25, ఫిబ్రవరి 2007, ఆదివారం

మండలి ఎన్నికల కథా కమామీషు

మరో నెలలో శాసనమండలి ఏర్పడబోతోంది. మండలి చదువుకున్నవారి కోసం. శాసనసభలాగా కాకుండా, సమాజంలోని కొన్ని ప్రత్యేక వర్గాలకు కేటాయింపులున్నాయిక్కడ . పట్టభద్రులకు, పంతుళ్ళకు, స్థానిక సంస్థలకు, శాసనసభకు కొన్ని స్థానాలను ప్రత్యేకించారు. ఇవికాక, గవర్నరు నామినేటు చేసేవి కొన్నుంటాయి. మన మండలిలో మొత్తం స్థానాలు 90 కాగా,

  • పట్టభద్రులకు 8 స్థానాలు,
  • పంతుళ్ళకు 8,
  • స్థానిక సంస్థల ప్రతినిధులకు 31,
  • శాసనసభ్యుల ప్రతినిధులకు 31
కేటాయించారు. ఈ నాలుగు వర్గాలకు చెందిన స్థానాలకు సభ్యులను ఆయా వర్గాలకు చెందిన వోటర్లే ఎన్నుకుంటారు. అంటే, మండలి సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేకించినదన్నమాట. అంచేత మామూలుగా అమలయ్యే రిజర్వేషన్లు ఇక్కడ అమలు చెయ్యరు. మండలిలోని మిగిలిన 12 స్థానాలకు సభ్యులను గవర్నరు ఎంపిక (నామినేటు) చేస్తారు.

శాసనమండలి సభ్యుల కాలపరిమితి ఆరేళ్ళు. అయితే ఆరేళ్ళకోసారి సభ్యులందరి పదవీకాలం ముగిసి సభ రద్దైపోయి (శాసనసభలాగా) ఎన్నికలు జరిగి కొత్త సభ ఏర్పడడం లాంటి పద్ధతి లేదిక్కడ. ఉన్న సభ్యుల్లో మూడోవంతు మంది రెండేళ్ళకో సారి రిటైరౌతారు. వారి స్థానాల్లో కొత్తవారిని ఎన్నుకుంటారు. అంచేత మండలి ఎన్నటికీ రద్దైపోదు, రామారావు చేసినట్లు శాశ్వతంగా రద్దు చేస్తే తప్ప.

అంతా బాగానే ఉంది.. మరి, ఇప్పుడు ఎన్నిక /ఎంపిక కాబోయే 90 మందీ కూడా ఒక్కసారే పదవి లోకి వస్తున్నారు కదా, మొదటి రెండేళ్ళకు, రెండో రెండేళ్ళకు విరమణ చేసేదెవరు? దాని కోసం లాటరీ తీస్తారట, మొదటి గుంపులో ఇంటికెళ్ళేదెవరు, రెండో బాచ్చిలోని వారెవరు, పూర్తి కాలం ఉండేదెవరు అనేది లాటరీ వేసి తేలుస్తారన్నమాట.

మిగతా ఎన్నికల లాగా ఈ ఎన్నికల బాలెటు కాగితాల్లో గుర్తులుండవు. వోట్లెసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా! వోటెయ్యడమంటే ముద్ర గుద్దడం కాదు, మనకు నచ్చిన వారి పేరు పక్కన 1 అని అంకె వెయ్యాలి. మీకు ఒకడి కంటే ఎక్కువ మంది నచ్చారనుకోండి, మిగతా ఎన్నికలలో మనకా అవకాశం లేకున్నా, ఇక్కడ ఒకడి కంటే ఎక్కువ మందికి వోటేసే అవకాశం ఉంది. మీకు నచ్చిన వాళ్ళకు ర్యాంకులిచ్చుకుంటూ పోవచ్చు. ఒక ర్యాంకు ఒక్కడికే ఇవ్వాలి సుమా! అలాగే ఒక్కరికి ఒక ర్యాంకే ఇవ్వాలి. వోటేసేటప్పుడు ఏం చెయ్యొచ్చో, ఏమేం చెయ్యకూడదో ఇక్కడ చూడొచ్చు.

అన్నట్టు మండలి ఎన్నికల్లో వోట్ల లెక్కింపు విభిన్నంగా ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో సమీప అభ్యర్థి కంటే ఒక్క వోటు ఎక్కువ వచ్చినా గెలిచినట్లే. కానీ మండలి ఎన్నికల్లో కనీసం సగం వోట్ల కంటే ఒకటి ఎక్కువ వస్తేనే గెలిచినట్లు. అలా ఎవరికీ రాకపోతే..? లేదులెండి, ఆ భయమక్కరలేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టరు గానీ, మళ్ళీ లెక్కిస్తారు. ఈసారి అతి తక్కువ వోట్లు వచ్చినవారిని లెక్కింపులోంచి తొలగించి వారి వోట్లను మిగతావారికి బదిలీ చేస్తారు. ఈ లెక్కింపు వ్యవహారం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ పీడీఎఫ్ ను చూడండి.

---------------------------

మండలి ఎన్నికల్లో నాకు తెలిసిన ఇద్దరు అభ్యర్థుల గురించి ఇక్కడ రాయాలి. వీళ్ళిద్దరూ "హైదరాబాదు, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగరు" నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇద్దరూ పట్టభద్రుల వర్గం తరపున పోటీలో ఉన్నారు. ఒకరు కె.నాగేశ్వర్, మరొకరు లక్ష్మయ్య. వీరిద్దరూ నాకు పరిచయస్తులు గాని, చుట్టాలు గానీ కాదు. కేవలం టీవీలోను, పేపర్ల ద్వారాను నాకు తెలిసింది ఇక్కడ రాస్తున్నాను. ముందు "మరొకరు" గురించి చెప్పి, ఆ తరువాత "ఒకరు" గురించి రాస్తాను.

లక్ష్మయ్యకు రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ శాఖలో ఉద్యోగం - ప్రస్తుతం ఉద్యోగం మానేసి ఉండొచ్చు బహుశా. ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కూడా. సుమారు ఓ యేడాది కిందట టీవీలో మాట్లాడుతూ ఉద్యోగులు లంచం తీసుకోవడం తప్పు కాదన్నట్లుగా మాట్లాడాడు. నా గత జాబుల్లో ఒకదానిలో దాని గురించి రాసాను కూడా. అప్పుడు నాకీ వ్యక్తి పేరు గుర్తు లేదు, ఇప్పుడు ఆయన ఫోటో చూడగానే గుర్తుకొచ్చాడు. ఇప్పుడు మండలికి వెళ్తాడట! సభలో ప్రశ్న అడిగేందుకు లంచం తీసుకోడంలో తప్పు లేదంటాడేమో, ఒకవేళ గెలిస్తే.

ఇక కె.నాగేశ్వర్.. ఈయన ఉస్మానియాలో జర్నలిజం ప్రొఫెసరు. ప్రస్తుతం ప్రతి శనివారం ఈనాడు ప్రతిభలో రాస్తూ ఉంటాడు. ఒకప్పుడు టీవీల్లో పొద్దుట పూట వార్తల విశ్లేషణలో దాదాపు రోజూ కనిపించేవాడు. ఆయన విశ్లేషణ చూస్తూ, అసలీయనకు తెలీని విషయమే లేనట్లుందే అని అనుకునేవాణ్ణి. గణాంకాలు పంటి కిందే ఉండేవి. విశ్లేషణ కూడా నిష్పాక్షికంగా ఉండేది. ఈసారి మన వోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు లాగుంది.

మండలి ఎన్నికల్లో నాకు వోటుంది. మరి, మీకో? మీకు వోటుందో లేదో తెలుసుకునేందుకు ఎన్నికల అధికారి వెబ్ సైటులోని ఈ లింకుకు వెళ్ళండి.

5 కామెంట్‌లు:

  1. చాలా విషయాలు తెలియజేశారు. నేను కొంచెం బద్దకించడం వల్ల ఈ ఎన్నికలకు ఓటు హక్కు పొందలేక పోయాను.

    రిప్లయితొలగించండి
  2. శాసనమండలి వల్ల శాసనమండలి సభ్యులకు మినహా మరెవరికైనా ఉపయోగం వుంటుందంటారా ?.

    రిప్లయితొలగించండి
  3. వెంకటరమణ: థాంక్సండి.
    పారుపల్లి: మౌలికమైన ప్రశ్న అడిగారు, మీరు. కెరటాల కరణాలు, ఎవరికోసమీ శాసనమండలి అనే నా గత జాబుల్లో అదే రాసాను.

    రిప్లయితొలగించండి
  4. చాలా విషయాలు చెప్పారండి. నాకర్ధంకానిది, నా పేరు మా ఇంటికొచ్చి వ్రాసుకెళ్ళారు ఎలక్టోరల్ రోల్సులో - మరి ఈ ఓటరులిస్టులో లేదేమిటో. ఒకసారి నాపేరు ఏదో లిస్టులో ఉంటే అన్ని రకాల ఎలక్షన్లకూ ఉపయోగపడలికదా?

    రిప్లయితొలగించండి
  5. (ఒకవేళ బహు పట్టభద్రులకు లేదేమో డాక్టరు గారూ :-))

    సీరియస్సుగా.. ఈ ఎన్నికలు పట్టభద్రుల కోసమే కాబట్టి, దీని కోసం ప్రత్యేకంగా నమోదు చేయించుకోవాలి గామోసు. నేను నమోదు చేసుకున్నాను.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు