3, జులై 2008, గురువారం

వాళ్ళు మనకోసం ప్రాణాలర్పించారు

అది యుద్ధం. గెరిల్లా యుద్ధం. 65 మంది పోలీసులు, ఇతర సిబ్బందీ నదిలో, నడిమజ్జన ఉండగా మావోయిస్టులు రాకెట్లూ తుపాకులతో దాడి చేస్తే పాపం చెల్లాచెదురయ్యారు. 29 మంది మాత్రం బ్రతికి బయట పడ్డారిప్పటికి. మిగిలినవారి జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసుల అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన జరిగిందని ఒక వంక చెబుతున్నారు. ఆ పడవ నడిపే అతను మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడని మరో వాదన కూడా వినవస్తోంది. ఒక పోలీసు శవం నదిలో దొరికింది. అతడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయని అంటున్నారు. అతడు మావోయిస్టులకు దొరికితే, చేతులు కట్టేసి నదిలోకి తోసేసి ఉంటారు. ఎంత క్రూరత్వం!

ఈ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులను బాగా అణచివేసారు. దాదాపు ప్రతిరోజూ వినబడుతూ ఉండే ఘాతుకాలు ఇప్పుడు ఆగిపోయాయి. బహుశా మితిమీరిన ఆత్మవిశ్వాసం పోలీసుల పాలిట మృత్యు వయ్యుండొచ్చు. అదను చూసి మావోయిస్టులు మాటేసి, కాటేసారు.

భలే జరుగుతోంది యుద్ధం!
-మావోయిస్టులు గెరిల్లా దాడులు చేస్తూ ఉన్నారు.
-పోలీసులు ప్రాణాలకు తెగించి వాళ్ళను వేటాడుతున్నారు.
-రాజధానిలో మాత్రం రాజకీయ నాయకత్వం మావోయిస్టు నాయకత్వంతో కులాసా కబుర్లు చెబుతోంది.వాళ్ళు జైల్లో ఉంటే జైలుకు, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రికీ వెళ్ళి మరీ చర్చలు చేస్తోంది. అడవుల్లో పోలీసులు రక్తం ధారపోస్తుంటే. రాజకీయ నాయకులు ఆసుపత్రులకెళ్ళి అన్నలను పరామర్శిస్తున్నారు.

ఏ రాజన్ననో, రాజక్కనో అరెస్టు చేసారనే పుకారొస్తే చాలు మానవ హక్కులవారు గగ్గోలెడతారు, హడావుడి చేసేస్తారు. వాళ్ళను కోర్టుకప్పజెప్పాలి అంటూ చదును చదును చేస్తారు. (ఓసారిలాగే సుధాకరునో మరో దివాకరునో అరెస్టు చేసారనే వార్తలొచ్చాయి -అంతే ఈ వాదులు నిదర్లు పోలేదు. ఓ రోజో రెండ్రోజులో పోయాక సదరు వీరుడే ఒరిస్సా నుంచి ప్రకటన చేసాడు, అబ్బెబ్బే నేను వాళ్ళకి చిక్కలేదు, బానే ఉన్నానంటూ -అప్పుడాగింది వీళ్ళ హడావుడి.)

ముప్పైఐదు మందికి పైగా కుర్రాళ్ళు మనకోసం పనిచేస్తూ గల్లంతయ్యారు. రెండు రోజులైనా ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. వాళ్ళ సహచరులు.- ఏఁ, మేం మనుషులం కామా, మాకు మానవహక్కులు లేవా? అని అడుగుతున్నారు, ముందు మనుషులం ఆ తరవాతే పోలీసులం అని ఆక్రోశిస్తున్నారు.

ఔను మరి, వాళ్ళకు లేవా హక్కులు?

12 కామెంట్‌లు:

  1. నీతి: మానవ హక్కులు సగటు మానవులకు, బాధ్యతాయుత పౌరులకు వర్తించవు..కేవలం టెర్రరిస్టులకు, నక్సలైట్లకు మాత్రమే వర్తిస్తాయి.

    రిప్లయితొలగించండి
  2. దీనికి ప్రభుత్వమే పూనుకోవాలి. మనం సానుభూతి కురిపించడం తప్ప ఏమీ చేయలేం.

    రిప్లయితొలగించండి
  3. చాలా సంవేదనాత్మకమైన వ్యాసం. సహేతుకమైన ప్రశ్న.
    యుద్దంలో అటువైపున్నా, ఇటువైపున్నా మనుషులు మనుషులే. అందరి మానవ హక్కులు సమానమే. కాకపోతే,ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోలీసుల హక్కుల్ని కాపాడటం ప్రభుత్వ కనీస భాధ్యత.

    నక్సలైట్లు ప్రభుత్వం మీదనున్న కోపాన్ని, దానికి బ్రతుకుదెరువు కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న పోలీసులపై చూపించడం గర్హనీయం, అమానుషం.


    ఇక `మానవహక్కుల సంఘాలకి, అన్నలు తప్ప మిగతావారు కనపడరా!' అన్నది కాస్త over statement.ప్రభుత్వ పరమైన దమనానికి (State violence)గురయ్యే ప్రతి పౌరుడినీ రక్షించడానికి ఈ సంఘాలున్నాయి. కాకపోతే ఇవి మనకు TV లో ఇలాంటి సంఘటనలప్పుడు మాత్రమే కనబడతాయి కాబట్టి, అలా అనిపించడంలో తప్పులేదు.

    రిప్లయితొలగించండి
  4. మహేష్! over statement ఎంతమాత్రం కాదు. మీ ఉద్దేశ్యం మానవ హక్కుల సంఘాలు ప్రతీ దాడినీ ఖండిస్తున్నాయనీ, కానీ ప్రసార సాధనాలు మాత్రం మావోయిస్టులకి నష్టం వాటిల్లినప్పుడు మాత్రమే వారి స్పందనని ప్రసారం చేస్తున్నాయనా? క్షమించండి, అయితే మీరు పేపర్లు, న్యూస్ చానళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లు లేరు. I fully agree with chaduvari and vaijasathya on this. Human rights commissions are only for terrorists and naxalites in our country. Why didn't a single person from HRC condemn the attack? Police men are also citizens of this state, after all. But many times I saw Kannabhiraan(Chairman of HRC) himself coming into the act whenever maoists suffered.

    రిప్లయితొలగించండి
  5. @బ్లాగాగ్ని, ఈ విషయం పైన ప్రముఖ మానవ హక్కుల ఛాంపియన్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హరగోపాల్ గారు నక్సల్స్ చర్యను తీవ్రంగా ఖండిస్తే, అదే ఇంటర్వూలో భాగంగా ఆయన మందకృష్ణ మాదిగ గురించి చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే ప్రసారం చేసిన ఛానల్ సంగతి నాకు తెలుసు.ఇక కన్నభిరాన్ గారు ఈ నక్సల్స్ దుశ్చర్యని "ఖండించలేదు" అని నాకు తెలీదుగానీ, మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసా?

    ఏది సెంన్సేషనైతే దాన్ని ప్రసారం చెయ్యడానికే ఎంచుకుంటున్న మీడియా తప్పుకుండా ఈ అపోహకు ఒక కారణం, అని మాత్రమే ఇక్కడ చెప్పదలిచాను. HRC మీడియాకు పనికిరాని చాలా పనులు చేస్తోంది.కానీ వారు వార్తల్లో కనపడేది మాత్రం అన్నలకు మద్దతు తెలుపుతూనే. అందుకు వాళ్ళని అసహ్యించు కుందామా...నిజానిజాలు తెలుసుకుందామా!

    రిప్లయితొలగించండి
  6. సెన్సేషనే వార్తలు వ్రాయటానికి ముఖ్య వస్తువు అయితే, ఈ వార్తలో అది బోలెడంత వుంది అన్న విషయం దీన్ని ప్రసార సాధనాలు గత రెండు మూడు రోజులుగా కవర్ చేసిన పద్ధతి చూస్తే మీకు అర్థమవుతుంది. హోం మంత్రి మొదలుకుని పేరుచెప్పడానికి ఇష్టపడని అధికారి వరకూ వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించిన పత్రికల్లో హరగోపాల్ గారి ఖండన 'మాత్రమే' రాలేదనడం హాస్యాస్పదం. మరొక్క విషయం. అన్నలని సమర్థించినంతమాత్రాన ఎవరినీ అసహ్యించుకోవాలని నా అభిప్రాయం కాదు. అసలు ఈ టపా ఉద్దేశ్యం కూడా అది కాదనుకుంటాను. బాధల్లా పౌరులందరిపట్లా సమభావం చూపించాల్సిన H.R.C. వంటి సంఘాలే ఇలాంటి పక్షపాతం చూపిస్తుండటం వల్ల.

    రిప్లయితొలగించండి
  7. యుద్ధం అమానుషం. అందులో ఏమీ సందేహం లేదు.
    పోలీసులకీ మావోయిస్టులకీ ఈ స్థితిలో కొన్ని మౌలికమైన తేడాలున్నాయి. పోలీసులు ప్రభుత్వం తరపున పని చేస్తున్నారు. వారి వెనుక దన్నుగా ప్రభుత్వ యంత్రాంగం ఉంది (ఉండాలి). వ్యూహం, సంరక్షణ, ఒకవేళ పట్టుబడినా చనిపోయినా వారి కుటుంబాల పరిరక్షణకి వారి సంఘాలు, యూనియన్లూ ఉన్నాయి (ఉండాలి).
    ప్రభుత్వం, దాని యంత్రాంగాలు పని చేసేందుకు కొన్ని పరిధులు ఉన్నాయి. రాజ్యాంగం వగైరా. హెచ్చార్సీ లాంటి సంస్థలు చేసేది ప్రభుత్వం ఆ పరిధి లో పని చేస్తోందా, మితి మీరి ప్రవర్తిస్తోందా అని ఒక కన్నేసి ఉంచడం. వాళ్ళు ఆ పని గొప్ప సమర్ధవంతంగా చేస్తున్నారని కూడా నేననుకోను. కానీ ఈ మాత్రమన్నా చెయ్యకపోతే ఒక్క నిమిషంలో పోలీసు రాజ్యం నెలకొంటుంది అనడంలో నాకేమీ సందేహం లేదు. ఎమర్జెన్సీ నేర్పిన ఫాఠాలు అప్పుడే మరిచి పోయారా? ఇటీవల అమెరికా ప్రభుత్వం అమెరికను పౌరుల పట్ల ప్రవర్తించిన తీరు కూడా మనకో గుణపాఠం కావాలి.

    రిప్లయితొలగించండి
  8. శత్రువును చంపడం యుద్ధనీతి. యుద్ధంలో పాల్గొన్నవాళ్ళకు అది తప్పదు! ఎవరి మార్గం వాళ్ళకు నచ్చుతుంది. అయితే..

    మా.హ కార్యకర్తలకు మానవ ప్రాణాలన్నీ సమానమే కావాలి, మానవ హక్కులు అందరికీ ఒకటే కాబట్టి! కానీ కాదేమోననిపిస్తుంది. వాళ్ళకు కొన్ని ఎక్కువ సమానం, సమ్మాననీయం! కొన్ని ప్రాణాలు అంత ముఖ్యమైనవి కావు. 35 మంది పోలీసులను చంపేస్తే మాట్టాడే వారు లేరు. ఇలాంటిదే పోలీసులు చేస్తే నా యాగీ చేసేవారు. మూణ్ణాలుగు నెలల కిందట ఇలాంటొదకటి జరిగితే వరవరరావు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మాత్రం మాట్టాడరు.

    ఈ దాడిని ఖండిస్తే రాజ్య హింసకు సరేనన్నట్టు కాదుగదా! పోలీసులు రాజ్య ప్రతినిధులే.. కానీ మనుషులే కదా!

    రిప్లయితొలగించండి
  9. దాదాపు ఒక దశాబ్దం క్రితం, ప్రయానణికులతో నిండుగా ఉన్న ట్రెయిన్ ని నక్షలైట్లు కాల్చి తగలబెట్టునప్పుడు, (వైజాగులో ఒక విరసం సభ్యుడి) ని ఆడిగితే, జవాబు: "ప్రజాపోరులో కొన్ని పొరబాటులు జరుగుతుంటవి. తప్పదు.పొరబాటు అని ఒప్పుకున్నాంగా! ఒక వంద మంది పోయినా, ఒక లక్ష మందికి మంచికి జరుగుతుంది కదా," అని అన్నారు.
    అది వారికి ఉద్యమ లక్ష్యం!

    రిప్లయితొలగించండి
  10. నక్సల్స్ అణచివేయబడితే ప్రభుత్వం తమ గొప్పగాచెప్పుకుంటుంది, ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు హోం మినిస్టర్ నుండి చీఫ్ మినిస్టర్ వరకు పోలీస్ వాళ్ల అజాగ్రత్తగా చెబుతూ భాద్యతని తప్పించుకుంటుంది. అసలు భాద్యత వహించవలసిన ప్రభుత్వం నిర్లజ్జగా తప్పించుకుంటుంటే ఇక పౌరహక్కుల వాళ్ల స్పందన గురించి ఆశించటం అత్యాశే.మానవ హక్కుల గురించి ఇంకొక సారి మాట్లాడితే, సిగ్గులేని పౌరహక్కుల వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఇంకొక సారి పౌరహక్కుల గురించి వాగకుండా. పాపం బాద్యతతో పక్క రాష్ట్రం పోలీస్ లతో కలసి విధినిర్వహణలో ఉన్న ౩౦ మందికి పైగా పోలీసులు చనిపోతే మన సమాజం స్పందించిన తీరు (ముఖ్యంగా ప్రభుత్వం) పౌరహక్కుల సంఘం కంటే దారుణంగా ఉంది. పోలిసుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించటం తప్ప మనంచేయగలిగింది ప్రస్తుతానికి ఏమిలేదు. నక్సల్స్ డౌన్ డౌన్, ప్రభుత్వం డౌన్ డౌన్, పౌరహక్కుల సంఘం. థూ.. థూ..

    రిప్లయితొలగించండి
  11. ఈ విషయం పై మరికొంత సమాచారానికి ఈ క్రింది లంకె చూడగలరు
    http://parnashaala.blogspot.com/2008/07/blog-post_04.html

    రిప్లయితొలగించండి
  12. పోలీసులు మన కోసమే వాకపల్లిలో గిరిజన స్త్రీలని రేప్ చేశారు. ఈ సో కాల్డ్ శాంతి కాముకలకి పోలీసు చేసే రేపులు, వేధింపులు కనిపించవు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు