26, ఆగస్టు 2007, ఆదివారం

బాంబుల మధ్య మనం

హైదరాబాదులో మళ్ళీ బాంబులు పేలాయి. గుంపులుగా చేరిన ప్రజల మధ్య పేలాయి. 42 మందిని పొట్టన బెట్టుకున్నాయి. వారాంతపు సాయంత్రం సరదాగా గడిపేందుకు వెళ్ళిన అమాయకులు.. పాపం, మృత్యువును వెదుక్కుంటూ వెళ్ళినట్టైంది. ట్రాఫిక్కు సమస్య కారణంగా సమయానికి అంబులెన్సులు చేరుకోలేని పరిస్థితి. సమయానికి అవి చేరుకుని ఉంటే కనీసం ఒక్కరినైనా కాపాడగలిగే వారేనేమో! ప్చ్!

ఏ ప్రకృతి బీభత్సానికో ప్రజలు చనిపోతే శోకం, బాధ కలుగుతాయి, మనసుక్కష్టం కలుగుతుంది. కానీ ఇలాంటి దురాగతాలకు బలవుతుంటే ఆక్రోశం, క్రోధమూ కలుగుతాయి. మున్నెన్నడూ ఎరగని సంఘటనలేమీ కావివి. మనకెన్నడూ అనుభవం లోకి రానివేమీ కావీ ఘటనలు. ఇంతకు ముందు జరిగాయి, పైగా ఇలాంటివి ఇంకా జరగొచ్చని అనుమానాలూ ఉన్నాయి. అయినా ఎలా జరిగాయి?

ఎందుకిలా జరిగాయి? మే 18 నాటి మసీదు బాంబు పేలుడు నాటి నుండీ, మళ్ళీ అలాంటివి జరగొచ్చేమోనని పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం. నిఘా సంస్థలకు వీటిపై సమాచారముందట. అయినా ఎలా జరిగాయీ పేలుళ్ళు? ఎందుకు వీటిని ఆపలేకపోయారు? ఇంత పెద్ద నగరంలో బాంబులెక్కడున్నాయో కనిపెట్టడం గడ్డి వామిలో సూది కోసం వెతికినట్టే కావచ్చు! కానీ మసీదు బాంబు తరవాత, ఇంకా అలాంటివి జరగొచ్చని తెలిసింతరవాత కూడా ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదెందుకని? ఒక్క అనుమానితుడిని కూడా పట్టుకోలేక పోయారేఁ? ఆర్డీయెక్సులు, బాంబుల తయారీ స్థలాలూ, దాచిన స్థలాలూ ఎందుకు దొరకలేదు? అసలు చర్యలేం తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేసారు? 42 ప్రాణాలు బలయ్యాక.., ఇకనైనా చెబుతారా? మమ్మల్ని సంయమనంతో ఉండమని చెవటం కాదు, మా రక్షణ కోసం మీరేం చేసారో, ఏం చేస్తున్నారో చెప్పండి.

ఒక్కటి మాత్రం బలపడుతోంది.. పొద్దుట బయటికి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రాత్రికి క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది కేవలం మన అదృష్టం, అంతే.. వ్యవస్థ మనకు కల్పిస్తున్న రక్షణ వలన మాత్రం కాదు! ప్రభుత్వాలు, వాటి విధానాలు చేతకానివి కావడంతో మనం మూల్యం చెల్లిస్తున్నాం. వాళ్ళకు ఓట్లిచ్చాం, పాలించే హక్కిచ్చాం, చివరికిలా ప్రాణాలూ వాళ్ళ ఎదాన పోస్తున్నాం.

1 కామెంట్‌:

  1. రాస్త్రాన్ని కాపాడలేని వెదవ ఉంటే ఎంత,పోతే ఎంత.ఇంత దరిడ్రుణ్ణి ఇంత వరకు చూడలేదు,చీ దేశన్నినాశనం చేస్తున్నాడు.ధరలు పెంచాడు,ఉగ్రవాదాన్ని అబివృద్ది చేస్తున్నాడు,పీడలకు నిలువ
    నీడ లేకుండా చేస్తున్నాడు..వీడిని తిట్టడానికి తెలుగులో కొత్త పదాలు కనిపెట్టాలి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు