22, ఆగస్టు 2007, బుధవారం

బీసీసీఐ నిర్వాకం

భారత్ లో క్రికెట్టు నియంత్రణ కోసం బీసీసీఐ ఉంది. కానీ..

బీసీసీఐ నియంత్రించేది క్రికెట్టును కాదు, దానిలో వచ్చిపడుతున్న డబ్బులను.
ఏ పోటీ ఐనా, ఎక్కడ జరిగినా మన జట్టంటూ పాల్గొంటే చాలు.. డబ్బులే డబ్బులు!
మనం ఓడినా, గెలిచినా మన జట్టు ఆడే మాచిల ప్రసార హక్కులు కోట్లు కురిపిస్తాయి.
- అంచేత జట్టును ఆడించడమే ముఖ్యం.. గెలుపు కాదు.
- అంచేత జట్టును ఎంపిక చేస్తే చాలు.. మంచి జట్టే కానక్కర్లేదు.
- అంచేత ఆటగాళ్ళంటూ ఉంటే చాలు.. మంచి ఆటగాళ్ళను తయారు చెయ్యాల్సిన పని లేదు.

బీసీసీఐ ఎక్కువగా తప్పుడు విషయాలకే వార్తల్లో ఉంటుంది. ఇవిగో ఇలాంటి వాటికి.
 • ఆటగాళ్ళ లోగోల గోల
 • ఆటగాళ్ళతో ఒప్పందాల పేచీ
 • ప్రసార హక్కుల గొడవ
 • ఎన్నికల రాజకీయాలు
 • ఐసీసీతో తగువులు
చాలా సులువుగా చెయ్యాల్సిన పనుల్ని కూడా కంపు చేస్తూ ఉంటారు వీళ్ళు, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు లాగా! మన జట్టుకు కోచిని నియమించడంలో బయటపడింది కదా వీళ్ళ తెలివితక్కువతనం. ఒక్కడు కాదు ముగ్గురి చేతుల్లో వెధవలయ్యారు. గతంలో వీళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషనుతో కూడా పేచీ పెట్టుకున్నారు. కామన్వెల్తు ఆటలకు క్రికెట్టు జట్టును మా ద్వారానే పంపాలని ఐ.ఓ.ఏ చెబితే, మీద్వారా ఎందుకు, మేమే నేరుగా పంపిస్తాం అని గొడవ పెట్టుకున్నారు. ఐసీసీతో కూడ గొడవ పడ్డారా మధ్య. (ఐసీసీ కూడా తక్కువదేమీ కాదనుకోండి.)

బీసీసీఐ నిర్వాహకులు భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లేడు గానీ ఇదివరకు జయవంత్ లెలే అని ఒకాయనుండే వాడు, కార్యదర్శిగా.. మనవాళ్ళు ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడి వస్తారని పత్రికల వాళ్ళకి చెప్పాడోసారి; తరవాత దాన్ని ఖండించాడు లెండి!

పైగా బీసీసీఐ పేరెత్తితే చాలు, రాజకీయాల గబ్బు. పోయిన దాల్మియా పతాకస్థాయికి తీసుకెళ్ళాడు దాన్ని. దాల్మియాలు, నాయర్లు, భింద్రాలు.. వీళ్ళకు రాజకీయాల తోటే సరిపోయేది. వీళ్ళు రాబందుల్లాగా తయారయ్యారనుకుంటే.. ఏకంగా గుంట నక్కలు, తోడేళ్ళే రంగంలోకి దిగిపొయ్యాయి, తరవాత. మాంసం వాసనను ఈ జంతువులెలా పసిగడతాయో, రాజకీయ జంతువులు డబ్బు వాసన్నలా పసిగడతాయి.

అసలు రాజకీయులు బీసీసీఐ లోకి దిగడం ఎప్పుడో మొదలైంది. ఎన్.కె.పి.సాల్వే అధ్యక్షుడిగా చేసాడిదివరలో. తరవాత్తరవాత మాధవ్‌రావ్ సిందియా, అరుణ్ జైట్లీ, శరద్ పవార్.. ఇలా అందరూ చేరి దాన్నో రొచ్చుగుంట చేసారు. లాలూ బీహారు సంఘంలో అడుగెట్టాడు, తరువాతి మజిలీ బీసీసీఐ య్యే! (ఇతర ఏ రంగం నుండైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు గానీ రాజకీయులు వేరే ఏ ఇతర రంగంలోకీ అడుగుపెట్టరాదని ఓ చట్టం చేస్తే బాగుండు. దివాలా తీసినవాడు ఇక ఎందుకూ పనికిరాడని తేల్చినట్టుగా నన్నమాట!)

ఒక్క బీసీసీఐ మాత్రమేనా.., దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ సంఘాలూ ఇట్టాగే ఏడుస్తున్నట్టున్నాయి. భారత క్రికెట్టు సామ్రాజ్యానికి బీసీసీఐ చక్రవర్తి, స్థానిక సంఘాలు సామంత రాజులూను. మన హైదరాబాదు సంఘం చూడండి.. రాజకీయాలకు నెలవది. శివలాల్ యాదవ్ తన కొడుక్కోసం తిరుపతి రాయుణ్ణి బలిపెట్టాడని చదివాం. ఆంధ్ర సంఘానికి ఈ మధ్య ఎన్నికలు జరిగితే బెజవాడ ఎంపీ దూరబోయాడు.. ఎలాగో బెడిసికొట్టింది. బెంగాల్లో ఓ సీపీఎమ్ నాయకుడూ ఓ పోలీసోడు పోటీ పడ్డారు అధ్యక్ష పదవి కోసం. అప్పుడు ఎవడికి మద్దతివ్వాలనే విషయమై ముఖ్యమంత్రికి చిక్కొచ్చిపడిందట! మన పేపర్ల దాకా వచ్చిందా విషయం.


ఇండియన్ క్రికెట్ లీగ్ - ఐసీయెల్ - భారత క్రికెట్లోకి మంచి మార్పులు తెస్తుందా?
తెస్తుంది. పోటీ వస్తుంది. బీసీసీఐ క్రికెట్ గురించి కూడా ఆలోచించేలా చేస్తుంది. పెద్దల అండలేని ఆటగాళ్ళ ప్రతిభా ప్రదర్శనకు వేదిక అవుతుంది. ఐసీయెల్ క్రికెట్టుకు సేవ చేసేందుకు వచ్చిందని నేననడం లేదు.. వాళ్ళకూ డబ్బు కావాలి. కానీ క్రికెట్టును పక్కనెట్టి రాజకీయాల్లో మునిగితేలరు, బీసీసీఐ లాగా.

ఐసీయెల్ లాగా మరి కొన్ని లీగులు రావాలి. అన్ని లీగుల్లోంచి ఉత్తమంగా ముందుకొచ్చేవారికి జాతీయ జట్టులో స్థానాలు కల్పించాలి. అదే బీసీసీఐకి తగిన మందు.

ఐసీయెల్ కు స్వాగతం! సుభాష్ చంద్రకు, కపిల్ దేవ్ కు శుభాకాంక్షలు.

తా.క: బీసీసీఐ వెబ్ సైటు చూస్తే, వాళ్ళకు క్రికెట్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకర్థం అవుతుంది. అసలు దాని వెబ్ అడ్రసేంటో చెప్పుకోండి చూద్దాం!

5 కామెంట్‌లు:

 1. మీరు పొద్దులో బాగా పొడుస్తున్నారని విన్నాను కానీ, ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఇలా చమక్ మనడం మాకు ఆనందం. మీ శైలిలో ఇక్కడ మాత్రమే రాసే విషయాలు కొన్ని ఉంటాయిగా.

  మంచి వ్యాసం. ఇంత దేశం ఉన్నా మన క్రికెట్ జట్టు పరిస్థితి ఇలా తయారయ్యిందంటే దానికి ప్రధమ కారణం బీసీసీఐ.

  రిప్లయితొలగించండి
 2. ఈ మధ్య మీరు రాయలేదో నేను చూడలేదో గానీ థీమ్ మార్చారే! బాగుందిప్పుడు.
  మొత్తానికి బీసీసీఐని బంటాట ఆడారు.
  ఈ కింది వాటిని రత్నాలనవచ్చు.
  "మాంసం వాసనను ఈ జంతువులెలా పసిగడతాయో, రాజకీయ జంతువులు డబ్బు వాసన్నలా పసిగడతాయి."
  "ఇతర ఏ రంగం నుండైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు గానీ రాజకీయులు వేరే ఏ ఇతర రంగంలోకీ అడుగుపెట్టరాదని ఓ చట్టం చేస్తే బాగుండు. దివాలా తీసినవాడు ఇక ఎందుకూ పనికిరాడని తేల్చినట్టుగా నన్నమాట!"

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 3. ఈ ఐ సీ ఎల్ వల్ల అయినా మహిళా క్రికెట్టు ఉద్ధరించబడితే అదే పదివేలు....
  బి సి సి ఐ లో ఈ వెధవ రాజకీయాల వల్ల,దేశం లో ఎంతో ఔత్సాహిక కురాళ్ళు వెలుగులోకి రాకుండా పోతున్నారు
  సరిగ్గా ఆడకున్నా కోట్లకు కోట్లు దండుకుంటున్న వాళ్ళకు ఇలాంటి ఐ సీ ఎల్ వల్ల వెన్నులో భయం పుట్టి,జాగ్రత్తగా ఆడితే చాలు

  రిప్లయితొలగించండి
 4. బాగా విశ్లేషించారు. టీం హైదరాబాద్ దాదాపుగా ఐ.సి.ఎల్ కి చేరుకుంది గదా చివరికి. బి.సి.సి.ఐ వెన్నులో ఇప్పుడు చలి మొదలయ్యింది. ఐ.సి.ఎల్ సఫలం కావాలనుకునేవాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి.

  రిప్లయితొలగించండి
 5. మీరు చెప్పినవి చాలా మటుకు నిజాలే. అయినా సరే ఎందుకో ఐసీఎల్ విజయం సాధిస్తుందని, మన గలుగుతుందని నాకు నమ్మకం లేదు.
  ఏమో కెర్రీ పాకర్ లా ఇది సరికొత్త సృష్టి చేస్తుందేమో మరి వేచి చూడాలి.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు