16, అక్టోబర్ 2007, మంగళవారం

బస్సు దోపిడీ!

ప్రైవేటు బస్సుల అరాచకాన్ని అరికట్టేందుకు దసరా సమయాన ఒక దుర్గమ్మ పూనుకోవలసి వచ్చింది. ప్రైవేటు బస్సుల ఆగడాల గురించి మనకు తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వానికీ ఇవి తెలుసు. ఇవిగో కొన్ని..

 1. ప్రభుత్వానికి జెల్ల కొట్టడంలో వీళ్ళది అందె వేసిన చెయ్యి. టూరిస్టు క్యారేజిగా తిరగాలవి.. కానీ స్టేజి క్యారేజిగా తిరుగుతాయి. ఆంధ్ర దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసా సంగతి, సంబంధిత అధికారులకు తప్ప!
 2. హై. నుండి మీ ఊరికి ఒక బస్సూ, అట్నుండి ఇటొకటీ ఒకే సమయానికి బయలుదేరుతాయి. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రత్యేక రిజిస్ట్రేషను నంబరుంటుంది (కదా!). రెంటికీ పన్ను కడతారని మనబోటి అమాయకులం అనుకుంటాం (కదా!). పాపం ప్రభుత్వమూ అలాగే అనుకుంటుంది. (ఔనా! ఏమో?) కానీ వాళ్ళు ఒకదానికే కడతారు.. ఆ నంబరు పెట్టుకునే రెండు బస్సులూ తిరుగుతాయి.
 3. రాత్రి ఎనిమిది నుండి పదింటి దాకా కూకట్‌పల్లి నుండి దిల్‌సుఖ్ నగరు దాకా చూడాలి.. మాఊరు, మీ ఊరని లేదు.. మొత్తం రోడ్డంతా వాళ్ళదే. రోడ్డు మీంచి ఒక్క అంగుళం కూడా దిగరు. మన హై. ముష్టి రోడ్లకు తోడు వీళ్ళ ఆగడం జతై మనకు నరకమే కనిపిస్తుంది.
 4. బస్సుపైన బస్సెత్తున సామానేస్తారు. హై. దాటేటప్పటికి పన్నెండు దాటుద్ది. ఇక ఆపైన ప్రయాణం మేఘాల్లో తేలిపోతూ సాగుతుంది. పైప్రాణాలు పైనే పోతాయి. మొన్న ఈనాడులో చూసాం కదా ఏం జరిగిందో!
 5. ప్రజలను దోచడంలో వీరు ఎమ్మెన్సీలకు పాఠాలు చెప్పగలరు. ప్రతి శుక్రవారం హై. నుండి గుంటూరు వెళ్ళే కొన్ని (అన్నీనా.. ఏమో?) బస్సుల్లో టిక్కెట్టు వెల పెరుగుతుంది. ఆది వారం అటునుండి వచ్చే టిక్కెట్లు వాస్తాయి. వీకెండుకు ఇంటికెళ్ళే సాఫ్టువేరు శ్రీమంతుల స్పెషలది. ఇది వారాంతపు స్పెషలు దోపిడీ. టిక్కెట్ల నల్లబజారు! సినిమా హాళ్ళ వాళ్ళు కొత్త సినిమాలకు టిక్కెట్లను పెంచేసినట్టు!!
 6. మీ ఊరి నుండి కూకట్‌పల్లి వెళ్ళాలని ఎక్కుతారు. పొద్దున్నే ఎస్సారు నగర్లో ఆపేసి, ఇకపోదు, అదిగో ఆ బస్సెక్కండి.. ఇదుగో ఈ ఆటోలో వెళ్ళండి అని అంటారు.
ఈనెల 5న మా అమ్మానాన్నా పొన్నూరు నుండి ప్రైవేటు బస్సులో వచ్చారు. రాత్రి రెండున్నరకి మా నాన్న ఫోను చేసారు.. "బస్సు బోల్తా పడింది, చీకటిగా ఉంది, ఎక్కడున్నామో తెలీదు, అంతా క్షేమమే, కంగారు పడొద్దు" అని. కాస్సేపటి తరవాత ఏదో ఆర్టీసీ బస్సులో ఎక్కి, పొద్దున తొమ్మిదిన్నరకు ఇంటికి చేరారు. ఇంతకీ, బస్సు డ్రైవరు పారిపోయాడు! వాడు అసలు డ్రైవరు కాదు.. అసలు డ్రైవరు గారి బావమరిదో మరొకడోనంట. అంతకు ముందు అక్కడెక్కడో ఆపి, దిగిపోయి, కాస్సేపాగాక మళ్ళీ ఎక్కాడంట.. అక్కడ మందేసి ఉంటాడని ప్రయాణీకుల అనుమానం!

ప్రైవేటు బస్సులని ఎత్తెయ్యాలని కాదు.. వాటిని అదుపు చెయ్యాలి. ప్రజలను వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుండి రక్షించాలి. టిక్కెట్టు రేట్లు అదుపు చెయ్యాలి (ఆర్టీసీ వాళ్ళను చేసినట్టుగా). ప్రయాణీకుల బళ్ళు ప్రయాణీకుల కోసమే నడవాలి. సరుకు రవాణా కోసం వాడరాదు.

ప్రస్తుతానికి పూనం మాలకొండయ్యదే పైచేయి. చూద్దాం, ప్రభుత్వమామెను ఎన్నాళ్ళు పనిచెయ్యనిస్తుందో!

4 కామెంట్‌లు:

 1. బాగా చెప్పారు. మీరింకా ఎస్సార్ నగర్ అన్నారు, మమ్మల్ని దిల్షుఖ్ నగర్లో దింపి అదే లాస్ట్ స్టాపన్నారు. బాగా గొడవపెడితే, అప్పుడు వేరే బస్సు ఎక్కించారు. మీ రెండో పాయింట్ నాకింత వరకు తెలియదు. అది మరీ దారుణం. కానీ దివాకర రెడ్డి గారి లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలా మందికి ఈ వ్యాపారాలున్నాయి కదా. వీళ్ళని అదుపులో పెట్టటం కష్టమే.

  రిప్లయితొలగించండి
 2. నేను ఒకసారి ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుండి నెల్లూరుకి ప్రయాణం చేసాను. టికెట్ తీసుకునేటప్పుడు హైటెక్ బస్సు అని చెప్పి తీరా బయలుదేరే సమయానికి మాములు ఎ.సి. బస్సు పంపించాడు. అది కూడ వాడి స్వంత బస్సు కాదు. వేరే ట్రావెల్స్ వాళ్లతో వీళ్లకి టై-అప్ అన్నమాట. రాత్రి 9 కి బయలుదేరాల్సిన బస్సు 10.30 కి బయలుదేరింది. నా ఖర్మ కొద్దీ నా సీట్ కిటికి పక్కనే. పై నుంచి ఎ.సి. గొట్టంలో నుంచి నీళ్లు లీక్ అవసాగాయి. నిద్ర పోదామనుకునే సరికి ఒక్కొక్క బొట్టు సరిగ్గా మోచేతి మీద పడడం. వాడికి చెబితే బస్సు అంతా ఫుల్లు సార్, ఎవరైనా మధ్యలో దిగితే అక్కడ కూర్చోవచ్చు అని ఒక ఉచిత సలహా. పైగా సరిగ్గా టి.వి. ముందే నా సీట్. ఎలాగో అలాగా నిద్ర పోదామంటే ఆ టి.వి. సౌండ్. అసలు ఆ రాత్రంతా నరకం కనపడిందనుకోండి. అప్పుడే నిశ్చయించుకున్నాను ఇంక జన్మలో వీటిల్లో ప్రయాణం చేయకూడదని.

  రిప్లయితొలగించండి
 3. ఆర్ టి సి కి సమాంతర రవాణా సదుపాయం కావాలి ప్రయాణీకులకు.కాని ఆ వ్యవస్థ ప్రజలకు మరింత ఇబ్బంది కరంగా ఉండకూడదు. ప్రస్తుతం ఈ ప్రైవేటు బస్సులతో జరుగుతున్నది అదే. ఈ ప్రైవేటు బస్సులకు ముక్కుతాడు వేసి అదుపులో పెట్టితే ఈ రెండు సమ్మంతర వ్యవస్థలు ప్రజా సేవలో పోటీ పడి మరింత మెరుగైన సేవలు అందించగలవు.
  -నేనుసైతం

  రిప్లయితొలగించండి
 4. మరి పండగ రోజుల్లో సిటీబస్సులని అంతర జిల్లా సర్వీసులుగా మార్చే ఆర్.టి.సీని ఏమనాలి? దొందూ దొందే...!

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు