2, ఏప్రిల్ 2007, సోమవారం

చాప కింద నీరు

గత ఆదివారం ఆంధ్ర జ్యోతిలో మత మార్పిడి వార్త వచ్చింది. మతప్రచారంలో భాగంగా ఈ క్రైస్తవ మిషనరీలు ఎలా పని చేస్తున్నాయో చదివి ఆశ్చర్యపోయాను. గిరిజనుల పేదరికాన్ని, అమాయకత్వాన్ని, చదువులేనితనాన్ని ఆసరాగా చేసుకుని నాగరికులమని చెప్పుకున్నవారు వారి శ్రమను దోచుకోవడం చిరకాలంగా జరుగుతున్నదే. కానీ సేవలో మత విశ్వాసాలను చొప్పించి, గిరిజన సమాజాన్ని ఛిన్నాభిన్నం చెయ్యబూనడం క్రైస్తవ మిషనరీలకే చెల్లింది.


క్రైస్తవ మిషనరీల ప్రజాసేవ స్వార్థపూరితమైనదనే విమర్శ ముందునుండీ ఉంది. చదువు చెబుతున్నామని, వైద్యం చేస్తున్నామని సేవల ముసుగేసుకుని మత ప్రచారాలు జరుపుతారు. రగ్గులిచ్చి, దుప్పట్లిచ్చి మత మార్పిడులు నిర్వహించిన చరిత్ర వారికుంది. సేవాసంస్థల ముసుగులో కోట్లాది రూపాయల డబ్బులు బయటి దేశాల నుండి పొందవచ్చనే దుర్బుద్ధితో మతం మార్చుకున్నవారున్నారు. అలా లబ్ది పొంది కోటీశ్వరులు అయినవారు, ఆనక రాజకీయాల్లోకి ప్రవేశించిన వారినీ మనమెరుగుదుము.

క్రైస్తవ స్వస్థత కూటములు జరుగుతూ ఉంటాయి, గమనించే ఉంటారు. (ఈ మధ్య ఇవి విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వాటిని గమనించకుండా ఉండడం కష్టమే!) ఈ కూటముల పేరుతో గిరిజనులను సాంస్కృతికంగా దోచుకుంటున్న విషయం రాసారీ ఆంధ్రజ్యోతి వ్యాసంలో. అది చదివితే విస్తుపోతాం, ఈ మిషనరీల సృజనాత్మకతకు. గిరిజనుల కట్టూ, బొట్టూ, ఆహారపు టలవాట్లను కూడా మార్చారట. వీరి కారణంగా గిరిజనుల మధ్య అంతర్గత కలహాలు కూడా వచ్చాయట.

తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రిలో క్రైస్తవ ప్రచారకులు రోగుల చేత ప్రార్థనలు చేయించిన విషయం మనకు తెలిసిందే. హిందువుల పుణ్యక్షేత్రాలైన తిరుమల, సింహాచలం వంటి వాటిని కూడా వదిలిపెట్ట లేదు. ఈ రెండు చోట్లా క్రైస్తవ మత ప్రచారాలు చేస్తున్న వారిని ప్రజలే పట్టుకుని దేహశుద్ధి చేసారు కూడాను. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ మీద కూడా ప్రస్తుతం ఒక దుమారం రేగుతోంది ఇలాంటి విషయమ్మీదే!

మత మార్పిడుల రగడ ఎక్కువైపోయిందీ మధ్య. సాక్షాత్తూ పోపు కూడా మతమార్పిడులను అడ్డుకోరాదని మనకో ఉచితసలహా పారేసిన విషయం మనకు తెలుసు. ఇతర మతస్తుల వద్ద తమ మతాన్ని ప్రచారం చేసుకోవడంపై వీరికింత యావ ఎందుకు? హిందువులను గబగబా మతం మార్చెయ్యాలని ఎందుకో వీరికీ తహతహ?

ఈ మత ప్రచారాన్నీ మత మార్పిడులను ఆపాలి. వీటిని నిషేధిస్తూ చట్టం చెయ్యాల్సిన సమయం వచ్చింది.

8 కామెంట్‌లు:

 1. మతం ఎందుకు మారుస్తారు అంటే...దాన్నే తెలుగులో దూల అంటారు. క్రైస్తవం స్వీకరించని వారికి నరకంలో శాశ్వత నివాసం అని వారి ప్రగాఢ నమ్మకం. దాని కోసం ఈ ప్రపంచాన్ని ఏసుప్రభువు రక్తంతో తడిపి...మానవాళి నంతా క్రైస్తవానికి మార్చి....సైతానును నరకంలో ఒంటరి చెయ్యలని వారి ఆత్రం.
  ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే...వారి నమ్మకం వారిదే కానీ, ఎదుటోళ్ళ నమ్మకానికి గౌరవం ఇవ్వాల్సిన పని లేదా? తాయిలాలిచ్చి మతం మార్పిడి చెయ్యడం నాకు ఇప్పటికీ వింతగా తోస్తుంది. ఇంకో విషయం తెలుసా? ప్రతి నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 47 బైబిళ్లు అమ్మడంగానీ పంపిణీ చేయడంగానీ జరుగుతోందట.

  రిప్లయితొలగించండి
 2. యూదులు క్రైస్తవంలోకి, క్రైస్తవులు ఇస్లాంలోకి మారితే అప్‌గ్రేడ్ చేసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు. సమయానుకూలంగా పరిణితి చెందే హైందవం నుండి క్రైస్తవానికి మారటం విండోస్ విస్టా నుండి విండోస్ 3.1కి మారటమే. కొందరికి అదో ఆనందం. యూదు మతం, క్రైస్తవం, ఇస్లాం పరిణితికి అవకాశం లేని స్థిరమైన మతాలు. వీటి పద్ధతులు సమయ సునిశితమైనవి. కేవలం కొన్ని ప్రాంతాలలోని కొన్ని తెగలకు కేవలం ఆయా సమయాల్లో ఉద్దేశించబడినవి. మరి హిందువులు మార్పిళ్లు చేయలేదంటారా..చేశారు..కానీ వెయ్యేళ్ల క్రితపు పాత ప్రపంచములో..ఈ వెయ్యేళ్లలో ఎంతో పరిణితి చెందింది.
  ఓ మతమార్పిడి దారులూ 21శతాబ్దం వచ్చేసిందండీ.

  రిప్లయితొలగించండి
 3. రవిగారి వ్యాఖ్య చూసి చెబుదామనిపించింది - హిందూ"మతం" అంటూ ప్రత్యేకంగా ఎవరూ నిబంధనలు, మార్గదర్శకాలు చేయలేదనుకొంటాను. ఉత్తరాది నుండి ఉపనిషత్తులు, వేదాలు, రామాయణ, భారతాలు దక్షిణాదికి వ్యాపించి మనందరినీ ఒక గొడుగుకిందికి చేర్చాయి అని చదివాను. ఈ గ్రంధాలలోని మార్గదర్శకాల ఆధారంగా ఇక్కడి మన ప్రాంతాలవారీగా సమాజానికి సమిష్టిగా మేలుచేకూర్చే జీవనవిధానం హిందూ"ధర్మం" అయింది. అదికూడా "హిందూధర్మం" అనే పేరుతో ఎక్కడా స్థిరీకరింపబడలేదు. మన శాస్త్రాలన్నింటికీ సమయానుకూలంగా అమెండుమెంట్లు చేసుకున్న సందర్భాలు బహుమెండు. కాబట్టి ఇది హిందూ"ధర్మం". ఇది ఒక "లైఫ్‌స్టైల్" అని నేనంటే ఔనంటారా? బహుశా అందుకే మనకు అంత పరమతసహనం. ఎవ్వరినీ అంత సులభంగా పరయివాళ్లను చేసెయ్యం.

  రిప్లయితొలగించండి
 4. చాలా చక్కగా చెప్పావ్ రామ్. హిందూ మతమంటూ ఏమీ లేదు అని నా అభిప్రాయం కూడ.హిందువులు అని ఎందుకు పిలవబడ్డారో నేను ఒక టపాలో ముందర రాసాను, Indus valley లో నివసించిన వారిని నాగరికతా అధారంగా ఒకే గాటన కట్టి పార్శీలు నోరు తిరక్క పెట్టిన పేరు హిందువులు.అది కాలక్రమేణా మతంగా రూపు దాల్చింది. ప్రపంచంలోనే ఒకానొక అత్యున్నత నాగరికతా ప్రమాణాలకు హిందూ నాగరికత పెట్తింది పేరు.

  అందువలనే హిందువులు మరీ పెద్దగా మతాన్ని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్లినా హిందూ హోటల్లు, హిందూ కొబ్బరి బోండాం అమ్మేవాడు,హిందూ క్శురకుడు ఇలా అని వెతకరు.

  నేనైతె కేవలం తమ మతస్థులతోనే ఫూస్ బాల్ ఆడే జనాలను కూడా చూసాను. నా ఖర్మ :-(

  రిప్లయితొలగించండి
 5. నిజమే హిందువులలో చాలా మందికి పెద్దగా మత పట్టింపులు వుండవు.స్నేహితుల కూడా చర్చ్ కి వెలతాము,మసీదుకీ వెళతాము.క్రిష్టియన్స్,ముస్లింస్ "చాలా మంది" మనం ఏమి పెట్టినా ప్రసాదమా అని కనుక్కుని కాకపోతేనే తింటారు.ఇందులో గమనించదగినదమేమటే నిజమయిన క్రీష్టియన్స్,ముస్లింస్ ఇలాంటివి పట్టించుకోరు.వాళ్ళు మనలానే మన ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మరీ తింటారు.మధ్యలో మతం మారి మిధ్యా లోకాల్లో జీవించేవారే ఇలా తల తిక్కగా ప్రవర్తిస్తారు.

  రిప్లయితొలగించండి
 6. ప్రసాదమా కాదా అని అడిగి అది ప్రసాదమయితే తినకపోతే ఖచ్చితంగా ప్రసాదం పవిత్రతని వాళ్ళూ అంగీకరిస్తున్నట్లే! కాదంటే దాన్ని కేవలం తిను పదార్తంగా చూడాలి కదా! ఇంకా మతం మారాక బొట్టు పెట్టకపోవడం కూడా ఒక వింత! నాకైతే బొట్టు ఒక ఆచారం అంతే మనలని మనం గుర్తించుకోవడానికి. అది పెట్టినా తీసినా తేడా ఏమీ లేదు కానీ మతం మారాక దాన్ని తీసివేయడంలో అర్థం లేదు. వీళ్ళే మళ్ళీ చీరలు మాత్రం కడతారు.
  మనం మతం మారగలం, బొట్టు మానగలం కానీ భారతీయులుగా పట్టిచ్చే వంటి రంగును మార్చుకోలేం కదా! ఇంకెందుకు ఈ పైపై వేషాలు మార్చడం?


  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 7. మతం మారటాన్ని అసలు ఎవరూ ప్రశ్నించలేరు. ఆ మాటకొస్తే అందరికీ ఆ హక్కు వున్నది, కాక పోతే మతాన్నే శ్వాసగా జీవిస్తేనే వొళ్లు మండేది. జేబులో ఎప్పుడూ ఒక బైబలు పెట్టుకుని తిరగటం, సినిమాలు చూడటం మానెయ్యటం, నోరు తిరగని తెలుగు హటాత్తుగా మాట్లాతుండటం ఇవన్నీ నాకు నచ్చవు. అసలు పుట్టటమే ఆ మతంలో పుట్టిన వారు ఎంతో హుందాగా వుంటారు. మా పాత కంపెనీ(ముంబయి)లో అయితే దీపావళికి మా MD ఫ్రేజర్ కాసిలినో భార్యా సమేతంగా పూజను నిర్వహించేవాడు. UK నుంచి వచ్చిన ఆర్కిటెక్టు ఒకతను పూజారిని హారతి ఎలా ఇవ్వాలో "కుడి మోచేతి క్రింద ఎడమ చేతిని పెట్టి సవ్య దిశలో హారతిని తిప్పిన క్షణం" ఇప్పటికీ నాకు గుర్తుంది. అందువలన మతం మనలో మౌఢ్యం తగ్గించాలే కానీ…మతమే మౌఢ్యంగా మారకూడదు.

  ఈ మధ్య డేవిడ్ రాజు అనే క్రైస్తవ మిషనరీ అతను ఒక టీవీ ఇంటర్వూలో ఇలా అన్నాడు…"జీసస్ ని అనుసరించాలంటే హిందువుగా చచ్చిపోనక్కరలేదు…నేను కూడా హిందువునే" అని. ఇది చాలా నిజం. ఎందుకంటే…క్రైస్తవం ఒక మతం…హైందవం ఒక సంస్కృతి. బొట్టు, చీర అందులోని భాగమే.


  తస్లీమా నస్రీన్ కూడా చీర కడతారు…కొన్ని సార్లు బొట్టు కూడా పెడతారు. మతాన్ని , సంస్కృతిని వేరు వేరుగా చూడాలంటే కొంత ఉన్నత వ్యక్తిత్వం కావాలి. ఇప్పుడు కొన్ని పార్టీలు దానిని మంటగలపి హైందవ సంస్కృతిని ఎలాగో నిర్వచించేస్తున్నాయి. వారు దానికి ప్రతినిధులుగా తయారయ్యే ప్రమాదం అతి తొందరలోనే వుంది.

  రిప్లయితొలగించండి
 8. ఆంధ్రజ్యోతి 'మతమార్పిడి'వార్తకు
  ఈనాడు'తితిదే'వార్త జవాబు;-)
  http://www.eenadu.net/story.asp?qry1=3&reccount=24

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు