31, మార్చి 2007, శనివారం

మండలి, దాని ఎన్నికలు

మండలి ఎన్నికలు ముగిసాయి. పట్టభద్రుల, పంతుళ్ళ, శాసనసభ్యుల ఓట్ల లెక్కింపు అయింది. గెలవాలని నేను కోరుకున్న కె. నాగేశ్వర్ గెలిచాడు. మరి కొందరు మంచివాళ్ళు కూడా గెలిచారట.. చుక్కా రామయ్య, కె.ఎస్.లక్ష్మణరావు మొదలైనవారు. సంతోషం!

స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల లెక్కింపు ఇంకా చెయ్యాల్సి ఉంది. అది ఏప్రిల్ 25 లోపు అవగొడతారట. మిగతా వాటితోపాటే తేలిపోవాల్సిన వీటి లెక్కింపు ఓ నెల పాటు వాయిదా పడింది. కాంగ్రెసు వాళ్ళు ప్రవేశపెట్టిన బహిరంగ పోలింగే దీనికి కారణం. మామూలుగా తప్పుడు పనులను చాలా సమర్థవంతంగా చేస్తారు రాజకీయులు, ఈ పనిలో ఎందుకో తేడా జరిగింది! తప్పుడు పనులైనంత మాత్రాన చాటుమాటుగా చెయ్యాల్సిన పని లేదు, బహిరంగంగా చేసినా మనల్నడిగేవాళ్ళు లేరు అనే దిలాసా తనం అలవాటైంది ఈమధ్య రాజకీయులకి. అంచేతే ఇంత బహిరంగంగా బహిరంగ వోటింగు చేసి దొరికిపోయారు!

అసలీ మండలి వలన మనమేం బావుకుంటామనే ప్రశ్న ఎలాగూ ఉండనే ఉంది. దీనివలన వచ్చే మార్పులేమిటో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో శ్రీరమణ ఇలా రాసారు..

"యికపై ఉభయసభలు అనే మాట వినిపిస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి డిమాండ్‌ పెరుగుతుంది. తిరుమల దర్శనానికి కొత్త లెటర్‌హెడ్స్‌ మీద సిఫార్సు లేఖలు వెళతాయి. స్థానికంగా, నగరంలో వుండే అధికారులు పెద్దల్ని కూడా తట్టుకోవలసి వుంటుంది. స్టూడెంట్‌ కుర్రాళ్లు వచ్చే సిలబస్‌ నుంచి కొత్త పాఠాలు చచ్చినట్లు చదవాల్సి వుంటుంది."

శ్రీరమణ మరో విషయం కూడా రాసారు.. ఎన్టీయార్ మండలిని రద్దు చేసాక, ఈ రెండు దశాబ్దాలలోనూ 'ఏ వొక్క సమయంలోనూ "అయ్యో శాసనమండలి వుండి వుంటే యీ విపత్తు వచ్చేది కాదు కదా'' అనుకునే సదవకాశం తెలుగు ప్రజలకు రాలేదు.'

దీనికి భిన్నంగా.. ఆహా, మండలి ఉండబట్టే కదా ఈ పని జరిగింది అని మనం అనుకునేలా పని చెయ్యగలరా కొత్తగా ఎన్నికైన నాగేశ్వర్ వంటి వారు???

2 కామెంట్‌లు:

  1. నాకో విషయం అర్థం కావడంలేదు

    బహిరంగ ఓటు వేయుట వల్ల నష్టమేమిటి?

    ఎలాగూ ఏ పార్టీ వారు ఆ పార్టీకే కదా వేసి తగలడేది? ఇదేమన్నా ఆంతరాత్మ ప్రభోధానుసరము జరిగే ఎన్నికలా?

    రిప్లయితొలగించండి
  2. ఆంతరాత్మ ప్రభోధానుసరము ఓటు వెస్తే ఇంకా ఎమన్నావుందా? క్రాస్ఓటింగికి పాల్పడ్డావంటూ సొంత పార్టివారే కొరతెయ్యరు?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు