20, ఫిబ్రవరి 2007, మంగళవారం

తప్పటడుగులు

చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా!


అతిశయోక్తి: ఏ వయసులో మొదటిసారిగా ఈ మాటను చూసానో గుర్తు లేదుగానీ.. బహుశా చందమామ, బాలమిత్ర లేదా ఆంధ్రప్రభ.. ఈమూడింట్లో ఓ దాని ద్వారా పరిచయమయ్యుంటుంది, నాకామాట. ఖచ్చితంగా బళ్ళో మాత్రం కాదు. నా బుర్ర ఆ మాటను అతియోశక్తి గా అచ్చేసుకుంది. కళ్ళు చూసేదాన్ని బుర్ర పట్టించుకోలేదు. అతియోశక్తిని అదో రకమైన శక్తి అని అనుకుని ఉంటాను. అప్పటికి శక్తి తెలుసుగానీ ఉక్తి తెలిసి ఉండదు.

మదాంధ్రం: ఆరో తరగతిలో.. ఏదో చుట్టం చూపుగా మా ప్రిన్సిపాలు గారు మాకు తెలుగు పాఠం చెప్పేందుకు వచ్చారు. (మా బడి జూనియరు కాలేజీతో కలిసి ఉండేది, అంచేత ప్రిన్సిపాలే ఉండేవారు, హెడ్మాస్టరు కాదు.) శ్రీమదాంధ్రమహాభారతం అనే మాటను చెప్పించాలి మాతో. శ్రీమత్+ఆంధ్ర అనే అర్థంలో ఉచ్చరింపజేయాలి, శ్రీమదాంధ్ర ను -అదీ ఆయన లక్ష్యం ఆరోజున. మేమేమో శ్రీ 'మదాం'ధ్ర అని అంటున్నాం తప్ప, కవి హృదయాన్ని గ్రహించడం లేదు. ఆ గంటంతా ప్రయత్నించి కూడా, మా మదాంధతను తొలగించి, మమ్మల్ని వెలుగు లోకి తేలేకపోయారాయన! ఆ తరువాత ఆయన మళ్ళీ మాజోలికి రాలేదు, ఇంకెప్పుడూ మాతో పెట్టుకోలేదు.

అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన కొత్త అది. నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో! (నన్నంతలా ప్రభావితం చేసిన సినిమా మరోటి లేదు.) ఆ సినిమాతోనే సీతారామరాజు మాకు హీరో అయిపోయాడు (హీరో కానిదెవరికి!?). ఆ సినిమా పాటలను ఎలుగెత్తి పాడుకునే వాళ్ళం. "స్వాగతం దొరా.., సుస్వాగతం" ను మా స్నేహితుడు ఇలా పాడేవాడు.. "స్వాగతంధరా.. సుస్వాగతం". ధరా అని వత్తడంలో వాడికి మరింత వీరత్వం కనిపించిందేమో! వాణ్ణి చూసి, నేనూ అలాగే పాడేవాణ్ణి. తరవాత మానేసాననుకోండి. ఈ రకంగా సినిమా పాటలలోని పదాలను అడ్డగోలుగా మార్చేసిన సంగతులు కోకొల్లలుగా ఉన్నాయి. మీకూ ఉండే ఉంటాయి లెండి! మచ్చుకొకటి..

"నరవరా, ఓ కురువరా.." పాటలో ఒకచోట "అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ, ధనంజయ విజయా.." అని అర్జునుడి పేర్లన్నీ పలికిస్తాడు రచయిత. ఆ పాట విన్న కొత్తలో నాకు ధనంజయ అనే మాట అర్థం కాలేదు. పాట పాడుకోడానికి అది నాకేమన్నా అడ్డమా? "అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ, నెలవు కొన్న విజయా.." అని పాడుకునే వాణ్ణి. 'నెలవు కొన్న' అంటే ఏంటని మీ సందేహమా? ఎవరికి తెలుసండీ.. మాట ఏదయితేనేం, పాట లయ తప్పకూడదు అంతే!

VIBGYOR తెలుసు కదా. దానికి తెలుగు - "ఊనీఆనపనార" అని చెప్పేవారు. మనకో గొప్ప పాట ఉంది - "మానూ మాకును కాను, రాయీ రప్పను కానేకాను, మామూలు మనిషిని నేను" అని. ఎలా అలవాటయిందో తెలీదు గానీ ఈ "ఊనీఆనపనార" ను "మానూ మాకును కాను" స్టైల్లో పాడ్డం అలవాటయింది. ఇప్పటికీ పాడుకుంటాను, ఎవ్వరూ వినకుండా!

'అర్జునుడు'లో జ ఒత్తులో 'జ' రాయడానికి బదులు 'జు' రాసాను. (రు కింద జు రాసాను) మా మేష్టారు తన పద్ధతిలో :-) తప్పు సరిదిద్దారు. ఆ పద్ధతి కారణంగా ఆ తప్పు మరెన్నడూ చెయ్యలేదు. అన్నట్టు, కంప్యూటరు ఆ తప్పు చేద్దామన్నా చెయ్యనివ్వదు, చూసారా!!?

సుందరంబాడి శంకరాచారి / శంకరంబాడి సుందరాచారి: మనకు రాష్ట్ర గీతాన్నిచ్చిన మహానుభావుడు! ఆయన పేరుతోనూ నాకు తికమకే, ఏది సరైనదని. ఈ తికమక నాకే కాదు ప్రసిద్ధులకూ ఉంది..
సుమారు ఓ రెండేళ్ళ కిందటి సంగతి.. అయన గురించి దూరదర్శన్ లో ఓ గోష్ఠి జరిగింది. పాల్గొన్నవారిలో పులికంటి కృష్ణారెడ్డి గారొకరు. నాలాగే ఆయన కూడా తికమక పడ్డారు.. ఒకసారి కాదు, కనీసం మూడు సార్లు! మా రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ ఆయన పేరును తప్పు చెప్పడం చూస్తే నవ్వొచ్చింది.

సరీసృపం! లేక సరీనృపమా? నిన్నా మొన్నటి దాకా ఏది సరైనదో నాకు తెలీదు! సరీసృపమే సరైనదని ఈ మధ్యే తెలిసింది. నాకు మాత్రం సరీనృపమే నచ్చింది.

"పల్లే కన్నీరూ పెడుతుందో కనిపించని కుట్రల.." పాట వినే ఉంటారు. చాలా విషాదం ఉందీ పాటలో. ఓ పాతికేళ్ళ నాటి పల్లెటూళ్ళనెరిగిన వారికి ఆ విషాదం మరింతగా తెలుస్తుంది. మామూలు ఏడుపు పాటల్లాగా ఏడుస్తూ, నీరసంగా సాగే పాట కాదది, మాంచి.. ఫ్లుతగతిలో (ఫ్లుతగతిలో plu / phlu -ఏది సరైనది?) సాగుతుంది; అయినా విషాదం పలికిస్తుంది. ఆ విషాదానిక్కూడా హాస్యాన్ని కలపగలిగాను నేను. మొదటి సారి ఆ పాట విన్నపుడు కుట్ర అనే మాట వేరేగా వినబడింది... కుక్క అని! మళ్ళీ విన్నాను, అలానే వినబడింది. మళ్ళీ మళ్ళీ విన్నాను, అలానే అలానే వినబడింది. ఎన్నిసార్లు విన్నా "కనిపించని కుక్కల" అనే అనిపించేది. (గోరటి వెంకన్న గారికి ఈ సంగతి తెలిస్తే, ఓ పాటుచ్చుకుని నన్ను కొడతారేమో!) అది ఖచ్చితంగా తప్పని తెలుసు. కానీ సరైన మాటేదో తెలీలేదు. అది "కుట్ర" అని తెలుసుకునే దాకా కుదురుగా ఉండలేకపోయాను.

అంతెందుకు.. ఈ మధ్యనే, ఈ బ్లాగులోనే, ఓ జాబులో ఓ గొప్ప పాటను ("సడిసేయకోగాలి సడిసేయబోకే!") రాస్తూ శుద్ధ తప్పు రాసేసాను. కొత్తపాళీ గారు తన వ్యాఖ్యలో సరిదిద్దారు. అదేమిటో చూస్తారా.. ఇదిగో.. ఇది!

ఈ మధ్యే నేను దిద్దుకున్న తప్పులు మరికొన్ని..
స్మశానం అనేది తప్పని, శ్మశానం సరైనదనీ బూదరాజు రాధాకృష్ణ పుస్తకంలో చదివాను.
ఉచ్ఛారణ కాదు ఉచ్చారణ సరైనదని కూడా ఆయనే రాసారు.

ఇప్పటికీ నే రాసేది తప్పో కాదో తెలియనివి కొన్నున్నాయి!
వాటిలో ఒకటి.. ళ్ళ, ళ్ల ఎక్కడెక్కడ వాడాలనేది.
పెళ్ళి / పెళ్లి - (ఏకవచనం) వీటిలో ఏది సరైనది?
కాళ్ళు / కాళ్లు - (బహువచనం) - వీటిలో ఏది సరి?

ధ, థ లు వాడే విషయమై కూడా నాక్కొన్ని సందేహాలున్నాయి!

నాక్కొంత ఇంగ్లీషూ వచ్చు. అంచేత స్టేషనరీల్లో (Stationary, Stationery) ఏది స్థిరము, ఏది చరము లాంటి సందేహాలు చాలానే ఉన్నాయి.

17 కామెంట్‌లు:

  1. మేము "సరీశృపాలు" అనేవాళ్ళం.మీరు చెపేదాకా అది తప్పని "సరీసృపాలు" అని తెలీదు.ఇక "పెళ్ళి" అని మాత్రమే అనాలి."పెళ్లి" అన్నది తప్పు అని మా తెలుగు టీచర్ చెప్పారు.

    రిప్లయితొలగించండి
  2. నవ్వాపుకోలేక చచ్చాను! మరీ ఇలా అన్నిటినీ ఒకేసారి చెప్పేస్తే ఎలా అండి భరించడం?
    ఇలాంటివే నాకూ చాలా వున్నాయి..కానీ అవేవో ఇంకా తెలియదు! ఆ మద్య పొద్దులో నా బ్లాగుపై సమీక్షలో "శ" ను వాడదగని చోట వాడతానని అన్నారు కానీ నాకు ఎక్కడ తప్పు చేస్తున్నానో ఇంకా తెలియదు! :(
    ఇప్పటికీ నేను "యజ్ఞము" ను "యజ్ఞము"లా చదువుతాను. ఇదేమి చిత్రము, yajnamu అని రాసినా లేఖిని yaj~namu" అనే చూపిస్తుంది!!!

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  3. కిసకిసా నవ్వుతూ "కుందు" అంటే ఏంటి రామ్నాధ్ - అని అడిగాడు నా మిత్రుడు ఇంటరు చదివేరోజుల్లో. కుందా... అన్నాన్నేను. "నిన్ను జూచి కుందువచ్చే వన్నెల దొరసానీ" పాటుందికదా - అన్నాడు. కుందు అనే పదానికి ఆయన ఏం అర్థం ఊహించుకొన్నాడో తలచుకొంటే నాకిప్పటికీ నవ్వాగదు. పాట అది కాదు - నన్ను దోచుకొందువటే - అని చెప్పి ఆయన కిసకిసల మీద నీళ్లు చల్లేశాను.

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగ్ చదివాక నాకూ ఒక చిన్న నాటి తప్పుగా పాడిన పాట గుర్తొస్తోంది. స్వాతి ముత్యం సినిమాలో రామ కళ్యాణం సీన్లో వచ్చే పాటని నేను ఇలా పాడే దాన్నీ.."అంతలో రామయ్య లేచినాడు, ఒక్క చిటికలో ఇల్లు ఎక్కి తొక్కినాడు"....
    ఒక రోజు జోరుగా పాడుతుంటె....మా ఆంటీ ఒకామె విని సరి చేసింది..."అంతలో రామయ్య లేచినాదు, ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు" అని..."విల్లు", "ఎక్కు పెట్టడం" లాంటివి 8-9 ఏళ్ళ వయసులో నాకు తెలీలేదు. కానీ ఇప్పటికి ఆ పాట తల్చుకుంటె నవ్వొస్తూ ఉంటుంది...

    రిప్లయితొలగించండి
  5. రాధిక గారూ, థాంక్సండి, నేను ళ కింద ఎప్పుడూ ళ వత్తునే రాస్తాను. కానీ చాలా చోట్ల ల వత్తు కనబడ్డంతో అనుమానం వచ్చింది. కానీ అన్ని చోట్లా ళ వత్తు రాయొచ్చా అని?

    ప్రసాదు గారూ, మనకీ తప్పొప్పులను తెలియజెప్పేందుగ్గాను బాలసుబ్రహ్మణ్యం, త్రివిక్రమ్ గారి లాంటి మేష్టార్లు బెత్తం పట్టుకుని అలా ఓ కన్నేసి ఉంచాలి. yajnamu, yaj~namu ల్లో లేఖినికి తేడా తెలీదని మీరు చెప్పాకే తెలిసింది. పద్మ కూడా అలాగే చూపిస్తోంది.

    రానారె గారూ! తవ్వుకుంటే ఇలాంటివింకెన్నో బయట పడతాయి, కదూ?

    విజయ గారూ, రాముడు ఇల్లెక్కి తొక్కడం.. తలుచుకునే కొద్దీ నవ్వొస్తోందండి.

    రిప్లయితొలగించండి
  6. నేను "నోయిడా"ని, "నోడియా" అనుకునేవాడిని.

    "తగులు" మరియు "పగులు" లతో సంబంధమున్న క్రియా అన్ని పదాలనీ (ఉదా: "పలిగింది", "తలుగుతుంది") అని ఇప్పటికీ అంటూ ఉంటా.

    ధ, థ లను వాడడంలో నాకూ అయోమయమే!

    రిప్లయితొలగించండి
  7. నేను కూడా చాలా పదాలని ఇలానే తప్పుగా అనుకునేవాన్ని. అవన్నీ ఇప్పుడు గుర్తురాక పోయినప్పటికీ నేను మొదటిసారిగా అలా తప్పుగా చదివిన పదం మాత్రం విటమినులు, దీన్ని నేను మిటమిటలు అని చదివేవాన్ని. మూడో తరగతి చదివేరోజుల్లో అనుకుంటాను ఈపదం మొదటిసారి నే్ను చదివింది. అప్పటి నుండి చాలా రోజులపాటు నేను దాన్ని మిటమిటలు అనే అనుకునే వాన్ని.

    రిప్లయితొలగించండి
  8. పోస్ట్ మొత్తం చదివేసరికి ఎందుకో ఇది గుర్తొచ్చింది ....

    రాముని తో కపి కుమారాడు .....

    కానీ మా వెర్షన్

    రాముని తోక పీకు మారుడు ...

    రిప్లయితొలగించండి
  9. పెళ్ళి అని రాయడం తప్పని దాన్ని పెళ్లి అనే అనాలని, ణ కి వత్తు ఇచ్చేటప్పుడు కూడా ఇదే రూల్ వాడాలని పెద్దలు చెప్పారు.

    రిప్లయితొలగించండి
  10. తమిళులు, శాస్త్రీయ సంగీతం పాడేవాళ్ళైనా, కచేరిలలో, తెలుగు కీర్తనల్లో
    విభక్తి ప్రత్యయాలని ఇష్టం వచ్చినట్లు ఖూనీ చేసేయడం కొంచెం
    చెవి ఒగ్గి వినేవాళ్లకి విదితమే! నాకు తెలిసిన ఒక తెలుగావిడ (గాయని
    కాదులెండి) ఒకసారి అంత్యాక్షరిలో చాలా ధీమాగా "ఇక్ష్వాకు కులతిలకా.."
    ని "ఇక్ష్వాకు కులచిలక.." గా పాడేసింది. :-)

    రిప్లయితొలగించండి
  11. అమ్మో.. నవ్వీ నవ్వీ కళ్ళ్ల్లో నీళ్ళు వచ్చాయి అందరి అనుభవాలు చదివి..
    నేను చాలా తప్పులు అనుకుని పాడుకుని ఉన్నాను కాని సమయానికి గుర్తు రావట్లేదు.
    మీరందరు భలే గుర్తు తెచ్చుకు చెప్పారండీ.
    మా చెల్లి మాత్రం అబద్దాన్ని ఆదబ్బం అనేది.

    రిప్లయితొలగించండి
  12. ఒక్క చిటికలో ఇల్లు ఎక్కి తొక్కినాడు....

    ఇది విని నవ్వాగట్లేదు :)

    రిప్లయితొలగించండి
  13. 'మదాం'ధ్ర - "ఊనీఆనపనార"

    Man, you're killing me! I haven't laughed like this in a while.

    You may actually have a point about "naravarA" song. I think the word is "birudulunna vijayA" or "birudu ganna vijayA" - not "dhananjaya vijayA".

    See my comment here for a couple more common Telugu mistakes.

    రిప్లయితొలగించండి
  14. ఇంతలా నవ్వి చాలా రోజులయ్యింది - కామేంటు రాస్తున్నా పొట్ట చెక్కలైపోతోంది ఇంకా.

    నా తిరకాసులు: నేను ఇప్పటికి "ఎల్లుండి" అనలేను. లడ్డుండ అనే అంటాను. ఇవాళ కాదు లడ్డుండ చేద్దాం అనేది సర్వసాధారణంగా నా ప్రయత్నం లేకుండానే దొర్లి పోతుంటుంది.

    చిన్నప్పుడు, శంకరాభరణం సినిమాలో "దొరకునా ఇటువంటి సేవ" నాకు సరిగా వినబడేది కాదు. "దొరకు నాటు వంటి సేవ" అని పాడుకొనే వాడిని. "దొరకునాటు సేవేంటో" ఏమిటో తెలిసేదు కాదు కూడా. గొప్ప సినిమా కదా, ఎదో మనకర్ధం కాని గొప్ప అర్ధమే ఉంటుందిలే అనుకొనేవాడిని.

    ఇంకోసారి ఏదో నవలలో లైను బ్రేకు సమస్య: చదివితే "సీతలం గాలేస్తోంది", పది సార్లు చదివినా సీతలం గాలేమిటో, హఠాత్తుగా ఈ గాలి ప్రశక్తి ఏమిటో తెలిసేది కాదు. రానారే లాటి మిత్రుడు - చిక్కు విప్పే దాకా - ఇంతకీ "సీత లంగాలేస్తోంది" అని కవి హృదయం.

    మా ఫ్రెండొకడి పేరు ధర్బా సుబ్రమణ్యం, వాడిని ఎప్పుడూ డబ్బా సుద్దమయం అనే పిలిచేవాడిని - ఎందుకో ఎంత ప్రయత్నించినా అలాగే వచ్చేది మరి.

    రిప్లయితొలగించండి
  15. @Dil అవునా..మరి మేము పదో తరగతిలో వున్నప్పుడు మా తెలుగు టీచర్ "పెళ్లి" అని రాసామని మా అందరి చేతా 500 సార్లు "పెళ్ళి" అని రాయించారు.వాటికి పక్కన అంకెలు వేస్తూ మరీ రాయమన్నారు.అప్పుడు అనుకున్నాము పెళ్ళి అని రాయడం కన్నా ఆ 500 అంకెలు వేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుందని.అందుకే నాకు ఆ విషయం అంత బాగా గుర్తుంది.ఆ తెలుగు టీచర్ తెలుగు పండిట్ కూడాను...
    ఇప్పుడు మీరిలా చెపుతుంటే నేను చెప్పింది తప్పా అన్న బాధ కన్నా అయ్యో అనవసరం గా అప్పుడు అన్ని సారులు రాసామే అన్న బాధ ఎక్కువగా వుందండి .

    రిప్లయితొలగించండి
  16. ఈ జాఢ్యం ఇక్కడున్న అందరికంటే నాకే ఎక్కువ అని ఘంటాపదంగా చేప్పగలను. నేను తప్పుగా చదివి/వినే పదాలను వ్రాయవలసి వస్తే అది పెద్ద నిఘంటువే అవుతుంది. ఇన్నాళ్ళు ఇదేమైనా మానసిక జబ్బేమో, నాకెందుకూ తగులుకొందిరా అని అనుకొనే వాడిని. ఈ జబ్బు నాతో పాటు ఇంత మందికి ఉందని తెలిసి భలే సంతోషంగా ఉంది. (మనం మాత్రం మునిగితే బాధ కానీ మనతో పాటూ అందరూ మునుగుతూంటే బాధేందుకూ :) )
    * మచ్చుకు కొన్ని పదాలు
    - computer scienceలో CORBA అన్న technology ఒకటి ఉంది. దాన్ని నేను కోబ్రా అనే చదువుతూండే వాడిని. వేరే జనాలు "అది కోబ్రా కాదురా నాయనా కోర్బా" అని చెప్పేంత వరకు మనకు స్పృహ కలగలేదు.
    - చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. బాబాయిలు అత్తమ్మలకు పాటలన్నా పుస్తకాలన్నా చాలా ఇష్టం. అదేదో NTR సినిమాలో పాటనుకోంటా తరచూ మా ఇంట్లో మోగేది. ఆ పాట ఇలా వస్తుంది. "చూచుకో పదిలంగా హృదయాన్ని బధ్రంగా" అని. గాయకుడు పాడటం అలా పాడాడో లేక చిన్న వయసులో పదిలం అనే పదానికి అర్థం తెలీలేదో కానీ..పాటలో ఆ రెండో పదం నాకు విడిపోయి వినపడేది. వింటే నాకు భలే సిగ్గేసి అక్కడ ఉండలేక వెళ్ళిపోయే వాడిని.
    - స్కూల్లో ట్యూషన్లలో ఇలాంటి క్యామెడీ సంఘటనలు చాలా జరిగాయి. వీలున్నప్పుడు వాటిని బ్లాగుతాను. అన్నట్టు ప్రవీణ్ తనకు జరిగిన ర్యాగింగ్ ను గుర్తు చేసుకొని నా ర్యాగింగ్ అనుభవాల తుట్టెను తట్టాడు. వాటిని కూడా సీరియల్ మాదిరి బ్లాగుతా..
    - Naveen Garla
    (http://gsnaveen.wordpress.com )

    రిప్లయితొలగించండి
  17. కుల, మత,దేశాభిమానాలకు దూరంగా - తెలుగుతల్లి

    kaviraju.blogspot.com

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు