11, ఆగస్టు 2008, సోమవారం

అమరనాథ దేవాలయ స్థల వివాదం

సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే..

ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి నిమిత్తం గుడారాలను వేసేందుకు. కాంగ్రెసు, పీడీపీల ఉమ్మడి ప్రభుత్వం ఈ భూమిని ఇచ్చింది. సంతకం పెట్టిన మంత్రి పీడీపీకి చెందినవాడే. ఓ చేత్తో భూమిని ఇచ్చిన పీడీపీ నాయకులే, ఆ వెంటనే వీధుల్లోకి వచ్చి దాన్ని నిరసిస్తూ నాటకాలు మొదలుపెట్టారు.

ఆ నిరసనలకు కారణం తెలిస్తే బాధ కలుగుతుంది...



కేవలం గుడారాలు వేసుకునేందుకు ఇచ్చిన ఆ భూమిలో శాశ్వత కట్టడాలు కట్టి, హిందువులకు అక్కడ నివాసం ఏర్పాటు చేస్తారట. దానితో కాశ్మీరు లోయలో ముస్లిములకు ఉన్న మెజారిటీ పోతుందట !! (డెమోగ్రఫీ - జనతుల్యత - మారిపోతుంది అని వాళ్ళ వాదన) లక్షలాది మంది హిందువులను కాశ్మీరు నుండి తరిమికొట్టినపుడు మారిపోయిన జనతుల్యత గురించి అడిగినవాడు లేడు. అలా తరిమికొట్టి మరీ సాధించిన తిరుగులేని మెజారిటీ పోతుందని వారి భయం.

  • హిందువులందరినీ కాశ్మీరు నుండి ఎప్పుడో వెళ్ళగొట్టేసారు. ఇప్పుడు, యాత్రికులుగా వెళ్ళేవారి వలన ఈ ముస్లిములకు ప్రమాదమొచ్చిందట!
  • సంవత్సరంలో రెండే నెలల పాటు వస్తారు యాత్రికులు. వాళ్ళు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారు. యాత్ర అవగానే వెళ్ళిపోయేవాళ్ళే. ఆ వచ్చే కొద్ది మంది కారణంగా జనాభా లెక్కలు తారుమారయి పోతాయా?
  • జమ్మూకాశ్మీరు రాష్ట్రం విస్తీర్ణం కొన్ని లక్షల ఎకరాలుంటుంది. అందులోంచి కేవలం వంద ఎకరాలు ఒక గుడికి ఇస్తే కొంపలంటుకుంటాయా? (ఈ ప్రశ్న వేసుకుంటూంటేనే ఏదోలా ఉంది.., మన దేశంలోనే మనం అడుక్కోవడమేంటని)
ఆ భూమిలో శాశ్వత కట్టడాలు కడతారా లేదా అనే సంగతి పక్కన పెడదాం.. దేశం నుండి విడిపోతామనే శక్తులతో గొంతు కలిపి ఈ రాజకీయ పార్టీల వాళ్ళు అంటున్నదేమిటి? కాశ్మీరు మాది, ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడకు వచ్చి ఉండటానికి వీలు లేదు అని! ఈ దేశంలో పౌరుడికి ఎక్కడికైనా వెళ్ళి బతికే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పిస్తోంది కదా! రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును కాలరాస్తూ దేశ సమగ్రతకు భంగం కల్పించేవారిని అదుపులో పెట్టలేకపోయిన కేంద్ర ప్రభుత్వం చవటతనం ఎలాంటిదంటే...
  • ఇచ్చిన భూమిని వెనక్కు తీసేసుకుంటే దాని వలన ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయో, అది హిందువులకు బాధ కలిగిస్తుందేమోనని ఆలోచించలేదు.దేశాన్ని చీల్చాలనుకున్న వారి కోరికను మన్నించి, కేటాయింపును రద్దు చేసింది.
  • ఇప్పుడు ఆ కేటాయింపు రద్దుకు నిరసనగా జమ్మూలో హిందువులు గొడవ చేస్తూంటే రెండు మూడు వారాల దాకా వాళ్ళలో కదలిక రాలేదు. వాతావరణం వేడెక్కుతూంటే బీజేపీ, అద్వానీ గుర్తొచ్చారు.
  • భూకేటాయింపు రద్దును నిరసిస్తూ జమ్మూలో ప్రజలు చేపట్టిన సమ్మెకు ప్రతిగా ఈ వేర్పాటువాద శక్తులు ఏం చేస్తున్నాయీ... నియంత్రణరేఖను దాటి పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి వెళ్ళి తమ యాపిలు పళ్ళను అమ్ముకుంటారట. దానికి మంత్రి శివరాజ్ పాటిల్ ఇలా అన్నాడు: "మీరా దారిని పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అది మాకూ మంచిది కాదు, మీకూ మంచిది కాదు". ఇక్కడ "మేము" ఎవరు, "మీరు" ఎవరు? మేం మీ దేశస్తులం కాదు, మా కాశ్మీరు మీ దేశంలో భాగం కాదు అని అంటున్నవారితో ఈయన కూడా అదే ధోరణిలో మాట్టాడుతున్నాడు. ఈ రకం వేర్పాటు శక్తుల పట్లేమో ఉదారత్వం చూపిస్తారు, న్యాయమైన కోరిక కోరుతున్నవారినేమో పట్టించుకోరు.

ఒక సంగతి గుర్తొస్తోంది.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగు చెప్పాడు - "దేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉంద"ని. మతపరంగా ప్రజలను చీల్చి, మైనారిటీలను బుజ్జగించి, పక్షపాతంతో వ్యవహరించే బాటలో కాంగ్రెసు ప్రభుత్వం పోతోందనడానికి ఇలాంటి నిదర్శనాలు ఇంకా ఉన్నాయి.

ఇక్కడ (కాశ్మీరులో) ముస్లిములు మాత్రమే ఉండాలి, హిందువులు ఉండరాదు అని మాట్లాడ్డం ఒక్క ముస్లిములకే చెల్లుతుంది ఈదేశంలో. (ముంబైలో థాకరేలు చేస్తున్నదానితో పోల్చే లౌకికవాదులు లేకపోలేదు) ఆ ధోరణికి ఎదురు తిరిగి, అది తప్పని చెప్పిన వాళ్ళేమో మతవాదులు, మితవాదులు!

10 కామెంట్‌లు:

  1. మంచి అభిప్రాయం . వాదన సమర్దంగా వినిపించారు . హిందువులను ఉగ్రవాదులుగా ప్రచారం చేసే కుట్రలు జరుగుతున్నాయి ఈమద్య . దేశంలో ఉగ్రవాద సానుభూతిపరులు పెరుగుతున్నారు లౌకికవాద ముసుగులో..

    రిప్లయితొలగించండి
  2. చదువరి గారు,

    మీలా ఆవేశకావేశాలకు పోకుండా, సమతుల్యంగా సమస్యను చెప్పే వారు ఉంటే "సైలెంటు మెజారిటీ" తప్పక మేల్కొంటుందని నా నమ్మకం. రెచ్చకొట్టకుండా, ఉన్న సమస్యలను చర్చించే మీలాటి వారి రచనలు వర్ధిల్లాలని కోరుకుంటూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఇది కాంగ్రెస్ వారి ఎన్నికల ఎత్తుగడగా కనిపిస్తోంది. అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు..అంతిమంగా మనం కోల్పోతున్నదేమిటో వీరికి అర్థం కాదు. అర్థమైనా వీరి అధికార దాహం ముందు మరేవీ ప్రధానం కాదు.

    ఇమ్మీడియేట్గా నన్ను బిజెపి వాడిగా తేల్చేయకండి.

    రిప్లయితొలగించండి
  4. ఇదేదో మళ్ళీ చిలికి చిలికి గాలివానయ్యేటట్టు ఉంది ఈ అమర్ నాధ్ విషయం

    రిప్లయితొలగించండి
  5. well said as usual!

    For a complete picture on this issue, read this excellent piece which chronicles the entire story.

    http://timesofindia.indiatimes.com/articleshow/msid-3333783,flstry-1.cms

    రిప్లయితొలగించండి
  6. ఈ మొత్తం ఎపిసోడ్‍లో బాగా పండిన సీనేదంటే, అటవీశాఖ మంత్రిగా పిడిపి వ్యక్తే స్థలం కేటాయించి, తర్వాత రాజీనామా చేసి రోడ్ల మీదకు రావటం. హిందూ ధార్మిక సంస్థల ఆధీనంలో వున్న ఆలయాన్ని వుండనివ్వకుండా, కొత్త బోర్డ్ ఏర్పరిచి, గవర్నర్‍ని దాని చైర్మన్ చేసి, అధికారాలు రాజ్ భవన్‍కి కట్టబెట్టారు. రాజకీయ నాయకులు చేతులు పెట్టటం మొదలెట్టాక వివాదాలు తప్పుతాయా.

    ఇస్లామియా యూనివర్సిటీ నిర్మాణానికి ఉచితంగా అటవీ భూములు కట్టబెట్టిన ప్రభుత్వం, అమర్‍నాథ్ ట్రస్ట్ నుంచి మాత్రం రెండున్నర కోట్ల్లు వసూలు చేసింది. ఇప్పుడు అదీ లాక్కున్నారు.

    "హిందువులు మెజారిటీలుగా వున్నంత వరకు ఈ దేశం సెక్యులర్ గానే వుంటుంది. ఒక్కసారి మైనారిటీలు మెజారిటీలుగా మారాక సెక్యులర్ అనే పదమే వినపడదు" - అన్న ప్రవీణ్ తొగాడియా మాటలు నిజమని నిరూపిస్తుంటే, విహెచ్‍పి లాంటి అతివాదులకు అభిమానులు వున్నారంటే ఆశ్చర్యమేముంది.

    రిప్లయితొలగించండి
  7. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. ఇటువంటివి జరిగినప్పుడల్లా ఆ బాధలో నాకేమనిపిస్తుందంటే - "మనం ప్రజాస్వామ్యానికి పనికిరాము" అని ! ప్రజాస్వామ్యం కాన్సెప్టు ఈ దేశంలో అవుతున్నంత విచ్చలవిడిగా ఇంకే దేశంలోను దుర్వినియోగానికి గుఱికావడం లేదేమో ! ఇక్కడ ప్రజాస్వామ్యం (మతపర)మైనారిటీయిజానికి పర్యాయపదమై కూర్చుంది. అలా మార్చేశారు మన నాయకులు.

    బహుశా మనలాంటి, దూరదృష్టి లేని, ఏబ్రాసి గాళ్ళకు రెండే ప్రత్యామ్నాయాలేమో !

    (౧) దేశాన్ని హిందూ రాజఱికంగా ప్రకటిస్తూ రాజ్యాంగాన్ని మార్చెయ్యడం.
    (౨) సార్వత్రిక వోటుహక్కుని రద్దుచేసి చదువో, ఆస్తో ఏదో ఒకటి ఉన్నవాళ్ళకు దాన్ని పరిమితం చెయ్యడం.

    రిప్లయితొలగించండి
  8. ఇక్కడ మానవ హక్కులవాళ్ళు, మైనారిటీ సమస్యల గురించే మాట్లాడే లౌకిక వాదులు వ్యాఖ్యలు రాయరు... మెజారిటీలకి జరిగే అన్యాయం అన్యాయమే కాదు.. మెజారిటీల సమస్యలు సమస్యలే కాదు... చూస్తున్నా, ఎవరైనా మైనారిటీని వెనకేసుకొచ్చే మెజారిటీలోని లౌకికవాదులు స్పందిస్తారేమో అని... పోని మైనారిటీల్లోని లౌకిక వాదులైనా ఖండిస్తారేమో అని...

    లాభం లేదు. ఈ ఉదాసీనత నిజంగా హిందువుల స్వభావమా, లేకపోతే నెహ్రూ కుటుంబం నుండి దేశంలోని కాంగ్రెస్ నాయకులకి, ఆ తరవాత మిగిలిన నాయకులకి... వారి నుండి దేశ ప్రజలకి అంటు వ్యాధిలా పాకిందా???!

    రిప్లయితొలగించండి
  9. శివ బండారు: లౌకికవాదులంటే హిందూ వ్యతిరేకులని అర్థం స్థిరపడిపోయింది.

    భావకుడన్: ఏడెనిమిది మంది హిందువులను ఊచకోత కోసిన మరాద్ సంఘటన గుర్తుకు తెచ్చుకోండి. ఆ హంతక ముఠాలను ఈ లౌకిక వాదులు - అనగా కమ్యూనిస్టులు, కాంగ్రెసువాళ్ళు - చంకనెత్తుకున్నారు. మసీదులో దాక్కున్న హంతకుల కోసం పోలీసులు పోబోతే.. వందలమంది అక్కడ చేరి, వాళ్లను పోనివ్వలేదు. ఇంతకీ అక్కడి మసీదులో కత్తులూ, బాంబులూ దొరికాయి. మీగ్గుర్తుందా.. హై.లో బాంబులేసినపుడు ముస్లిములను అనుమానించడం తప్పంటూ ఈ మానవహక్కుల సంఘాల నాయకులు, హేతువాదులు, లౌకికవాదులు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ విమర్శించారు. తరవాతేమయిందీ? అఫ్జల్‌లూ, మొహ్తాసిమ్ బిల్లాలూ, బిలాల్‌లూ,..., వీళ్ళ మదరసా మిత్రులూ కలిసి జైపూరు, బెంగళూరు, అహమ్మదాబాదు, సూరత్తు.. చేసారు. గుండె మండినవాడెవడైనా ఈ నిజాలను కక్కితే అది రెచ్చగొట్టినట్టు అయిపోదని నా ఉద్దేశ్యం.

    పెదరాయ్డు: కావచ్చు. వాళ్ళంతటి కుటిలురే, ఇంతటి అసమర్థులే!

    అశ్విన్: అవనే అయింది.

    శ్రీరామ్: నెనరులు

    చైతన్య కృష్ణ పాటూరు: నిజమైన లౌకికవాదులు మనదేశంలో మైనారిటీయేనండి.

    తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: అవేమోగానీ, ముందు మత ప్రచారాన్ని, బలవంత మత మార్పిడినీ, బయటి దేశాల నుండి మత సంఘాలకు డబ్బులు రావడాన్ని నిషేధించాలి.

    ఏకాంతపు దిలీప్: హిందువులకు మానవహక్కులెక్కడేడ్చాయండి? హిందూ మత విషయాల్లో తప్ప అన్ని చోట్లా అన్ని వేళలా మానవ హక్కులు చెల్లుబాటవుతాయి. హైందవానికి వ్యతిరేకంగా ఏం చేసినా అది సమ్మతమే!

    రిప్లయితొలగించండి
  10. కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగమని కాశ్మీరీలు ఎప్పుడూ భావించలేదు. అందుకే ఎప్పుడు మాట్లాడినా "మీ భారతదేశం" అంటారేగానీ "మన భారతదేశం" అనరు. ఇంతగా వేర్పాటువాద భావాలున్న వీరికి మన ఆర్టికల్ 370 బ్రహ్మాండంగా కొమ్ముకాస్తోంది. అసలు కాశ్మీర్ ను కనీసం physical గా కూడా చూడని మనలో చాలామంది "కాశ్మీరం నుంచీ కన్యాకుమారి వరకూ మన భారతదేశమే" అని చంకలు గుద్దుకుంటూ ఈ సమస్యని మరింత జటిలం చేస్తున్నామేగానీ అసలు సమస్యని గుర్తించడం లేదు. అమర్ నాథ్ యాత్ర ఉదంతం ఈ విస్తృత సమస్యకున్న ఒక చిన్న కోణం మాత్రమే.

    అయినా కాశ్మీర్ విడిపోవాలని వారంత బలంగా కోరుకుంటూ విపరీతమైన సమస్యల్ని సృష్టిస్తుంటే, నిజంగా మనకు వాళ్ళని బలవంతంగా బుజ్జగించి, బామాలి,అడుక్కుని మనతో ఉంచుకోవడం నిజంగా అవసరమా? ఈ విషయం పైన నేనొక టపా రాసాను చూడగలరు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు