10, జూన్ 2010, గురువారం

మందు x మందులు

రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!

డబ్బులకోసం జనాల జేబులను కొల్లగొడుతోంది ప్రభుత్వమంటూ ఈ వేలంపాటలమీద విమర్శలొచ్చాయి. ఇదేంటయా, మరీ ఇంతలా బరితెగించారేంటి అని అడిగితే, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులూ ఏమంటున్నారూ.. ’ప్రజల చేతుల్లో బాగా డబ్బులాడుతున్నాయి, వాళ్ళు కూడా ఎంజాయి చేద్దామని ఆలోచిస్తున్నారు అంచేతే తాగుతున్నారు’ అని మన చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎంత లెక్కలేనితనమో, ఎంత ఎటకారమో చూడండి.

గవర్నరు గారిక్కూడా ఈ పూల పంపకాలు, ఎటకారాలూ నచ్చినట్టులేదు. ఈ సన్నాసి రాజకీయులను తిట్టేందుకు మంచి సమయాన్ని, సందర్భాన్నీ ఎంచుకున్నాడు. ఆరోగ్యశ్రీ పథక పరిశీలనను ఆయుధంగా వాడుకున్నాడు.
 • "రాష్ట్రంలో పేదరికం ఈ స్థాయిలో ఉందా?" ,
 • "ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాం... ఇక్కడ ఇంత పేదరికం ఎలా ఉంది? అసలు అభివృద్ధి చెందుతున్న వారెవరు?"
అంటూ ప్రశ్నలడిగాడు. ఈ ప్రశ్నల ద్వారా అన్యాపదేశంగా రెండు వ్యాఖ్యలు వదిలాడాయన:
 1. తాగుడు దగ్గరకొచ్చేసరికి ప్రజల దగ్గర డబ్బులున్నాయంటున్నారు, ఆరోగ్యశ్రీ మాత్రం 82% పేదరికం ఉందని చెబుతోంది.
 2. ఓ పక్క తాగుడును విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ, మరో పక్క ఆరోగ్యశ్రీ మీద తెగ ఖర్చు చేసేస్తున్నారు
అసలు గవర్నరు టైమింగు చూడండి! ప్రజల దగ్గర డబ్బులున్నాయని వాళ్ళు ఓ పక్క చెబుతూండగానే, ఈయన పేదరికమ్మీద, ఆరోగ్యశ్రీ మీదా వ్యాఖ్యలు చేసాడు. కావాలని అన్నాడో అనుకోకుండా అన్నాడో గానీ, ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి చురకల్లాంటివే! అయితే ఈ చురకలూ వాతలకు రాజకీయ బ్రహ్మరాక్షసులు అదిరేనా బెదిరేనా? సీయేజీ యే సూటిగా తిట్టిపోసినా కూడా చలించని జాతి వీళ్లది (గతంలో నేను రాసిన టపా ఒకటి చూడండి), ఇలా అన్యాపదేశంగా తిడితే దడుస్తారా? రాజకీయుల మీద విమర్శలు, దున్నపోతు మీద వానా, ఒకటే కాదూ!?

గవర్నరు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు: "ముదిరిన జబ్బులకు చికిత్స చేయిస్తున్నారు సరే... మరి ఎక్కువ మంది ప్రజలకు వస్తున్న సాధారణ వ్యాధుల పరిస్థితేమిటి?" అని. ఆరోగ్యశ్రీ పెట్టినప్పటి నుంచీ లోక్‍సత్తా అడుగుతున్నది ఇదే! ’ఈ పథకం పేరున కార్పొరేటు ఆసుపత్రుల్ని మేపుతున్నారు, ప్రజలకు ఇంతకంటే ఎంతో అవసరమైన ప్రాథమిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి’ అంటూ మొత్తుకున్నారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి వినిపించుకోలేదు. స్వప్రయోజనాలు, స్వజనులప్రయోజనాలే ముఖ్యమైన మంత్రులు ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకున్నారా?

9 కామెంట్‌లు:

 1. ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?
  http://parnashaala.blogspot.com/2009/05/blog-post_21.html

  ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రస్తుతానికి
  4,642 ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో కేవలం 227 మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. నిమ్స్ లాంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కేవలం 3 ఆపరేషన్లు జరిగాయంటే నమ్మగలరా! అంటే పూర్తి స్థాయి ఫెసిలిటీలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోకూడా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు జరగటం లేదు. దీన్నిబట్టి ప్రభుత్వం యొక్క అంతర్లీన ఉద్దేశం తేటతెల్లం.Lets be careful and watchful. లేకపోతే ఇంతే సంగతులు.

  రిప్లయితొలగించండి
 2. ఇదివరకు రాజకీయాల్లో ఇలాంటిదేదైనా ఇష్యూ వస్తే, కనీసం ప్రతిపక్షమొకటుందన్న స్పృహతో మసలేవారు. (సమస్య పరిష్కరించకపోయినా). రాజశేఖర రెడ్డి హయాం నుండి ప్రజల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దండుకోవడమనే ఏకైక పాలసీ అందరిదీనూ. వీళ్ళెప్పుడు బాగుపడతారో అగమ్యగోచరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 3. యథా ప్రజా తథా రాజా. మార్పు అట్నుండి కాదు, ఇట్నుండి రావాలి.

  ఒక ఎమ్మెల్యేకి ఫోనొచ్చింది .. ఆయనకి ఓటేసిన (?) ఓ చిన్నపాటి బియ్యం వ్యాపారి దగ్గర్నుండి. స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అతని బియ్యం లోడు పట్టుకున్నాడనీ, విడిపించమనీ. ఎమ్మెల్యే సర్కిల్‌కీ ఫోన్ చేసి ఆరా తీస్తే, సర్కిల్ చెప్పిన విషయం - సదరు వ్యాపారి సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నాడని. ఇప్పుడా ఎమ్మెల్యే ఏం చెయ్యాలి? వాళ్ల దగ్గరికి పనుల మీదొచ్చేవారిలో సగం పైగా ఇటువంటివారే. అర్హత లేకున్నా రేషన్ కార్డులిప్పించమనో, ఉద్యోగాలకో వ్యాపారాలకో సిఫార్సులు చెయ్యమనో, ఇంకోటో. పక్కవాడు అలాగే చేసి పైకొస్తున్నప్పుడు నేనూ ఎందుకు చెయ్యకూడదనే సమర్ధింపొకటి.

  అవినీతి మనదేశంలో అన్ని స్థాయిల మనుషుల్లోనూ నరనరానా జీర్ణించుకుపోయింది. రాజకీయులనే నిందించి ఉపయోగం లేదు. వాళ్లు మనలోనుండి వచ్చినవాళ్లే కాబట్టి.

  రిప్లయితొలగించండి
 4. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ,గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులమంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మద్యం దుకాణాలను నిషేదిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

  ప్రజల ఆదాయం బాగా పెరిగింది కాబట్టే మద్యం దుకాణాలకు ఇంతగా గిరాకీ పెరిగిందనీ,కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకమనీ మంత్రిగారుచెబుతున్నారు. దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని,1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు: " 1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు.అనంతరం సడలించారు.నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు.మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి.ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి.కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.మరింత ఎక్కువ మందిని మద్య వినియోగదారులుగా మార్చడం, మద్యవ్యాపారం పరిమాణాన్ని విపరీతంగా పెంచడం- లక్ష్యంగానే ఎక్సైజ్ విధానం కొనసాగుతున్నది. నడికుడి వంటి చిన్న కేంద్రంలో ఒక మద్యం దుకాణం ఐదుకోట్ల రూపాయలకుపైగా రేటు పలికింది. హైవేల పక్కనా, విద్యాలయాలకు సమీపంలో, చివరకు దేవాలయాల కు చేరువలో మంచినీరు కూడా దుర్లభమైన మారుమూల దుర్బిక్ష గ్రామాలలో కూడా మద్యాన్నిప్రవహింపజేస్తున్నారు.మద్యవ్యాపారంతో పాటే సంచరించే గూండాల దండు, దానితో పాటే పెరిగే రాజకీయ ప్రాపకం- మొత్తం వ్యవస్థనే దుర్గంధ భరితం చేస్తున్నాయి.మద్యాన్ని వ్యాప్తి చేయడం వల్ల నష్టమవుతున్న ఆరోగ్యాలు, కోల్పోతున్న పనిదినాలు, తరిగిపోతున్న ఉత్పాదకత లెక్కవేస్తే, వేలం పాటల్లో వచ్చే వేల కోట్లు ఏ మూలకు?సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి" .

  రిప్లయితొలగించండి
 5. మద్యాన్ని నిషేధిస్తే సమాజానికి ఎన్నో మేళ్ళున్నాయిః
  “చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”
  “పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య.
  “మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు.
  ‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సందేహిస్తుంటే,’రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు.
  మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.శాంతిభద్రతలు కొరవడతాయి.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.

  రిప్లయితొలగించండి
 6. If people have enough money, let the government discontinue 'aarogyasree'.

  Insted of 'aarogyasree' the government should have modernized government hospitals and made these hospitals amicable to people.

  రిప్లయితొలగించండి
 7. Miryalaguda(Nalgonda..lo Govt.Teacher..gaa panichesthunna naa snehithudu..Mahathma Gandhi Autobiography chadivina tharuvata MADYAM muttukovaddani nirnainchukunnanani naatho okasari cheppadu..

  Intintiki Mahathma Gandhi-Athmakatha..nu panchi pedithe samasya parishkaram avuthundani na IDEA..

  Meeremantaro cheppandi..?

  రిప్లయితొలగించండి
 8. సరిగ్గా చెప్పారు. కాని డబ్బులు తీసుకుని ఓట్లు వేసే జనం ఉన్నంత కాలం, ఏటికి ఏడు తాగుడు ఒక ఫాషన్ గా మారుతున్నంత కాలం మీరు నేను ఎంత గొంతు చించుకుని అరిచినా ఏం లాభం లేదు. కూలి నాలి చేసుకునేవాడు సాయంత్రం అయ్యేసరికి తాగుతుంటే వీడు ఈ జన్మ కి బాగు పడడు అని తిడుతున్నారు గాని, పార్టీ ల పేరుతో వీకెండ్స్ లో మందేసి చిందేస్తున్న వాళ్ళ సంగతేంటి?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు