2, జూన్ 2007, శనివారం

మీస వైరాగ్యం భక్తి వైరాగ్యం

అభిప్రాయాలు మార్చుకోకపోతే రాజకీయ నాయకుడు కాలేడు అని పెద్దలన్నారు. రాజకీయుడే కాదు, అభిప్రాయాలు మార్చుకోకపోతే చాలా కాలేము అని అంటాన్నేను. జీవితంలో కనీసం ఓ ఐదారొందల సార్లు అభిప్రాయాలు మార్చుకోకపోతే అంత బతుకు బతికీ ఉపయోగమేముంటుంది చెప్పండి?! అసలు అభిప్రాయాలు మార్చబట్టేనట, చలం అరుణాచలమెళ్ళింది! నేను మార్చుకున్న ఓ అభిప్రాయం గురించి చెబుతాను.. ఆ అభిప్రాయం మీసమ్మీద.

ఆ మధ్య తిరపతెళ్ళి గుండు చేయించుకొచ్చాను. ఏవో కష్టాల్లో పడి ఉంటాడు.., దేవుడు గుర్తొచ్చాడు, లేపోతే తిరుపతెందుకెళ్తాడు అని అనుకుంటున్నారా? నిజమే మరి, కష్టాల్లో ఉన్నప్పుడు కాక, అంతా బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి విసిగించడం ఎందుకు చెప్పండి? అసలు నాకో సందేహం.. కష్టాలొచ్చినపుడు, ఆస్తికులు దేవుడికి మొక్కుకుంటారు, చక్కహా గుండు చేయించుకుంటారు, మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?

నాస్తికులు "దేవుడు లేడు, భక్తీ ముక్తీ అంతా ట్రాష్ అంటూ ఇంగ్లీషులో కొట్టిపారేస్తుంటారు కదా.. వీళ్ళకి పాపం తగలదూ? చచ్చిపోయాక నరకానికి పోరూ?" అని చింత ఉండేది నాకు. ఈ మధ్య ఓ బ్లాగులో (పేరు గుర్తు లేదు) రాసింది చదివాక నాకా సందేహాలు పటాపంచలైపోయాయి. అందులో ఇలా రాసారు..

జయ విజయుల కథ తెలుసు కదా, వాళ్ళు విష్ణుమూర్తి ద్వారపాలకులు, పరమభక్తులు. సనక సనందనాదుల శాపవశాన ఏడు జన్మలు విష్ణువుకు దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శాపవిమోచనం కోసం విష్ణువు కాళ్ళావేళ్ళా పడితే సరే మూడు జన్మలు నాకు బద్ధ శత్రువులుగా నన్ను తిడుతూ జీవించండి. ఆ తరువాత నన్ను చేరుకోవచ్చు అని చెప్పాడట. ఆ విధంగా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు, రావణ కుంభకర్ణులు, జరాసంధ కంసులు మనకు దొరికారు. అదే విధంగా మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు శాప విమోచనం కోసం ఈ జన్మలో దేవుణ్ణి తిడుతూ ముక్తి కోసం ఎదురు చూస్తున్నారట. అంచేత వాళ్ళ గురించి మనం దిగులు చెందనక్కరలేదు, మనకంటే వీర భక్తులు వాళ్ళు! శ్రీ వేంకటేశ్వరుడు వారికి ముక్తిని ప్రసాదిస్తాడు, నోడౌట్! సో.. నాస్తిక్స్, డోంట్వర్రీ!

ఇక నా గుండు దగ్గరికి వస్తే.. గుండు చేయించుకున్నపుడు మీసం కూడా తీసెయ్యాల్సి వచ్చింది. గుండు చేయించుకుని రాంబగీచాలో గదిలోకి వెళితే వీడెవడన్నట్టు చూసారు పిల్లలు. అద్దంలో చూసుకుని నేనే గుర్తుపట్టలా.. ఇహ వాళ్ళేం గుర్తు పడతారు! మూతి మీద మీసం లేకపోతే నాకు నచ్చదు. మరిప్పుడెలా? మరీ చూసుకోలేకుండా ఉన్నానే! మీసమ్మీద నా అభిప్రాయం మార్చుకుంటే తప్ప ప్రశాంతంగా ఉండలేననిపించింది. కృష్ణుడికి మీసముందా? వాజపేయీకి మీసముందా? అని సమాధానపడ్డాను. అలా అభిప్రాయం మార్చుకున్నాక మీసం లేకపోయినా బానే అనిపించింది. పదిరోజుల్లో మీసమ్మొలిచాక మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నాను లెండి.

8 కామెంట్‌లు:

  1. బాగుంది మనమెలాగుంటే అదే బాగు...

    రిప్లయితొలగించండి
  2. బాగుంది...బాగుంది...శ్మశాన వైరాగ్యం,ప్రసూతి వైరాగ్యం లాగా మీస వైరాగ్యం.

    రిప్లయితొలగించండి
  3. అంతా బాగానే ఉంది, గానీ నాస్తుకులను కూడా ఆస్తికులుగా చిత్రీకరించే మీ కామెంట్లను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను :)

    రిప్లయితొలగించండి
  4. తమ అభిప్రాయాలను ఎప్పటికీ మార్చుకోనిది మూర్ఖులు, చనిపోయినవాళ్ళు మాత్రమేనట! :)

    ఒకసారి పజిలింగ్ పజిల్లో "వేసవిలో భలే హాయినిస్తుంది బహుశా (2+2)" అని ఒక ఆధారమిచ్చి వదిలేశారు. అది బోడి గుండు అని వారం రోజులకు గానీ తట్టలేదు నాకు. మొత్తానికి భలే టైమింగు మీది!

    రిప్లయితొలగించండి
  5. మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు శాప విమోచనం కోసం ఈ జన్మలో దేవుణ్ణి తిడుతూ ముక్తి కోసం ఎదురు చూస్తున్నారట. -చదువరి.

    వాస్తవం ఏమంటే నాస్తికులు దైవ దూషణ చెయ్యరు. దైవం అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ విశ్వంలో God's design ఉన్నదా లేక Darwins's theory of evolution ప్రకారం సృష్టి ఉన్నదా అని విశ్లేషణ చేస్తారు. ఆస్తికుల కంటే నాస్తికులే ఎక్కువ సార్లు దైవాన్ని తలుస్తారు. పుణ్య పురుషులు స్వర్గానికి వెళ్ళినప్పుడు వారికి రంభా ఊర్వశుల పొందు లభ్యమవుతుంది. పుణ్య కార్యాలు చేసిన స్త్రీలు స్వర్గానికి వెళ్ళినప్పుడు వారికి గంధర్వ, కింపురుషుల పొందు లభించట్లేదేమి అని నాస్తికులు హేతుబద్ధంగా ఆలోచిస్తారు. హేతువాదమే నాస్తికుల మతం.

    రిప్లయితొలగించండి
  6. రావుగారూ, మీరు చాలా విస్తృతమైన విషయాలన్నింటినీ ఒక గాటికి కడుతున్నారు. బౌద్ధాన్ని నాస్తికమతం అంటారు ఎందుకో తెలుసా? తెలుసుకుంటే నాస్తికం లో బోలెడన్ని రకాలని తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. చాల లేటు గా జాబు వ్రాస్తున్నాను, కంస జరాసంధులు కాదు, శిశుపాల దంతవ్రక్తులు.

    రిప్లయితొలగించండి
  8. మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?--> తలలో పేలు పడినప్పుడు :)

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు