5, జులై 2008, శనివారం

వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?

అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.

ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలిపితే పద్ధతిగా ఉంటుందని నాక్కూడా అనిపించి అక్కడ రాయలేదు.

ముందుగా ఒక్క విషయం.. పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. నేనన్నదల్లా - రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!

నక్సలైట్లపై జరిగిన అమానుష హింస గురించి మనం తెలుసుకోవాలి, నిజమే! అలాగే నక్సలైట్ల ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.


ముందుగా.. నక్సలైట్లపై చట్టబద్ధంగా చర్యలెలా తీసుకోవాలి -
ఏకే47లూ, రాకెట్లతో యుద్ధం చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించడమెలాగ? (ఆ ఆయుధాలను పట్టుకుని మనపై తెగబడినవారినే అనేకానేక సంఘటనల్లో కాల్చిచంపేసింది - వాటిలో పార్లమెంటుపై దాడి ఒకటి) వాళ్ళని పట్టుకుని, సంకెళ్ళు వేసి తెచ్చేందుకు పోలీసులు ఏ ఆయుధాలు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పట్టుకోవాలి? మందుపాతరలు పెట్టి అటుగా వచ్చే పోలీసులను (మనుషులను) పేల్చేసిన వారిని పట్టుకునేదెలా, శిక్షించేదెలా?

అలాగే నక్సలైట్లు ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.

రైల్వే స్టేషన్లు, పోలీసు స్టేషన్లు, టెలిఫోను ఎక్స్ఛేంజీలు, ఆర్టీసీ బస్సులు, సెల్ టవర్లు మొదలైన అనేక ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందెందుకో కూడా మనం తెలుసుకోవాలి.

ఇన్నేళ్ళుగా వాళ్ళు వాడిన ఆయుధాలు, మందుపాతరలు, మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవాలి. తమ సాయుధ పోరాటాన్ని నడపడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఎక్కడినుండి ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగానే వీళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గరి నుండి రౌడీమామూళ్ళు తీసుకుంటారన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్సలైట్ల పేరు చెప్పుకుని ప్రజల దగ్గరినుండి డబ్బులు గుంజిన (ఎక్స్‌టార్షన్) నకిలీ నక్సలైట్లకు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో, చాలా సందర్భాల్లో ఆ మోసాలు ఎందుకు సఫలమయ్యాయో కూడా తెలుసుకోవాలి. నక్సలైట్లు ఆయుధాల డంపులతో పాటు డబ్బు డంపులు కూడా ఎలా సమకూర్చుకున్నారో తెలుసుకోవాలి. డబ్బులు పట్టుకుని దళాన్నొదిలి పారిపోయినవారి గురించి, డబ్బుల కోసం అయిన గొడవల గురించి కూడా తెలుసుకోవాలి. దళంలోని ఆడవారిపై దాడులు చేసిన సంగతులు కూడా మనం మననం చేసుకోవాలి.

పోలీసులు జీపుల్లో వెళ్ళటానికి భయపడి ఆర్టీసీ బస్సులో వెళ్ళబోతే ప్రజలు అడ్డుచెప్పిన సంఘటనలెందుకు ఎదురయ్యాయో, పోలీసులు అంటరానివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు 'పోలీసులు మావెంట రక్షణగా వస్తే మేం వెళ్ళం' అనే పరిస్థితి ఎందుకొచ్చిందో, పోలీసులు వెంటరాకూడనివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. 'ఎన్‌కౌంటరు జరిగిన ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడ మృత్యువాసన గుప్పున కొట్టింద'ని అంటూ ఉంటారు విప్లవ కవులు కొందరు, శ్రేష్టులలోకెల్లా శ్రేష్టులు కొందరు - మరి అంటరాని, వెంటరాకూడని ఆ పోలీసుల కళ్ళలో మృత్యువు నీడలు కనబడలేదో ! మందుపాతరల్లో మారుమోగిన మృత్యుఘోష వినబడలేదో!!

దిలీప్ గారన్నారు.. ఆ డబ్బులు ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే నక్సలైట్ల అవసరం ఉండేదే కాదు అని. ఈ నక్సలైట్లు ఉండీ ఉపయోగమేం జరిగిందో నాకు అర్థం కాదు.. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా - గిరిజనులను దోచుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులను బెదిరించి పోయారట! ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినా ఎంతో కొంత సాధించి ఉండేవారేమో!

ఇన్నేళ్ళ సాయుధ పోరాటం తరవాత, వాళ్ళు సాధించిన కొన్ని కీర్తి కిరీటాలు: టి.హయగ్రీవాచారి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి పురుషోత్తమరావు, ప్యానెల్ స్పీకరు సి.నర్సిరెడ్డి - ఆయనతోపాటు మరో పది పన్నెండు మంది. (ఇవి నాకు తెలిసినవి, తెలియనివెన్నో!) వీళ్ళెవరూ పోలీసులు కారు.

ఇన్నేళ్ళ వర్గపోరాటం ద్వారా ఏం సాధించారో, ప్రజలకు వీళ్ళెంత ఉపయోగపడ్డారో కూడా తెలుసుకోవాలి. నేపాలు నుండి దండకారణ్యం దాకా (లేక, నల్లమల దాకానో మరి.) ఎర్ర బాట (రివల్యూషనరీ కారిడార్ - RC) పరిచారు కదా! నేపాల్లో చెయ్యాల్సిన హింస అంతా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని పాలనలో కొచ్చారు. అక్కడంటే ఇన్నాళ్ళూ ప్రజాస్వామ్యం లేదు సరే, కానీ మనకుందే! మరి ఈ హింసా, విధ్వంసం అన్నీ మానేసి, ఎన్నికల్లో పాల్గొనవచ్చుగదా!ఆ బాటలో నడచే కామ్రేడ్లే గదా, వీళ్ళూను!! పోటీ చేసి, అధికారంలోకి వచ్చి, వర్గ నిర్మూలన చెయ్యొచ్చు కదా! వర్గ నిర్మూలన తుపాకీతో సాధ్యపడేదైతే ఈ 40 ఏళ్ళలోనూ జరగలేదే!!

వర్గనిర్మూలన, సమసమాజ స్థాపన అనేది ఉదాత్తమైన ఆశయమే కానీ నలభై ఏళ్ళ తరవాత అది ఉత్త ఆశయం ఐపోయినట్టు కనబడుతోంది.

8 కామెంట్‌లు:

  1. ఇప్పుడు మీ చర్చ గాడిలో పడింది. ‘నక్సల్ బరి’లో ఈ ఉద్యమం మొదలైనప్పటి నుండీ ఇప్పటివరకూ జరిగిన పరిణామాలలో నక్సల్స్ సాధించింది పెద్దగా ఏమీ లేదనే నిజం, బహుశా వాళ్ళకి కూడా తెలుసనుకుంటా.కానీ they were there as a bitter reminders to the injustice being perpetuated by the state and other institutional structures.


    90లలో కొచ్చేసరికీ మార్కెట్ ఎకానమీ ప్రభావం ఈ ఉద్యమం మీద కూడా తీవ్రంగా పడింది.అటు నక్సల్స్ లోనే డబ్బుకోసం పనులు చేసే కేడర్లు ఏర్పడగా,ఇటు పోలీసులతో కుమ్ముక్కై ఉద్యమాన్ని దెబ్బతీసిన వారూ ఉన్నారు. అప్పటివరకూ నక్సల్స్ ఉద్యమబాట పైన కాస్తోకూస్తో నమ్మకం ఉన్న ప్రజలు కూడా, ఇది జరిగేపని కాదని తెలుసుకున్నారు.పక్కకి తప్పుకున్నారు. వెరసి ఉద్యమం నీరుగారింది,తప్పుదారి పట్టింది.

    ఆశయాలూ, ఆలోచనలూ ఉన్నతమే అయినా ఆయుధం చేతబట్టిన తరువాత మనిషిలో క్రమేణా మానవత్వం నశిస్తుందనడానికి ఉదాహరణలుగా నక్సలైటు మిగిలారు.పోలీసులూ ఇదే పంధాలో తయారయ్యారు.తేడాఅల్లా,ప్రజల కోసం పోరాడుతున్నామన్న అపోహలో నక్సల్స్...ప్రభుత్వం కోసం సిన్సియర్గా పోలీసులూ...ఇలా ఒకరినొకరు చంపుకుంటూ అసలు ఉద్దేశాలు మరిచారు.

    రిప్లయితొలగించండి
  2. మీరు పొరబడ్డారు. ఈ జాబు, దీని గత జాబులలోని విషయాలు భిన్నమైనవి. రెండు జాబులనూ మళ్ళీ ఓసారి చదవండి. వాటిలోని తేడా అర్థం చేసుకోండి!

    నక్సలైట్లలో మానవత్వం నశించిందని మీరు గ్రహించినట్టుగా అనిపిస్తోంది, మీ ఈ వ్యాఖ్య చూస్తే! మా.హ. కార్యకర్తలు ఆ "మానవత్వం లేని వాళ్ళ" క్రూరచర్యలను సమర్ధిస్తూ, "సిన్సియరుగా పనిచేసే" పోలీసుల పట్ల దుర్మార్గమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారనేదే నా మొదటి జాబులోని ప్రశ్న. అందులో ఎవరు మంచో ఎవరు చెడ్డో నేను ప్రస్తావించలేదు, కేవలం హక్కు వీరుల వివక్ష గురించే నేను మాట్టాడింది. పోతే ఈ జాబులో నక్సలైట్లు ఏమాత్రం మంచివారో రాసాను అంతే!

    ఈ రెంటిలోని తేడా మీకు అర్థమైందనుకుంటాను. లేదా ఆ రెంటినీ మళ్ళీ ఒకసారి చదివి ఆలోచించండి. చర్చ గాట్లో పడిందో రోట్లో పడిందో తరవాత ఆలోచిద్దాం!

    రిప్లయితొలగించండి
  3. నరేంద్ర భాస్కర్ S.P
    ఈ విషయం పైనే ఒకానొక సందర్భం లో కాళోజీ ఇలా అన్నారు
    "హింస తప్పే, ప్రతి హింస తప్పుకాదు, రాజ్య హింస పెద్ద తప్పు",
    ఇది నాకు తెలిసిన దృక్కొణం

    రిప్లయితొలగించండి
  4. చదువరి గారు,

    1) పార్లమెంటు పై దాడి చేసింది టెర్రరిస్టులు. దురదృష్టం ఏమిటంటే ఇవ్వాళ చాలామందికి నక్సలైట్లకూ, టెర్రరిస్టులకూ మధ్యా తేడా తెలియకుండా పోవడం. బహుశా మూడు దశాబ్దాల పోరాటంలో నక్సలైట్ల అతి పెద్ద వైఫల్యం ఇదే. తామెవరికొరకైతే పోరాడుతున్నారో ఆ ప్రజల చేతనే తిరస్కారానికి గురి కావడం.

    2) ఇక నక్సలైట్ల వద్ద ఆయుధాలు, మందుపాతరలూ గట్రా ఉన్నాయి వారిని ఎలా ఎదురుకోవాలి అని అడిగారు. నేను చెబుతున్నది ఒకటే. నిజంగా ఎదురుకాల్పుల వంటి ఘటనలే జరిగితే అది వేరే విషయం. కానీ వారిని సజీవంగా పట్టుకుని మరీ అరెస్టు చేయకుండా చంపడం అమానుషం అని. నా బోటి వారు అడిగేది Rule of Law అమలు జరపమని.

    3) ".. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు."

    చదువరి గారూ, సింపుల్ గా చెపుతున్నానని మీరు అనుకోకపోతే "పోయిన సంవత్సరం కలుపు తీసినా మళ్లీ ఈ సారి కలుపు మొలిచింది." అన్నట్టుంది మీ వరస...

    రిప్లయితొలగించండి
  5. నరేంద్ర భాస్కర్: మీ దృక్కోణాన్ని గౌరవిస్తాను.
    దిల్:
    1. కటువుగా ఉన్నప్పటికీ మీరన్నది నిజం. కాకపోతే అది - తేడా "తెలియకుండాపోవడం" కాదు - తేడా "లేకుండా పోవడం".
    2. "కానీ వారిని సజీవంగా పట్టుకుని మరీ అరెస్టు చేయకుండా చంపడం అమానుషం అని." - నిర్ద్వంద్వంగా ఒప్పుకుంటాను. కానీ బలిమెలలో నక్సలైట్లు చేసింది సమర్ధనీయమా?
    3. :) పోలిక బావుంది! అయితే, నక్సలైట్లు సాధించదలచిన పని ఎన్నటికీ నెరవేరదని మీ భావనగా నేను అనుకోవచ్చా? ఎప్పటికప్పుడు తుపాకీ ఝళిపిస్తూనే ఉండాల్సిందేనేమో!

    రిప్లయితొలగించండి
  6. మావోయిస్టులు ప్రజల కోసం పోరాడుతున్నారా? తమ ఉనికి కోసం పోరాడుతున్నారా?
    బలిమెల సంఘటన చుస్తే అది ప్రజల కోసం జరిగినట్లుగా అనిపించదు. ఇకపోతే పోలీసులు తమ 'పని' చేస్తున్నారా? చట్టాలని అమలు పరుస్తున్నారా? "ఇంతకూ ఇంతా తీర్చుకుంటామని" పోలీసులు ప్రతిన చెయ్యడం కూడా చూస్తే వాళ్ళు కూడా 'సిన్సియర్' గా 'పని' చేస్తున్నట్లే కనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  7. Hi,
    We at enewss have partially release a social networking platform for indian bloggers.
    Please visit us at http://www.enewss.com/alpha/

    Please submit your blogs under Telugu blogs category.
    Thanks
    Sri

    రిప్లయితొలగించండి
  8. better late than never" అంటారుగా అందుకని ఈ కమెంటు లేటయినా రాస్తున్నా...
    మన సమాజంలో పోలీసులు పెద్దగా చించి, పొడిచి జనాల్ని ఉధ్ధరించేదేమీలేదు. కానీ "rule of law" వుందనే భయం సమాజాన్ని ఒక చట్రంలో ఇమడ్చడానికి వీలవుతుంది. నక్సలైట్లూ అంతే. 10-15 ఏళ్ళ క్రితం వీళ్ళు లేకపోతే ఆ కాస్త భయం కూడా లేకుండా పోయేది, బొత్తిగా ఆర్.నారాయణమూర్తి సినిమాలో first half లాగా వుండేది మన రాష్ట్రం. వీళ్ళు చేసిన వాటిని గానీ, చేస్తున్న వాటిని గాని నేను సమర్ధిస్తున్నాననుకోకండి. పోలీసులూ, నక్షలైట్లూ ఒకటికాదు. కానీ, ప్రభుత్వం ఇవ్వలేని న్యాయన్ని వీళ్ళిచ్చారు. అందుకే ప్రజలు వాళ్ళవెంట వున్నారు. ఇప్పటి పరిస్తితులు వేరనుకోండి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు