18, జులై 2006, మంగళవారం

ఏమిటీ తెలివితక్కువతనం!

కేంద్ర ప్రభుత్వం బ్లాగ్‌స్పాటులోని 22 వెబ్‌సైట్లనో, 22 పేజీల వెబ్‌సైట్ల జాబితానో నిరోధించిందట! అయ్యెస్పీలేమో మొత్తం బ్లాగ్‌స్పాటుకే స్పాటు పెట్టారు.

అయినా ఇదేం చపలత్వం. ఆ సైట్లలో ఉన్న సమాచారం జనానికి చేరకూడదనుకుంటే ఇదా దానికి మార్గం? ఇప్పుడు ఆ వెబ్‌సైట్లేంటొ వెతుక్కుని మరీ చూస్తాం కదా! వాటికి లేనిపోని ప్రచారం కల్పించినట్లే కదా! ఇప్పుడేమయింది? ప్రపంచంలో మనం తప్ప అందరూ ఆ సైట్లను చూస్తారు. ఆ తప్పుడురాతలను (ఒకవేళ అవి తప్పుడు రాతలైతే) చదువుతారు. చదివి ఓహో అలాగా అనుకుంటారు. మనం చదివితే వాటిని సమర్ధవంతంగా ఖండించవచ్చు. చదివే అవకాశమే లేకుండా చేస్తిరి! మరి ఆ రాతలను ఖండించేదెవరు? మనం చదవకపోతే మనకే కదా నష్టం.

ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ అణాకాణీ వెధవా మనకు సలహాలు ఇవ్వడం మొదలెడతాడు... "భారత్‌లో ఆలోచించే హక్కు లేదు, మాట్లాడే హక్కూ, రాసే హక్కూ లేవు, మెదళ్ళకు తాళాలేస్తున్నారు" అంటూ. మనల్ని మనం ఎన్నైనా తిట్టుకోవచ్చు, పైవాడికి ఆ అవకాశమిస్తే ఎట్లా?

(నాకో అనుమానం.. అధిష్ఠాన దేవుళ్ళు, దేవతల గురించి నిజాలు రాసిన సైట్లు గానీ కావుగదా ఇవి!)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు