ఇన్ని దుర్వార్తలు ఇంత తక్కువ సమయంలో ఈ మధ్యకాలంలో వినలేదనుకుంటాను.
అగ్ని-3, జీఎస్సెల్వీ ల వైఫల్యాలు.: ఇవి వైఫల్యాలేనా!? కానే కాదు. అద్దరి చేరాలంటే బోలెడు అవాంతరాలు.. సుడులుంటాయి, ముడులుంటాయి, వాలుగా వెళ్ళడమే కాదు, ఎదురీదాలి కూడాను. గమ్యం మీద దృష్టి ఉన్నవాడికి, గమ్యం ఎలా చేరాలో తెలిసినవాడికి ఇవి వైఫల్యాలు కావు, పాఠాలే. నిచ్చెన మెట్లే! ఎడిసను బల్బు కనిపెట్టే ముందు 2 వేల సార్లు విఫలమయ్యాడట. 'వైఫల్యాలా? ఎవరామాటన్నది? బల్బును కనిపెట్టే ప్రక్రియలో 2000 మెట్లున్నాయి, అంతే!' అన్నాడట! అగ్నీ, జీఎస్సెల్వీలు నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యం చేరే రోజు ఎంతో దూరంలో లేదు. అవి సమర్ధుల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి దిగులేం పడనక్ల్కరలేదు.
కానీ మన ఎన్నికల ప్రహసనాలు, రాజకీయుల పిల్లిగంతులూ, పిల్లచేష్టలు, చేతివాటాలూ చూస్తూ దిగులు పడకుండా ఉండగలమా!?
ఎన్నికల కాలుష్యంలో మరింత మురికి: నిన్న తెదే టిక్కెట్టుపై ఎన్నికయ్యారు, ఇవ్వాళ కాంగ్రెసుతో చెయ్యి కలిపారు. జిల్లాను బాగు చేసే సత్తా కాంగ్రెసుకే ఉంది.., అంచేతే రంగు మార్చాం అని మంత్రి రఘువీraaరెడ్డికి చెప్పారట, ఆయనకి ఎంతో సంతోషం వేసిందట! అనంతపురం జెడ్పీ ఎన్నికలో జరిగిన నాటకమిది. మంత్రులే పాత్రధారులీ నాటకంలో!
ఇక, వేలంపాటలు.. ఎక్కడెక్కడ ఎవెరెవరు ఎంతెంతకు పాట పాడుతున్నారనేది వివరంగా పేపర్లలో వస్తోంది. ఈ ఎన్నికలూ, వోటర్ల జాబితాలూ, వాటిలో అవకతవకలు, రిగ్గింగులు ఇవన్నీ అవసరమా అని ఆలోచించి మనవాళ్ళు భలే పద్ధతి కనిపెట్టారు. ఇక ఎన్నికల సంఘం అవసరమే ఉండదు. "ఈసీ గారూ! దేశంకోసమో, ప్రజాస్వామ్యం కోసమో కాకపోయినా, కనీసం ఈసీ అనేదాన్ని ఉంచడం కోసమన్నా ఈ దురాచారాన్ని నిర్మూలించండి."
రాజకీయ దిగజారుడులో కొత్త లోతులు: కేకే, నరేంద్రల కౌగిలింత ఫోటో చూసారా? ఎంతాశ్చర్యం! నిన్నటి దాకా బజార్లో బండబూతులు తిట్టుకుని ఇవ్వాళ వాటేసుకోవడం చూస్తుంటే వీళ్ళి చెప్పే దేన్నీ పట్టించుకోనక్కర్లేదని తెలుస్తోంది.
వెరపు లేని అవినీతి: అవినీతి మనకెంత మామూలైపోయిందంటే.. ఇదివరలో ఎవరినైనా అవినీతి పరుడనో, లంచగొండి అనో నిందిస్తే వెంటనే ఖండించేవారు. నానా యాగీ చేసేవారు. నిజమో అబద్ధమో తరువాతి సంగతి.. ముందా ఆరోపణను ఖండించి పారేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. మీరింత తిన్నారని ప్రతిపక్ష నాయకులంటే.. ఏ మీరు తినలేదా అని పాలకులంటున్నారు. అంతే కానీ ఖండించడం లేదు. పైపై కబుర్లలో కూడా మనల్ని లెక్క చేసే స్థాయిని దాటేసారన్నమాట.
ఆ మధ్య రెవిన్యూ అధికారుల సంఘ నాయకుడు ఒక పత్రికా సమావేశం పెట్టి ఇలా అన్నాడు.. మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలు పర్యటనకు వచ్చినపుడు వారికీ, వారి వెంట ఉండేవారికీ.. సౌకర్యాల ఏర్పాటుకు మాకు బోలెడన్ని ఖర్చులవుతాయి. అన్నీ మేమే చూసుకోవాలి. దాని గురించి మాకు ప్రభుత్వం డబ్బులివ్వదు. కాబట్టి మాకు లంచం తీసుకోక తప్పదు. (ఆ మనిషి పేరు నాకు గుర్తు లేదు కానీ మీసాలూ గట్రా.. మనిషి గుర్తున్నాడు.) ఎంత తెంపరితనమో చూడండి. (అయితే ఆయన చెప్పేదాన్లో కొంత నిజమూ లేకపోలేదు.. నాగార్జున సాగరు వెళ్ళిన మంత్రి షబ్బీరు, చేపల కూర వండలేదని కోప్పడ్డారట.. 'అంత పెద్ద చెరువు పెట్టుకుని కూడా చేపల కూర వండకపోతే ఎలా' అని!)
200 ఎకరాల భూమి - మనందరిదీ అది - ఓ అధికారి అప్పనంగా ఎవడికో రాసిచ్చేసాడు. పైగా కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నాడు. తనకిన్నాళ్ళు తిండి పెట్టిన ప్రజలకు చివరి వెన్నుపోటు పొడిచాడు, అది తెలుస్తూనే ఉంది. ఘోరమేమిటంటే.. తాను దళితుణ్ణి కాబట్టి తనపై నిందలు వేస్తున్నారు అని అంటున్నాడట. బురదలో దొర్లి, ఆ గబ్బును, కుళ్ళును కులగోత్రాల మాటున దాచాలని చూస్తున్నాడు! డబ్బులు తీసుకుని ఆటకు పోటు పొడిచిన అజరు భాయి కూడా ఇలాగే అన్నాడు అప్పట్లో.. 'నేను మైనారిటీ వాణ్ణని నాపై వివక్ష చూపించారు' అని.
మాటేసి, కాటేసిన టెర్రరిస్టులు: 200 మందిని పొట్టన బెట్టుకున్నారు. వాళ్ళను కిరాతకులనీ, ద్రోహులనీ తిట్లూ శాపనార్థాలూ పెడుతూ కూర్చుంటేనో, పక్కోడు టెర్రరిజాన్ని మనకు ఎగుమతి చేస్తున్నాడని వాపోతేనో పని జరగదు. మన దేశంలో వాళ్ళు యథేచ్ఛగా ఎలా తిరగ గలుగుతున్నారు? వారికి ఆశ్రయం ఎలా దొరుకుతోంది? బాంబులు పేల్చీ, బీభత్సం సృష్టించీ, వాళ్ళు హాయిగా దేశం వదలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతున్నారు? (ముంబైలో బాంబులు పేలాక, విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు పోలీసులు. అయినా సరే, పేలుళ్ళ కారకుడొకడు విదేశాలకు పారిపోయాడట ఆ రాత్రి! ఇదెలా సాధ్యం!?)
పడగనీడన బతుకుతున్నాం, మనం. దాని బుస వినిపిస్తూనే ఉంది. మనం పోసే పాలు తాగుతూనే, పక్కవాడి పాంబుర్రకు తలడిస్తోంది. వాడికోసం మనల్ని మళ్ళీ మళ్ళీ కాటేస్తోంది. పాకిస్తానుతో చేతులుకలిపి, మనల్ని చంపే కుట్ర చేసే నజీరులు, వజీరులూ, ముజీబులు, ఔరంగజేబులు మన హైదరాబాదులోనే ఉన్నారట. ఔనుమరి, మనూరంత వీలు వాళ్ళకి మరెక్కడ దొరుకుతుంది? పోలీసులు కూడా వెళ్ళడానికి వెనకాడే స్థలాలున్నాయి వాళ్ళు దాక్కోడానికి, కాదు.. బహిరంగంగా తిరగడానికి. వాళ్ళే ఇబ్బందులు పడతారోనని మనం ప్రత్యేక సదుపాయాలు కూడా ఇస్తామాయె.
మన రాజకీయుల్లో ఉన్న దుష్టుల్నీ, దొగల్నీ, నేరస్తుల్నీ ఏరేస్తే మొదటిది తప్ప మిగతా దుర్వార్తలేవీ వినే అవసరం మనకుండదు. అనుకున్నా.. మీరామాట అంటారని.. "అలా అయితే మనకసలు రాజకీయులే మిగలరు కదా" అని అంటున్నారు, ఔనా? దానికి సమాధానం వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి వస్తుందేమో చూద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి