28, అక్టోబర్ 2011, శుక్రవారం

ఇభరాముడు, మల్కిభరాము

నమస్తే తెలంగాణ పత్రికలో ప్రాణహిత అనే శీర్షికలో అల్లం నారాయణ గారు ఇలా రాసారు:

"ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్‌షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ప్రోత్సహించినారన్న విషయమూ తెలియదు. సురవరం ప్రతాప్‌డ్డి అన్నట్టు ‘మనమూ చరివూతకు ఎక్కదగినవారమే’ అనీ తెలియదు. ఎందువల్ల. మనం చరివూతకు ఎక్కలేదు కను క."

తెలంగాణ చరిత్ర ను ప్రజలకు తెలియకుండా కుట్ర చేసారు అనే ఆరోపణ పాతదే. ఆ ఆరోపణను తీసుకుని ఒక వ్యాసం రాసారాయన. ఆ పత్రికకు సంపాదకుడూ ఆయనే. ఇంతకీ నేను దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆయన చెప్పినట్టు ఈ సంగతిని దాచిపెట్టలేదు కాబట్టి, ఈ ముక్క నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదూకున్నాను కాబట్టీను. ఇప్పుడు ఆ సంగతులన్నీ పూర్తిగా గుర్తులేవు కానీ.. ’ఇబ్రహీమ్ కుతుబ్ షాను మల్కిభరాము అని అనేవారు’ అనే సంగతి మాత్రం గుర్తుంది. ఇభరాముడు అని ఈయన అన్న పేరును ఆ పుస్తకంలో మల్కిభరాము అని రాసారు. రెండూ ఒకటే అని నా ఉద్దేశం.

ఆ మల్కిభరాము అనే పేరు చదివినప్పుడు అసలిది ఏం పేరు? హిందూ పేరా, ముస్లిము పేరా, మల్కిభరామ్ అనో మల్కిభరాముడు అనో కాకుండా ఇలా పిలిచారేంటి? ఇలాంటి సందేహాలు కలిగినట్టు గుర్తు. దాన్ని ’మల్కి భరాము’ అనాలా ’మల్కిభ రాము’ అనాలా అనే సందేహం కూడా కలిగినట్టు గుర్తు.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే.. తెలంగాణ చరిత్ర ను వెలుగులోకి రాకుండా దాచిపెట్టేసారు అని చెప్పే క్రమంలో ఇలాంటి ఉదాహరణలు ఇస్తూంటారు. ఎవరో మామూలు సత్రకాయలు, ప్రొఫెసర్ వక్రవాణి లాంటి వాళ్ళు చెబితే.. సర్లే అబద్ధాలు చెప్పేస్తున్నార్లే, వీళ్లకిది అలవాటేగా అని అర్థం చేసుకోవచ్చు. కానీ అల్లం నారాయణ కూడా ముందూ ఎనకా చూసుకోకుండా ఇలాంటి రాతలు రాసేస్తే ఎలా?
---------------------------
వ్యాఖ్యాత DG గారు తన వ్యాఖ్యలో ఇలా రాసారు.

ఆయనకి తెలీదేవో... ఈ కింద పద్యం ఎప్పట్నుంచో తెలుగొచ్చిన వాళ్ళందర్కీ తెలుసు. మల్కిభరాముడు ఇచ్చిన సమస్యా పూరణం...
ఆకుంటే, ఈకుంటే, మాకుంటే, మీకుంటే అని సమస్య.

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే హీనుడగును హీనాత్ముండౌ
మీకుంటే మాకియ్యుడు
మాకుంటే మేము రాము మల్కిభరామా

15 కామెంట్‌లు:

  1. ఆయనకి తెలీదేవో... ఈ కింద పద్యం ఎప్పట్నుంచో తెలుగొచ్చిన వాళ్ళందర్కీ తెలుసు. మల్కిభరాముడు ఇచ్చిన సమస్యా పూరణం...

    ఆకుంటే, ఈకుంటే, మాకుంటే, మీకుంటే అని సమస్య.

    ఆకుంటే వృక్షంబగు
    ఈకుంటే హీనుడగు హీనాత్ముండౌ
    మీకుంటే మాకియ్యుడు
    మాకుంటే మేము రాము మల్కిభరామా

    రిప్లయితొలగించండి
  2. మాలిక్ ఇబ్రహీం కాస్తా తెలుగు వారి అభిమానంతో మల్కిభరాముడు అయ్యాడని ప్రతీతి.

    "కందుకూరి జనార్దనా" మకుటంతో శతకం రచించిన కందుకూరి రుద్రకవి ఇతని ఆస్థానంలోనే ఉండేవాడని చెబుతారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆ కవి ప్రస్తుతించిన జనార్దన స్వామి కోవెల ఇప్పటికీ ఉంది. ఈబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగు సహిత్యం పట్ల చాలా మక్కువకలవాడనే కారణం వల్ల తెలుగు కవులు, తెలుగు ప్రజలు అతడిని "ఇభరాముడని" కీర్తించారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో కందుకూరి రుద్రకవితో పాటుగా అద్దంకి గంగాధరుడు, శింగరాచార్యుడు అనే కవులు కూడా ఉన్నారని చెబుతారు. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం నవాబు ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గరలో ఉన్న "చింతలపాలెం" అనే గ్రామాన్ని బహుమతిగా ఇచ్చాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. (మరి అప్పుడు తెలంగాణా లేనట్లే కదా అని చెప్పకండి. తెలుగు వారిని మొత్తంగా గోల్కొండ నవాబులు ఏలారని అస్సలు చెప్పకండి. మీరేం జేసినా, మా తెలంగాణా కి అన్యాయం జరిగింది, మా తెలంగానా మాగ్గావాలె! మల్ల మాట్లాడితె, ఆ దినాలల్ల గూడ మీ ఆంద్రోల్లు మా తెలంగానా కవులను రానీయలేరని చెబుతం. కందుకూరు నుంచీ వచ్చిన రుద్రకవి, అద్దంకి నుంచీ వచ్చిన గంగాధరుడు ప్రకాశం జిల్లా వాల్లు అంటే ఆ కవులు ఆంద్రోల్లన్నట్లె గద మరి!! గోల్కొండ నవాబుల తాన సుత మా కవులని తక్కువ జేశిన్రని చెప్తున్నం...)

    గోల్కొండ నవాబులు మన అందరికీ తెలిసిన వారే - మరి చరిత్ర సదరు అల్లం నారాయణ గారు చదువుకోలేదేమో !

    రిప్లయితొలగించండి
  3. మల్కిభరాము అనే పేరు మాలిక్ ఇభరాము అనే రెండు పదాల కలయిక. రాజైన ఇభరాము (ఇబ్రహీం కు తెలుగు వెర్షన్). ఈ మల్కిభరాము పేరు అల్లం వారు వినకపోయి ఉంటే ఆ తప్పు పాతతరం తెలుగు సాహిత్యకారులదీ కాదు, ఇభరామునిదీ కాదు.

    రిప్లయితొలగించండి
  4. మల్కిభరాం ఇచ్చిన సమస్యగా చెప్పబడే ఆ పద్యం నేనూ విన్నానండీ. అయినా మీ పిచ్చి కాకపోతే అల్లం వారు మల్కిభరాముని కన్నా కల్వకుంట్ల తారకరామునికే ఎక్కువ విలువ ఇస్తారుగా

    రిప్లయితొలగించండి
  5. అల్లం నారాయణ ఎవరింతకీ? (మళ్లీ ఈయనెవరో తెలీదన్నానని తెలంగాణ చరిత్రని తొక్కేస్తున్నామంటాడేమో, లేనిపోని గోల). ఆయన రాసింది చూస్తే అర్ధమయిందేమయ్యా అంటే, తెలంగాణ చరిత్ర గురించి అక్కడోళ్లకంటే తక్కినోళ్లకే ఎక్కువ తెలుసని. లేకపోతే మల్కిభరాముడిని ఈయన కొత్తగా కనుక్కోటమేంటి. ఈ మాత్రం తెలియని వ్యక్తి ఓ పత్రిక్కి సంపాదకుడా!!

    రిప్లయితొలగించండి
  6. అబ్రకదబ్ర గారు మీరు అయిపోయారు :)) అల్లం నారాయణ గారు నమస్తే తెలంగాణా పత్రిక చీఫ్ ఎడిటర్ ! ఇంతకూ ముందు జ్యోతి లో చేసేవారు !

    రిప్లయితొలగించండి
  7. అల్లం నారాయణ గారి తెలంగాణా వాదమో ఉన్మాదమో కాస్త పక్కన పెడితే..ఆయన కథ ఒకటి నాకు బాగా నచ్చింది. 'వరడు ' దాని పేరు. వరడు అంటే చేవ చచ్చిన ముసలి నక్క. అది పగలు జంతువుల జాడ కనిపెట్టి రాత్రుళ్ళు పులికి వాటి దారి చూపిస్తుందట. పులి వాటిని చంపి తిని వదిలేసిన దాన్ని తను తినొచ్చని దాని ఆశ. దాని ఊళ వినపడితే దేనికో మూడిందనే లెక్క. అందుకే దాని గురించి తెల్సిన వారు పులి గాండ్రింపు కి భయపడని వారుకూడా దీనికి భయపడతారట.

    దీన్ని బేస్ గా చేసుకొని ఒక కథ అల్లుతాడు.బావుంటుంది.
    ఇక ఆయన తె.వాదమా...పాపం పెద్దాయన ఏదోపోనిద్దురూ.

    రిప్లయితొలగించండి
  8. Mein got!! This is why I like blogs. They host all kindsa nerds.

    Thanks for the info and thanks to the commentators.

    రిప్లయితొలగించండి
  9. పావని గారు,

    మీరు చెప్పిన కథ రచయిత అల్లం శేషగిరిరావుగారు.

    రిప్లయితొలగించండి
  10. రమణ గారు. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ చూశాను. అది అల్లం శెషగిరి రావు గారి కథ. ధన్యవాదాలు.ఈయన, అల్లం రాజయ్య, నారాయణ కాస్తా తికమక పడ్డాన్లేండి. అల్లం నారాయణగారి స్పీచులు ఇప్పుడే చూశా. వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

    రిప్లయితొలగించండి
  11. మల్కిభరాముడే కాదు షోయబ్ ఉల్లాఖాన్ పాఠం కూడా మేము చిన్నప్పుడు చదువుకున్నాము. అల్లం నారాయణ కొన్నాళ్ళ ముందు ’అమరావతి’ మీద కూడా పడి ఏడ్చారు. అమరావతిని శాతవాహనుల రాజధాని అనడం సీమాంధ్రుల కుట్రట! నేలకొండపల్లె శాతవాహనుల రాజధానిట, దాన్ని తొక్కేసి అమరావతి అని పాఠ్యపుస్తకాల్లో రాశారట. ఓ మారు ఆదివారం అనుబంధంలో వచ్చిందిది. ఇలాంటి జోకుల కోసం ప్రజలా పేపర్ కొని ఆయన పత్రిక తారాస్థాయికి చేరుకున్నా ఆశ్చర్యం లేదు.

    రిప్లయితొలగించండి
  12. వ్యాఖ్యాతలందరికీ నమస్సులు. ఈ టపా రాసేటప్పటికి నాకు తెలిసింది టపాలో నేను రాసినంతవరకే! వ్యాఖ్యల ద్వారా చాలా సంగతులు తెలుసుకున్నాను - మల్కిభరాము గురించి, అల్లం నారాయణ గురించీ! అందరికీ నెనరులు.

    రిప్లయితొలగించండి
  13. /తెలంగాణవూపజలు
    చరివూతకు /

    ఇవి ఏ భాషా పదములో నాకు కొంచెం కూడా అర్దం కాలేదు....:(

    రిప్లయితొలగించండి
  14. John: :) ప్ర అనే అక్షరం ఎక్కువగా (అన్ని సార్లూ కాదు) అలా పడుతూ ఉంది. ఈనాడు ఈపేపర్లో ’ర’ అక్షరం పడదు. ’౦’ అని పడుతుంది.

    రిప్లయితొలగించండి
  15. ఈ కాలంవాళ్ళకి మల్కిభరాముడు ఒక లెక్కా ? జమా ? ఇప్పుడు ఎవఱి చరిత్రనీ ఎవఱూ అణగదొక్కనక్కఱలేదు. ఈరోజు ఏ చరిత్రా ఎవఱికీ తెలీదు. తెలుసుకునే అవసరం లేదని భావిస్తోంది ప్రజ. కోస్తా, రాయలసీమా, తెలంగాణా అందఱూ పచ్చి కెరీరిస్టులై కూర్చున్నారు. బతుకో బతుకు, బతుకాయ నమః - ఇదే ఈనాటి జీవనమంత్రం. మనుగడసూత్రం. చరిత్ర - అది రాష్ట్రానిదైనా, ప్రాంతానిదైనా, దేశానిదైనా ఎవఱికీ అక్కఱలేదు. ఈ నేపథ్యంలో అల్లం నారాయణ ఆక్రోశాలు అర్థరహితాలు.

    ఈ దేశంలో ఏ ప్రాంతపు/ రాష్ట్రపు చరిత్రా స్వతంత్రం కాదు. ఎందుకంటే ఇవి గత వెయ్యేళ్ళుగా ప్రత్యేక స్వతంత్ర/ రాజకీయ స్వరూపాలుగా లేవు, ఇతర ప్రాంతాల/ రాష్ట్రాల చరిత్రతో ముడిపడే ఉంటుంది ప్రతి రాష్ట్రం/ ప్రాంతం యొక్క చరిత్ర. అందుచేత తెలంగాణకంటూ ప్రత్యేకంగా ఒక చరిత్ర వ్రాయలేం.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు