29, మే 2007, మంగళవారం

ఓ మంత్రిగారి జాబు

"స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్లో రామారావుపై ఉన్న అభిమానాన్ని, మూర్తిమత్వాన్ని దుర్వినియోగం చేయవద్ద"ని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి చంద్రబాబు నాయుడును కోరింది.

నవ్వొస్తది వీళ్ళ పద్ధతి చూస్తుంటే. ఈమె కాంగ్రెసు నేత. తెదేపా వాళ్ళు తమ తమాషాను జరుపుకుంటున్నారు. తమ నాయకుణ్ణి తలచుకుంటున్నారు. మరో కాంగ్రెసు నాయకుడెవరైనా అంటే పర్లేదు, కానీ అలా రాసే నైతికత ఈమెకుందా? ఆమెనే అడుగుదాం.

అమ్మా మంత్రిగారూ..
  1. రామారావు పార్టీ పెట్టిందే కాంగ్రెసుకు వ్యతిరేకతతో. కాంగ్రెసు వ్యతిరేకతే తెదేపాకు అస్తిత్వం. మరి మీరు ఆ పార్టీలో ఎలా చేరారు? మీ నాన్నపై అంత గౌరవం, ప్రేమ ఉంటే తెదేపాలోనే ఎందుకుండలేదు? సరే బాబు ఉండనివ్వలేదు.. అందుకని కాంగ్రెసులో ఎలా చేరతారు, మీ నాన్న ఆశయాలకు వ్యతిరేకంగా?
  2. మీ నాన్నను పడదోసి బాబు గద్దెనెక్కినపుడు, మీభర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముందు మీ నాన్నతోటే ఉన్నాడు. తరువాత బాబు పంచన చేరాడు. మరి అప్పుడు కనిపించలేదా బాబు మీనాన్నకు చేసిన ద్రోహం? కొన్నాళ్ళకు మళ్ళీ వెనక్కి పోయాడు. తన వర్గంలోని వారికి మంత్రివర్గంలో చాలినన్ని సీట్లివ్వలేదనే కదా బయటికి పోయింది?
  3. ఇప్పుడు మీరీ బహిరంగ లేఖ ఎందుకు రాసారు? ఏ నిచ్చెన ఎక్కేందుకు మీ తాపత్రయం?
  4. రాజకీయ నాయకుడిగా రామారావుకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకుందామని అందరూ చూస్తున్నారు. తెదేపా, ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు.. ఇలా అందరూ. సొమ్ము చేసుకునే హక్కు ఎవరికైనా ఉందీ అంటే అది తెలుగుదేశం పార్టికే ఉంది. ఆయన రాజకీయ వారసత్వం తెలుగుదేశం పార్టీదే. పార్టీకి మూలవిరాట్టుగా రామారావుకు ఆ గౌరవమివ్వాల్సిన బాధ్యతా పార్టీకుంది. మీరు ఆయన బిడ్డలైతే ఆయన కుటుంబ వారసత్వం కోసం పోట్లాడుకోండి. ఆయన ఆస్తి కోసం కొట్టుకోండి. ప్రజల ముందు నాటకాలొద్దు.
లేదూ ఎన్టీయార్ రాజకీయ వారసుడు బాబు కాదు మేమేనంటారా.. వెళ్ళి తెలుగుదేశం పార్టిలో చేరి ప్రజాభిమానం పొందండి. లేదూ పోటీ తెలుగు దేశం పెట్టండి. ఆయన రాజకీయ వారసత్వం కోసం పోటీ పడండి. అంతేగానీ ఎక్కడ ఆత్మగౌరవం తాకట్టడిపోయిందని ఎన్టీయార్ తెలుగుదేశం ఏర్పాటు చేసాడో.. ఆ కాంగ్రెసులో ఉండి ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్పొద్దు.

6 కామెంట్‌లు:

  1. మహానాయకుడి ని ఎన్నో రకాలుగా హింసించి , అవమానించిన కాంగ్రెస్ వారా అన్న గారి గురించి మాట్లాడేది.

    రిప్లయితొలగించండి
  2. రామారావు గారి ఊపిరే కాంగ్రస్ వ్యతిరేకత. ఈవిడ గారు ఇప్పుడు కాంగ్రెస్ లో హఠాత్తుగా రాహుల్, సింధియా వారు స్థాయి పోలికలు తెచ్చుకునే సరికి ఈ మాటలు వచ్చేస్తున్నాయి. ఇంత రాజకీయ చైతన్యం వున్నావిడ లక్ష్మీ పార్వతిని తిట్టవచ్చు కదా? కోట్లు వెనకేసిన పార్వతికి రాజకీయాలు నడపడానికి డబ్బులు లేవంట ఇప్పుడు. మొదట ఈ మంత్రి గారు అన్న గారిని అర్ధం చేసుకుంటే మంచిది. ఆమె రాజకీయాలను అర్ధం చే్సుకుంటున్నారు. భర్త గారి డవిరిక్షన్ అనుకుంటా...

    రిప్లయితొలగించండి
  3. ఇది సహేతుకమైన విమర్శే. N.T.R. కుటుంబ సభ్యులలో బాబు పై వ్యతిరేకత, హరికృష్ణ తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి తగ్గు ముఖం పట్టిందనుకో వచ్చు. కాబోయే ముఖ్యమంత్రిగా దివంగత రామారావు నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్న బాలయ్య, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు వియ్యంకులు కాబోతున్నందున,రాజకీయ ఎత్తులు కొత్త మలుపు తిరగబోతున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. "ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి!"

    రిప్లయితొలగించండి
  5. వీళ్ళ రాజకీయ రంగు మాటలు తెలియని దెవ్వరికి?

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  6. అవకాశవాద రాజకీయాలకు ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు