21, అక్టోబర్ 2009, బుధవారం

తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం

సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పేరుతో అక్టోబరు 21న తెరాస నిర్వహించిన సభను టీవీలో చూసాను. హైదరాబాదును ఫ్రీజోనుగా ప్రకటిస్తూ (పోలీసు నియామకాలకు సంబంధించి) సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కలిసి పెట్టిన సభ ఇది.


రాష్ట్రప్రభుత్వం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషను వేద్దాం అని అంటోంది. మొన్న అఖిలపక్ష సమావేశంలో కూడా ఆ ముక్కే చెప్పింది. తెరాస, లోక్‌సత్తా తప్ప మిగతా అన్ని పక్షాలూ అందుకు సరేనన్నాయి. ప్రజారాజ్యం ఏంజెప్పిందో ఏంటోగానీ, విషయాన్ని కూలంకషంగా పరిశీలించేదుగ్గాను (!!!) ఒక పార్టీ కమిటీని మాత్రం వేసింది.

తెరాస ఏమంటున్నదంటే-
రివ్యూ పిటిషను వల్ల ప్రయోజనమేమీ ఉండదు. వాళ్ళిచ్చిన తీర్పును పరిశీలించండని మళ్ళీ వాళ్ళనే అడిగితే ఉపయోగమేముంది? దానికి చెయ్యాల్సిందల్లా ఒకటే.. రాజ్యాంగాన్ని మార్చాలి, హై. ఫ్రీజోను కాదని ప్రకటించాలి. 1972 లో జైఆంధ్ర ఉద్యమం తరవాత ఇలాంటి పనే చేసారు, ఇప్పుడు చెయ్యడానికేంటి బాధ?

ఎన్నికల్లో దెబ్బతిని, అచేతనంగా పడున్న ఉద్యమానికి కొత్త జవసత్వాలనిచ్చి మళ్ళీ నిలబెట్టడానికి కేసీయారుకు వచ్చిన మహదవకాశం ఈ ఫ్రీజోను తీర్పు. ముందు పెద్దగా పట్టించుకున్నట్టు కనబడని కేసీయారు ఎంచేతో కాస్త నిదానంగా మేల్కొన్నాడు. సిద్ధిపేట సభతో ఉద్యమాన్ని చైతన్యపరచే ప్రయత్నం చేసాడు.

~~~~~~~~~~~

సిద్ధిపేట సభలో మాట్టాడినవారందరి వాదన ఏంటంటే.. ఫ్రీజోను అనే ప్రకటన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. రేప్పొద్దున తెలంగాణ ఏర్పడే పక్షంలో, ఈ ఫ్రీజోను అనే భావనను మరింత ముందుకు తీసుకుపోయి, హై.ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించమనే డిమాండు తలెత్తవచ్చు. దాన్ని అడ్డుకోవాలి.

సభకు స్వామి అగ్నివేశ్ కూడా వచ్చాడు. ఏంటో పాపం.. హిందీలో మాట్టాడుకు పోయాడు. ఏదో అగ్ని అన్నాడు, ఆగ్ అన్నాడు - మొత్తానికి అయిందనిపించాడు. సభలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్టాడారు. వాళ్ళ ప్రసంగాలూ చప్పగానే ఉన్నాయి.  చివరిగా కేసీయారు మాట్టాడాడు. ఆయన  చెప్పిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవి:
  • ఫ్రీజోనుపై సుప్రీమ్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, రాజ్యాంగ సవరణ చెయ్యాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి - అలా కోరుతూ శాసనసభ తీర్మానం చెసి కేంద్రానికి పంపాలి.
  • కేంద్రప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చెయ్యాలి.
మర్యాదగా ఈ పనులు చేసారో సరే సరి.. లేదా జరగబోయే పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఇదీ ఆయన చేసిన హెచ్చరిక.  కార్యాచరణలో భాగంగా ఆయన ప్రస్తావించిన అంశాలివి:
  • ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేస్తాం. 
  • జైళ్ళు నింపుతాం.
  • హింసాత్మక ఉద్యమానికి కూడా సిద్ధమే. అందులో భాగంగా అంతర్యుద్ధం (సివిల్ వార్ అని అన్నాడు) రావచ్చు. అలా అంతర్యుద్ధమే వస్తే అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
ఇంకో హెచ్చరిక కూడా చేసాడు: కోస్తా, సీమ ప్రాంతాలకు చెందిన పత్రికాధిపతులు, ఇతర మాధ్యమాల అధిపతులు, తెలంగాణలో స్థిరపడ్డ కోస్తా, సీమలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు,.. వీళ్ళంతా కూడా ఫ్రీజోను ఉత్తర్వును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలని డిమాండు చెయ్యాలి.

ప్రసంగంలో కేసీయారు చంద్రబాబుపై చేసిన విమర్శ ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వే జారీ చేసిన 124 జీవోను ఈ ప్రభుత్వం అమలు చెయ్యకపోతే అదేంటని నిలదీయలేని నువ్వేం ప్రతిపక్షనేతవు అని గద్దించి అడిగాడు. ఛి, చ్ఛీ అని ఈసడించాడు. ఫ్రీజోను గురించి గట్టిగా వ్యతిరేకించకుండా, 6 సూత్రాల ఒప్పందాన్ని కాపాడాలంటూ తీపి తీపి కబుర్లు చెబుతున్నాడని విమర్శించాడు. నీకు మగటిమి ఉంటే.. రా, జైల్‌భరోలో పాల్గొను అని సవాలు చేసాడు.

2004లో ప్రధానమంత్రి అయ్యాక విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగు చేసిన ప్రసంగాన్ని వినిపించి, 'ఇదిగో, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన నువ్వే మాట తప్పావు. నువ్వేదో సచ్ఛీలుడివని అంటారు.. నువ్వు అటువంటివాడివే అయితే, నువ్వు ఒకరి చేతిలో కీలుబొమ్మవే కనక కాకపోతే, నీకంటూ ఒక అస్తిత్వం ఉంటే.. ఇచ్చిన మాట నిలుపుకో ' అని హితబోధ చేసాడు. ఇదంతా హిందీలో!

రోశయ్య గురించి చాలా చెతుర్లాడాడు. అఖిలపక్ష సమావేశంలో అబద్ధాలు చెప్పాడని విమర్శించాడు. ఒక పిట్టకథ చెప్పాడు. రాశేరె చచ్చిపోయాక ఆయన్నొకరు "రాజశేఖరు పోయాడుగదా నీకు మంచిగుందా అన్నా" అని అడిగారట. తాను "ఆయనుంటేనే బాగుండేది, ఏదన్నా ఫైటింగు చెయ్యాలన్నా మంచిగుండేది. ఇప్పుడొచ్చిన ఈ పెద్దాయన్ను చూడు, ఏదన్నా అనాలంటే ఒక బాధ, అనకపోతే ఇంకో బాధ" అని సమాధానం చెప్పాడట..

కేసీయారు ప్రసంగంలో కొత్త నినాదాలూ వచ్చాయి:
  • జాగో తెలంగాణావాలే  భాగో ఆంధ్రావాలే
  • ఫ్రీజోను కాదురా, హైదరాబాదు మాదిరా!
కేసీయారు ప్రసంగంపట్ల ప్రజలనుంచి అంతగా స్పందన వచ్చినట్టు కనిపించలేదు. బహుశా టీవీలో చూస్తుంటే తెలియలేదేమో! నాకు మాత్రం ప్రసంగం చాలా నచ్చింది. ఆయనలాగా ప్రసంగించగలిగిన నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరని ఇంకోసారి తేల్చిచెప్పిన ప్రసంగం ఇది. చంద్రబాబు మీద నిప్పులు చెరిగినా, మన్మోహను సింగును నిలదీసినా, రోశయ్యను చమత్కార ధోరణిలో విమర్శించినా, రచ్చబండమీద కూచ్చుని కబుర్లు చెప్పిన చందంగా మాట్టాడినా,.. కేసీయారుకు సాధ్యపడినట్టుగా ఇంకో నాయకుడికి కుదరదు. చక్కటి తెలంగాణా యాసలో ఓ గంటసేపు చెడుగుడు ఆడుకున్నాడు. పేరుకు ఉద్యోగుల గర్జన ఐనా, ఇది కేసీయారు గర్జన.



8 కామెంట్‌లు:

  1. ఈ అగ్నివేశ్ ఎవరు? ఎప్పుడూ వినలేదా పేరు. తెలంగాణతో ఈయనకేమిటి సంబంధం? 'తెలంగాణ మేధావులు' అంటూ కొన్ని పేర్లు వినపడేవి ఇంతకు ముందు. అవి ఇప్పుడు వినపడటం లేదేమిటో.

    ఫ్రీజోన్ అనేది పోలీసు ఉద్యోగాలకు మాత్రమే సంబంధించిన విషయం కదా. ఫ్రీజోన్ చేస్తే ఎక్కువ లాభపడేది మహబూబ్‌నగర్ ప్రాంతపోళ్లు, ఆ సంగతి అర్ధమయ్యాకే కేసీయార్ గొంతు మారింది అన్నారు. ఎంతవరకూ నిజం? అయినా రాజధానిలో ఉద్యోగాలు కొన్ని ప్రాంతాల వాళ్లకే పరిమితం చెయ్యటమేంటి?

    రిప్లయితొలగించండి
  2. ఆయన ప్రసంగం చూసే అదృష్టం మాకు కలగలేదు కానీ, అంటే మాకు తెలుగు టీ.వీ.లు, చానళ్ళు గట్రా రావు. మీ వ్రాసిన ఈ టపాతో ఆయన మహర్దశ కనపడిందండీ. ధన్యవాదాలు. కానీ పేపర్లలో నేను చదివినంతమటుకూ ఆయన ప్రసంగాల్లో ఇదివరకు ఈ భూప్రపంచకంలో ఎన్నడూ విననివీ, కొత్తవీ, చెవులకింపైనవీ వెరసి ఇతిహాసాలకు ఇతిహాసాలే కనపడతాయి / వినపడతాయి ఈ కర్ణాలకు ఎప్పుడయినా. ఆ మహానుభావుడు ఏలాగున చెబుతాడనగా -

    " తెలంగాణా రాకపోటానికీ, హైదరాబాదు నగరాన్నో అందులో కొంత భాగాన్నో ఫ్రీ జోను చేయ్యలేకపోటానికీ, ఆ విష్ణుమూర్తే కారణం. తెలంగాణోళ్ళు పట్టు పట్టటం మొదలెట్టాక ఆ విష్ణుమూర్తి షికారుకో, సెలవు మీద చూసిపోడానికో వచ్చాడనుకో, చూసేసాడు, సమైక్యాంధ్రవాది కావటం మూలాన ముందు చిరాకుపడ్డాడు. రాత్రి అయ్యింది, స్నానాలు, ఇక్కడున్న ఆంధ్రా భక్తుల ఇంటో భోజనాలు అయ్యన్నీ అయ్యాక, నిద్దరొచ్చింది. మరి విష్ణుమూర్తి గాబట్టి తనతో పాటు పామును కూడా తెచ్చుకున్నాడు. మరి నీకు తెలుసో లేదో ఆయన మనలాగా మామూలు పరుపు మంచం మీద పడుకోకపోటానికీ, ఆ పైన పాము మంచం మీదే ఎందుకు పడుకుంటాడు అన్న దానికి బోలెడు కారణాలు"

    "ఎట్లాగెట్లాగ? సూతుడు శౌనకాది మునులకు చెప్పిన విధంగా చెప్పు తండ్రీ"

    " ఓరి హైదరాబాదోడా - ఒక వేళ మామూలు పరుపు మంచం మీద పడుకుంటే, దుప్పట్లు, దిళ్ళు తదితర సరంజామా కావాలా? మరి మూర్తిగారు గనక స్వేద రంధ్రాల్లో నుంచి స్వేదం పుట్టుకొచ్చి అవి మాసిపోతాయిగా!. అప్పుడేమో మరి అవి ఉతకటానికి వాళ్ళావిడ అంటే లక్ష్మీదేవిగారు ఒప్పుకోకపోతే చాకలివాడినన్నా పిలిచి వాడికి అప్పగించాలిగా.! మరి ఇక చాకలివాడికి ఖర్మకాలి ఇచ్చామే అనుకో, వాడు ఏ బండకో వేసి బాది వాటిని చిరుగులు పెట్టకుండా తీసుకుని రాడు. ఒకవేళ తెచ్చినా ఒక సమయపాలన లేకుండా వాడికి కుదిరినప్పుడు తెస్తాడు. ఇలాటివి ఇంకా బోలెడు చెప్పుకోవచ్చు. ఇవన్నిటితో ఆయనకు ఈతిబాధలెక్కువవుతాయి అని ఆయన ఆ పాము మీదే పడుకుంటాడు."

    "అసలు తెలంగాణా రావటానికీ విష్ణుమూర్తికి సంబంధం ఏమిటో, ఆపైన ఈ పాముమంచాలేమిటో, చాకలాళ్ళేమిటో ఇంకా అర్ధం కాలా సూత మునీంద్రా"

    " అదేరా గొర్ల బుద్దుల సన్నాసి - ఇక్కడ సంగతేంటంటే ఆయన పక్కా సమైక్యాంధ్రావాది. కాబట్టి ఆయన్ని, ఆయన పాము మంచంతో సహా ముందు తన్ని తరిమేస్తే, మన తెలంగాణా మనకొస్తుంది, హైదరాబాదు ఫ్రీ జోను అవుతుంది. లేకపోతే పాము తల కోసి రక్తం తాగుతా. నా తెలంగాణా విప్లవకారుల్ని పంపి అంతర్యుద్ధం పక్కరాష్ట్రాలకూ పాకిస్తా. అదన్నమాట సంగతి. నువ్వు ఇవ్వన్నీ ఈతాకుల మీద తాటికాయలంత అక్షరాలతో రాసి నీ పేపర్లో వెయ్యి. జై తెలంగాణా తల్లీ "

    " వార్నీ - $%@$%్** - అసలు %$@%@%@&**

    రిప్లయితొలగించండి
  3. KCR గారి ప్రసంగం మిస్సయాను అన్న భాదను మీ చెణుకులతొ తీర్చారు , Thank you sir.

    రిప్లయితొలగించండి
  4. ఏమీ జరగదు, ఈ వీర బొబ్బిలి మాటలు విని వినీ ప్రజలకు విసుగొచ్చింది. నరుకుతా, రక్తం తాగుతా, బొందపెడతా అనడమే. మొన్న కొద్దిలో చంద్రబాబు తప్పువలన మిస్ అయ్యాడు కానీ లేకపోతే ప్రజలే ఈయనకు బొంద పెట్టేవాళ్ళు.

    రిప్లయితొలగించండి
  5. అబ్రకదబ్ర: అగ్నివేశ్ కాషాయం కట్టుకోని, తలకో గుడ్డ చుట్టుకోని, రాజ్ బబ్బర్ పోలికలతో, వివేకానంద స్వామి ఆహార్యంతో తిరుగుతూంటాడు. ఆధ్యాత్మిక రంగానికి చెందిన వ్యక్తి. ఆర్యసమాజానికి చెందిన వాణ్ణని అంటూంటాడుగానీ వాళ్ళు దాన్నొప్పుకోరు. హిందువునని చెప్పుకుంటే మేమొప్పుకోం :) ముస్లిమునని చెప్పుకుంటే వాళ్ళు తన్ని తగలేస్తారు. వెరసి అతడేంటో తెలవదు -కాషాయ క్రైస్తవుడో, కాషాయ నాస్తికుడో తెలవదు మరి! మహబూబ్‌నగర్లో పుట్టిన తెలుగువాణ్ణని నాలుగు తెలుగు ముక్కలు తన ప్రసంగంలో చెప్పుకున్నాడుగానీ.., తెలుగస్సలు వచ్చిన బాపతులాగా లేడు. మొత్తమ్మీద కేసీయారు ఢిల్లీలో ఏం చేస్తాడోగానీ, ఇలాంటి రకాలను భలే పడతాడు. గతంలో ఇలాంటిదే ఒక సభకు జార్ఖండు నేరస్తుడు గడ్డపు శిబు సోరెన్‌ను తీసుకొచ్చాడు. ఇంకోసారి దేవెగౌడ వచ్చి నిదరపోయినట్టు గుర్తు.

    జలసూత్రం: విష్ణుమూర్తి సంగతులు కేసీయారు కంటే బాగా ఇంకెవరు చెప్పగలరులెండి. వాహనానికి తప్ప ఇంకెవరికి తెలుస్తాయి అన్ని సంగతులు!

    శ్రావ్య వట్టికూటి: నెనరులు

    మహేంద్ర తనయ: పతంజలి గారి వీర బొబ్బిలేనా? :)

    రిప్లయితొలగించండి
  6. వీరబొబ్బిలి ఆయనదే సార్..

    రిప్లయితొలగించండి
  7. నాకు ఇలాంటివి టి. వి. లొ చూసే అవకాశం లేదు .. చదువరి గారు ఇలా కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంటే (ఆయన కామెంట్స్ కూడ కలిపి) చూసినదానికన్నా ఎక్కువ మజా.. :-)

    రిప్లయితొలగించండి
  8. హైదరాబాద్ ని ఫ్రీజోన్ చెయ్యకపోతే దాన్ని స్థానిక ఉర్దూ/ పాకిస్తానీ/ బాంగ్లాదేశీ ముస్లిముల కోసమూ, ఉత్తరాదివాళ్ళ కోసమూ ఏడో జోన్ గా మారుస్తారు. వాళ్ళు నిన్నమొన్న వలసవచ్చినా సరే, వాళ్ళందఱికీ మనతో సమానంగా రేషన్ కార్డులూ గట్రా ఉదారంగా ఇచ్చేస్తున్నారు. ఎవడు ఎక్కణ్ణుంచి వచ్చాడో తెలియడం లేదు. కానీ వాళ్ళు స్థానికులకిందే జమ. తెలుగువాళ్ళ రాజధాని అనుకుంటున్న హైదరాబాదులో 610 జీవోని, గిర్ గ్లానీ కమీషన్ నివేదికనీ అడ్డంపెట్టుకొని ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వోద్యోగాల్ని ఉత్తరాదివాళ్ళు ఆక్రమించేశారు. తెలుగుభాషా పరిజ్ఞానం మన విద్యావ్యవస్థలో తప్పనిసరి కాకపోవడం కూడా ఇందుకు దోహదిస్తున్నది. బొంబాయిలాగా అయిపోతున్నది హైదరాబాదు కూడా. ఈ వెఱ్ఱి తెలంగాణ జనానికి ఆ సంగతి తెలియదు. ఈ తె.రా.స. గ్యాంగ్ తెలియనివ్వదు. ఎంతసేపూ తోటి తెలుగువాళ్ళని శత్రువుల్ని చేసి మాట్లాడతారు. హైదరాబాదుని ఫ్రీజోన్ చేస్తే తెలంగాణ ప్రజలకి అక్కడ ఇప్పుడున్న ఉద్యోగాల కంటే ఎక్కువే వస్తాయి. చెయ్యకపోతే వాటిని ఇదిగో ఇలా బయటివాళ్లు తన్నుకుపోతారు.

    -- తాడేపల్లి

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు