14, అక్టోబర్ 2009, బుధవారం

హైకమాండు, హై.కమాండు

జగను హై. చేరాడు. ఇక ఢిల్లీలో  హైకమాండు - హైదరాబాదులో  హై.కమాండు. మంత్రులు, ఎమ్మెల్యేల  తీర్థయాత్రాస్థలం ఇక కళకళలాడబోతోంది.  ముఖ్యమంత్రి జగనుకు చేసే ఫోన్లు ఇలా ఉండొచ్చు - 'జగనూ, ఆ రఘువీరారెడ్డి ఉంటే రేపో ఎల్లుండో ఓసారి సచివాలయానికి పంపించవా, కాస్త పనుంది.'

పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !


* * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * *

పాపం ముఖ్యమంత్రి! ఆఫీసులో ఉంటే ఈ మంత్రుల ధిక్కారాలు, బయటికిపోతే జనం ఛీత్కారాలు...

వరద పరామర్శలలో ముఖ్యమంత్రికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కర్నూల్లో రాళ్ళేసారంట. వేసింది ఎవరనే విషయమై భిన్నాభిప్రాయాలుండగా రోశయ్య మాత్రం అసలు రాళ్ళు వెయ్యనేలేదని అన్నాడు. (నిజమేంటో ఆ జగన్నాయకుడికే ఎరుక. ) రేపల్లె దగ్గర మాటలతో నిలదీసారు. ఆయనకు చిరాకొచ్చి, దురుసుగా మాట్టాడాడంట. గతంలో కూడా రోశయ్యకు ఒకసారి ఇలాంటి అనుభవమైంది. - ఆరోగ్యశాఖామంత్రిగా హై.లో పర్యటించేటపుడు ఒక బస్తీలో ప్రజలు ఆయన్ను చికున్ గున్యాను నిరోధించలేకపోవడంపై నిలదీసారు. అప్పుడు కూడా ఆయన జనంపై చిరాకుపడ్డాడు. ఒక పరిణతి చెందిన నాయకుడు కూడా జనమ్మీద ఇలా విరుచుకుపడితే ఎలా? (రాజకీయ నాయకుడు, పరిణతి -ఈ రెండూ విరోధాభాసాలు కదా అని మీరంటే నేజెప్పేదేమీ లేదు) ప్రత్యర్థి పార్టీలమీద ఎదురుదాడి చేసీ చేసీ వీళ్ళకి అలవాటైపోయి జనమ్మీద కూడా కత్తులు దూస్తున్నారు. ఎదురుదాడి చెయ్యడంలో రాశేరె వీళ్ళందరికీ బాగా ప్రైవేటు చెప్పేసినట్టున్నాడు -రాటుదేలిపోయారు.

* * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * *

ఈ రాళ్ళేసిన సంఘటనను సీనియర్లు జగనుపై గన్నెక్కుపెట్టేందుకు వాడుతున్నట్టు కనిపిస్తోంది. డి.శ్రీనివాసు, కేకే జాగ్రత్తగా గాల్లోకి మాటలను పేలుస్తున్నారు. ఇలాంటివి ముందు గాల్లోకి చేసే కాల్పులలాగానే కనిపిస్తాయి, కానీ తగలాల్సినవాళ్ళకి బానే తగుల్తాయి. ముందు ముందు ఓ మాదిరి దొమ్మీకి దారితీసే సత్తా కలిగిన కాల్పులివి. మరి ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతూంటే,  హై. కమాండు వారి కమాండోలు ఊరుకోరు గదా  -వాళ్ళు నేరుగా వీళ్ళమీదకే గురిపెడతారు. ఇక హైకమాండువారి ఇతర కమాండోలు కూడా రంగంలోకి దిగుతారు. రెండువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలై, ఓ నాల్రోజులు దడదడలాడిపోతుంది. ఆ తరవాత గాయాలకు మందు రాసుకుంటూ, 'విషయం హైకమాండు పరిశీలనలో ఉంది, ఇకనెవ్వడూ మాట్టాడకూడదు ' అంటూ సంధి ప్రకటిస్తారందరూ. మళ్ళీ గాల్లోకి కాల్పులు జరిపేవరకు శాంతి. కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం లాగా వీళ్ళు నోరు తెరిస్తే యుద్ధం, నోరు మూస్తే సంధి.

* * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * *

కేసీయారు నోరు తెరిస్తే మాత్రం మాటల వరదే, తిట్ల బురదే. మామూలుగానే ఆయనకు మంచి వాగ్ధాటి ఉంది. ఏ నాయకుడికీ లేని వాక్శూరత్వం (శ్లేష ధ్వనిస్తోందా.. అయితే సరే!) ఆయన సొంతం. తిట్టే వేళ ఆయన నాలుక మరీ పదునుదేలుతుంది. అయితే మొన్న దాని స్థాయి కొంత దిగజారి, వాగ్ధాటి కాస్తా వాగుడు లాగా పరిణమించింది. తాగి వాగుతున్నాడని కొందరు కాంగ్రెసు నాయకులు అన్నారు. ఏంటో నాక్కూడా అలాగే అనిపించింది. నిజమేంటో విద్యాసాగరరావుకే ఎరుక!

చంద్రబాబు చెంపలు ఎడాపెడా వాయించినా, మేడమ్మను దేవతగా పొగడినా, వెనువెంటనే డియెస్సు వచ్చి నా కాళ్ళు కడిగి రమ్మన్నా కాంగ్రెసులోకి రాను అని అన్నా.. అది కేసీయారుకే చెల్లు.  కేసీయారు ఆ రకంగా చెడుగుడు ఆడుతూంటే అతడి బ్లాగే గుర్తుకొచ్చింది నాకు.


* * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * *

11 కామెంట్‌లు:

  1. జగన్ కి సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వదు. బస్సులు ద్వంసం చేసి, తన బ్యానర్లని చింపివేసిన వర్గం నడుపుతున్న జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఎందుకిస్తుంది సోనియా? Moreover, Jagan is not politically experienced. So, giving chief ministership to him would be a crude joke.

    రిప్లయితొలగించండి
  2. కాంగ్రెస్స్ నాయకులు నొరు తెరిస్తే యుద్ధం నొరుమూస్తే ( తాత్కాలిక) సంధి. ఈ వ్యాఖ్య బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. //పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !
    ఎంత కోపంతో, బాధతో వ్రాశారో ఇది !

    //చంద్రబాబు చెంపలు ఎడాపెడా వాయించినా, మేడమ్మను దేవతగా పొగడినా, వెనువెంటనే డియెస్సు వచ్చి నా కాళ్ళు కడిగి రమ్మన్నా కాంగ్రెసులోకి రాను అని అన్నా.. అది కేసీయారుకే చెల్లు
    :D :D

    రిప్లయితొలగించండి
  4. హ హ బాగా రాశారు. మీ రాజకీయ నాయకుల బ్లాగుల పోస్ట్ ఇపుడే చదివాను అది కూడా చాలా బాగుంది. అందులో కొందరు వ్యాఖ్యాతలు చెప్పినట్లు మీకు మీరే సాటి.

    రిప్లయితొలగించండి
  5. మీరు వ్రాసిన ప్రతీమాటతోనూ ఏకీభవిస్తున్నానండీ.

    ఇహ (రాశేరె) పోతే, కొణిజేటివారిపై ఒక చెణుకు. రాశేరె హయాంలో మొదటిసారి కాంగ్రెస్సు పదవిలోకి వచ్చినప్పుడు ముందుప్రభుత్వం సరిగా పనిచెయ్యలేదు కనుక ప్రస్తుతం చికున్‌గున్యా ప్రబలిపోయిందీ అనగలిగాడు (నిజానికి దేనికైనా ఇదే అస్త్రం వాడారు ఐదేళ్లూనూ), ఇప్పుడు మళ్లీ ఎన్నికయ్యాక దులుపుకుని పోవడానికి ఆ అవకాశం లేదుగా పాపం! అందుకే ఆ అసహనం.

    రిప్లయితొలగించండి
  6. పరిణతి లేనిది రోశయ్యకి కాదు, మన ప్రజలకే ! వాస్తవానికి ఒక కురువృద్ధుడుగా రోశయ్యగారు వారి ఘెరావ్ లని పెద్దమనసుతో తేలిగ్గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. "వాళ్ళు అన్నీ పోగొట్టుకుని నిలబడ్డారు. వాళ్ళ స్థానంలో నేనుంటే ముఖ్యమంత్రి చెంప పగలగొడుదును. పాపం, వాళ్ళా పని చెయ్యలేదు. సంతోషం." అన్నాడాయన. హైదరాబాదులో విలేఖరులతో మాట్లాడుతూ !

    ప్రజాస్వామ్య ప్రభుత్వ పనితీరు మీద మన ప్రజల అవగాహనలో చాలా లోపాలున్నాయి.

    ౧. ప్రభుత్వం అనంతమైన నిధుల కాణాచి ఏమీ కాదనీ, మనం డబ్బు కట్టకుండా ప్రభుత్వానికి అది సమకూడే మార్గం లేదని తెలుసుకోకపోవడం

    ౨. ఇలాంటి వైపరీత్యాల్లో ప్రజలే కాక ప్రభుత్వయంత్రాంగం కూడా బాధితులే నని, వారి జీవితాలే పాడైపోయినప్పుడు ప్రజల సంగతి పట్టించుకోవడం కష్టమని గుర్తించక పోవడం. ఉదాహరణకి కర్నూల్ లోని ప్రభుత్వోద్యోగులంతా సర్వస్వం పోగొట్టుకొని వీథిన పడ్డారు. వాళ్ళ ద్వారా నడిచే ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీచేసే పరిస్థితి గానీ, అవి స్థానికంగా అమలయ్యే పరిస్థితి గానీ లేదు.

    ౩. ఆపన్నప్రాంతాలు, వాటికి వెళ్ళే దారులూ భౌగోళికంగా పాడైపోయినప్పుడు వాటికి సహాయసామగ్రిని చేఱవేయడం ప్రభుత్వానిక్కూడా సాధ్యపడదనీ తెలుసుకోకపోవడం.

    ౪. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నంతమాత్రాన రాజఱికాల రోజుల్లో మాదిరి ఆ ఒక్క వ్యక్తినే బాధ్యుణ్ణి చేసి దాడిచేయడం, తిట్టిపోయడం, మీదపడి ఘెరావ్ చేయడం సమంజసం కాదని, అనాగరికమనీ అర్థం చేసుకోవడం.

    ఈ మానసిక లోపాల్లో కొన్ని రాజకీయపక్షాలు దశాబ్దాలుగా ప్రజలకి అలవాటు చేసినవి కూడా ఉన్నాయి.

    - తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  7. >>కొన్ని రాజకీయపక్షాలు దశాబ్దాలుగా ప్రజలకి అలవాటు చేసినవి కూడా ఉన్నాయి.
    అత్భుతమైన మాట తాడేపల్లి గారూ!!
    >>పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !
    :):)

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు