత్రి పేరు తెలిసిపోయిందోచ్. ఎందుకంటే నేను ఇంగ్లీషు నవల్లు చదవను. ఎవరైనా ఏమేం నవల్లు చదివావ్? అని అడిగినప్పుడు కాస్త బిల్డప్ ఇచ్చుకోవచ్చు. రచయిత్రి పేరు కూడా "ఐరన్ రాడ్" ఉరఫ్ అయాన్ ర్యాండ్ అని గుర్తుంచుకోవటానికి సులభంగా ఉంది. ఇక నుంచి బ్లాగర్ల ఫ్రొఫైల్లు కూడా నిశితంగా పరిశీలించాలన్నమాట. :)))

    రిప్లయితొలగించండి
  6. హ హ మొన్నే అనుకున్నానండి "ఈ మధ్య బొత్తిగా సీరియస్ టపాలే నడుస్తున్నాయి ఏంటో ఎప్పటికి చల్లబడేనో వాతావారణం" అని మొత్తానికి పన్నీటి జల్లులు కురిపించారు. కొయ్యగుర్రం రైడ్ భలే ఉంది. తూహె పోహె త్రివేణీ ఒక్కపొడి సూపరు :-)

    నాకూ ఈవిడ్ని యండమూరి గారే పరిచయం చేశారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో అందరు తెగ చదివేస్తున్నారు అని అట్లాస్ ష్రగ్గ్డ్ చదవడానికి ప్రయత్నించి ఎన్నాళైనా యాభై పేజీలు దాటలేకపోయే సరికి ఈవిడ పుస్తకాలు మనకి అర్ధంకావులే అని మానేసాను. మళ్ళీ ఒక రెండేళ్ళక్రితమే కాస్త సైజు తక్కువుంది కదా అని ఫౌంటేన్ హెడ్ మొదలెట్టాను ఒక వంద పేజీలు దాటి కథలో లీనమైతే పుస్తకమే మనచేత చదివించేస్తుంది.

    ఇలాటి పెద్ద నవల్లు చదివేప్పుడు అలవాటయ్యే వరకు పాత్రలు గుర్తుండటానికి నేను లాస్ట్ పేజ్ లో ఎవరెవరు ఏంటో నోట్స్ రాసుకుంటుంటాను. పాకుడురాళ్ళు లాంటి తెలుగు నవలలకు కూడా ఈ పద్దతి తప్పలేదు. కోతికొమ్మచ్చి అంత సులువుగా చదివించే శక్తి ఆ రచయితలకే లేదండీ లోపం మనది కాదు :-)

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
    అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
    *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
    SRRao
    శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

    రిప్లయితొలగించండి
  8. గురూ గారూ, ఈ టపా అదేదో పరకాయ ప్రవేశంట, అట్లాగ, పరతలకాయ ప్రవేశం నేర్చేసుకొచ్చేసి, నా తల్లో దూరి, నా కథ రాసినట్టున్నారు. నేనూ యండమూరి ప్రార్థన నవల్లో అయాన్ ర్యాండు పేరిని అట్లాస్ ష్రగ్గుడు తీస్కొచ్చా. చాలా యేళ్ళ ముందు లెండి. తల వాచింది కానీ అర్థం కాలే. ఇంకా ఊర్కోకుండా బార్న్ టు విన్నూ, అయనెస్కో పుస్కమొగటీ తీస్కొచ్చినా. వాటి గతీ మీరన్న కొయ్యగుర్రం లాగానే. చివరికి, ఎవడో ఇంటలెక్చువల్ కి అంటగట్టేశా లెండి.

    అయితే నేను ఇంగిలీసు ఎలగబెట్టా అనడానికి సిడ్నీ షెల్డను ఆల్మైటీ, సెకండ్ లేడీ (ఈ పుస్తకం ఎందుకు చదివానో ఊహించుకోండి) మూడు నెల్లు కష్టపడి కాలేజీ రోజుల్లో ఎలగబెట్టాను.ఆ తర్వాత బుద్దుడికి లాగ తల వెనుక చక్రం తిరిగేసి, షాడో పుస్కాలు, ఆ తర్వాత శ్రీ రమణా, ఇలా డెవలప్పయిపోయా. (మొత్తానికి మనతో భావసారూప్యముండే వాళ్ళూ నెట్లో ఉన్నారన్నమాట)

    రిప్లయితొలగించండి
  9. "అసలు – ఎంత పెద్ద కథైనా రెండొందల పేజీల్లోపే చెప్పేయొచ్చు అన్న అభిప్రాయం, ఎలా ఏర్పడిందో గానీ, ఒకటేర్పడింది నాకు. వేలాది పేజీలకు పైగా సా….గే అట్లాస్ ష్రగ్‌డ్ తరహా నవలలంటే నాకు చిరాకు (ఐయన్ రాండ్ అభిమానులు కత్తులు నూరుతున్న శబ్దాలేనా అవి?) నా వరకూ – నూట యాభై పేజీల్లో ముగిసిపోయే అల్కెమిస్ట్ వంటివైతే మూడ్నాలుగు సిట్టింగుల్లో చదివెయ్యటం వీజీ. మొత్తానికి, ఒక నవల కొనాలా వద్దా అనేదానికి దాని పేరు ప్రఖ్యాతులకన్నా, దాని సైజు నాకు అతి ముఖ్యం"

    పైది, నా బ్లాగులో ఎప్పుడో రాసుకున్న పేరా. మీదీ ఆ టేస్టేనన్న మాట :-)

    రిప్లయితొలగించండి
  10. నన్నడిగితే అయాన్ రాండు పుస్తకాలు చదవాలంటే కాలేజి ఏజిలో చదవాలి. కాస్త ఇంప్రెషనబుల్ ఏజిలో చించాలి పొడిచేయాలి అని ఉత్సాహమే కాక, కొత్త విషయాలు తర్కించాలన్న జ్ఞానదాహమొకటి ఉంటుంది. ఇరవయ్యైదు దాటాక అయాన్ రాండ్ చదవాలంటే శానా కష్తం. (మీరు ఎవరితోనో వాదించాలంటేనో లేక ఎంతో పఠనాసక్తో ఉంటేనో తప్ప చదవాలన్న మోటివేషన్ రాదు.)

    నేను కాలేజిలోనే చదివినా అదృష్టవశాత్తూ ఆమె(ఫిలాసఫీ) మోజులో పడలేదు. ఈ యండమూరిలూ, రాంగోపాళ్ళూ, రైటుగోపాళ్ళూ ఎంత గ్లామరైజ్ చేసినా కొత్తపాళీ గారు చెప్పిన మాట కరెష్టు మాట. చదవకపోయినా పెద్ద నష్టం లేదు. ఆ మూడు ముక్కల ఫిలాసఫి వికిపీడియాలో చదివేస్తే సరి.

    Is it a vice to have a virtue? is an interesting debate that is relevant to todays indian society.

    ఇక దాన్ని చదవడం బదులు ఏ మిథునమో చదవాలన్న వాదన సరైంది కాదనుకుంటా. అవి రెండు డిఫరెంట్ genre. పోలిక తగదు.

    రిప్లయితొలగించండి
  11. చాలా బాగా వ్రాశారు! ఎంత మందికో 'సేం పించ్' ఇచ్చారు. అట్లాస్ ష్రగ్ చేస్తేనే అంత పెద్దదుంటే అట్లాస్ అన్‌ష్రగ్డ్ అని వ్రాస్తే ఇంకెంత పెద్దదై ఉండేదో కదా. కొత్త పాళీ గారి సీక్రెట్‌ను విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    రిప్లయితొలగించండి
  12. "భూమి గుండ్రంగా ఉంది" అనేది ప్రస్తుతం ఒకటోక్లాసు కుర్రాడికి తెలిసిన విషయం. దాన్ని ఆధారంగా తీసుకుని గెలీలియో వెధవని,ఆర్యభట్టు మూర్ఖుడు అని నిర్ణయించినట్టున్నాయి వ్యాఖ్యలు.

    Great knowledge of past becomes common knowledge of present అనేది అయాన్ ర్యాండ్ రాతలకూ వర్తిస్తుంది. తను రాసిన సమయంలో ఆ (కొత్త) సిద్దాంతాల్ని పాత్రలద్వారా చెప్పడానికి అన్ని పేజీలు కావాలి. ఇప్పుడు ఆ సిద్దాంతాలు మనందరికీ తెలుసు కాబట్టి ఎందుకు అనవసరమైన శ్రమ అనిపిస్తుంది.అంతమాత్రానా తన గొప్పతనం,ప్రాముఖ్యత తగ్గినట్లు కాదు.

    అయినా అయాన్ ర్యాండ్ ని నేర్చుకోవాలి,తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఉన్న (కాలేజి) వయసులో చదవాలి. మాకన్నీ తెలుసు అనుకునే అపోహల వయసులో కాదు.She is a popular writer with strong philosophical tradition that influenced societies. If we don't have a sense of philosophical history and history in itself appreciating her in these times might be difficult.

    రిప్లయితొలగించండి
  13. ఫౌంటెన్ హెడ్ చదవలేక పోతే '3 ఈడియట్స్' సినిమా చూడండి. అందులో 'రంచోర్ దాస్ చాంచడ్' (అమీర్ ఖాన్) పాత్ర చిత్రణ హోవార్డ్ రోర్క్ పాత్రను పోలి ఉంది. అలాగే 'చతుర్ రామలింగం' పాత్ర పీటర్ కీటింగ్ పాత్రను పోలి ఉంది.

    కాని యాన్ రాండ్ పుస్తకాలు చదవడం వల్ల వచ్చే అనుభవం వికిపెడియా తో లభిస్తుందంటే పొరబాటే. కేవలం ఆమె తత్త్వం మాత్రమే తెలుసుకోవాలంటే Objectivist Epistemology, Virtue of Selfishness వగైరా పుస్తకాలు చదవొచ్చు. ఇవి చిన్నగానే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆవిడ 1940 లలో వ్యక్త పరచిన భావాలు ఇప్పటికి కూడా అక్షర సత్యాలు. ఆమె individualism ని ప్రభోధించారు. collectivism ని తీవ్రంగా విమర్శించారు.

    collectivism తో కలిగే నష్టాలని ఆమె ఆ కాలం లోనే విపులంగా వివరించారు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర గుంపు కట్టే పద్ధతులను చూస్తే... ప్రతి మనిషి కులం గుంపు, మతం గుంపు, ప్రాంతం గుంపు, ఉద్యోగం లో యూనియన్ గుంపు, వగైరా. ఒక్కొక్కరు ఒకటికన్నా ఎక్కువ గుంపులలో ఉంటున్నారనేది చూస్తున్నాం. ఏ గుంపులో లేకుండా స్వతంత్రంగా ఉన్న వారు కూడా ఉంటారు (వారే ఎక్కువ). ఇలా ఏ గుంపులో లేకుండా ఉండేవారికి గుంపుల నుండి రక్షణ ఉండాలనేదే అయాన్ రాండ్ ముఖ్య సిద్ధాంతం (నాకు తెలిసినంత వరకు).

    రిప్లయితొలగించండి
  14. ఫౌటెన్ హెడ్; నేనూ చదివానీ పుస్తకాన్ని. చిరంజీవనుకుంటా నాకు బ్బ్బాగా నచ్చిన పుస్తకం ఇదయ్యా అని చెబితే. ఆయనకంత గనంగా నచ్చితే మనమ్మాత్రం చదవద్దా అని కొని చదివేశా. / the way నకిది పిచ్చపిచ్చగా నచ్చినప్పటికిన్నీ అట్లాసును ష్రగ్గుజేయు ప్రయత్నం మాత్రం ఇంకా చేయలేదు.

    మీరు చెప్పిన అవస్థ నేనూ పడ్డాను Oliver Twist చదువుతున్నప్పుడు. అదేం స్టైలో తెలీదుగానీ ఒక లైనంటే పేరాకు మల్లే వుండేది. వాక్యాల్లో సెమీ కోలనులు, కోలనులు చూసి మూర్చవచ్చినంత పనైయ్యింది. ఫుల్లుస్టాపు దగ్గరమాత్రమే ఫుల్లుగా ఆగి ఊపిరిపీల్చుకోవాలనే నా చాదస్తానికి (అలా కాకపోతే ఎఫెక్టివ్‌గా వుండదని నా అభిప్రాయమబ్బా...) ఫుల్లుస్టాపు పెట్టేశాను. ఒక 100 పేజీలు చదివాక ఏం చదువుతున్నానో అర్ధంకాక ఓ దశలో దాన్నోపెట్టెలో పెట్టి తాళమేశాను. మూణ్ణెల్ల తరువాత నీచమానవులు పద్యం ఏవరో గుర్తుచెయ్యడంతో మళ్ళీ మొదలెట్టి మొత్తానికి చదివేశా. ఆ రోజు నేను చేసిన భీషణ ప్రతిజ్ఞకి (ఏమై వుంటుందో ఊహించుకోండి) నేనీనాటిక్కూడ కట్టుబడే వున్నాను. ఇంచుమించు ఇలాంటిదే War and Peaceది కూడా కాకపోతే ఈసారి ముప్పై నెలలుకాదు సుమా ఏళ్ళు... తరువాత మొదలుపెడతాను.

    రిప్లయితొలగించండి
  15. హరి దోర్నాల గారు,
    రాంచోని రోర్క్ పాత్రతో పోల్చడం సరైనదేనా? సపోజ్, రాంచో సినిమాలో చూపించినట్టుగా సరదా మనిషి కాదనుకోండి. లద్దాక్‌లో పిల్లలకోసం స్కూలు గట్రా తెరిచి చారిటీ యాక్టివిటీస్ చేయక కేవలం సైన్స్ రీసెర్చిలో మునిగిపోయాడనుకోండి. ఐనా మనకు నచ్చేవాడా?

    రిప్లయితొలగించండి
  16. వ్యాఖ్యాతలకు నెనరులు.

    harephala: నెనరులు.

    సురేష్ కాజ: :) నెనరులు!

    కొత్త పాళీ: ఈ దగ్గరిదారేదో బాగుందండీ! చూడాల్సిందే. :)

    Vasu: మనం పందెవేసుకుందామండీ, ఎవరు ముందు చదూతారోనని. :)

    నాగప్రసాద్: :)

    వేణూ శ్రీకాంత్: మీ సూచన బాగుందండి.

    SRRao: నెనరులు సార్!

    రవి: "చివరికి, ఎవడో ఇంటలెక్చువల్ కి అంటగట్టేశా లెండి." :)

    అబ్రకదబ్ర: "మీదీ ఆ టేస్టేనన్న మాట": మనకు ఆసక్తి కలిగేట్టుగా ఉంటే ఎంత లావాటిదైనా చదవొచ్చనుకోండి. ఉదాహరణకు ఇండియా ఆఫ్టర్ గాంధీ!

    budugu:
    "రాంగోపాళ్ళూ, రైటుగోపాళ్ళూ": సూపర్! :)
    "..ఇక దాన్ని చదవడం బదులు ఏ మిథునమో చదవాలన్న వాదన సరైంది కాదనుకుంటా. అవి రెండు డిఫరెంట్ genre. పోలిక తగదు." - ఒప్పుకుంటానండి. గుంటలబాటపై సాగే ప్రయాణాన్ని కుదుపుల్లేకుండా సాగే ప్రయాణంతో పోల్చడమే నా ఉద్దేశం తప్ప, ఆయా రచనల నాణ్యతను పోల్చడం నా ఉద్దేశం కాదు. ప్రయాణం సరిగ్గా చెయ్యలేకపోవడం నా అశక్తతే తప్ప మరోటి కాదు!

    చంద్ర మోహన్: "కొత్త పాళీ గారి సీక్రెట్‌ను విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది." - ఔనౌను!

    కత్తి మహేష్ కుమార్: ర్యాండును, ఆవిడ పుస్తకాలను తేలిక చేసే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడి వ్యాఖ్యల్లోనూ ఆ ఉద్దేశం కనబళ్ళేదు.

    హరి దోర్నాల: ర్యాండు సిద్ధాంతం గురించి కొంత అవగాహన కలిగించారు. నెనరులు.

    Indian Minerva:
    "..భీషణ ప్రతిజ్ఞకి (ఏమై వుంటుందో ఊహించుకోండి) ": 'ఇంకెప్పుడూ పుస్తకాలు చదివే విషయంలో నీచమానవులు పద్యం ప్రసక్తి తీసుకురాను.' అంతేనాండి?

    రిప్లయితొలగించండి
  17. ఇక్కడ నేను కూడా రెండు ముక్కలు చెప్పి వెళ్ళాలి.. ఇంగ్లీష్ పుస్తకం చదవడం మొదలెట్టడం పాపం.. "ఒక్క నవల చదివే టైములో నాలుగైదు తెలుగు పుస్తకాలు లాగించేయొచ్చు, చక్కగా.." అనిపిస్తూ ఉంటుంది.. పెండింగ్ లో ఉన్న తెలుగు పుస్తకాలు పూర్తయ్యాక ఇంగ్లీష్ చదవాలి అని కొన్నాళ్ళు ప్రయత్నించాను కానీ అదీ కుదరలేదు.. ఇప్పుడింక ఇంగ్లీష్ నవలలో తెలుగు కథలు నంజుకుంటూ ఆ ప్రకారం ముందుకు పోతున్నా..

    రిప్లయితొలగించండి
  18. @ బుడుగు

    రాంచో, రోర్క్ ఇద్దరూ తము చేసే పనిని, లేదా చదివే విషయాన్ని ఎంజాయ్ చేస్తారు. రాంచో మార్కుల కోసం చదువలేదు, కొత్త విషయం నేర్చుకోవడానికి చదివాడు. చతుర్ మార్కులు తెచ్చుకోవడం కోసం, మంచి ఉద్యోగం, దబ్బులు సంపాదించడం కోసం మాత్రమే చదివాడు, విషయం నేర్చుకోవడానికి కాదు.

    రాంచో చారిటీ చెయ్యకపోయినా మనకు నచ్చేవాడు. చారిటీ విషయం చివరికి మాత్రమే తెలిసింది, కానీ అప్పటి వరకూ కూడా అందరికీ నచ్చాడు.

    రిప్లయితొలగించండి
  19. నేను కూడా నా మాస్టర్స్ చేసే సమయంలో ప్రొజెక్టు వర్కుకు సమాంతరంగా ఫౌంటెన్ హెడ్, వి ద్స్ లివింగ్ పూర్తి చేసాను. అత్లాస్ ష్రగ్డ్ రెందు వందల పేజీలు చదివిన తరువాత ఆపేసి ఇంతవరకూ పూర్తి చేయలేదు.

    ఇంగ్లీషు నవలలు కూడా యండమూరి, మల్లాది నవలలంత సులభంగా చదవాలంటే సిడ్న్య్ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, డాన్ బ్రౌన్, జాన్ గ్రిషంలు చదవండి. ఆయన్ రాండును మాత్రం ఒక నవలలోసం కాకుండా, తన ఫిలాసఫీ కోసం చదువండి, అది కొంచెం కష్టమే. ఒక విప్లవాత్మకమయిన ఫిలాసఫీని రూపొందించి దాన్ని నవలలోని పాత్రల ద్వారా చెపడమే ఆయన్ రాండ్ విశిష్ఠత.

    రిప్లయితొలగించండి
  20. Indian Minerva: :)
    మురళి: మీరు చెప్పిన మార్గాన్ని నేనూ ప్రయత్నించి ముందుకు పోక పోయినా, కనీసం వెనక్కు పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలియజేసు కుంటున్..నాను. :)
    Karan Kumbh: నిజమే, నా మొదటి ఇంగ్లీషు పుస్తకాలని కాస్త వీజీగానే చదివేసినట్టు గుర్తు.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులు చెప్పిందే నేనూ చెబుతున్నాను. అనవసరంగా సమయం వృధా చేసుకోకండి. ఈ పుస్తకం పరమ చెత్త. ఇంతకంటే చెత్త నేనెక్కడా చూడలేదు. ఆ మాత్రం చెప్పడానికి అన్ని పాత్రల చేత అంత సేపు క్లాసు పీకాలా? దేఁవుఁడా! ఆమెను నమ్మిన అమెరికావారి దౌర్భాగ్యం నేను కళ్ళారా చూచాను కాబట్టి నా మాటకు తగువిలువివ్వగలరు.

    నేను అవి చదవాల్సిన వయస్సులోనే చదివాను. మీరు చెప్పిన రాండు అభిమాన నెటిజన్లు అందరూ ఆ లేత వయస్సులో చదివి మోసపోయినవారే నాలాగా. నేనూ ఒక ఆఱునెలలు అభిమానిగా పెట్టుకొని ఆ తరువాత తీసేశాను. ఇక ఆ గూదవాళ్ళందఱికీ ఈ పుస్తకం ఎందుకు నచ్చుతుందంటే,
    చిరంజీవి రజనీకాంతు సినిమాలు అందరికీ ఎందుకు నచ్చుతాయో అచ్చం, అచ్చం అంటే నూటికి నూరు శాతం, అదే కారణం చే. ఒక హీరో వుంటాడు, రోర్కో రాకేశో ఏదో పేరుంటుంది. వాడు ఇష్టమచ్చినట్టు చేస్తుంటాడు. ఆఖరికి ఆడికి అన్నీ అనగా పిల్లా డబ్బు దక్కుతాయి. సీతయ్య సినిమా చూశారా? చూడకపోతే దాని ట్రెయిలర్ చూడండి, ఈ పుస్తకం చదివినట్టే !

    వ్యక్తివాదం రక్తివాదం అంటాంటారు. దాని గుఱించి మన యోగశాస్త్రాలలో ఎప్పుడో చెప్పియున్నారు. సామ్యవాదంలాగా ఇదో వాదం. వదనకి తప్ప దేనికీ పనికి రాదు.

    ఇక మీరు నిజంగా ఆంగ్ల సాహిత్యము మీదఁ అభిమానము పెంచుకోవాలంటే (పెంచుకోదగ్గ అర్హత ఆంగ్ల సాహిత్యానికి తప్పక వుంది), జేన్ ఆష్టిన్ లేదా చారెస్ డికెన్స్ చదవండి. Sense and Sensibility, Great Expectations వంటివి (నాకు తెలిసినంతలోఁ) ప్రపంచ సాహితీ చరిత్రలో మహాభారతం వంటి సాహిత్యం నుండి చివరకు మిగిలేది వంటి సాహిత్యానికి లాక్కువచ్చాయి. ప్రత్యేకించి రెండవది. అంతెందుకు ఎవరైనా తెలుగు సాహిత్యం చదువుతానని వస్తే మీరు యండమూరి సూచిస్తారా? కొకు సూచిస్తారా?


    {కాస్త మీకు అర్థం కావాలని తీవ్రంగా వ్రాసాను గానీ, తెలంగాణ ఉద్యోమం సద్దుమణిగాక మీకు నిజ్జంగా పని లేక పోతే చదివి, వెఱ్ఱి వేయి విధాలు అని అనుకోవచ్చు.}

    అన్నట్టు ర్యాండ్ పై కలంకలలులో ఎప్పుడో సుదీర్ఘ చర్చే జరిగింది.

    రిప్లయితొలగించండి
  22. బాగుంది! :)

    ఇలా జనజీవన స్రవంతిలో కల్సిపోవాలనే పోయిన ఏడాది, తెలుగు సినిమాలు ఎడపెడా చూసి, బుర్ర వాచిపోయింది కానీ, కొత్త తెలుగు సినిమా ఇంకా వంటబట్టలే! కాకపోతే ఆఫీసు కాంటీన్ లో జరిగిన "ఆర్య - రెండు" సభలో నేను వెర్ర్రి చూపులు చూడక, ఓ రెండు మూడు జోకులు గుర్తుపెట్టుకొని మరీ ఉపన్యసించటం, ఏడాదికాలం పాటు నే జరిపిన కృషికి ప్రతిఫలం.

    క్ర్రాస్ వర్డ్ లాంటి షాపుల్లో ఉండే ఏకైక సౌకర్యం - పుస్తకం మనకి అలవాటయ్యేదాకా చదువుకొని, నచ్చితే కొనడం. ఈ లోపు పుస్తకం అయ్యేపోతే మరీ సంతోషం. :) (ప్రసాద్స్ ఒడిస్సీలో తెలుగు పుస్తకాల కలెక్షన్ బాగుంది. లాండ్‍మార్క్ వాడూ బానే పెడుతున్నాడు. విశాలాంధ్ర స్థాయి డిస్కౌంట్స్ ఉండవులేండి..)

    అయన్ రాండ్ పై నేను చెప్పాలనుకున్నది, హరిగారు చెప్పారు. మూడేళ్ళ క్రితం నేను తెలుగు పుస్తక విషయాలేవీ తెల్సుకోకుండా విశాలాంధ్ర్రకి, నవీన్ బాంధవ్యాలు, సాహిత్య వ్యాసాలూ, చలం మైదానం ఏకబిగిన చదివి "హయ్యో.. ఎంత సమయం వేస్ట్ చేశానే" అనుకున్నాను. కాకపోతే ఆ తర్వాత తెలుగు బ్లాగులూ, బ్లాగర్ల పుణ్యమా అని బోలెడు విలువైన సాహిత్యం గురించి తెల్సుకున్నాను. మీకూ ఇంగ్లీషు పుస్తకాల విషయంలో సరైన మార్గదర్శకం తప్పక లభిస్తుందని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  23. నాదీ మీ లాంటి పరిస్తితే ఆండీ,ఇప్పుడు మళ్ళీ మొదటి నుండీ మొదలు పెట్టాలి "ఫౌంటెన్ హెడ్" ను

    రిప్లయితొలగించండి
  24. నేనైతే నవల నవల చదవడం అంత సులభంగా లేదని యూ ట్యూబు నుండి మూవీ డౌన్లోడ్ చేసి చూసేశాను

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు