"విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటించిన.. " అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.
కానీ మనకో మహత్తరమైన విద్యుంది. ఎంత పొడుగాటి పేరునైనా తెగ్గొట్టి, ఇరగ్గొట్టి, ముక్కల్జేసి, మళ్ళీ అతికించి మహామహా పొడుగాటి పేర్లను కూడా నాలుగైదు అక్షరాలకు కుదించేస్తాం. అంచేత "విశ్వ విఖ్యాత.." -ఈ మొత్తాన్ని కుదించేసి ఎన్టీవోడు అని అనేసాం. పేరులో వాడు ఉందిగదా అని తేలిగ్గా తీసుకోకండి సుమా, మూడు తరాల తెలుగుప్రజలకు ఎన్టీవోడంటే "విశ్వవిఖ్యాత..' యేగానీ మరోటి కాదు, మరోలా కాదు. అయితే, సదూకున్నోళ్ళంగదా, ఎన్టీవోడనే మాట మాకు నోరు తిరక్క, ఎన్టీయారనేవాళ్ళం.
నాగ్గాడికి (నాగిగాడు అనే పేరుకు) ఎన్టీవోడికున్నంత పవిత్రత లేదు. ఈ మాట పలకడంలో కాస్త తేలికదనం ధ్వనిస్తుంది. ఆ రోజుల్లో నాయేస్రావును నాగ్గాడు అని అనడంలో మంచి సరదా ఉండేది. రాజబాబును రాజబాబనీ, పద్మనాభాన్ని పద్మనాభం అనీ పిలిచిన గుర్తే లేదు నాకు. రాజబాబుగాడనీ, పద్దనాబంగాడనీ అనేవాళ్లం. రాజనాల గాడు, నాగబూషణంగాడు, ప్రబాకర్రెడ్డిగాడు,.. ఇదీ వరస!
ఇహ కృష్ణ సంగతి చెప్పే పనే లేదు -ఔనౌను, సూపర్‌స్టారే! కిట్టిగాడనేవాళ్ళం. గూనప్పడు అనాలని యమా ఉత్సాహంగా ఉండేదిగానీ, ఫ్యాన్సు ఏడిచ్చస్తారని అనేవాళ్లం కాదు. చాటుమాటుగా అనుకునేవాళ్ళం. శోబన్‌బాబు మాకసలు ఒక లెక్కలోవాడేగాదు.., (ఆడికేఁవన్నా ఫైటింగొచ్చా, పాడా?) కృష్ణంరాజు జోలిక్కూడా పొయ్యేవాళ్ళంగాదు. అస్సలునేను కృష్ణంరాజును ఒక హీరోగా చూట్టం మొదలెట్టింది కటకటాల రుద్రయ్యతోటే!
సినిమావాళ్ళ సంగతి పక్కనబెడితే..
లక్ష్మిని లక్షణంగా లక్ష్మీ అని అంటామా? అనం. లష్వీఁ అంటాం. ఇంకాస్త అందంగా పలకాలంటే లచ్చిఁవి అంటాం. మహాలక్ష్మి అనే చక్కటి పేరును మరింత అందంగా మాలష్విఁ, మాలచ్చివిఁ అని అంటాం. సచ్చినాణ అనో, కొద్ది తేడాతో సచ్చినాడ అనో అంటే తప్పు పట్టకూడదు సుమా.. సత్యనారాయణకు అది పొట్టిపేరు మరి. సచ్చెం గూడా అలాటిదే! లష్నాణ కూడా ఆ పద్ధతిలో వచ్చిందే! వెంకటేశ్వరరావును ఎంకటేస్వర్రావనో, ఎంక్టేస్రావనో పిలవాలి.
పాసార్ది అనే పేరు వినే ఉంటారు.. చాన్నాళ్ళ కిందట ఒక కథ చదివాను. రాసిందెవరో, కథేంటో ఏమీ గుర్తు లేదుగానీ.. ఒకడు పాసార్దీ.. పాసార్దీ.. పాసార్దీ.. అంటూ కేకేస్తూండగా కథ మొదలౌతుంది. చెప్పొద్దూ.. ఈ పాసార్దీ ఏంటో నాకు వెంటనే అర్థం కాలేదు. నాలుగు వాక్యాలు చదివాక తెలిసింది, పార్థసారథిని అలా పిలుస్తున్నాడని. ఆ రోజుల్లో కాబట్టి సరిపోయిందిగానీ, ఇప్పుడైతేనా... "పాసార్ది అనగా పార్థసారథి" అని ఠక్కున తట్టనందుగ్గాను, హిందువుగా పుట్టినందుకు సిగ్గుతో తలవంచుకుని ఉండేవాణ్ణి. ఈ తలొంచుకోడమేంటి హఠాత్తుగా? అసలు హిందువుకూ దీనికీ సంబంధవేంటీ? అని అడగబాకండి.. అదంతే, అదిప్పుడు ఫ్యాషను!
పైన చెప్పిన పేరుమార్పులు, మార్పిడి పేర్లూ అన్నీ మనకు నచ్చేవే. ఇక నచ్చనివి కొన్ని..
ముందుగా కీరవాణి చేసిన ఒక దౌర్జన్యం గురించి చెప్పుకోవాలి -అవును ఎమ్మెమ్ కీరవాణే! "శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం.." అనే శ్లోకాన్ని, శ్రీరామదాసులో కాబోలు, పాడాడు. ఎలా పాడాడూ.. అరవిందదళాయతాక్షం అనాలి గదా.. అరవిందదళాయతాచ్షం అన్నాడు. (చాలామంది అంటారలా.) తెలుగు సినిమాల్లో ఇలాంటివి కొల్లలుగా ఉంటై, నువ్వు ఊరికే కోడిగుడ్డుకు ఈకలు పీకొద్దు అని అనకండి.. తెలుగైనా సంస్కృతమైనా ఇలా పదికాలాలు నిలిచే పాటల్లో, సినిమాల్లో తేడాల్లేకుండా పలకాలి, అంతే! ఇలా తప్పులు పాడితే, అది భాష మీద దౌర్జన్యం చేసినట్లే. పైగా- పాడింది ఏ ముక్కు గాయకుడో అయితే, మనసులోనే చిరాకుపడి ఒదిలేద్దుం. కానీ ఇక్కడ పాడింది కీరవాణి గదా, సరిగ్గా పలకాలా, లేదా? ఇప్పుడూ.. ఆడు, ఈడు, అడ, ఈడ,.. అంటూ నేను రాస్తున్నా గదా, రాసేది నేనైతే ఎవరూ పట్టించుకోరు. అదే ఏ భైరవభట్లగారో, తాడేపల్లిగారో రాసారనుకోండి.. "ఏంటిది, వీళ్ళు గూడా ఇట్లా రాసారు, చదువరి లాగా " అని అనుకోరూ? మరదే తేడా అంటే! అయినా..
అంత పలకలేనివాడు తాను పాడటం ఎందుకు? గానకళాప్రపూర్ణ, డాక్టర్, పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం - అనగా మన బాలు - ఉండనే ఉన్నాడు గదా! అతనిచేత పాడించొచ్చుగా, అసలతడు పుట్టిందే అందుక్కదా !! అలాగే, అదే సినిమాలో తండ్రీ ని తన్రీ అని ఓ ఆడగొంతు అలా పాడుకుంటూపోతే, తప్పు సవరించకుండా అలాగే మనమీదికి వదలినందుకు కూడా కీరవాణిని నేను క్షమించను. సినిమాల్లో ఇలాంటివాటి గురించి పట్టించుకోడం గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోవడం లాంటిదే, కాదన్ను. అయినా సరే, క్షమించదలచుకోలేదు. మన సినిమాల్లో తెలుగురాని నటీనటులను పెట్టుకుంటాం. చాలా భాషలవాళ్ళు చేస్తారాపని. కాకపోతే, వాళ్ళకు చక్కగా డబ్బింగు చెప్పిస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే, డబ్బింగుకు కూడా తెలుగు రానివాళ్ళమే పెట్టుకుంటాం. తెలుగును ఇంగ్లీషులానో, హిందీలానో మాట్లాడ్డం వాళ్ళకో అర్హత!
ఇహ ఊళ్ళ పేర్ల సంగతి కొచ్చేటప్పటికి మనం చేసే ప్రయోగాలు, తప్పులు కొల్లలు. తెల్లోడు ఎలాగూ కొన్ని ఊళ్ళ పేర్లు మార్చేసి పొయ్యాడు. వాటినే పట్టుకు వేళ్ళాడుతున్నామనుకోండి. కానీ, తెలుగులో సుబ్బరంగా రాసే పేర్లను రోమను లిపిలో రాసేటపుడు మార్చి రాయటం మనం తప్ప ప్రపంచంలో మరొకడెవ్వడూ చెయ్యడని నా ఉద్దేశం. గుంటూరు తెలుగులో బానే రాస్తాం. ఇంగ్లీషులో రాసేటపుడు మాత్రం గుంటూర్ అంటాం. నెల్లూరు పరిస్థితి దీనికంటే అన్యాయం.. నెల్లోర్ అట. తెలుగులో ఎలా రాస్తామో ఇంగ్లీషులోనూ అలానే రాయొచ్చుకదా! అది మనకు చిన్నతనం. కడప సంగతి మరీ దయనీయం. ఈ మధ్యెప్పుడో మార్చినట్టున్నారుగానీ లేకపోతే ఇంగ్లీషులో కుడ్డప్పహ్ అని రాసేవాళ్ళం. సుబ్బరంగా ప్రళయకావేరి అనే అద్భుతమైన పేరుండగా, పులికాట్ అని గొప్పగా చెప్పుకుంటాం.మా జిల్లాలో చుండూరు అనే ఊరుంది. దీన్ని చ లాగా కాక, ౘ (మీకీ రెండో చ సరిగా కనబడకపోతే, తెలుగుబ్లాగు గుంపులోని ఈ లింకు చూడండి) లాగా పలకాలి. ఇంగ్లీషులో రాసినపుడు సరిగ్గా అలాగే పలకాలనే ఉద్దేశంతో దాన్ని Tsundur అని రాసారు. ఇప్పటికీ అలాగే రాస్తారు. చుండూరుపల్లి అనే మరో ఊరుంది. దాన్ని మాత్రం మామూలుగా Chundurupalli అనే రాస్తారు.
రాయలసీమ ఊళ్ళ పేర్లలో ఎక్కువగా పల్లె అని ఉంటుంది. పల్లి అని ఉండదు. మదనపల్లె, బనగానపల్లె, కందిమల్లయ్యపల్లె,.. ఇలాగ. మదనపల్లి అని రాసుండటం మదనపల్లెలోనే చూసాను. రారోరసం వాళ్ళు కూడా తమ బస్సుల మీద మదనపల్లి అని రాసుకున్నారు. వాళ్ళ బస్టాండు మీద కూడా అదే పేరు. ఎందుకు రాయాలీ తప్పు? ఎందుకీ అలక్ష్యం? కోస్తా జిల్లాల్లో ఊళ్ళకు పల్లి అని ఉంటుంది, పల్లె అనేది చాలా అరుదు. భారత జనగణన అనే జనాభా లెక్కలు తీసే ప్రభుత్వ శాఖ ఒకటుంది గదా, వాళ్ళ లెక్కల్లో మన ఊళ్ళ పేర్లు ఎలా రాసారో చూస్తే, కంపరం కలుగుద్ది. పల్లిలన్నీ పల్లెలు. పేటలన్నీ పేట్‌లు!
ఇక, యాడుల్లో (వ్యాపార ప్రకటనల్లో) తెలుగు (బైబిలు తెలుగు లాగానే ఇది కూడా ఒక ప్రత్యేకమైన తెలుగు) గురించి చెప్పుకోవాలంటే అదో ప్రత్యేక వ్యాసమౌతుంది. అలాగే, సాఫ్టువేర్ల తెలుగీకరణలో మనం (భవదీయుడితో సహా) చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుకోవాలంటే కూడా అదో టపా అవుతుంది.
అది సరే, ఈ సంగతి చెప్పండి.. ఉపలబ్ధం అనేమాటను యాడుల్లో ("ఇప్పుడు, సరికొత్త వంద గ్రాముల ప్యాకులో ఉపలబ్ధం!") కాక ఇంకెక్కడైనా చూసారా? ఈ మధ్య బ్లాగుల్లో అక్కడక్కడా తగులుతున్నాయి. తెలుగీకరణలో కూడా తగిలితే తగలొచ్చు.
చాలా రోజుల తరవాత మంచి టపా ! మాలాంటి మీ అభిమానుల కోసం తరచుగా రాయాలని మనవి. చుండూరు spelling లో T ఎందుకా అని ఎప్పుడు అనుకునే దాన్ని ఇప్పుడు తెలిసింది. Ongole మర్చిపోయారా? :)
రిప్లయితొలగించండిమీరు వాల్తేర్, రాజమండ్రి ల గురించి మరచినట్లున్నారు, అయినా, మా వాల్తేర్ ని వాల్తేర్ అని చెప్పుకోడవడమే గొప్ప, ఆ ఏంగొప్ప బోడి గొప్ప అంటారా, అన్నా పర్వాలేదు, మెడ్రాస్ ని మెడ్రాస్, వాల్తేర్ ని వాల్తేర్ అని అంటేనే దాని అందం, చందం :)
రిప్లయితొలగించండిమెడ్రాస్ ని తమిళనాడు వాళ్లు చెన్నై అని మార్చేసినా, బెంగళూర్ లో మాత్రం ఇంకా ఓల్డ్ మెడ్రాస్ (రోడ్డు) అలానే ఉంది. దయగల కర్నాటక ప్రభుత్వం దాన్ని ఓల్డ్ చెన్నై రోడ్డని మార్చేయకుండా ఉంటే చాలు :)
రాజమండ్రి గురించి నాకు పెద్దగా పట్టింపులేదు, ఎలా అన్నా ఒకటే :)
"..పొటిగరాపోడు" గురించి చాల రోజులు తెలియలేదు. సరే మన బుడతకీచులు వీరే అని తెలుసుకున్న తరువాత అరెరే అని నాలుక కొరుకున్న రోజులు..:)
రిప్లయితొలగించండిసరే, దూడ బాతులు మీ ప్రాంతంవే! వాటి గురించి తెలుసా?
చాలా బాగా రాసారు. NTR ని, ANR ని, అలాగే మిగతా నటి నటులని అలాంటి పిలుపు లోనే ఒక ఆత్మీయత నాకు కనబడుతుంది. మనకెంతో దగ్గిర వాళ్ళు అనిపిస్తుంది. గారు, గీరు అంటే ఏదో వారిని దూరం చేసినట్టు ఫీలింగ్. మరి ఆ మహా నటులని ఎవరు దూరం చేసుకుంటారు చెప్పండి. అందుకే అలా పిల్చుకుంటూ వారంటే తమకెంతో దగ్గిర వారని మురిసిపోతుంటారు అందరు.
రిప్లయితొలగించండిఇక మామూలు పేర్లు... వెంకటేశం ని ఎంకటేషు అని, సూర్య నారాయణని సూన్నానా .. ఇలా పిలుస్తుంటారు. విచిత్రం ఏమిటంటే.. ఇలా పిలిపించుకునే వారు ఏమాత్రం ఫీల్ అవ్వరు, బాద అసలే పడరు. ANYWAY.. VERY GOOD POST INDEED.
టీవీ యాంఖర్ల ఖూనీ మరచారా చద్వర్గారూ. :))) హాయైన టపా. ఈమధ్య బేంగళోరె ని బంగళూరు గా మార్చడం నాకు బాగా నచ్చింది. మద్రాస్ వెళ్లడం కన్నా చెన్నాపట్నం వెళ్ళడం ఎంత సొగసో కదా. బెజవాడ, వైజాగ్ లపేర్లు కూడా నాకు నచ్చవు.
రిప్లయితొలగించండిచాన్నాళ్ళైంది మీలో ఈ పాఋశ్వం చూసి. కృష్ణానది దక్షిణ తీర యాసల విశ్వరూపాన్ని ప్రదర్శించారుగా!
రిప్లయితొలగించండిఒకటి మాత్రం సూపర్ కరక్టు. సినిమహీరోల పేరెనకాలు గాడు లేకుండా పలికేవాళ్లం కాదు.
చాలా మంచి టపా. సినిమావాళ్ళ/సినిమా గాయకుల తెలుగు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నాళ్ళుగా, ఎన్ని సినిమాలగా ఖూని అవుతున్నా అలవాటుపడలేనేంటో. తెలుగులో అన్నిటికన్నా ఎక్కువ ఖూనీ అయింది "శ" అక్షరమేనేమో. షంకరా, షంకర్దాదా, షషి, సుషీలా, నువ్వే నా ఆషా/ష్వాసా లాంటివి ఎన్నిసార్లుగా వింటూనే ఉన్నా విన్న ప్రతిసారీ పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఎస్.పి.బాలు టీవీల్లో వాళ్ళకీ వీళ్ళకీ ఉచ్ఛారణదోషాల గురించి చెప్పేటప్పుడు ఎవరూ ఆయన పలికే "ష" గురించి అడగలేదెందుకో.
రిప్లయితొలగించండిఇక ఊర్ల/స్థలాల పేర్ల విషయానికి వస్తే "దుర్గమ్మ చెరువు" ని "durgam cheruv" అని ఎందుకు రాస్తారో తెలియదు. అలా అంటే గుర్తొచ్చింది. పెద్ద పిస్తా లాగా గింజుకునే నేను చిన్నప్పట్నుంచీ తూ/ప.గో.జీ ని ఇంగ్లీషులో చెప్పాలంటే "ఈస్ట్/వెస్ట్ గొడావరి" అంటానని పక్కవాళ్ళు దెప్పేవరకు నాకు తట్టలేదెందుకో.. అయినా తర్వాత కూడా ఇంకా అలాగే అంటానెందుకో.
యాడుల్లో తెలుగు అంటే హిందీ/ఇంగ్లీషులోంచి పదాల్ని తెలుగీకరించటానికి తెలుగురానివాళ్ళు ప్రయత్నించటం వల్ల వచ్చే తిప్పలు. కానీ బ్లాగుల్లో "తెలుగీకరణ" అనేది ఆలోచన హిందీ/ఇంగ్లీషుల్లో సాగుతుండండం వల్ల కదా.. అంత కష్టపడి ఆ భావాన్ని తెలుగీకరించటానికి ప్రయత్నించి తెలుగులో లేని (మనకి రాని) పదప్రయోగాలు, భావాలతో కుస్తీ పడేకన్నా ఆ వాక్యమేదో ఇంగ్లీషులోనే అనేస్తే హాయి కదా, మన భావమూ ఎదుటివాళ్ళకి సరిగ్గా తెలుస్తుందీ, భాషా నిలుస్తుందీ.
"ఈసాపట్నం" నుంచి "సివంచలం" వెళ్ళే దారిలో ముడసర్లోవ అనే ఊరుంది. దాన్ని మా వాడొకడు సలక్షణంగా "ముడసర లోయ" అని నా ఉచ్చారణని సరిచేసేడు. "కాదరురా అబ్బీ" అన్నాను. "ముడసర లోవ" అన్నాడు. దాని పేర్లో "లోవ" లేదు, అది "లోయ" కాదు. దాన్ని "ముడసర్లోవ" అనే అనాలని పట్టు పట్టాను. మీరేమంటారు?
రిప్లయితొలగించండిCuddapah ను వయ్యెస్సార్ ముఖ్యమంత్రైన కొత్తల్లోనే Kadapa అని మార్చారు. అరవదేశంలో కడలూరు అని ఒక ఊరుంది. దాని పేరు ఇప్పటికీ Cuddalore అనే రాస్తారు. కడప జిల్లాలో దంత్య చకారంతో మొదలయ్యే చుండుపల్లి అనే పేరుతో ఒక ఊరుంది. దీని పేరును ఆంగ్లేయులు వాళ్లకు తోచినట్లు Tsundupalli అని రాసేవారు. అది కాస్తా ఇప్పుడు టి.సుండుపల్లి అయింది! :)
రిప్లయితొలగించండి"ఈ తలొంచుకోడమేంటి హఠాత్తుగా? అసలు హిందువుకూ దీనికీ సంబంధవేంటీ? అని అడగబాకండి.. అదంతే, అదిప్పుడు ఫ్యాషను!"
:)
"రాయలసీమ ఊళ్ళ పేర్లలో ఎక్కువగా పల్లె అని ఉంటుంది. పల్లి అని ఉండదు." నిజమే, రాయలసీమ వాసినైన నేనే ఈ సంగతి మర్చిపోయి పల్లీలకు అలవాటుపడిపోయాను.
రిప్లయితొలగించండిపైన నేను రాసిన వ్యాఖ్యలోని ఊరిపేరును చుండుపల్లె, Tsundupalle, టి.సుండుపల్లి అని చదువుకోగలరు. బ్రిటిష్ వాళ్ళు రాసిన కడప జిల్లా గెజిటీర్ లో Tsundupalle అనే ఉంది. ఇక
మా జిల్లాలోని మరికొన్ని ఊర్లపేర్లు (అసలుపేర్లు ఊహించండి):
టి. సదిపిరాళ్ళవాండ్ల పల్లి
టి. సాకిబండ
టి. సల్ల గరిగెల
టి. సౌదరివారిపల్లి
చాలా బాగుంది టపా...ఠపా!
రిప్లయితొలగించండి:) నాక్కూడా ఈపేరుల తీరులు తమాషాగా వుంటాయండీ. చాలా బాగా చెప్పారు. పోతే అమెరికా వచ్చిన తెలుగువారి పేర్లు మరో పెద్ద టపా అవుతుంది.
రిప్లయితొలగించండినేను మాట్లాడదల్చుకోలేదండీ. కేవలం :)
రిప్లయితొలగించండి"ఈ తలొంచుకోడమేంటి హఠాత్తుగా? అసలు హిందువుకూ దీనికీ సంబంధవేంటీ? అని అడగబాకండి.. అదంతే, అదిప్పుడు ఫ్యాషను!"
రిప్లయితొలగించండిహ్హహ్హహ్హ !
సినిమాలు అన్నారు కాబట్టి ఓ పాట, "చందురునీ తాకినదీ ఆర్మ్ స్ట్రాంగా" అని ఓ పాట. అందులో ఆర్మ్ స్ట్రాంగ్ అన్నది మీకు ఎవరైన చెబితే తప్ప తెలుసుకోలేరు. అంత చెత్తగా పాడాడు ఓ తమిళాయన.
వూరిపేరు గురించి. ఒకప్పుడు బుక్కరాయలు, అనంతమ్మ అన్న ఇద్దరు దంపతుల పేర్ల మీద, బుక్కరాయ సముద్రం అనే చిన్న గ్రామం, అనంత మ్మ పురమనే ఓ పట్టణం వెలిసాయి. ఇప్పుడది, పూర్ గా, అనంతపూర్ అయిపోయింది!
రావు వేమూరి గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పాక కాదనేదేముంది, అది ముడసర్లోవే :-)
60 నంబరు బస్సు అదే రూటు :-)
ఇసాపట్నం, సివంచలం, ఎన్ని రోజులయ్యింది ఇలా విని (చదివి)
"ఒరే సివంచలమా బేగ పార్రా" అని వింటే (చదువరి గారి భాషలో చెప్పాలంటే) మైకం కమ్మినట్లుంటుంది :-)
నా చిన్నప్పుడు మా ఊర్లో ఉగాది ముచ్చట్లు ఓ టపా వ్రాస్తా :-) (నోస్టాల్జియా ఎక్కువైపోతోంది ;)
పేర్ల ప్రస్తావనొచ్చింది కాబట్టి - ఈ క్రింది లంకెలో ఉన్న విచిత్రమైన ఊర్ల పేర్లు చూడండి:
రిప్లయితొలగించండిhttp://www.absoluterandom.com/11-weird-and-funny-city-names-and-proof-that-they-exist/
మా మామయ్య కూతుర్ని వాళ్ళాయన "రాశ్రీ రాశ్రీ" అని పిలుస్తుంటే ఇందేంటని విస్తుపోయాము. ఆమె పేరు రాజేశ్వరి మరి.
రిప్లయితొలగించండిSravya: మీ అభిమానానికి నెనరులు. నేను మచ్చుకు మాత్రమే రాసానండి. మనం ఏ పేరునూ వదలం. :) అసలు తెలుగు అజంత భాష కాబట్టే మధురంగా ఉంటుందనీ, సంగీతానికి చక్కగా అమరిందనీ ఎక్కడో చదివాను. మన భాషలోని ఈ ప్రత్యేకత నాకు తెలిసేటప్పటికి కాస్త అల్సెవైఁపోయింది. మమ్మ నాకు పేరు పెట్టేసింది. మబ్బాయికి నేను పేరు పెట్టేసాను. :)
రిప్లయితొలగించండిసూర్యుడు: మీ ఊరి మీద మీకంత కసేంటి సార్! :)
netizen: పొటీగరాపు పంతులు అర్థం కావడానికి నాకూ కాస్త సమయం పట్టింది. మాయేపు దూడబాతు లాగా తిని తిరుగుతున్నాడని తిడతారు. :)
krishna rao jallipalli: నిజానికి పేర్లు అలా పిలిస్తేనే అందమండి. సూర్యనారాయణా అని ఇమ్మర్శగా పిలిస్తే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కాబోలని అనుకునే అవకాశం ఉంది. :)
సత్యసాయి కొవ్వలి: వాళ్ళను కూడా టపాలోకి లాకొస్తే ఇంత హాయిగా ఉండకపోనేమోనండి! :)
కొత్తపాళీ: మా చెల్లెలు, నటులను "ఆయన" అని, ఆడనటులను (నటీమణుల కంటే ఇదే బాగుంది నాకు) "ఆమె" అనీ అంటది. నాకేమో వింతగా ఉంటది. :)
చేతన: అది దుర్గమ్మ చెరువు అన్న సంగతే నాకు తెలీలేదు సుమండీ! చెప్పినందుకు నెనరులు. స,శ,ష లను తలచుకుంటే - ముఖ్యంగా శ ను - గుండె మండుతూంటుంది. ముఖ్యంగా నాకెంత మండుద్దో గ్రహించగలరు-ఈ మూడక్షరాల్లోను రెండు నా పేరులో ఉన్నాయి. (సురేషు, సురీషు, షురీషు.. ఇలా పిలుస్తూంటారు. మా తాతమ్మ హాయిగా తిరీసూ అనేది :) ) ఈ తెలుగీకరణ మీద వివరంగా ఒక టపా రాయాలనుంది. రాస్తాను.
రావు వేమూరి: పట్టు పట్టాల్సిందే సార్.
త్రివిక్రమ్: T సుండుపల్లె :) :)
కత్తి మహేష్ కుమార్: :)
te.thulika: ఆ విశేషాలు మీ మాటల్లో చదువుతూంటే గానీ మజా రాదండి. తప్పక రాయాలని నా కోరిక.
రాఘవ: :)
రవి: అవునండి, ఈ పూర్‌లేంటో. :)
అబ్రకదబ్ర: పేర్లు బావున్నాయండి :)
సుజాత: :)
చాన్నాళ్ళ తర్వాత మాంచి టపా ఘుమాయించారు.
రిప్లయితొలగించండిమీ టపా ఆసక్తికరంగా వుంది. ఎంచుకున్న విషయానికి ఓ పుట సరిపోదు. పలికినట్టుగా రాయడం మన భాషకో భూషణం అనుకుంటాను. "గొడావరీ లేటా, రైటా" అని ఒహావిడ సాక్షాత్తూ రాజమండ్రి స్టేషన్లో వాకబు చేస్తుండగా నే విన్నాను.ముళ్లపూడివారి "సీగానపెసూనాంబ" ని సిసలు పేరులో ఊహించుకోగలమా?
రిప్లయితొలగించండిచాలా బాగుంది ఠపా
రిప్లయితొలగించండిఅక్షరాలను కలిపి చదివేయటం ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా యాసలో కనపడుతుంది.
రామచంద్రపురం ఊరిని రాంపురం అని అనటం మరీ బాగుంటుంది. ఇలాంటి వన్నీ వంశీ తనకధల్లో చక్కగా రికార్డు చేసి పెట్టాడు.
చిన్న ఉదాహరణ: మా వూరిలోని ఒక థియేటర్ పేరు వీరేశ్వరా. దాన్ని మేం చిన్నప్పుడు ఈరేస్ఫరా అని పలికేవాళ్లం. అదే మాటను అచ్చు అలానే వంశీ ఒక కధలో వాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
మీరు చెప్పిన మాటలనన్నింటినీ మేమూ అలాగే పలికేవాళ్లం.
బొల్లోజు బాబా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపేర్ల పురాణం నిజంగానే పెద్ద పెద్ద విషయాలు తెలిపింది నాకు, చదువరి గారికి ధన్యవాదాలు... :) సారీ సదువరి వారికి ధన్యవాదాలు
రిప్లయితొలగించండి