17, ఆగస్టు 2008, ఆదివారం

చిరంజీవి చెప్పిందేమీ లేదు, అంతా బహిరంగ సభలోనే నట!

చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!

తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు 'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?' అని ఎవరో అడిగితే, దానికి 'నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే...' అంటూ చక్కగా చెప్పాడు.

ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.

డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు "ప్రజలే" అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు 'సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు' అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.

ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, 'సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా' అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!

ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే 'విధానం లేకపోవడమే ఆయన విధానం' లాగా అనిపించింది.

అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, 'తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు' అని అన్నాడు. 'ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా' అనీ అన్నాడు.

అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.

మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది.
తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు. రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.

19 కామెంట్‌లు:

  1. నాకు ఇంటెర్వ్యూ చూడటం కుదరలేదు...

    చూద్దాము 26న ఏమి చేప్తాడో! ముహూర్తమే చూసుకుని ఉండొచ్చు...

    ఈ లెక్కన విలేకరులు కూడ విషయం ఉన్న ప్రశ్నలు వేసినట్టు లేరు... లేక ఈ సమావేశంలో విషయం లేదనిపించి వాళ్ళూ అడగలేదేమో! వచ్చాము కాబట్టి అడగాలి కదా అని ఎప్పటినుండో వేస్తున్న ప్రశ్నలే వేసినట్టుంది... దానికి సిద్ధంగా ఉంచుకున్న సమాధానాలు చెప్పినట్టుంది...

    రిప్లయితొలగించండి
  2. నాకసలు నచ్చలేదు... ఏదో సినిమా ఫంక్షనులో మాట్లాడినట్టు మాట్లాడాడు.
    ఒక గ్లోరీఫైడ్ పిక్చర్ మాత్రం పెయింటు చేసాడు. అన్ని పార్టీలూ బానే ఉన్నాయిట, కానీ ఇంకా బాగు చెయ్యాలని వచ్చానని చెబుతున్నాడు.

    తన అజెండా, సమస్యలు, అప్రోచ్ వంటివేవీ చెప్పలేదు. అన్నిటికీ బహిరంగ సభే వేదిక అనే రొడ్డకొటుడు సమాధానం.
    కొద్దిగా నిరాశ పరచిందనే చెప్పవచ్చు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు కాబట్టి వేచి చూద్దాం.

    రిప్లయితొలగించండి
  3. హ హ అవునవును ఏదో సినిమా ఫంక్షనులో మాట్లాడినట్టు మాట్లాడాడు.ఏదో చెయ్యలన్న తపన కనపడుతుంది కానీ... మరి అందులో ఎంతవరకూ సఫలీకృతం అవుతాడన్నది ఆలోచించ దగ్గవిషయమే

    రిప్లయితొలగించండి
  4. 'రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు ' అన్న ప్రశ్నకు సమాధానం కూడా ముందు ప్రిపేర్ అయినట్టే కనిపిస్తోంది.(ఆ ప్రశ్న ఎవరో ఒకరు వేస్తారని ఊహించుంటాడు).

    ఒకటి మాత్రం నిజం! విధానం ఏదీ లేకపోవడమే ఆయన విధానంగా కనపడుతోంది. మరో మూసపార్టీకి శ్రీకారం! నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే చిరంజీవి పార్టీ గురించి మొదటినుంచీ చేస్తున్న ఆర్భాటానికి, ఈ మీడియా సమావేశానికి పొంతన ఎక్కడా లేదు.

    రిప్లయితొలగించండి
  5. నేనూ చిరంజీవిని ఒక నటుడుగా మెచ్చుకుంటాను. అయితే చిరంజీవి ఏదైనా కావొచ్చు ఆయన అభిమానుల దృష్టిలో ! నాకభ్యంతరం లేదు. నాకు నచ్చనిదల్లా ఆయన్ని ఎన్.టి.ఆర్.తో పోల్చడం. ఎన్.టి.ఆర్. తొలి ప్రయత్నంలోనే ఏ పొత్తులూ లేకుండా 202 శాసనసభా స్థానాలు గెల్చుకున్నారు. చిరంజీవికి అంత సీన్ లేదని చెప్పడానికి నేను చాలా మొహమాటపడుతున్నాను.

    ఎన్.టి.ఆర్ ధైర్యసాహసాలూ, స్వతంత్రాలోచనా ధోరణి, తెలుగుజాత్యభిమానం, అన్ని కులాల్లోను, వర్గాల్లోను ఆయనకున్న తిరుగులేని ప్రజాదరణ - ఓహ్ ! ఆ మనిషే వేఱు. ఆ మూర్తిమత్త్వమే వేఱు. అలాంటివారు వెయ్యేళ్ళకొకసారే వస్తారు.

    దేవుడికి తప్ప ఇంకెవరికీ భయపడని ఎన్.టి.ఆర్. కీ చిరంజీవి యొక్క భయస్థ, మొహమాటస్థ ధోరణికీ చుక్కెదురు. చనిపోయే ముందు దాకా ఎన్.టి.ఆర్ కి తన కుటుంబం మీద ఉడుంపట్టుంది.

    రిప్లయితొలగించండి
  6. ఎన్.ట్.ఆర్.తను నమ్మింది,చేయాలనుకున్నది ధైర్యంగా చేసేవారు.చిరంజీవి గారు ఊగిసలాడేధోరణిలో వున్నట్టనిపిస్తోంది.ఇన్ని రోజుల కాలయాపన తర్వాత కూడా స్పష్టంగా చెప్పలేదుfirst impression is best impression అన్నారు కదా!మొదటిరోజే తన భావాలను,ఆశయాలను స్పష్టంగా చెప్పివుండాల్సింది.

    రిప్లయితొలగించండి
  7. ఎన్టీవోడికీ సిరంజీవికీ పోలికెందుకులెండి. ఎవరి గొప్ప వాళ్లది. ఆయన రాజకీయాల్లోకొచ్చినప్పుడూ చాలా మంది చాలా అన్నారు. చివరికేమైందో చూశాం కదా. ఇప్పుడీయన్నీ చాలా అంటున్నారు. ఈయనేమి చేస్తాడో చూద్దాం. అయితే ఒకటి, ఇప్పుడు ఈయన కొత్త పార్టీ పెట్టాల్సినంత అవసరం నిజంగా ఉందా? నాకైతే సినిమాల్లో ఈయన శకం ముగిసిపోతుంది కాబట్టి రాజకీయాల్లోకొస్తున్నట్లే అనిపిస్తుంది. సినిమాల్లో ఉన్నప్పుడు రామారావంటే అభిజాత్యానికి, అహంకారానికీ, క్రమశిక్షణకీ మారుపేరు. రాజకీయాల్లోనూ ఆయనలాగే వున్నాడు. మరి చిరంజీవికి మొహమాటస్తుడు, లౌక్యుడు అని పేరు. రాజకీయాల్లోనూ ఇలాగే ఉంటాడా మరి?

    రిప్లయితొలగించండి
  8. ఎన్ టీ ఆర్ జీవితం చివరికేమైందన్నది పక్కన పెడితే, ఆయన కున్న చరిష్మా ఇప్పట్లో ఇంకెవ్వరికీ లేదు, రాదు కూడా! ఒంటి చేత్తో తెలుగుదేశాన్ని గెలిపించాడు. ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో చిరంజీవికి అంత లేదు. అసలు అతడిని ఎన్ టీ ఆర్ తో పోల్చకూడదు. ఆయనకున్న వాగ్ధాటి, ధారణ, మొండితనం(ఇదీ మరీ నచ్చేవిషయం),అభిజాత్యం,క్రమశిక్షణ చిరంజీవిలో ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి!

    కోట్లమంది ప్రజల్ని మాటల్తో ఒప్పించడం శబ్దాలయ లో డబ్బింగ్ చెప్పినట్టు కాదు.కొడుకుని ఎలాగూ వారసుడిగా సినిమాల్లో దించాడు ! హిట్లా లేవు! "ఖాళీగా కూచుని ఏం చేస్తావు, పద పద " అని అరవింద్ లాంటి వాళ్ళు బలవంత పెట్టి ఈడ్చుకొస్తే వచ్చిన బాపతే! లౌక్యమూ కాదు, ఏమీ కాదు, 'ఖాళీ బుర్ర ' అని తెలీకుండా ఉండేందుకు సైలెంట్ గా కూచుంటే ఆయనేదో తెగ ఆలోచిస్తున్నాడని మనం అనుకుంటున్నాం!

    రిప్లయితొలగించండి
  9. ఎన్టీయారు ప్రసక్తి వచ్చింది కాబట్టి -
    నటులుగా ఇద్దరూ స్వశక్తిమీదే పైకొచ్చారు. అంతవరకే వాళ్ళలో పోలిక. నిజజీవితంలో నాయకత్వ లక్షణాల్లో (రాజకీయ నాయకుడిగానే కాదు) వీళ్ళిద్దరికీ బోల్డంత తేడా ఉంది. చిరంజీవి పూర్తిగా వీరాభిమానులు తయారు చేసిన వ్యక్తి. వీరాభిమాని లేకపోతే చిరంజీవి లేడు. కేవలం చిరంజీవి అనే నటుడుంటాడంతే! తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చిరంజీవి పూనుకుని చేపట్టినవేమీ కాదు. ఆయనలా చూస్తూ ఉంటే, అవి అలా జరిగిపోయాయి, అభిమానులు జరిపించారు. అది అభిమానుల గొప్పతనం, అంతే! ఆ పనుల శ్రేయస్సు మాత్రం ఆయనకు దక్కింది.

    రామారావు అలాక్కాదు, ఆయన ఉత్థాన పతనాలన్నీ పూర్తిగా ఆయన స్వయంకృతమే! తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ప్రతీ ఘటనకూ ఆయనే కర్త, జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ ఆయన రాసుకున్నదే! అభిమానులు ఆయన వెనక నడిచారంతే!

    రిప్లయితొలగించండి
  10. నాకపుడు పదేళ్ళు కూడా లేవనుకుంటా. కాంగ్రెస్సు వాళ్ళు రామారావును ఆఫీసుకు వెళ్ళనీయకుండా రాస్తారోకో చేస్తే, అక్కడే నడిరోడ్డులో కూర్చొనో లేక పరుపు తెప్పించుకొని పడుకునో ఏదో చేశాడు. ఇట్లాంటి స్ట్రోకులు "సొంతంగా" ఆలోచించి అప్పటికి అప్పుడు ఇవ్వడం రామారావుకు మామూలే. అమాయకత్వం నిండిన మొండివాడు. కోట్లలో కొందరు ఆ కొందర్లో ఒక్కడు "యన్టీఆర్".

    రిప్లయితొలగించండి
  11. "ఆయనలా చూస్తూ ఉంటే, అవి అలా జరిగిపోయాయి, అభిమానులు జరిపించారు."

    ఆ చూపు చాలా శక్తి కలిగినదై వుండాలి. ఆ శక్తిని సమకూర్చుకోవడానికి మనిషి దాదాపు తన జీవితకాలం క్రమశిక్షణ కలిగిన వాడై వుండాలి. అలాంటి వ్యక్తిననుసరించిన అభిమానులకు గొప్పదనం ఆపాదించబడినప్పుడు వారి పనుల శ్రేయస్సు ఆ వ్యక్తికి దక్కడం సహజమే కదా!

    రిప్లయితొలగించండి
  12. ముమ్మాటికీ సహజమే! రానారె మాట బంగారు మూట:-) -ఓ వీరాభిమాని.

    రిప్లయితొలగించండి
  13. ఆ శక్తి చూపులో కాదు, డాక్టరు గారి లాంటి వీరాభిమానుల్లో ఉందని నేననేది. :) ఆ శక్తే చిరంజీవికి వరం. అందుకే చిరంజీవిని తయారు చేసింది వీరాభిమానులేనని అన్నాను. వీరాభిమానులు చేసిన పనుల శ్రేయస్సు ఆయనకు దక్కడం మాత్రం సహజమే!

    రిప్లయితొలగించండి
  14. రామారావు, చిరంజీవి ఇద్దరు గ్రేట్ నా ఉద్దేశం లో. ఇక్కడ అందరూ రామారావు ని ఎక్కువ సప్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చిరు వైపు మాట్లాడుతాను. రామారావు ఒక శక్తి. "తెలుగు ప్రజల ఆత్మ గౌరవం". ఒక మహా నటుడు. నటుడిగా రామారావు కి పోలిక, పోటీ లేదు. ఒక తెలుగు కి వాడి నాడి రామారావు. కాని రామారవు లో కూడ కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. మొండి వాడు. నిర్ణయాలు ఒక్కడే సరి అయిన ఆలోచన లేకుండా తీసుకొనేవాడు. కాని చిరంజీవి అలా కాదు. రామారావు సినిమాల్లోకి వచ్చినప్పుడు అంత పేరున్న హీరో లు ఎవరూ లేరు (అక్కినేని, చిత్తూరు నాగయ్య లకు కూడ అప్పట్లో అంత పేరు లేదు). అంటే కధా నాయకుల శూన్యత ఉంది. అప్పుడు రామారావు జనాలని ఆకట్టుకున్నాడు. కాని చిరంజీవి వచ్చేటప్పటికే పేరున్న హీరో లు చాలా మంది ఉన్నారు. అయినా కుడ చిరు "సూపర్ హిట్" అయ్యాడు. అప్పటి వరకు తెలుగు లొ లేని ఫైట్స్ (డూప్ లేకుండా..), స్టెప్స్ ని చేసి చూపించాడు. రామారావు కి తన తోటి హీరో లతొ పెద్దగా పడేది కాదు (అక్కినేని తో కూడ అప్పుడప్పుడు గొడవలు ఉండేవి). కాని చిరు కి అందరితో (ఒక్క మోహన్ బాబు తొ తప్ప :) )మంచి సంబంధాలున్నాయి. రామారావు రాజ కీయాల్లోకి వచినప్పుడు కూడ శూన్యత ఉంది. అప్పుడు కూడా ఆకట్టుకున్నాడు. చిరు వచ్చేటప్పటికి అది లేదు. ఇక్కడ కూడ సూపర్ హిట్ అవుతాడని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  15. నేను చిరంజీవి గారి అభిమానిని కాను, కాని మనం కీబొర్డ్ మీద ఏదేదొ టైప్ చేసి అది జనం నాడిగా చెప్పలేము. నిజానికి పేద ప్రజలు ఒక గొప్ప నాయకునికోసం ఎదురు చూస్తున్నరు. అది చిరంజీవి కావొచ్చు లేద మరొకరు కావొచ్చు. తనకు అనుకూలంగా లేరని మంత్రివర్గాన్ని అంతటినీ రధ్ధు చేసిన వ్యక్తి ఎన్.టి.ఆర్. ఆయన చాలా గొప్పవాడు కాని ఒక మోనార్క్ ల వ్యవహరించేవారు. కాని చిరంజీవి సౌమ్యుడు, అందరి మాటా వింటాడు,అందరిని కలుపుకుపొతాడు. ఆయన విధి,విధానాలు ప్రకటించకముందే విమర్శించడం తగదు

    రిప్లయితొలగించండి
  16. simply sarat, మీరు చిరంజీవి అభిమాని కాదు, నేనేమో ఆయన అభిమానిని. బావుంది కాంట్రాస్టు. :)

    పోతే.. చిరంజీవి పార్టీ విధానాల గురించి నేనేమీ రాయలేదు కదండీ! అది ముందుంది. జనం నాడి గురించి కూడా నేనేం రాయలేదని అనుకుంటున్నాను. అలా మీకెందుకనిపించిందో చెప్పగలరు.

    ఇహ, కీబోర్డు గురించి.. నాకర్థమైంది. :)

    "..ఒక మోనార్క్ ల వ్యవహరించేవారు." - నిజం. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆ కారణంగా.
    "..అందరి మాటా వింటాడు,అందరిని కలుపుకుపొతాడు." -అది ఆయన బలహీనత. అందరితోటీ మంచి అనిపించుకోవాలనే కోరిక. తాను చూపించే అతివినయం అందులో భాగమే.

    రిప్లయితొలగించండి
  17. నేను మిమ్మల్ని విమర్శించడానికి అలా అనలేదు. ప్రస్తుతానికి చిరంజీవికి ఇంకా రాజకీయాలు వంటబట్టలేదనుకుంటాను. కొన్ని రొజులాగండి.. ఈయన కూడా మన y.s గారిలా తెలివిగా మాట్లాడటం నేర్చుకుంటారు... ఇంకా జనం నాడి గురించి అంటారా!!కొత్త నాయకుడైన ఎదో చేస్తాడని జనం ఎదురు చూస్తున్నారు . ఇంకా ఆయన విధి విధానాలు ప్రకటించకముందే మన బ్లాగర్లు విరుచుకుపడుతున్నారు.. ఒక మార్పు మంచిదే అని నా ఉద్దేశం...

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు