10, అక్టోబర్ 2007, బుధవారం

మా పున్నమ్మ బడి

నా గత జాబొకటి రాసేటపుడు నా చిన్నప్పటి బడి జ్ఞాపకం ఒకటి రాయాల్సొచ్చింది. ఆ సందర్భంగా జ్ఞాపకాలను అలా తవ్వుకుంటూ పోతుంటే చాలా బయటపడ్డాయి. కొన్ని బయటకు చెప్పుకోగలిగేవి, కొన్ని మనసులోనే మాగేసి ఆస్వాదించాల్సినవి. చెప్పుకోగలిగేవాటిలో కొన్ని ఇక్కడ.


1974 నాటి సంగతి. మమ్మమ్మ గారి ఊరు (గుంటూరు జిల్లా గణపవరం) నుండి మా కావూరు వెళ్ళాక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. నాకు మా వూరు నచ్చేది కాదు. నాన్నంటే భయం, బజార్లో కూచ్చుని చెతుర్లాడే పెద్దాళ్ళంటే భయం, ప్రైవేటు పంతుళ్ళంటే భయం. ఇన్ని భయాల మధ్య ఏం బతుకుతాం చెప్పండి. అదృష్టం కొద్దీ బడంటే భయం ఉండేది కాదు. మా పున్నమ్మ బళ్ళో ఐదో తరగతి దాకా ఉండేది. హెడ్ మాస్టరు గారు మృదుస్వభావి. ఐదో తరగతి పిల్లలకు అన్నీ ఆయనే. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పంతులుండే బడి కాదు మాది, ఆ రోజులూ కావవి. లెక్కలు, ఇంగ్లీషు, సోషలు.. ఇలా అన్నీ ఆయనే చెప్పేవారు.

పున్నమ్మ బడి కాకుండా మా ఊళ్ళో మరో రెండు బళ్ళున్నాయి. ఒకటి జూనియరు కాలేజి -ఇక్కడ ఆరో తరగతి నుండి ఇంటరు దాకా ఉండేది. రెండోది.. తిలక్ జాతీయ పాఠశాల. జాతీయోద్యమంలో ఇంగ్లీషు చదువుకు వ్యతిరేకంగా దేశభాషల్లో దేశీయ విద్య నేర్పేందుకు వెలసినవే జాతీయ పాఠశాలలు. అలాంటి జాతీయ పాఠశాలే మా 'తిలక్ జాతీయ పాఠశాల'. (ఆ పేరు చూడండి.. ఎక్కడో గుంటూరు జిల్లాలో, మారుమూల కావూరులో ఓ మామూలు బడికి కూడా తిలక్ పేరు! మనవాళ్ళెవరూ లేనట్టు!! హాయిగా -"పున్నమ్మ బడి" లాంటి పేరేదో పెట్టొచ్చుగదా! :) )

మా బడి గురించి ఓ ముక్క చెప్పాలి. ఊళ్ళో ఒకరి ఇంటిని బడిగా మార్చారు. పెంకుటిల్లు, అడుసుతో అలికి, ముగ్గులు పెట్టిన నేల. రెండు గదులు, బయట వరండా. ఈ మూడూ మళ్ళీ ఒక్కోటి రెండుగా విభజించబడి ఉండేవి. వరండా బయట కొద్ది ఖాళీ స్థలం.. ఆడుకునేందుకు. వెనక కొద్దిపాటి పెరడు ఉండేది. ముందు గదిలో నాలుగు, ఐదు తరగతులు, వెనగ్గదిలో రెండు, మూడు, వరండాలో ఒకటో తరగతి జరిగేవి. అలికిన నేల మీద బల్లలేసుకుని కూర్చునేవాళ్ళం. బల్లలంటే కాళ్ళుండే బల్లలు కావు.., ఉత్త చెక్కలు. ఒక్కోటీ ఐదారు అడుగుల పొడుగున, ముప్పాతిక అడుగు వెడల్పున ఉండేవి. వాటినే కింద పరుచుకుని కూర్చునే వాళ్ళం. బల్లలు కూడా అరకొరగా ఉండి, కొందరికే సరిపోయేవి. మిగతా వారు కిందే కూర్చునే వాళ్ళు. అసలు బల్ల మీద కూచ్చున్నా సగం నేల మీదే ఉండేవాళ్ళం. నేల మీద, అలికిన సాళ్ళు గరుగ్గరుగ్గా కాళ్ళకు తగుల్తూ భలే ఉండేది. ఇప్పటికీ నాకా స్పర్శ వంటి మీద ఉంది.

వందేమాతరంతో బడి మొదలయ్యేది. చివరగా జనగణమన ఉండేది. ఆ తరవాత ఉండేది అసలు సీను. "బోలో స్వతంత్ర భారత్ కీ.." అని ఒకరంటే మిగతా పిల్లలంతా జై కొట్టేవాళ్ళు. ఈ "బోలో.." చెప్పడం కోసం తెగ పోటీ ఉండేది. ఎంతో ఉత్కంఠ..., జనగణమన పాడుతున్నంతసేపూ! జనగణమన అయ్యీ కాగానే 'బోల'డానికి ఒక్కుమ్మడిగా మూణ్ణాలుగు గొంతులు లేచేవి. పోటీని తగ్గించడం కోసం మా మేష్కారు దీన్ని ఐదో తరగతి వాళ్ళకే కేటాయించారు. మిగతా వాళ్ళ పని కేవలం జై కొట్టడం వరకే! అయితే, 'రోజుకొకరు అనండిరా' అని మాలోమాకు వంతులు వెయ్యొచ్చుగదా... మా పోటీ అంటే ఆయనకూ ముచ్చటగా ఉండేది గామోసు, అలా వెయ్యలేదు! మూడో జయహే అయ్యీ కాకముందే "బోలో.." అంటూ తగులుకునే వాళ్ళం. బోలో చెప్పినవాడు ఆ రోజుకి హీరో అనమాట!

ఆ తరవాత మరో తంతు ఉండేది. వరండాలో ఒకటో తరగతి పిల్లలు కూచ్చునే వాళ్ళు కదా.. అక్కడేసిన బల్లలను లోపల పెట్టేపని కూడా ఐదో తరగతి వాళ్ళదే. (పొద్దున్నే బయట వెయ్యాలి కూడా) 'బోలో' అయిపోయాక చివరగా వెళ్ళేవాళ్ళు వాటిని లోపల పెట్టి వెళ్ళాలి. అది తప్పించుకోవడం కూడా మా దినచర్యలో ఒక భాగం. జై కొట్టగానే బయట పడ్డానికి తోపులాట జరిగేదన్నమాట!

పంతులుగారిని 'మేష్కార'నే (లేదా మేష్షారు) అనేవాళ్ళం. సర్ అనే అలవాటు లేదు! అసలలా అంటారని కూడా తెలీదు. ఇంటర్లో కూడా మేష్కారనే అనేవాళ్ళం. సర్, సార్, సారూ అనే అలవాట్లన్నీ ఇంజనీరింగులో చేరాకే మొదలయ్యాయి.

పున్నమ్మ బళ్ళో నేను ఐదో తరగతి ఒక్కటే చదివాను. మా మేష్కారు చెంపదెబ్బలు వేయించేవారు అప్పుడప్పుడూ. ప్రశ్న అడిగి, సమాధానం చెప్పలేని వాళ్ళని చెప్పిన వాళ్ళతో చెంపదెబ్బలు వేయించడమన్నమాట. ఒకసారి టేబులు స్పెల్లింగుకు గాను చెంపదెబ్బ వేసే అవకాశం నాకు వచ్చింది. tbl లతో పాటు అచ్చులు అన్ని కాంబినేషన్లనూ మావాళ్ళు ప్రయత్నించేసాక నావంతు వచ్చినట్టుంది.. మిగిలిన దాన్ని నేను ప్రయత్నించగానే అది హిట్టైంది.

ఇప్పుడా బడి దాని స్వంత గూటికి చేరింది. పాత ఇంటిని దాని స్వంతదారులు తీసేసుకున్నారు. మా పున్నమ్మ బడిలో చదువుకున్న వారిలో గొప్ప మేథావులైనవాళ్ళు లేరేమోగానీ నా తరం పిల్లకాయలు చాలామందికి ఇంత చదువు నేర్పింది, బుద్ధులు నేర్పింది. శంకరమంచి సత్యం ఒక అమరావతి కథలో అంటాడు.. 'ఆ పిల్లాడికి కృష్ణలో మునగ్గానే లోపలి నులివెచ్చటి నీళ్ళ స్పర్శకి అమ్మ కడుపులో ఉన్నట్టు హాయిగా అనిపించింద'ని. నా బడిని తలచుకుంటే నాకూ కాస్త అలాగే అనిపిస్తోంది! పున్నమ్మ బడి, అంతకు ముందరి 'బసమ్మావయ్య ప్రైవేటు' నా తీపి గురుతులు. ముఖ్యంగా నాలుగో తరగతి దాకా నేను చదివిన మా బసమ్మావయ్య ప్రైవేటు నా బతుక్కు పునాది. ఆ కథ మరోసారి.

12 కామెంట్‌లు:

 1. "మూడో జయహే అయ్యీ కాకముందే "బోలో.." అంటూ తగులుకునే వాళ్ళం. బోలో చెప్పినవాడు ఆ రోజుకి హీరో అనమాట!"
  :-)
  You made my day.
  బసమ్మాయ్య ప్రైవేటు కత కూడా త్వరలో!

  రిప్లయితొలగించండి
 2. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా తవ్వకాలు మొదలుపెడితే మరి మేమేమి చెయ్యాల?రానారే ఏమి చెయ్యాల?
  మీరు చెప్పిన ఆ చెక్కబల్లలు అవి మాకూ వుండేవి.శిశుప్రధమ,శిశు ద్వితీయ నుండి రెండో తరగతి వరకు ఆ బెంచీలే.ఎప్పుడు కాళ్ళున్న ఎత్తు బెంచీలు ఎక్కుతామా అని ఆ చిన్న క్లాసు పిల్లలు ఎదురుచూడ్డం,అలాగే పెన్నులతో ఎప్పుడు రాస్తామా అని ఎదురు చూడడం భలే వుండేది.మాకు జనగణమణ చివరిలో జైహింద్ చెప్పించేవారు.

  రిప్లయితొలగించండి
 3. మీ బడి ఙాపకాలు బాగున్నాయి. 'Tebull' వర్ణక్రమము (స్పెల్లింగ్) ఏమిటో చెప్పకుండా, చదివేవాళ్లకు కూడా చెంపదెబ్బలు వేశారుగా.

  రిప్లయితొలగించండి
 4. amaravati kadhalu gurthu chesinanduku nenarlu. rangula ratnam ekkincharu, mi badi gurinchi cheppi...ma tadikala badi gurthuku chesaru

  రిప్లయితొలగించండి
 5. ఊకదంపుడు గారూ, మీ స్పెల్లింగు తప్పని నాకు తెలిసిపోయిందోచ్! ఇంకెవరైనా ప్రయత్నిస్తారేమోనని చూసా రెండ్రోలు. ప్చ్, బ్యాటను అందుకోడానికి ఎవరూ లేరు. ఇక నేను చెప్పేస్తాను.. TEBIL అని అనుకున్నాగానీ, మనం టే.. బుల్ అనిగదా అంటాం -అంచేత ఖచ్చితంగా TABUL అయ్యుండాలి. అదే అయ్యుంటుందిలెండి.. అలా సరైన స్పెల్లింగు చెప్పబట్టే గదా చెంపదెబ్బలు వేసింది!!
  -అందరికీ నెనరులతో

  రిప్లయితొలగించండి
 6. ఎద్దును (bull)'టే'క్కాడికి ( టేకు కాడికి) కట్టేస్తేసరిపోతుందనుకున్నానే? పోనీ TAతో మొదలనుకున్నా.. మీరేమో ఎద్దుకుతోకకోశారు.. కుమ్మకుండా ఎట్టావదిలిందబ్బా?

  రిప్లయితొలగించండి
 7. ఏవండీ పదో నేల పదో తారీకు పోయి మూడు నెలలు పున్నమ్మ బడి తరువాయి భాగం ఏదీ ఎక్కడా?

  రిప్లయితొలగించండి
 8. good one naaku....chinnappati life gurrtuku vachhindi..memu naaraayana maastaaru daggara chaduvukunnam..memu ganapavaram daggara turlapaadu nundi.............nijame nenu inter varaku maastaaru ani pilchevaadini.....

  రిప్లయితొలగించండి
 9. @మారుమూల కావూరులో ఓ మామూలు బడికి కూడా తిలక్ పేరు! మనవాళ్ళెవరూ లేనట్టు!! హాయిగా -"పున్నమ్మ బడి" లాంటి పేరేదో పెట్టొచ్చుగదా! :) )

  మరి గా౦ధీ, నెహ్రూ తో సహా స్వాత౦త్ర్య యోధుల౦తా తిరిగిన ఊరు కదా :)

  చాలా పాత టపా లో వ్యాఖ్యానిస్తున్నాను, మా స్కూల్ పేరు వ్రాశారేమో చూస్తే ,ప్చ్ లేదు :)

  రిప్లయితొలగించండి
 10. "మా స్కూల్ పేరు వ్రాశారేమో చూస్తే ,ప్చ్ లేదు :)" - Mauli గారూ మీరుగానీ ఆశ్రమం రెసిడెన్షియల్ బళ్ళో గానీ చదివారా ఏంటి? మనం ఒక ప్రాంతం వాళ్ళమేనా అయితే!!

  రిప్లయితొలగించండి
 11. అవున౦డీ,సరిగమలు బ్లాగ్ చూస్తూ ఇటొచ్చాను. మీరు తిలక్ పేరుతో వ్రాసిన చెణుకులు చూడగానే ఆ స్కూల్ లో జ్నాపకాలు చుట్టేసాయి :)

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు