2, జనవరి 2010, శనివారం

రాష్ట్ర విభజనపై తిరుపతిలో రౌండ్‌టేబుల్ సమావేశం

రాష్ట్ర చీలిక ఉద్యమం నేపథ్యంలో హెచ్చెమ్‌టీవీవాళ్ళు వివిధప్రాంతాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతపు సమావేశం ఆమధ్య హై.లో జరిగింది. తరువాత డిసెంబరు 27న రాయలసీమ సమావేశం తిరుపతిలో జరిగింది. సాయంత్రం దాదాపు ఐదున్నర నుండి రాత్రి 11 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో సీమ నాయకులు, మేధావులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.


తెలంగాణవాదుల అభిప్రాయం చెప్పడానికి వి.ప్రకాశ్ ఈ సమావేశంలో పాల్గొన్నాడు. తెలంగాణ దృక్కోణం వివరించడంతోపాటు, మీ సందేహాలను నివృత్తి చేస్తాను అని చెప్పుకొన్నాడాయన. ఆయనతోపాటు, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ, ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్త, ప్రముఖ సీమ సామాజికవేత్త భూమన్‌ (ఈయనకు రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక లాంటి పేరుగల సంస్థ ఏదో ఒకటుంది ) లు కూడా వేదికపై కూర్చున్నారు. కె. రామచంద్ర మూర్తి సమావేశాన్ని నడిపించారు.

సమావేశంలో జరిగిన చర్చల ఫలితంగా, సీమప్రజల అభిప్రాయాలు కిందివిధంగా బయల్పడ్డాయి
  1. రాష్ట్ర విభజన కూడదు. సమైక్య రాష్ట్రమే కావాలి.
  2. విడిపోయేందుకు తెలంగాణ చెబుతున్న కారణాలు సబబు కాదు. వెనకబాటుతనమే విడిపోయేందుకు అర్హత ఐతే, అందుకు తెలంగాణ కంటే సీమకే ఎక్కువ అర్హత ఉంది.
తెలంగాణవాదులు ప్రత్యేకరాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారో ప్రకాశ్ చెప్పాడు. నదీజలాలపై తమ హక్కులను ఎలా కాలరాసారో చెప్పాడు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం దగ్గర్నుండి తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్టాడాడు.

ఆతరవాత సమావేశానికి వచ్చిన సీమ ప్రతినిధులు మాట్టాడారు. అసలు రాష్ట్ర విభజనకు ప్రాతిపదికే లేదు అని తెదేపా నేత గోపాలకృష్ణారెడ్డి అన్నాడు. భూమన కరుణాకరరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.. రాయలసీమను తెల్లోడికి అప్పగించిన తరవాత, 1823 నుండి 1947 వరకు నిజాము దానిపై కప్పం పొందుతూ వచ్చాడు. రాయలసీమ నుండి వెళ్ళిన కప్పం డబ్బు కూడా హైదరాబాదు నిర్మాణంలో  భాగమే. అందుచేత హై. ను మా రక్తమాంసాలతోటే కట్టాము అంటూ తెలంగాణవాదులు చెప్పడం తప్పు అని ఆయన అన్నాడు.

"మమ్మల్ని నీచంగా తిడుతూ వివిధ ప్రాంతాల మధ్య జాతివైరం ఉన్నట్టుగా సృష్టించారు. రెచ్చగొట్టే ధోరణితో మాట్టాడుతూ ప్రజల మధ్య అంతరాలు పెంచారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థుల గురించి అసభ్యంగా, అవమానకరంగా మాట్టాడారు. మానవతాదృక్పథంతో అందరం కలిసి అభివృద్ధి చెందాలని మా ప్రాంతం వాళ్ళమందరం కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రాంతం మాత్రమే వెనకబడి ఉందని చెప్పడం నిజం కాదు. మా ప్రాంతం కూడా వెనకబడి ఉంది. అయినప్పటికీ విడిపోదామని మేమెవ్వరం కోరుకోవడం లేదు", అని ఆయన అన్నాడు. ఇంకా "రాష్ట్ర ప్రగతిని కాంక్షించేవాళ్ళు, మేధావులు, అన్ని ప్రాంతాల ప్రజల క్షేమం కోరేవాళ్ళు కలిసి చర్చించుకుని ఒక పరిష్కారం కనుక్కోవాలి." అని అన్నాడు.

సిహెచ్.చంద్ర శేఖరరెడ్డి,రాయలసీమ కార్మిక కర్షక నేత: రాష్ట్రం ఎందుకు విడిపోకూడదో ఈయన చక్కగా, విశదంగా మాట్టాడాడు. "ప్రజలకు విశాలాంధ్రలో ఒరిగింది ఏమీ లేదు. అయినా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాం. సీమకోసం ఎవరూ ఏమీ చెయ్యలేదు. ఒక్క ఎన్టీరామారావు మాత్రం సీమకోసం కొంత ప్రయత్నం చేసాడు. ఆ తరవాత వయ్యెస్ కూడా కొంత ప్రయత్నం చేసాడు. ఒక్క సీమకేకాక, ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తా లోని మెట్టప్రాంతాలకు కూడా ఆయన మేలు చేసాడు. ఆయన మరణంతో సీమ అన్యాయమైపోయింది."

"గతంలో పోతిరెడ్డిపాడు విషయం ఎంత వివాదాస్పదమైందో మేం మర్చిపోలేదు. పోలవరం విషయంలో ఎంత వివాదమైందో చూసాం. సమైక్యంగా లేకపోతే ఈ ప్రాజెక్టులకు సమస్యలొస్తాయనేది సీమ ప్రజలకు భయం. అంత గొడవలు జరిగిన తరువాత, రాష్ట్రం విడిపోతే, ఈ ప్రాజెక్టులు వెలుగు చూడవనే భయం. మాటిమాటికీ 'మా పరీవాహక ప్రాంతానికి తగినట్టుగా, ఆ నిష్పత్తిలో మాకు నీళ్ళు కావాలి' అని వాదించే తెలంగాణ నాయకుల గురించి మాకు భయం." అని అన్నాడు.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి తుడా చైర్మన్: ఈయన చెప్పినదానిలో సరుకు అంతగా లేదు. "ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో ప్రజలను అడిగి తెలుసుకోండి. మేధావులను కాదు. ప్రెస్సు, పోలీసు ఈ ఉద్యమానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తే బాగుంటుంది", అంటూ సోది చెప్పాడు. కేసీయారు ఉద్యమకారుడో మద్యమకారుడో అంటూ ఒక జోకు వేసాడు. అలా వ్యక్తిగత విమర్శలు చెయ్యకూడదని నిర్వాహకులు వెంటనే అతణ్ణి కట్టడీ చేసారు. మొత్తమ్మీద ఈయన ప్రసంగంలో చెప్పిందేమీ లేదు.

సికెబాబు, చిత్తూరు కాంగ్రెసు నాయకుడు: ఈయనా అంతే! ఊకదంపుడు తప్ప చెప్పిందేమీ లేదు! దశ దిశ కోసం మాలాంటి వాళ్ళం కాకుండా మేధావులు, శాస్త్రజ్ఞులు, మొదలైనవాళ్ళతో చర్చించాలి అని ఓమాట చెప్పాడు.

దయాకర్, విద్యార్థి నాయకుడు: ఇతడు అవినీతి గురించి అసందర్భంగా మాట్టాడబోగా, ఇతర సదస్యులు వారించారు. చిన్నపాటి గొడవ జరిగింది. ఇంకా ఇతర విద్యార్థులొకరిద్దరు మాట్టాడారుగానీ వాళ్ళ ప్రసంగాలు అపరిపక్వంగా అనిపించాయి. వరంగల్ జిల్లానుంచి వచ్చిన ఒక తెలంగాణ కుర్రాణ్ణి కూడ మాట్టాడించారు. రాష్ట్ర విభజన కూడదని అతడు చెప్పాడు. ఆ కుర్రాడిలోకూడా పరిణతిలేమి కనిపించింది.

సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెదేపా నాయకుడు: ఈయన కాస్త అర్థవంతంగా మాట్టాడాడు. రాష్ట్ర విభజన కూడదని గట్టిగా వాదించాడు. "అనంతపురం జిల్లాకంటే దరిద్రంలో మునిగితేలే జిల్లా మరొకటి ఉందా? సమస్యల గురించి సరైన విధంగా ఫోకస్ చెయ్యకుండా ఒక వ్యక్తి కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారం వీళ్ళకెవరిచ్చారు అని అడుగుతున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా సినిమా షూటింగులు చేసుకోవచ్చు, కానీ హై.లో మాత్రం కుదరదు. ఏమిటీ ఘోరం!?" అన్నాడు. "జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్‌లు విడిపోయినపుడు వాళ్లకు నీళ్ళ పంపిణీ సమస్యల్లేవు. రాజధాని సమస్యల్లేవు. అందుకే అక్కడ రాష్ట్ర విభజన సజావుగా సాగిపోయింది. కానీ మనకు ఆ సమస్యలెన్నో ఉన్నాయి. " అన్నాడు.
తెలంగాణ వెనకబడి ఉందనే వాదనను తిరస్కరిస్తూ, "రాష్ట్ర తలసరి పరిగణనలోకి తీసుకుని చూడండి, తెలంగాణ ఏమాత్రం వెనకబడి ఉందో చెప్పండి" అని ఆయన అన్నాడు.

ఎమ్.వి రమణారెడ్డి: రాయలసీమ విమోచన సమితి పేరుతో ఉద్యమం చేసిన వ్యక్తి ఈయన. దరిమిలా ఏదో కేసులో జైల్లో ఉన్నాడు. రాష్ట్రం విడిపోతే మంచిదని ఈయన ఉద్దేశం. సీమ ప్రత్యేక రాష్ట్రం కావాలనేది ఈయన ఉద్దేశం.

రోజా దంచిపారేసింది. మాకు అన్యాయం జరిగింది అని గోల చేసేవాళ్ళు ఆ అన్యాయాలకు కారణమైన మీ నాయకులను నిలదియ్యకుండా కోస్తా సీమల నాయకులను తిట్టడం ఏంపద్ధతి అని నిలదీసింది.

శాంతారెడ్డి అనే భాజపా నాయకురాలు సీమ నాయకులకు స్ఫూర్తి కలిగేలా మాట్టాడింది. 'హైదరాబాదు సమావేశంలో మమ్మల్ని మాట్టాడనివ్వలేదు. కానీ, ఇక్కడ నా తమ్ముళ్ళు చాలా హుందాగా ప్రవర్తించారు - ప్రకాశ్ గారిని 45 నిముషాల పాటు నిరాక్షణీయంగా మాట్టాడనిచ్చారు, మా సీమజనులను నేను అభినందిస్తున్నాను' అని తెలంగాణ నాయకులకు చురక అంటించిందామె. ఇదేముక్క అంతకు ముందు భూమన కరుణాకరరెడ్డి కూడా చెప్పాడు.. "హై.లో మనల్ని మాట్టాడనివ్వలేదు. కానీ మనం మాత్రం ప్రకాశ్ గారి ప్రసంగానికి అడ్డు తగలం" అని సదస్యులకు చెప్పాడు.

రాష్ట్ర చీలికకు వ్యతిరేకమని శాంతారెడ్డి అంది. సీమకు గోదావరి నీళ్ళు రావాలి. అలా జరగాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని ఆమె వాదించింది.

ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసరు ఒకాయన మాట్టాడారు.. నారాయణరెడ్డి అనుకుంటా ఆయనపేరు. ప్రకాశ్ గారు చెప్పిన ప్రతీ గణాంకానికీ సమాధానం గణాంకాల ద్వారానే ఇవ్వగలను, నా దగ్గర ఆ వివరాలున్నాయి, మీరు సమయమిస్తే చెబుతాను అని అన్నారు. సమయం లేకపోవడం చేత చెప్పలేదుగానీ, మాట్టాడిన కాసేపు చాలా బలంగా తన వాదన చెప్పారాయన.

ఆ తరవాత అనంతపురం జిల్లా కాంగ్రెసు నాయకుడొకాయన కూడా చాలా చక్కగా మాట్టాడారు. చీలికవాదుల వాదాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రసంగించారాయన.

మొత్తమ్మీద ఆ సమావేశం చూసాక నాకొక విషయం అర్థమైంది. మన టీవీల వాళ్ళు ఘంటా చక్రపాణి లాంటి సత్రకాయల్ని, తెలంగాణ పక్షపాతులను కెమెరాల ముందు కూచ్చోబెట్టి మనకు తెలంగాణవాదాన్ని ఊదరగొట్టేస్తూ ఉన్నారిన్నాళ్ళూ. తెలంగాణవాదుల అబద్ధాల్ని బయటపెట్టి, వాళ్ళ నోళ్ళు మూయించగల సమర్థులకు కూడా టీవీల్లో అవకాశాలిస్తే వీళ్ళ దొంగలెక్కల్ని లోకానికి తెలిసేలా బయట పెట్టెయ్యడం ఖాయం!
---------------------------------------------

ఈ హెచ్చెమ్‌టీవీ అధినేత రామచంద్రమూర్తి మాజీ పత్రికా సంపాదకుడు, తెలంగాణ సమర్ధకుడు. రాష్ట్ర చీలికను సమర్ధించడం ఆ చానెలువారి బయటికి చెప్పుకోని విధానం. ఈ రౌండ్‌టేబులు సమావేశాల ద్వారా రాష్ట్ర చీలికకు సమర్ధనగా అభిప్రాయాన్ని అన్నిప్రాంతాలనుండి పోగుచెయ్యడం వీళ్ళ ఉద్దేశంగా నాకు తోచింది. రామచంద్రమూర్తి సమావేశాన్ని నిర్వహించిన విధానంలో నాకా ధోరణి కనిపించింది. ఈ సమావేశ ఫలితంతో హెచ్చెమ్ టీవీ ఆశాభంగం చెంది ఉండాలి. తమ విధానం ఏమైనప్పటికీ ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చెయ్యడం మాత్రం అభినందనీయం.

10 కామెంట్‌లు:

  1. చదువరి గారు !
    ఆ రోజు ఆ ప్రోగ్రాం చాలా మంది లైవ్ చూసారు. మీరు " సమైక్యవాద " సమర్థకులు కాబట్టి మీరూ మీ కనుకూలంగా రిపోర్ట్ ఇచ్చాక, మీకు రామచంద్ర మూర్తిని నిందించే హక్కెక్కడిది ?
    సరే ! తెలుగు వాళ్ళంతా సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి కోరికలు మీ నాయకులు తీర్చగలరా ?. అవేం గొంతెమ్మ కోర్కెలేం కావు. ఇది వరకు ’ పెద్ద మనుషుల ఒప్పందం ’ లో ఉల్లంఘన జరిగిన వాటికి సరిదిద్దే కార్యక్రమాలు... ఇంకా తెలుగు వాళ్ళందరిలో భావ సమైక్యత, సమానత్వం పెంపొందించే పనులు. అర్థం కాలేదా ? చెబుతా వినండి.
    1. " గిర్ గ్లాని కమిషన్ " లెక్కతేల్చిన 2,50,000 మంది ఆంధ్రా, రాయల సీమ ఉద్యోగులను 3 నెలల లోపు ఆ యా ప్రాంతాలకు బదిలీ చేసి, ఆ ఉద్యోగాలలో తెలంగాణ వారిని రిక్రూట్ చేయాలి. అంటే నిక్కచ్చిగా 610 G.O. ను అమలుపరచాలన్న మాట.
    2. " ముల్కీ రూల్సు " ను పునరుద్ధరించాలి. హైదరాబాదు ఆరో జోన్ లో అంతర్బాగమని పార్లమెంటులో బిల్ పాస్ చేయాలి.
    3. ఇక్కడ పెట్టుబడులు పెట్టామని బీరాలు పోయే ఆంధ్రా, రాయల సీమ వాళ్ళ ప్రైవేట్ సంస్థలలో తప్పనిసరిగా కనీసం మూడో వంతు ఉద్యోగాలలో తెలంగాణ వారిని నియమించాలి.
    4. తెలంగాణలోని అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, వినోబా భావే భూదాన యజ్ఞం ద్వారా సేకరించిన భూములు, ఇతర చారిటీ ట్రస్ట్ భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని, తెలంగాణ దళితులకు, మైనారిటీలకు, పేదలకు పంచాలి.
    5. రెండు సంవత్సరాలలోపు " ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ " మరియు " ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్ట్ " ను పూర్తి చేసి, ఇంకా కృష్ణా, గోదావరి పరీవాహక నిశ్పత్తి ప్రకారం తెలంగాణ జిల్లాలకు సాగు నీటిని, త్రాగు నీటిని అందించే ప్రాజెక్టులను చేపట్టాలి.
    6. హైదరాబాదుతోసహా తెలంగాణ జిల్లాలలో వచ్చే ప్రభుత్వాదాయాన్ని ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసి, ప్రతి సంవత్సరం తెలంగాణ బడ్జెట్ ను వేరుగా ప్రకటించాలి.
    7. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఇక్కడి పాత నాయకులు, కవులు, మహానుభావుల ( ఉదా || పాల్కురికి సోమన, గణపతి దేవ చక్రవర్తి, ప్రతాప రుద్రుడు, పోతన, మల్కిభ రాముడు, కులి కుతుబ్ షా, సాలార్జంగ్, కొమురం భీమ్, మగ్ధూమ్ కవి, వానమామలై సోదర కవులు, దాశరథి, స్వామి రామానంద తీర్థ, బూర్గుల, సురవరం ప్రతాప రెడ్డి, పి.వి. మొ|| వారు ) చరిత్రలను తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలి. వారి విగ్రహాలను ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాలలో విస్తృతంగా ప్రతిష్ఠించాలి. వారి పేర్లను కూడా ఆ ప్రాంతాల ప్రభుత్వ సంస్థలకు పెట్టాలి.

    ఇంత న్యాయబద్ధమైన కోరికలను మేమడిగితే ... మీ స్వార్థ ప్రయోజనాలు దెబ్బ తింటాయని, మా కన్నా ముందు మీరే " జై ఆంధ్ర - జై రాయల సీమ " అంటారు. 1973 లో మీరు చేసింది అదే కదా! ఒక వేళ మీరు పై పై మాటలకు ఒప్పుకొన్నా, ఆ మాట మీద మీరు నిలబడతారన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే మీ బతుకు మీరు బతకండి. మా మానాన మమ్మల్ని వదిలేయండి.

    రిప్లయితొలగించండి
  2. సరే ! తెలుగు వాళ్ళంతా సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి కోరికలు మీ నాయకులు తీర్చగలరా ? --> It is your leaders(your MPs, MLAs) failed to implement. It is not the responsibility of Kostha, Rayalaseema leaders. Damn, KCR, Madhu Goud and other MPs are in their seats for more than 8 years. What the hell did they do to their respective dist? and you never agitated for florid problem by doing mass resignation/ pen down. Today you are claiming it is the Andhra leaders responsibility?

    Dude, today people came from different parts of andhra pradesh and settled in Hyd, because it is capital city.

    Do you think the listed down points from 1...7 will be implemented at least 25% after Telengana is given? (It would be great if they are all implemented I am not against implementing any of them, it is you and people of respective regions to kick the asses of leaders and get the things done.)

    7. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఇక్కడి పాత నాయకులు, కవులు, మహానుభావుల ( ఉదా || పాల్కురికి సోమన, గణపతి దేవ చక్రవర్తి, ప్రతాప రుద్రుడు, పోతన, మల్కిభ రాముడు, కులి కుతుబ్ షా, సాలార్జంగ్, కొమురం భీమ్, మగ్ధూమ్ కవి, వానమామలై సోదర కవులు, దాశరథి, స్వామి రామానంద తీర్థ, బూర్గుల, సురవరం ప్రతాప రెడ్డి, పి.వి. మొ|| వారు ) చరిత్రలను తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలి. వారి విగ్రహాలను ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాలలో విస్తృతంగా ప్రతిష్ఠించాలి. వారి పేర్లను కూడా ఆ ప్రాంతాల ప్రభుత్వ సంస్థలకు పెట్టాలి.

    Dude, I remember reading most of the stuff as you mentioned above when I was in school. I don't know if you have ever read. you want statues every where? I don't mind if you take off all the political leaders statues and replace them with all the mentioned above.

    Ultimately, it is all because of politicians who made this situation worst. and making their lives better by earning and making the lives of common people miserable.
    -

    రిప్లయితొలగించండి
  3. ROHIT: ముందుగా.., రామచంద్రమూర్తి గారు తెలంగాణ సమర్ధకుడని అన్నాను. అది ఉన్నమాటే! అంతేగాని నేను ఆయన్ను నిందించలేదండి. అలా ధ్వనిస్తే అది నా తప్పే!

    పోతే.., నిక్కచ్చిగా 610 జీవోను అమలు చేస్తే - మనం మాట్టాడుకోవాల్సింది 58,000 ఉద్యోగాల సంగతే. అంతేగానీ 250000 సంగతి కాదు. ఇంకోటి.. రాష్ట్రాన్ని చీల్చడమంటూ జరిగితే, చీల్చాక, 58000 కాదుగదా.. ఒక్కడు కూడా వెనక్కిపోడు. ఒప్పందాల్లో అది ఖచ్చితంగా ఉంటది చూడండి.


    జరిగిన అన్యాయాన్ని భూతద్దంలోంచి చూపించడమేగానీ, సమస్యల పరిష్కారం కోసం మనమేం చేసామిన్నాళ్ళూ అని ఆలోచించేవాడొక్కడు లేడు. ఆంధ్రావాళ్ళు పెట్టిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణావాళ్ళు లేరని వాపోతున్నారు.. తెలంగాణావాళ్ళు పెట్టిన కంపెనీల్లో ఎంతమంది తెలంగాణవాళ్ళ శాతం ఎంత ఉందో చూసారా? ఆ విషయంలో ఖచ్చితంగా ఇంత అని లెక్క చెప్పలేనుగానీ, తెలంగాణ పెట్టుబడిదారుల కంటే ఆంధ్ర పెట్టుబడిదారులే నయంగా ఉంటరని నేను భావిస్తాను.

    1973 లో జై ఆంధ్ర ఉద్యమం సంగతి మాట్టాడారు, బానే ఉంది. కానీ 1969 లో మేం వీళ్ళతో కలిసుండం అని తెలంగాణవాదులు గోల చేసాకే, రెండేళ తరవాత ఆంధ్రవాదులు జై ఆంధ్ర ఉద్యమం తెచ్చారు. ఎవడికి అన్యాయం జరిగితే వాడు 'చి చ్ఛీ, విడిపోతామ'నేవాడే! తప్పితే జాతి సార్వత్రిక విలువల గురించి ఆలోచించే పెద్దమనిషి ఎవడూ లేడు. ముఖ్యంగా తెలంగాణవాదుల్లో అసలే లేరు. కోస్తా, సీమ జనులు తమకంటే పెద్దవాళ్ళైపోతున్నారనే అసూయతో తెలంగాణవాళ్ళను రెచ్చగొట్టి రాష్ట్రాన్ని చీల్చాలని తహతహలాడిపోతున్నారు. వాళ్ళు లేకుండా పోతే తాము పెరిగి పెద్దాళ్లమౌదామనే దుగ్ధ. అంతేగానీ, సామాన్యుడి మీద ప్రేమ కానే కాదు. ఎవడి అధికార యావ, ఎవడి సంపాదనా యావ వాడిదేగానీ జనమ్మీద ప్రేమ ఉన్నవాడొక్కడు లేడీ తెలంగాణవాదుల్లో! వీళ్ళ యావ సంగతి తెలంగాణ ప్రజలు ఎత్తిచూపకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతూంటారు. ఒకటి రెండు ఉదాహరణలు చెబుతాను.. నిజంగా ప్రజలమీద ప్రేమే ఉంటే -

    మీ వ్యాఖ్యలో ఏడు కష్టాలను ఎత్తి చూపారు. కోల్పోయిన మీ ఉద్యోగాలు వగైరాల సంగతే గుర్తుకొచ్చిందిగానీ, గిరిజనుల భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్న సంగతిని మీ వ్యాఖ్యలో ఎక్కడా ఉదహరించలేదే? ఆ గిరిజనేతరుల్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారనేనా? తెలంగాణ ప్రాంతాలకు చెందిన గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించుకుంటే తప్పేం లేదా? ఏఁ, మీరు చేసిన దౌష్ట్యం కనబళ్ళేదా, మీకు? వాళ్ళకు నోళ్ళు లేవు, వాళ్ళ వ్యథల గురించి మాట్టాడానికి వాళ్ళకు రోహిత్ లాంటివాళ్ళెవరూ లేనంతమాత్రాన, అంత మాత్రాన వాళ్ళకు అన్యాయం జరగనట్టా? మీరే కాదండి, ఈ ఉద్యమాలు చేస్తున్న తెలంగాణవాదులెవరూ మాట్టాడరు. అసలు వాళ్ళకు జరిగిన అన్యాయలెవరికైనా తెలుసో లేదో కూడా తెలవదు. అన్యాయం జరిగినందనే పేరుతో రాష్ట్రాన్ని చీల్చే పనైతే, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను విడదీసి ముందు వాళ్ళకోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి.

    తెలంగాణవాదుల్లో ప్రజలమీద నిజంగా ప్రేమ ఉన్నవాడొక్కడైనా ఉంటే నల్లగొండ ఫ్లోరోసిస్ బాధలు ఇన్నాళ్ళ దాకా అలాగే ఉండేవి కావు. వాళ్లకు తాగునీళ్లందిస్తే - ఫ్లోరోసిస్ బాధలు తీర్చేస్తే - 'ఆంద్రోళ్లను' తిట్టి పెద్దోళ్ళైపోదామనే అవకాశం ఒకదాన్ని తెలంగాణవాదులు కోల్పోయినట్టేగా? అంచేతే సమస్యలేవీ తీరకూడదు. అలాగే ఉండాలి. రాష్ట్రాన్ని చీల్చేదాకా అలాగే ఉండాలి. ఆ తరవాత వాటినెవడూ పట్టించుకోడు. ఎందుకంటే ఎవరికివారు పెద్దాళ్ళైపోతే చాలు. ప్రజల గోడు ఎవరికీ అవసరం లేదు!

    రిప్లయితొలగించండి
  4. For more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
    http://blogubevars.blogspot.com/2009/12/3.html

    రిప్లయితొలగించండి
  5. మీరు ఆ సమావేశానికి హాజరయ్యారా! నేను కూడా వద్దామనుకుని రాలేకపోయాను. ఆ సమావేశంలో మాట్లాడిన వరంగల్ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ కుర్రాడు నా స్నేహితుడే. :) తనతో పాటుగా నన్ను కూడా ఆ సమావేశానికి తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నించాడు. కాని నాకు కుదరలేకపోయింది. :(

    అక్కడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ప్రకాశ్ గారు సరియైన సమాధానాలు చెప్పలేకపోయారని నా స్నేహితుడు చెప్పాడు. సమాధానాలను దాటవేస్తూ మాది "ఆత్మగౌరవ" సమస్యంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పాడు.

    ఇంకా అక్కడి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేస్తున్న TV వాళ్ళను తిడుతూ, అక్కడున్న HMTV వాణ్ణి కూడా నిలదీశారని చెప్పాడు. వాళ్ళు మేమేం చేస్తామండి మాక్కూడా TRP రేటింగ్స్ కావాలి కదా అని సమాధానమిచ్చినట్లు చెప్పాడు.

    రిప్లయితొలగించండి
  6. తిరుపతి లో జరిగిన hmtv- దిశ-దశ కార్యక్రమము, హైదరాబాదులో కంటే మంచి చర్చా జరిగింది. ఈ విషయములో మీరు వ్రాసిన రివ్యూ పూర్తిగా కరెక్టు .
    రెండు చూసిన వారికి hmtv .secret agenda అర్థమయ్యింది. ప్రత్యేక తెలంగాణ కు కే సి ఆర్ కు వ్యతిరేకముగా మాట్లాడిన వారిన ఎడిటర్ రామచంద్రమూర్తి కట్టడి చేయడం కనిపించింది.

    రిప్లయితొలగించండి
  7. నేను నాగ ప్రసాద్ గారు, ఆ సమావేశానికి హాజరు కావలిసిఉంది అండి, కానీ వీలు కుదరలేదు.

    రిప్లయితొలగించండి
  8. రామచంద్రమూర్తి గారు తెలంగాణా సమర్ధకులు అని నాకు అనిపించలేదు

    రిప్లయితొలగించండి
  9. @Rohit,

    నేను 1990-99 మధ్య కాలంలో ఒకటో తరగతి నుంచి పదో తగరతి దాకా చదివాను. ఏడవ పాయింటులో మీరు ప్రస్తావించిన ప్రముఖులనందరి గురించి నేను ఏదో ఒక తరగతి పాఠ్య పుస్తకాల్లో చదివాను (మల్కిభ రాముడు, ముగ్ధుమ్ కవి మినహాయిస్తే). ఇది కాదని మీరు వాదిస్తే చాలామంది తెలంగాణా వాదుల్లాగా మీరు వాస్తవాలు పక్కన బెట్టి మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  10. @ ROHIT garoo,

    "పాల్కురికి సోమన, గణపతి దేవ చక్రవర్తి, ప్రతాప రుద్రుడు, పోతన, మల్కిభ రాముడు, కులి కుతుబ్ షా, సాలార్జంగ్, కొమురం భీమ్, మగ్ధూమ్ కవి, వానమామలై సోదర కవులు, దాశరథి, స్వామి రామానంద తీర్థ, బూర్గుల, సురవరం ప్రతాప రెడ్డి, పి.వి. మొ|| వారు -- " వీరందరి గురించీ తప్పక చదివి ఉన్నారండీ అందరమూ ! కాకుంటే, ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే మన పిల్లలకి మనమే మన సంస్కృతి గురించి చెప్పడంలేదు. తెలుగు వారిలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రముఖులనీ తెలుగు వాచకాల్లో మీరు చూడవచ్చు. కానీ తెలుగు చదివించే వారేరి? తెలంగాణా ని ఎవ్వరూ అన్యాయం చెయ్యలేదండీ ... తెలంగాణా ప్రాంతపు నాయకులే అన్యాయం చేసారు, ఇప్పుడూ చేస్తున్నారు. వారు చేసిన అన్యాయాలను గురించి ప్రజలు నిలదీస్తారని, "ప్రత్యేక" పాట పాడుతున్నారు. బెదిరింపు రాజకీయాలతో వారు కూడా ఎన్నో రోజులు మభ్యపెట్టలేరు. సరైన దిశలో అన్నీ జరగకపోవడానికి కారణం కేవలం తెలంగాణా నాయకులే. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా - నిజం!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు