5, జులై 2006, బుధవారం

విజేతలూ, విజితా!

నిజానికి స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం సాధించిన సీట్లు పెద్ద చెప్పుకోదగ్గవి కావు. కాంగ్రెసు వాళ్ళు అంటున్నట్లుగా.. సంబరాలు చేసుకునేటంత గొప్ప ఫలితాలేమీ తెదేపాకు రాలేదు. కానీ సీట్లకు మించి, నైతిక స్థైర్యాన్ని దేశం సాధించింది. ఆత్మ విశ్వాసాన్ని తిరిగి పొందింది. అయితే దీనికోసం ప్రత్యేకించి ఆ పార్టీ ఏమీ చెయ్యలేదు. ఒక రకంగా ప్రజలే ఆ పార్టీని తట్టి లేపారు. కాంగ్రెసుకిది కలవరపాటు కలిగించేదే! ప్రాప్తకాలజ్ఞత ఉన్న కాంగ్రెసువారెవరైనా ఒకసారి పరిస్థితిని సమీక్షించవలసిన తరుణమిది.

కాంగ్రెసు చేసిన తప్పేంటి? స్వాతిశయము, అతివిశ్వాసం వలన కాంగ్రెసు దెబ్బతిందని కొందరన్నారు. కాని అది వాస్తవం కాకపోవచ్చేమో! తన బలాన్ని ఎక్కువ చేసి, ఎదరి బలాన్ని తూలనాడటం అనేది యుద్ధనీతి. అందులో తప్పులేదు. నిజానికి కాంగ్రెసు, ఓ లక్ష్యాన్ని జయప్రదంగా సాధించింది. తెదేపాను ఓడించడం బయటి లక్ష్యం కాగా, తెరాసను బలహీనపరచడం అనేది కాంగ్రెసు నాయకుడి సమాంతర లక్ష్యం. బహుశ అది ఊహించినదానికంటే బాగానే నెరవేరింది. ఎటొచ్చీ తెదే లాభపడింది. అయితే 65% స్థానాలు సాధించి కాంగ్రెసు పైచేయిగానే ఉంది.

చులాగ్గా కాంగ్రెసు కక్ష్య నుండి బయటపడి తెదేతో చెయ్యి కలిపిన సీపీఎం లాభపడినట్లే ఉంది. రాఘవులు గారి పొత్తులు చూస్తుంటే వాలెన్స్ ఎలెక్ట్రాన్లు గుర్తుకొస్తున్నాయి. ఏదేమైనా కొత్త స్నేహం ఎన్నాళ్ళు సాగుతుందో!? ఈ స్నేహం ప్రస్తుతానికే.. ముందు ముందు ఏమవుతుందో చెప్పలేమని ఇవ్వాళ చెప్పనే చెప్పారాయన!

సీపీఐ.. కాంగ్రెసుతో పొత్తుతో వీళ్ళూ లాభపడినట్లే! నల్గొండ జిల్లా పరిషత్తు తమకివ్వమని అడుగుతారట. సీపీఎంతోటీ, తెరాసతోటీ సంబంధాలు చెడిన నేపథ్యంలో కాంగ్రెసు వీరిని సంతోషపెట్టేందుకు గాను సరేననవచ్చేమో!

తెరాస -ఈ ఎన్నికల్లో అందరూ విజేతలే. ఒక్క తెరాస మాత్రమే విజిత. మేము అధర్మ విజితులమంటున్నారు వారు, ఓటమిపై భలే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని చూద్దాం..
 1. ఎబ్బే.. మేమసలు ఈ ఎన్నికల్ని పట్టించుకోనే లేదు. అందుకే మా నాయకులు కనీసం ప్రచారం కూడా చెయ్యలేదు. ఇవెట్లా పోయినా మాకేం కాదు. మా లక్ష్యమల్లా తెలంగాణే! (అలాంటపుడు అసలు పోటీ చెయ్యడం ఎందుకో!)
 2. మేడమ్మీద మాకు విశ్వాసం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెసుతో చెయ్యి కలిపి మిత్రధర్మాన్ని పాటిస్తే తెలంగాణా ఇస్తుందని మా ఆశ. అందుకే మాకు తక్కువ సీట్లిచ్చినా మాట్లాడకుండా ఊరుకున్నాం. (ఇలా మాట్లాడితేనే చిరాకొచ్చి ప్రజలీ తీర్పునిచ్చారు!)
 3. మాకు ఇచ్చిన కాసిని సీట్లలో కూడా కాంగ్రెసు తిరుగుబాటుదారులు పోటీ చేసి మాకు వెన్నుపోటు పొడిచారు. అందుకే ఓడిపోయాం. (మరి అసలు పొత్తనేదే లేకుండా ఐదేళ్ళ కిందటి ఎన్నికల్లో 80 పైచిలుకు స్థానాలు గెలిచారు కదా, మరిప్పుడు 30 కూడా గెలవలేక పోయారెందుకో!)
 4. పై మూడిటినీ మించినది నరేంద్ర ఉవాచ.. తెదే బలం పుంజుకోవడం తెలంగాణ సాధన లక్ష్యానికి మంచిదేనట. తెదే బలపడుతోందనే బూచి చూపి సోనియాను బెదరగొట్టి తెలంగాణా సాధిస్తారట!
ఇక బీజేపీ -ఎన్నికలలో ఎంత దారుణమైన ఫలితం వచ్చినా ఏమాత్రం నష్టపోని పార్టీ ఇది. ఈసారి తెలంగాణా నినాదం పనిచెయ్యలేదు.. ఇకపై ఏంచేస్తారో చూడాలి.

1 కామెంట్‌:

 1. అసలు తె దే పా సంతోషానికి కారణం మరొకటి ఉన్నది:

  కాంగీ వారు చాలా చాలా చాలా రకాలుగా ప్రయత్నించినారు

  అయినా కేవలం ౬౪%!!! మాత్రమే

  అదే ఎన్నికలు నిజాయితీగా జరిగి ఉంటే!


  అంతే నండి

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు