2, మార్చి 2009, సోమవారం

ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!

ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. పార్టీలు, నాయకులు మన ముందు చేతులు కట్టుకు నిలబడే రోజు వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు
    • మొదటిదశ: ఏప్రిల్ 16. 124 లోక్‌సభ నియోజక వర్గాలు. మన రాష్ట్రంలో తెలంగాణ, ఉత్తరాంధ్రల్లో 21 ని.వల్లో ఎన్నికలు జరుగుతాయి.  
    • రెండోదశ. ఏప్రిల్23. 141 లోక్‌సభ నియోజక వర్గాలు. మన రాష్ట్రంలోని మిగతా ని.వల్లో  ఎన్నికలు జరుగుతాయి.  
    • మూడోదశ: ఏప్రిల్ 30. 107 నియోజక వర్గాలు
    • నాలుగోదశ : మే 7. 85 నియోజక వర్గాలు
    • అయిదో దశ: మే 13. 86 నియోజక వర్గాలు
    • మే 16న ఓట్ల లెక్కింపు
  • ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభకూ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 
  • దాదాపు నెలరోజుల పాటు ఎన్నికలు జరుగుతాయి. మొదటిదశలో వోట్లేసాక, ఫలితాల కోసం సరిగ్గా నెలరోజులు ఆగాలి.
ఎన్నికల క్రమశిక్షణావళి వెంటనే అమల్లోకి వచ్చింది కాబట్టి, ఇక మనకు కొన్ని తలకాయనెప్పులు తగ్గొచ్చు. అవి..
  • టీవీల్లో వస్తున్న అడ్డగోలు, చవకబారు ప్రకటనలు. ఇకపై ఎన్నికల సంఘం అనుమతి లేనిదే ఈ రకం ప్రకటనలు వెయ్యగూడదు. అంచేత ఇక ఆ కోళ్ళూ, కుక్కల ప్రకటనలు ఉండకపోవచ్చు.
  • ప్రభుత్వం మన డబ్బుతో పేపర్ల నిండా గుప్పిస్తున్న ప్రకటనలు. ఇహన ఇవి గూడా రాకపోవచ్చు.
  • అయితే వీటికి ప్రత్యామ్నాయంగా నాయకులు బూతులు తిట్టుకోడం ఎక్కువౌతుంది. దాన్ని భరించాల్సిందే. ఎన్నికల సంఘం వీళ్ళ కూతలకు కూడా ఏదన్నా పరిమితి పెడితే బాగుంటుంది.
మనం చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి..
  1. ముందు మన పేరు వోటర్ల జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. లేనట్లైతే, ఇప్పుడైనా నమోదు చేయించుకోవచ్చు. పోస్టాఫీసులో ఒక దరఖాస్తు పడేస్తే చాలు, పని జరుగుతుంది. గుర్తింపు కార్డు లేకపోతే తీసుకోవాలి.
  2. మన ఇంట్లోవాళ్ళకు, తోటివాళ్ళకు వోటు హక్కు ఉందో లేదో కనుక్కుని, లేకపోతే నమోదు చేయించుకునేందుకు వాళ్ళను ప్రోత్సహించాలి. 
  3. వోటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల అధికారి వెబ్‌సైటులో చూడొచ్చు.  వివిధ ఫారాలు కూడా అదే సైటులో ఉన్నాయి.
  4. వోటేసేందుకు ఒక విధానాన్ని మనకు మనమే ఎంచుకోవాలి. అవినీతి లేని పాలన కోసమో, వ్యవసాయాభివృద్ధి కోసమో, పారిశ్రామికాభివృద్ధి కోసమో, ఎస్సీ వర్గీకరణ చెయ్యడం కోసమో, వర్గీకరణ చెయ్యకుండా ఉండటం కోసమో, తెలంగాణా కోసమో, సమైక్య భావన కోసమో,.. ఇలా మనకు ముఖ్యమనుకున్న విధానాలను ఎంచుకుని వాటికి న్యాయం చెయ్యగల పార్టీకి వోటేద్దాం. మన్నికైన నాయకులను ఎన్నుకుందాం. ఒక్కొక్కరి తప్పొప్పులను ఎంచి, బేరీజు వేసి వోటేద్దాం.
అసలంటూ వోటు వేద్దాం. వోటు, హక్కే కాదు, బాధ్యత కూడా!

16 కామెంట్‌లు:

  1. అవునుట ఇందాకనే ఒక మిత్రుడు చెప్పాడు.
    ఎన్నికల రణాంగణాన ఎదిరించిన .. కురుపాండవ కాదు .. కాంగెస్, టీడీపీ, పీయార్పీ, బీజేపీ, ఇంకేదోపీ, పాపాపీపీ .. ఇహ మొదలు సంరంభం.

    రిప్లయితొలగించండి
  2. అవునూ .. ఇంతకీ మన దేశంలో పార్లమెంటు, శాసన సభల కాల పరిమితి ఐదేళ్లే కదా. ఆ లెక్కన వచ్చే మే 14 నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరాలి - ఎందుకంటే, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 2004 మే 14న. మరి ఇప్పుడు మే 16న వోట్ల లెక్కింపంటే ప్రస్తుత ప్రభుత్వం/శాసన సభ ఐదేళ్లకి మించినట్లు లెక్క!

    రిప్లయితొలగించండి
  3. ప్చ్..!సరే..!వోటేస్తా . నాకేంటీ? అదే..ఎంతిస్తారు...?

    రిప్లయితొలగించండి
  4. అది ఐదేళ్ళకు మించినట్టు అవదనుకుంటా, కొన్నాళ్ళపాటు సభ ఉండదు. గత లోక్‌సభ శాసనసభల సంగతి చూస్తే, ఫిబ్రవరిలో (2004) వాటిని రద్దు చేసారు. కానీ తరువాతి సభలు ఏర్పడింది మేలో! అ సమయంలో ఉండే ప్రభుత్వం ఎలాగూ ఆపత్ధర్మ ప్రభుత్వమే.

    రిప్లయితొలగించండి
  5. ఇంకోటేంటంటే.. గడువు తీరేది, మొదటి సమావేశం తేదీ నుండి ఐదేళ్ళ తరవాత.

    రిప్లయితొలగించండి
  6. అంతా బాగానె ఉంది, రాజకీయ నాయకులకి మళ్ళా పండుగ వచ్చేసింది, కాని సామాన్యుల పరిస్థితే కుడితిలో పడ్డ ఎలుకలాగ ఉంది. ఎవరికి వోటెయ్యాలి అన్నది బిలియన్ డాలర్ ప్రశ్న, ఏ రాయైతేనేమి మూతి పళ్ళు రాలగొట్టుకోవటానికి అనుకుంటే సమస్యే లేదు

    రిప్లయితొలగించండి
  7. ప్రజా రాజ్యాన్ని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇంకా నా ఓటరు గుర్తింపు కార్డు చేతికి రాలేదు.

    రిప్లయితొలగించండి
  8. ఈసారైనా లోక్‌సత్తా కొన్ని స్థానాలైనా గెలుచుకుంటుందేమో చూడాలి. ఔనూ, ప్రతిభమ్మగారి తీర్మానం గురించి మీరు అస్సలేమీ మాట్లాడకపోవడం శోచనీయం!

    రిప్లయితొలగించండి
  9. @చదువరి:

    నిజమే. నే తప్పులో కాలేశా. ఆ నిబంధన 'రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలల కన్నా ఎక్కువ దూరం ఉండకూడదు' అని.

    రిప్లయితొలగించండి
  10. కొత్తపాళీ: ఔను, మీరన్నది నిజమే ఇది కురుపాండవ.. కాదు. ఇదో దొమ్మీ! :) ఎవడు ఎవణ్ణి కొడుతాడో, ఎవణ్ణి తిడతాడో, ఎవణ్ణి పొడుస్తాడో తెలవదు. అంతా అయ్యాక, సద్దుమణిగాకగానీ, క్షతగాత్రులూ నిధనులూ నిర్ధనులూ బయటపడరు.
    బాబు: :)
    లక్ష్మి: నిజానికి ఇవ్వాళ్టి రాజకీయ చిత్రంలో వో టెవరికి వెయ్యాలీ అనేది అంత చిక్కు ప్రశ్న కాదండి. లోక్‌సత్తా లాంటి పార్టీ మరోటి ఉండుంటే మనకు ఎంపిక కష్టమయ్యేది. :)
    సుజాత: మీరు ప్రజారాజ్యం పార్టీ ద్వారా అప్లికేషను పంపించారు, అంతేగదా? బహుశా అది ప్రజారాజ్యం తప్పు కాకపోవచ్చేమో! పోస్టాఫీసులకు సమర్పించిన అప్లికేషన్లను పరిష్కరించడంలో వాళ్ళు చాలా జాప్యం చేస్తున్నారు. ఎప్పుడో మూణ్ణెల్ల కిందట ఇచ్చిన అప్లికేషన్లకు సంబంధించి ఇంకా ఇళ్ళకు విచారణ కోసం రాలేదు. ఇక వేగిరపరుస్తారేమో చూడాలి.
    రాఘవ: అవును, రాబోయే శాసనసభలో నిజాయితీగల గొంతులు కొన్నైనా వినిపిస్తాయని ఆశిద్దాం. ప్రతిభమ్మ గారి తీర్మానం.. అర్థం కాలేదండీ.
    అబ్రకదబ్ర: :)

    రిప్లయితొలగించండి
  11. నేను అన్నది మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రభుత్వం మాట తు, చ తప్పకుండా విని స్వామి మాట త్రోసిరాజని చావ్లాకి పదవి కట్టబెట్టడం గురించి.

    రిప్లయితొలగించండి
  12. ఓహో, ఇది నాకు తట్టలేదండి.
    శేషన్‌కు ముందు ఎన్నికల కమిషనర్లు చాలావరకు నవీన్ లాంటోళ్ళే -కాంగ్రెస్ ఎలెక్షన్ కమిషనర్‌లు! కాబట్టి నవీన్ నవీనుడు కాదు, పాతకాలపువాడు, ప్రాచీనుడు, పురాతనుడు. ఇహ, ప్రతిభగారి సంగతి చెప్పేదేముంది..

    నవీన్, ప్రతిభ - పేర్లు రెండూ కూడా నేతిబీరకాయలే!!

    ఇంతకీ, గోపాలస్వామి చెప్పిన కారణాలను పక్కనబెట్టారు.., ఆయనను బీజేపీ సమర్ధకుడిగా లోపాయికారీగా ముద్దరేసేసారు. అయితే అయ్యుండొచ్చు, రేపు ఆ పార్టీలో చేరినా చేరొచ్చు, కానీ ఆయన ఆరోపణలను పట్టించుకోకపోవడం అన్యాయం.

    రిప్లయితొలగించండి
  13. చదువరి గారు,
    ఒక పార్టీ తరఫున ఇచ్చిన వందలాది అప్లికేషన్లలో అన్నింటికీ న్యాయం జరిగే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ ఫోన్ కంపెనీ బిల్లులను కూడా రెసిడెన్స్ ప్రూఫ్ కింద పెట్టి ఇచ్చారు కొన్ని దరఖాస్తులు. నిజానికి BSNL ఒక్కటే కదా అడ్రస్ ప్రూఫ్ కింద ఒప్పుకుంటారు. నేను ఆగస్టులో ఇచ్చిన దరఖాస్తుకి జనవరి నెల్లో విచారణకు వస్తారని చెప్పారు. ఇంతవరకు అతీ గతీ లేదు.

    సరాసరి GHMC ఆఫీసుకు వెళ్ళి అడిగినా "వస్తార్లెండి" అని చెప్తున్నారు. నా దరఖాస్తు పక్కాగా ఉన్నదన్నదొక్కటే నా ఆశ.

    రిప్లయితొలగించండి
  14. ఏకగ్రీవ ఎన్నిక
    ఈ పద్దతి వలన లాభాలు

    1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
    2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
    3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
    4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
    5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.
    మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

    * 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
    * 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
    * 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
    * 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
    * 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
    * 1955 : రామారావు కామారెడ్డి
    * 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
    * 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
    * 1957 : సీతాకుమారి బన్స్ వాడ
    * 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
    * 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
    * 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
    * 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
    * 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
    * 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
    * 1962 : కే.వి.రెడ్డి బోదన్
    * 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
    * 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
    * 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
    * 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎస్.భూపాల్ అమరచింత
    * 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
    * 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
    * 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
    * 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
    * 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
    * 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
    * 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
    * 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
    * 1981 టి.అంజయ్య రామాయంపేట
    * 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి

    రిప్లయితొలగించండి
  15. chaduvari gaaru, ee vyaakhya ee pai raatha ku sambhandhinchinadi kaadu...

    nenu mee blaagunu ennallanundoa chadootunnanu...okappdu meeru telugu blaagulloa taggipoatunna 'QUALITY' gurinchi raasarani gurthu..

    koodali loa ee madhya raajakeeyala peruthoa 'a2zdreams' ani oka manishi vichala vidigaa blaagutunnadu...entha vichalavidi gaa antea..tanu raaasindi tanakea artham kaanantaga..pichi vimarsalu cheayadam..taruvaatha comment laku samaadhaanam cheppakunda tappinchukoavaTam loa ditta....

    meeru ee blaagu nu chaduvutunnara? athagaaDiki samadhaanam cheppagala vyakthi gaa...meeru okkarea kanapdutunnaru..!!!

    ithagaadi chettha vimarsalani, sollu raathalani aapaDam ela? 'KOODALI' loaki ilaanti neechu lu raakunda cheyaDam ela?

    రిప్లయితొలగించండి
  16. johnbk: నేను బ్లాగుల్లో నాణ్యత గురించి రాసిన గుర్తు లేదు. నాణెమైన వ్యాఖ్యల గురించి మాత్రం రాసాను.

    ఏదేమైనా.. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నచ్చడం నచ్చకపోవడం అనేది మాత్రం వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది, ఏమంటారు!?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు