30, మార్చి 2007, శుక్రవారం

టైగరు, పేపరు టైగరూ

తెరాస విశ్వరూప ప్రదర్శన సభను ఏర్పాటు చెయ్యబోతోంది. అయితే ఆ సభకంటే నెల ముందే నరేంద్రకు కేసీయార్ విశ్వరూప సందర్శన యోగం కలిగింది. నరేంద్ర కేసీయారును అన్యాపదేశంగా విమర్శించినందుకు ఫలితమది. సరిగ్గా కృష్ణుడి విశ్వరూపాన్ని తట్టుకోలేకపోయిన అర్జునుడి లాగానే నరేంద్ర కూడా కేసీయార్ విశ్వరూపాన్ని తట్టుకోలేక బేజారై పోయాడు. అనేక బాహువులు, ముఖాలు, కళ్ళూ.., ముఖ్యంగా ముక్కు వగైరాలతో భయం గొలుపుతున్న కేసీయార్ విశ్వరూపాన్ని చూసి తట్టుకోలేక "ప్రభో కేసీయార్, నన్ను మన్నించు" అంటూ లొంగిపోయాడు.

అంతకు ముందో తమాషా జరిగిందట! విశ్వరూప సందర్శనకు కొన్ని గంటల ముందు నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఉండగా నరేంద్ర అనుచర గణం "టైగర్ నరేంద్రా, సంఘర్ష్ కరో, హమ్ తుమ్హారే సాత్ హై" అంటూ హిందీలో నినాదాలు చేసారు. పైగా కేసీయార్ డౌన్ డౌన్ అని ఇంగ్లీషులో కూడా అన్నారట. అప్పటికే తెరాస నాయకులు కొందరు నరేంద్రను కలిసి ఆయనపై కేసీయార్ కు కలిగిన అనుగ్రహం గురించి, విశ్వరూప ప్రదర్శన చెయ్యాలన్న ఆయన అభిమతం గురించి నరేంద్రకు చెప్పి ఉన్నారు. ఓపక్క ఆ దెబ్బకే బేజారై ఉన్న నరేంద్రకు తన అనుచరులు నినదించిన సంఘర్ష్ కరో అనే మాటలు ఈటెలై, తూటాలై గుచ్చుకుని ఉండాలి. పాపం కష్టపడి వాళ్ళను శాంతింపజేసాడట. అనుచరులు నాయకుడి మనసెరిగి ప్రవర్తించాలి గదా అని నరేంద్రపై మనసులోనే జాలిపడ్డారట విలేకరుల్లో కొందరు. అనుచరుడు నాయకుడి మనసెరిగి ప్రవర్తించాలి గదా అని అనుకున్నారట మరి కొందరు.

విశ్వరూపాన్ని దర్శించిన తరువాత 'టైగర్' నరేంద్ర పత్రికల వాళ్ళతో మాట్లాడుతూ మామధ్య గొడవలేమీ లేవు, అదంతా మీ సృష్టే అని అన్నాడట. పైగా 'ఇంత అన్యాయమైన మీడియా మరొకచోట లేదు' అని కూడా అన్నాడట.

ఓ అంకం ముగిసింది. ఈ అంకం వరకు మాత్రం కేసీయార్ టైగరు తానేనని ప్రకటించి, నరేంద్రకు పేపరిచ్చి పంపించాడు. రాబోయే అంకాలు ఆసక్తికరంగా ఉండొచ్చు.

2 కామెంట్‌లు:

 1. ఇది చాలా సార్లు వినే వుంటారు అయినా మళ్లీ చెప్తున్నా

  ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలుక వైపు ఎర్రగా చూసిందంట...అలా వుంది.

  అయినా ఇప్పుడు కాగితపు పులులకు కొదవేది.

  పధ్నాలుగు పులులు వెస్టిండీస్ నుంచి మొన్ననే దొడ్డి దారిన దిగాయి. ఇది పదిహేనో పులి అంతే

  రిప్లయితొలగించండి
 2. ఆంధ్రావాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా TRS ఒక శాశ్వత రాజకీయ శక్తిగా నిలిచి తీఱుతుంది. అయితే అందులో KCR ఆయన కొడుకూ మేనల్లుడూ తప్ప ఇంకెవరూ మిగలరనేది వేరే విషయం.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు