5, ఫిబ్రవరి 2007, సోమవారం

సైంధవులు, శిశుపాలురు, మన పాలిట గుదిబండలు - రాజకీయులు

రాజకీయుల పేకాట, ప్రజల జీవితాలతో చెలగాటం. ఒక దృష్టాంతమిది.
















పై ఫోటోలు రెంటినీ ఈనాడు నుండి సేకరించాను.
మొదటి దాన్లో ఏం జరుగుతుందో చూసారుగా. పేకాటాడుతున్నారు ఈ నేతలు -నడిరోడ్డున ! వాహనాలేమీ కదలనీయకుండా దిగ్బంధనం చేసారు. ఈనాడులో వార్త చూడండి.
ఇక రెండో ఫోటో: అనారోగ్యంగా ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్ళే తొందర్లో ఉన్న వీరిని పై రకం రాజకీయులు, వారి అంతేవాసులు అడ్డుకుంటే.. నిస్సహాయంగా విలపిస్తున్న దృశ్యం! ఈనాడులో వార్త .

ఇలా రోడ్డును ఆక్రమించి ప్రజల్ని కదలా మెదలనీయక చేసే సైంధవులు ఎక్కువైపోయారీ రోజుల్లో. రాజకీయులు ప్రజలను హింసించడం బాగా పెరిగిపోయింది. ప్రశాంత వాతావరణం లేకుండా చేస్తున్నారు. ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వలేదని, ఎదటి వాడికి ఇచ్చారని ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న అల్లరి చూస్తూనే ఉన్నాం. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెంప మీద లాగి ఒక్కటిచ్చాడట ఒకడు (భలే, భలే!!).

ఆ మధ్య శంషాబాదు లోని ఒక స్థలాన్ని అమ్మమంటూ ఆ స్థలం యజమానిని బెదిరించి కిడ్నాపు చెయ్యబూనిన ఒక ఎమ్మెల్యే నిర్వాకాన్ని టీవీలో చూసాం. కానీ ఆ తర్వాత ఇక ఆ సంఘటన ప్రస్తావనే రాలేదంటే దానికి కారణం అర్థం చేసుకోలేనంత పిల్లకాయలమేం కాదు మనం.

గతంలో ఓ అధికారిని చెంప మీద కొట్టిన కేసులో వేణుగోపాలాచారికి కోర్టు శిక్ష కూడ విధించింది, ఈ మధ్య.

తెలంగాణా అంశంపై హద్దులు మీరి మాట్లాడ్డం అందరికీ పరిపాటి అయిపోయింది. లగడపాటి రాజగోపాల్, సర్వే సత్యనారాయణలు తిట్టుకోడం చూసాం. హైదరాబాదులో తిరగలేవని ఒకరంటే, ఏంచేస్తావో చూస్తానని మరొకరు. చివరికి అది తోపులాట దాకా పోతే.., రాజగోపాలు రోడ్డు మీద కూచ్చుని ట్రాఫిక్కును అడ్డగించాడు. తిట్టుకునేది వీళ్ళు, కష్టాలు మాత్రం మనకు!!

రాయలసీమకు వస్తే తిరిగిపోవని పీజేయార్ ను ఆయన పార్టీ నాయకులే బెదిరించడం విన్నాం.

మెదక్ లోనే ఐఐటీ పెట్టాలంటూ నిరాహారదీక్ష చేసిన తెరాస అసమ్మతి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. "తెరాస నాయకత్వానికి దమ్ముంటే బాసరలోనే ఐఐటీ పెట్టాలన్న మాటను ఇక్కడి కొచ్చి చెప్పమనండి" అంటూ సవాలు చేసాడు. అలా చెబితే బహుశా తన అనుయాయుల చేత కొట్టించేవాడు కామోసు!

నాలుగైదు రోజుల కిందట విజయనగరం జిల్లాపరిషత్తు సమావేశంలో అధ్యక్ష స్థానం పైకి మంచి నీళ్ళ సీసాను విసిరేసిన కళావెంకటరావు ఫోటోను యాక్షను సహితంగా ఈనాడులో చూసాం. (ఆయన గారి మనవడో మనవరాలో "అదేంటి తాతా, అది తప్పు కదా?" అని అడిగుంటే ఏమని సమాధానం చెప్పేవాడో మరి!!?)

ఈ రాజకీయుల వలన మనకు ప్రయోజనమేమో గానీ, నష్టాలు మాత్రం బోలెడున్నాయి. మనుషులను, మనసులను విడగొట్టడంలో ముత్యాలముగ్గు రావుగోపాలరావు వీళ్ళకు చాలడు. బూతులు తిట్టుకోడం, చట్టసభల్లో తిట్టుకోడాలు, కొట్టుకోడాలు.. ఇవన్నీ చూస్తే శిశుపాలుడు కూడా వీళ్ళ ముందు బలాదూరే అని అనిపిస్తుంది! మనం వీళ్ళ తప్పులను ఎన్నిటిని క్షమించాలో!?

(రాజకీయుల దుష్ప్రవర్తనలపై గతంలో నే రాసిన జాబు - ఏమిటీ ధోరణి కూడా చూడండి.)

6 కామెంట్‌లు:

  1. ప్రభుత్వం తల్లి అయితే ప్రజలు బిడ్డలు. కాబట్టి ఆ తల్లిని ఏడిపించి, సాధించాలంటే బిడ్డలను చిత్ర హింసలు పెడితే సరిపోతుంది కదా. రాజకీయనాయకులందరూ ప్రజాస్వామ్య నపుంసకులు. వారికి తెలిసింది ఇలాంటి పద్ధతులే.

    రిప్లయితొలగించండి
  2. ఈ రెండు ఫోటోల సహాయంతో మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేయగలమా?
    ఎక్కడొ అక్కడ వీటికి చెక్ పెట్టకుంటే వీటికి హద్దు వుండకుండా పోతుంది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  3. ప్రజలకి ఏదోఒకటి చెస్తామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్ళందరూ మాటలు నిలబెట్టుకుంటున్నట్టున్నారు ఇలా ప్రజలను కష్టాలు పెట్టి.

    రిప్లయితొలగించండి
  4. ఇంత నిర్లజ్జ గా ప్రజలతో ఆడుకుంటున్న వాళ్ళ ఇళ్ళలో ఎవరో ఒకరు ఇలాంటి వాటికి బలి అయీఎ గానీ వళ్ళకు బుద్ధి రాదు.



    విహారి
    http://vihaari.blogspot.com

    రిప్లయితొలగించండి
  5. ప్చ్... దారుణం.
    వీళ్లకు భవిష్యత్తు లేకుండా చెయ్యాలి.
    ప్రజలను ఆసుపత్రికి పోనివ్వకుండా అడ్డుకోవడంకంటే పెద్ద నేరం లేదు. ప్రసాద్‌గారన్నట్లు మానవహక్కుల సంఘానికి వీరిమీద ఫిర్యాదు చెయ్యగలమా?

    రిప్లయితొలగించండి
  6. ౧. చాలా ఏళ్ళక్రితం ఢిల్లీ దూరదర్శను వారు ఒక ప్రకటన వేసేవారు. అందులో ఒక రా.నా. తన ప్రచార పత్రాలను అన్ని రోడ్ల మీది దిక్కులు చూపే బోర్డులమీద అతికింపిస్తాడు. తీరా తన కూతురికి ప్రమాదం జరిగిందని కబురొచ్చి బయలుదేరితే డైరెక్షన్లు తెలియక ఇబ్బంది పడి తనచర్యకి పశ్చాత్తాప పడతాడు. వీళ్ళ తెలివి దొంగలు తోలా! రా.నా.లకి పశ్చాత్తాపమేంటి?
    ౨. తన మనమడో, మనవరాలో అడిగితే ఏం సమాధానం చెబుతాడని అంటున్నారు మీరు. ఒకే తానులో వేరే ముక్కలుంటాయా? అయినా ప్రజాస్వామ్యంలో ఇంత మందిమి అడగలేకపోతున్నాము, మనమడో, మనవరాలో అడుగుతారా?
    ౩. అయ్యా. మీకూ, అభినవ వాగ్గేయకారుడికీ ఉన్న అవినాభావసంబంధం ఏమిటి? ఈమధ్య ఒక కేసెట్ట్ విడుదల గురించిన ఏకవాక్యపు టపాలో కూడా పేరు పెట్టి మరీ మీకుత్ెలియజ్ప్పారు?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు