18, ఆగస్టు 2008, సోమవారం

అన్నయ్యల పోటీ

రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా' అనుకున్నారు. 'ఈడు రామారావు కాదు, డ్రామారావు' అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

అన్న మహాప్రస్థానం తరవాత, మరొక అన్న రాలేదు. ఇప్పుడు అన్నయ్యగా చిరంజీవి వస్తున్నాడు. చిరంజీవి అసలు పేరు వేరే ఏదో ఉంది. ఆ పేరుతో ఎవరూ పిలవరు, తానే చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు కాబట్టి. చిరంజీవి అనే కాకుండా చిరు అనీ, సినిమా నటుడు కాబట్టి మెగాస్టారు అనీ పిలుస్తున్నారు. అదే కాకుండా, ఆయన వీరాభిమానులు అన్నయ్య అని పిలుస్తూంటారు. రాజకీయాల్లో దిగాక, బహుశా వోటున్నవారందరికీ ఈ పెట్టుడు బంధుత్వాన్ని విస్తరించే ఆలోచన ఉండొచ్చు. ఎన్‌టీవీ లాంటి కొన్ని వార్తా ఛానెళ్ళు కూడా అన్నయ్య అంటూ ఉంటాయి.

ఈ పేర్లన్నిటిలో ఏది పనికొచ్చినా లేకున్నా.. అన్నయ్య అనేది మాత్రం రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. అయితే ఈ పెట్టుడు బంధుత్వం మీద పోటీ నెలకొందేమోనని అనిపిస్తోంది.

పాపం, కాంగ్రెసోళ్ళకు సొంత బంధువులంటే ఉన్న సెంటిమెంటు ఈ పెట్టుడు బంధుత్వాలంటే ఉండదని అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అయితే మన ముఖ్యమంత్రి వేరు -పురుషులందు కాపురుషులు, ఉత్తపురుషులు, పుణ్యపురుషులు వేరయా అన్నట్టు! ఆయనకు పెట్టుడు బంధుత్వాల పట్ల కూడా సెంటిమెంటున్నట్టు తోస్తోంది. అన్నయ్య హోదాలోని మహత్తును గ్రహించినవాడు కాబట్టే, ఆయన చెల్లెమ్మ సబిత నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఏ కొత్త కార్యక్రమమైనా చేవెళ్ళ నుండి మొదలుపెట్టాల్సిందేననే సంప్రదాయాన్ని ఆచరిస్తూ తానెంత సెంటిమెంటలు వ్యక్తినో ప్రజలకు చెప్పకనే చెప్పాడు. అయితే, ఎంచేతోగానీ తెలుగాడపడుచులు ఆయన్ను అన్నయ్యగా భావించినట్టు కనబడలేదు. మీసాల సైజు కాస్త తగ్గించుకుని, నవ్వును కాస్త కత్తిరించుకుని ఉంటే సత్ఫలితాలుండేవేమోనని నా అనుమానం. ఏదో ఒకటి చేసి, తెలుగాడపడుచులచేత అన్నయ్యా అని నోరారా పిలిపించుకోవాల్సిందే అని రాజశేఖరుడు అనుకున్నట్టుంది.

శనివారం నాటి పత్రికలు చూసినవాళ్ళు ప్రభుత్వం - అనగా ముఖ్యమంత్రి - ఇచ్చిన ఖరీదైన ప్రకటనను గమనించే ఉంటారు. ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనే అంటూ రాజశేఖరరెడ్డి ఈ ప్రకటనల్లో ఆడపడుచులందరికీ గుర్తు చేసాడు. చిరంజీవిని అన్నయ్య అని ఎక్కడ అనేస్తారోనని సెంటిమెంటుతో ముందస్తు బంధాలు వేసేసాడు. చాలా ఉద్వేగంగా "అమ్మా, అన్నయ్యను నేనున్నా. మీకు ఏ లోటూ రానివ్వను." అన్నాడు. ఇంకా "మీ సోదరుడిగా జీవితాంతం తరిస్తానని మాటిస్తున్నా. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనేనని మరోసారి స్పష్టం చేస్తున్నా" అని మరోసారి గుర్తు చేసాడు. మరి ఆడపడుచులు ఈ బంధాలకు కట్టుబడతారో లేక ఈయన్ని పెద్దన్నయ్య ఆయన్ని చిన్నన్నయ్య అని అనుకుంటారో చూడాలి.


అయితే ఈనాడులో ఒక చమక్కు మెరిసింది. సుబ్బరంగా డబ్బుల్దీసుకోని, ప్రకటన అచ్చేసి, అదే పేజీలో కింద, ఇదీ సంగతంటూ ఓ కార్టూనేసాడు. ఆ కార్టూనులో ఉన్నది రాజశేఖరరెడ్డి కాదులెండి, పదవిలో ఉన్న ఓ రాజకీయుడు, అంతే! (సూరీడు లేడు కాబట్టి) అయితే ఆ రెంటికీ లింకు కలిపి చూస్తే సర్దాగా అనిపించింది, అంతే!

టీవీ తొమ్మిది వాడేమైనా తక్కువ తిన్నాడా? రజనీకాంతున్నాడు కదా (యాక్టరు కాదు యాంకరు).. మొన్నోరోజు ఓ ఇద్దరిని పిలిచి అన్న గొప్పా, అన్నయ్య గొప్పా అని చర్చ పెట్టాడు. (అన్నంటే ఎన్టీయారు, అన్నయ్యంటే చిరంజీవి -- రాజశేఖరరెడ్డి అప్పటికింకా పోటీలో లేడు) ఎట్టైనా గానీ, అన్నయ్య అన్నకు సాటిగాదు అని వాళ్లచేత చెప్పించాలని నానా ప్రయాస పడ్డాడు. 'చెప్పండి... అన్నయ్య అన్నంతటి డైనమిక్కు కాదుగదా' అని అడుగుతాడు. 'అప్పుడే ఎలా చెబుతాం, అన్నయ్య ఇంకా రాజకీయాల్లో దిగనే లేదు కదా' అంటూ ఇలాంటిదేదో చెప్పి వాళ్ళిద్దరూ తప్పించుకుంటారు. 'నిఝెం చెప్పండి.. అన్నకున్నంతటి ఊపు అన్నయ్యకు లేదు కదా' అని మళ్ళీ అడుగుతాడు. వాళ్ళూ తక్కువ వాళ్ళేం కాదు,  ఏదో అర్థం పర్థం లేని లాజిక్కేదో లాగి, తప్పించుకుంటారు. ఇలా ఓ అరగంటో ఏమో ప్రయత్నం చేసి ఇహ వాళ్లచేత అవుననిపించలేక ఆ కార్యక్రమం ముగించాడు. ఆ అతిథులిద్దరిలో ఒకరు లక్ష్మీ పార్వతి, మరొకరు రామ్మోహన నాయుడు. ఈయనెవరో నాకు తెలీలేదు.

తెలుగువారి అన్నయ్య ఎవరో మరి!
-------------------------------

ఈ పేజీలోని బొమ్మలను ఈనాడు వెబ్‌సైటు నుండి తీసుకున్నాను. కేవలం సూచనామాత్రంగానే వాడుకున్నాను, పైగా వారి సైటుకు లింకు ఇచ్చాను కాబట్టి అనుమతి అవసరం లేదని అనుకున్నాను. వారికి ఇబ్బంది కలిగితే తక్షణం తీసేస్తాను.

8 కామెంట్‌లు:

  1. ఎన్టీఆర్ టైమ్ కీ ఇప్పటికీ జనరేషన్ మారింది. కాబట్టి, ఇద్దరన్నయ్యలు ఓకే...అప్పటికి ఆయన, ఇప్పటికి ఈయన.

    రిప్లయితొలగించండి
  2. Anna ki andhra pradesh anthaa tammllu ayyaru
    annyyaki maatram pavan kalyan,naga babu,allu aravind,mitra maatrame tammllu avutaaru

    రిప్లయితొలగించండి
  3. ఆ టైటిల్ చూసి నేను చిరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ మీకు అన్నయ్యగా ఉంటాను అని చెపుతున్నాడేమో అనుకున్నాను. తర్వాత ఫోటో చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఆహా మరో కొత్త రాజశేఖరన్నయ్యా అని ముక్కున వేలేసుకున్నాను :)

    అన్నట్టూ ఈనాడు అమ్ముడుపొయిందా? మరీ ఫ్రంట్ పేజీలో అలా ప్రకటన? అదీ వార్తలాగా?

    రిప్లయితొలగించండి
  4. ఉన్న పార్టీల నోట్లో దుమ్ము కొట్టడం తప్ప చిరంజీవి ఏం సాధిస్తాడో నాకు తెలియదు. ఆయన అధికారంలోకి రాలేడు, ఇతర్లని రానివ్వడు (ఆయన మూలంగా ఆయన పార్టీతో సహా ఏ పార్టీకి శాసనసభలో సంఖ్యాధిక్యం రాదు గనుక). పర్యవసానంగా, ఏదో ఒక పార్టీకి తోకపార్టీగా మిగిలి అధికార పార్టీని బెదరించి పన్లు చేయించుకుంటూ బతకాల్సిందే. నాకు మనసులో ఒక మూల అనుమానమేంటంటే 'చిరు'ని అడ్డం పెట్టుకుని అల్లు అరవింద్ కాలక్రమంలో చాలా పెద్దవాడైపోతాడని, 'చిరు' చిరుగానే మిగిలిపోతాడని !

    రిప్లయితొలగించండి
  5. మీరు గమనించారా? :-) అలా పిలిపించుకుని ఏమి చేద్దామనుకుంటున్నాడో!

    రిప్లయితొలగించండి
  6. ఎవరికి ఎవరూ సొంత అన్నయ్యలు కాదు. సొంత అన్నయ్యలే డబ్బో, అధికారమో రాగానే మొహాలు చాటేసే రోజులివి. ఈ అన్న సెంటిమెంట్ ఇహపై వర్క్ అవుట్ అవదు.అది ఎన్ టి ఆర్ తోనే అయిపోయింది.అధికారం చేజిక్కాలంటే ఈ రకపు 'శకలు ' తప్పవుగా!జనం కూడా వాళ్ళను నిజంగానే 'అన్నయ్యలు ' గా భావిస్తున్నట్టు బాగానే నటిస్తున్నారు.

    తాడేపల్లి గారి అనుమానం నమ్మదగింది. అసలు బలవంతంగా చిరంజీవిని లాక్కొచ్చింది ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు తప్ప ఆయన intension ఏమీ ఉన్నట్టు కనపడట్లేదు ఇందులో! చిరు ని అడ్డం పెట్టుకుని అల్లు ఇల్లు చక్కపెట్టుకుంటాడన్నమాట.

    రిప్లయితొలగించండి
  7. ఎన్టీఆర్ అంత కాకపొయినా, TDP కాంగ్రేసు లతొ విసిగిన మన జనాలు చిరు కు బ్రహ్మరథం పట్టొచ్చేమో

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు