22, మే 2011, ఆదివారం

"అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.)

"చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు.



ఘొల్లురవి: ఈయన స్వరం కొంచెం వీకు. గొంతుపెంచి ప్రత్యర్థుల్తో వాగ్యుద్ధం చేస్తాడుగానీ, అవతలి గొంతుల హోరులో  కొంచెం వెనకబడుతూంటాడు. ముందు తెలుగు రాజ్యాన్ని తిట్టి ఆ తరవాత పాయింటు కొస్తూంటాడు. ఆయనిలా అన్నాడు: "చూడండీ.. రెండువేల ఒకట్లో ఇంద్రబాబును ఇంద్రశేఖర్రావు తిట్టలేదా? అన్ని పార్టీల్లోనూ ఉందండీ ఇది. కాకపోతే మిగతా పార్టీల్లోకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం  ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తిట్లు కొంచెం తీవ్రంగా ఉండడం సహజం. అయితే వీటిని పార్టీ వేదికల మీద వినిపించాలిగానీ, ఇలా మీడియా ముందు మాట్టాడ్డం పద్ధతి కాదు."

ఆయన చెప్పినదానిలోంచి వెంటనే రంజనీకాంతు ఒక సారాంశం లాగేసాడు. లాగేసి, "అయితే హైకమాండును ఆమె అలా విమర్శించడం తప్పేం కాదంటారు?" అని అన్నాడు. రవి వెన్వెంటనే, "కాదు కాదు కాదు, తప్పేనని అంటున్నాను. మీడియా ముందు అలా మాట్టాడ్డం తప్పేనని కదా చెబుతున్నది" అని అన్నాడు. అయినా రంజనీకాంతు ఊరుకుంటాడా..!

రంజనీకాంతు తరవాత ఫోన్లైన్లో ఉన్న కేకే శివరావుతో "కేకే గారూ, మీరు చెప్పండి.. హైకమాండుకు వెన్నెముక లేదనడం, పిరికిదనడం తప్పేమీకాదు అని ఘొల్లు రవి గారు చెబుతున్నారు, మీరేమంటారు?" అని అడుగుతూ ఘొల్లు రవికి ఒక చిన్నపాటి షాకిచ్చాడు.

కేకే మాట్టాట్టం మొదలుపెట్టాడు. ఘొల్లు రవి హడావుడిగా, "రంజనీకాంతుగారూ, నేనలా అన్లేదు. రంజనీకాంతుగారూ, రంజనీకాంతుగారూ, .." అంటూ ఘొల్లుమన్నాడు.
ఇహనాపమన్నట్టుగా చేత్తో సైగచేసి, "సరేలెండి" అని రవితో చెప్పి, "హైకమాండు పిరికిది అని బయటికి అనకూడదుగానీ, ప్రైవేటుగా అనొచ్చని ఘొల్లు రవి గారు అంటున్నారు. అది మీకు ఓకేనా, కేకే గారూ?" అని కేకేను అడిగాడు. ఘొల్లు రవి ఇంకా ఏదో మాట్టాడుతూ ఉండగానే, కేకే శివరావు మాట్టాట్టం మొదలుపెట్టాడు.

కేకే: కేకే శివరావుకు ఒక వరముంది. అతడి మాటలు మామూలు మనుషుల కర్థం కావు. ఇంగ్లీషు, తెలుగు కలిపేసి, అనర్గళంగా ఒక పది నిముషాలు మాట్టాడి, శ్రోతలంతా  నిర్విణ్ణులై,  స్థాణువులై, విస్తుపోయి, మ్రాన్పడిపోయి, కొయ్యబారిపోయి చూస్తూండగా విజయహాసంతో నిష్క్రమిస్తాడాయన.  ఇలా అన్నాడు: "చూడండి రంజనీకాంత్ గారూ, నేనేం చెబుతున్నానంటే.. సీ.. ఐ హావ్ సీన్ హండ్రెడ్స్, ఇఫ్ నాట్ థౌజండ్స్,  లైక్ దట్ లేడీ. మీకు తెలుసా, హైకమాండ్ చుట్టూ ఒక ఆరా ఉంటుంది, మీకు తెలుసా? యు నో దట్? టెల్ మీ.. యు నో దట్? హూ హాస్సీన్ ద టారా? నాట్ వన్, రంజనీకాంత్ గారూ.., నాట్వన్ ఇన్ది లాస్ట్ ట్వెంటీ ఇయర్స్ -యెస్.. యెస్..  ట్వెంటీ ఇయర్స్!   చెక్వితెనీబడీ. ఐ చాలెంజ్యూ! కమాన్, నేను చాలెంజి చేస్తున్నాను, ఎనీ టేకర్స్? యు కాంట్ ఫూల్మీ! దే కాంట్ ఫూల్మీ! నోబడీ కెన్ ఫూల్మీ యు నో! వీల్లేంటండీ..? ఆఫ్టరాల్ నిన్నొచ్చారు వీల్లు, బచ్చాగాల్లండీ వీల్లు. నేను ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నానండీ, ట్వెం..టీ..ఫై..వ్ ఇయర్స్! నో..బ్బడీ ఇన్ది వాల్డ్ ఈజ్ క్లోజర్ టు ఇట్ దాన్ మీ! నాకు చెబుతారా మీరు? ఎవరికి చెబుతున్నారండీ మీరు?"

నేనిక్కడ చుక్కలూ, కామాలూ, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థకాలూ వగైరాలు మీకు అర్థం కావాలని పెట్టానుగానీ, ఆయన మాట్టాడేటపుడు అవేవీ ఉండవు (ఇవన్నీ పెట్టినా, ఆయన మాట్టాడింది మీకేమీ అర్థం కాలేదని నాకు తెలుసనుకోండి). రంజనీకాంతుకు కూడా ఏవీ అర్థం కాలేదు.  మైండు బ్లాంకవడంతో అసలు తను వేసిన ప్రశ్న ఏంటో మర్చిపోయాడు. వెంటనే "ఒక బ్రేక్ తీసుకుందాం" అని అన్నాడు.

బ్రేకు తరవాత తిరిగి వచ్చేసరికి, "హైకమాండు పిరికిది, వెన్నెముక లేనిది అనే వ్యాఖ్యను సమరధించిన ఘొల్లు రవి" అంటూ చర్చల్లోని హైలైటును టికర్లాగా స్క్రాల్ చెయ్యడం మొదలెట్టారు. ’సమరధించిన’ అనే మాట రాసింది నేను కాదు, టికర్లోనే అలా దొర్లింది. టికర్లో అలాంటి తప్పులు చాలా సామాన్యం (మిగతా టీవీలతో పోలిస్తే తొమ్మిదో టీవీ చాలా నయం లెండి). టైపించేవాళ్లకు అవి తప్పులని తెలవదు, చూపించేవాళ్ళకు వాటిని చూడాల్సినంత ఖర్మ లేదు. ఇక చూసేవాళ్ళకు.. మన ఖర్మ అది, అంతే!

ఘొల్లు రవి: ’రంజనీకాంత్ గారూ.. అదేంటి, ఆ టికర్లో అలా వేస్తున్నారేంటండీ.. నేనలా అన్లేదు కదా?"

రంజనీకాంతు, "ఒక్క నిమిషమండీ, ఫోన్లో ఉన్న ధుమధుమ యాస్కీ గారితో మాట్టాడదాం".., "ధుమధుమ యాస్కీ గారు, చర్చ చూస్తున్నారు గదా, మీరేమంటారు?" అని అడిగాడు.

ఆయన "ఈ ఆంద్ర వలసవాదులు ఈడికెట్లొచ్చిన్రొ, ఎట్ల బలిసిన్రొ, అందరికీ తెల్సు. రంజినికాంత్ గారూ, తెలుగురాజ్యం పార్టీల ఇసంటి లీడర్లను శానమందిని సూసినం.  అవర్ హైకమాండ్ ఈజ్ ప్రాబబ్లీ వనాఫ్ది మోస్ట్ సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇనిండియా. ఆ సంగతి తెలుసుకోమని టీయార్పీ వోల్లకు చెప్తున్నం", అని ధుమధుమ లాడాడు.

ఘొల్లు రవి ఏదో చెప్పబోయాడు గానీ రంజనీకాంతు పడనివ్వలేదు. "ఇప్పుడు ఢిల్లీలో వి. హనుమాన్ రావు గారు మనతో మాట్టాడ్డానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వి. హనుమాన్ రావుగారూ, మీ హైకమాండును మీవాళ్ళే తిడుతున్నారు, ఘొల్లు రవి గారి లాంటి సీనియర్లు కూడా సమర్ధిస్తున్నారు. హైకమాండుకు క్లోజుగా ఉండే మీరు ఈ విషయమ్మీద ఎలా స్పందిస్తారు?"

"రంజనీకాంతుగారూ, నేనలా అన్లేదు. రంజనీకాంతుగారూ.. "

వీహెచ్ ఇలా అన్నాడు, "అలో, ఐకమాండంటే ఏందిరా బయ్? గాంధి ఫ్యామిలీ! దేశం కోసం ఆ ఫ్యామిలీ చేసిన త్యాగం, అలో, ఎవురైనా చేసిన్రార బయ్? గిట్ల మాట్టాడె లీడర్లకు, అలో, దమాక్ కరాబైందో ఏమో నాకు తెల్వదు బయ్!"

ఘొల్లు రవి మళ్ళీ ఏదో మాట్టాడబోగా, రంజనీకాంతు "ఘొల్లు రవి గారూ, మీ హైకమాండు పిరికిదని, వెన్నెముక లేనిదని, సన్నాసి అనీ తేలిపోయింది. ఇక మీరు చెప్పుకొనేదేమైనా ఉందా?" అని అడిగాడు.

అప్పటికే తాను చెప్పినదాన్ని వక్రీకరించాడని ఘొల్లు రవి పొగలు సెగలు కక్కుతున్నాడు. "ఏంటండి చెప్పేది? మీరెలా తేల్చేస్తారు? నూటా ముప్ఫై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, అనేకమంది త్యాగమూర్తులను దేశానికి అందించిన పార్టీ,.. అటువంటి పార్టీ హైకమాండును అలా అనడమంటే అది అన్నవాళ్ళ అజ్ఞానం తప్ప మరోటి కాదు." ముందే బొంగురుగా ఉండే రవి గొంతు ఈ మాటలనడంతో భొంగురు పోయింది.

"రైట్ రవి గారూ! " అని చెప్పి చర్చను ముగిస్తూ రంజనీకాంతు ఇలా అన్నాడు:"మొత్తమ్మీద హైకమాండు పిరికిదని, సన్నాసి అనీ ప్రతిపక్షులూ, స్వపక్షంలోని ప్రతిపక్షులూ అంటూంటే, ఆ పార్టీలోని మరికొందరు ఔనని ఒప్పేసుకున్నారు. ఇక ఈ చర్చ ఇంతటితో సమాప్తం"
---------****----------
బ్రేకు ముందర జరిగిన చర్చను  (చర్చ యొక్క మొదటి భాగాన్ని) చదివారా ?

3 కామెంట్‌లు:

  1. మీ బాద ఏమిటో అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  2. ప్రస్తుతం మన టీవీ చర్చలు అచ్చు ఇలానే జరుగుతున్నయ్ . అదిగో పులి అంటే ఇదిగో తోకలా . నిప్పు లేనిదే పొగ రాదంటారు . మన చానెళ్ళు పొగని చూపి నిప్పు రాజేయడానికి ప్రయత్నిస్తున్నాయ్ . రోజంతా బ్రేకింగ్ న్యూస్ అంటూ చర్చలు . మర్నాటి పేపర్లో కనీసం వార్తగానయినా రిపోర్ట్ అవ్వదు . చానెల్స్ మధ్య పోటీ , కంటెంట్ లేకపోవటం .. రాజకీయ వార్తలనీ , చర్చలనీ రియాల్టీ షోలా మార్చివేసింది . ఒక మంచి టాపిక్ ని సునిశితంగా , సూటిగా రాసిన చదువరి బహు గడుసరి . అందుకోండి నా అభినందనలు .

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు