4, మే 2010, మంగళవారం

ఐఐఐయో.. ఐఐఐటీ!

రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.

పదోతరగతి చదివిన పిల్లలను (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) ఐఐఐటి కోర్సులో చేర్చుకుని, ఆరేళ్ళ తరవాత ఏకంగా రెండు డిగ్రీలతో బయటికి పంపించడమనేది ఈ సంస్థల ఆశయం. మొత్తం మూడు చోట్ల పెట్టారు - బాసర, నూజివీడు, ఇడుపులపాయ. ఒక్కోదానిలో సంవత్సరానికి 2,000 మందిని చేర్చుకునే ఆలోచనతో మొదలుపెట్టారు. మొదటి రెండేళ్ళూ బాగానే తీసుకున్నారు. ఈ యేడు మాత్రం, అంతమందిని తీసుకోలేమని చెబుతూ దాన్ని వెయ్యికి కుదించారు.


ఐఐఐటీలను పెద్ద యెత్తున ఆర్భాటంగా మొదలుపెట్టారు. చిన్న స్థాయిలో మొదలుపెట్టి, వ్యవస్థ సరిగ్గా ఏర్పడేలా జాగర్తపడుతూ, నిదానంగా విస్తరించుకుంటూ పోతే బాగుండేది. ఏడాదికి 2000 మంది చొప్పున ఆరేళ్ళ కోర్సుకుగాను మొత్తం 12,000 మంది ఒక్కోచోట చదువుకునే సామర్థ్యం కలిగిన సంస్థలివి. మొదటి రెండేళ్ళు ఇంటరు చదువుతారు. తరువాతి నాలుగేళ్ళలో రెండు ఇంజనీరింగు డిగ్రీలు వస్తాయి. ఈ మూడు ఐఐఐటీలు కొత్తగా ఏర్పరచిన ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. ఆ యూనివర్సిటీ పేరు -మామూలే- రాజీవ్ గాంధీ...గట్రా గట్రా! ఈ యూనివర్సిటీకి చాన్సెలర్ గవర్నరు కాదు, డా. రాజ్ రెడ్డి. డా. రాజ్ రెడ్డి అంటే.. ఫ్రెంచి లీజియన్ ఆఫ్ ఆనర్, ఓయెమ్సీ కంప్యూటర్స్ (ఇప్పుడీ కంపెనీ లేదు), మిలియన్ బుక్స్ కార్యక్రమంలో భారతీయ భాషాపుస్తకాల సాంఖ్యీకరణం (డిజిటైజేషన్) మొదలైనవాటితో ముడిపడ్డ ప్రసిద్ధ వ్యక్తి. వైస్ చాన్సెలరు ఐఐటీ నుంచి వచ్చారు. ప్రో చాన్సెలరని ఇంకో హోదా ఉంది. మొన్నటిదాకా వైసు గా ఉన్నాయన్ను నైసుగా ఇప్పుడు ఈ పదవిలో పెట్టారు. నిరూపణ కాని ఆరోపణలు ఈయన మీద చాలానే ఉన్నాయి.

ఈ ఐఐఐటీల పనిలో కొన్ని లోపాలున్నాయి. ప్రవేశాలను వ్యవస్థీకరించకపోవడం, దానిలో తప్పులు జరగడం ఈ వీటిలో ఒక పెద్ద లోపం. లోపాలు జరిగాయని ఆరోపణలు, ప్రవేశాల రద్దు, తిరిగి జరపడం,.. ఇవన్నీ కలిసి నిరుడు పాఠాలు చెప్పడం మొదలయ్యే సరికి సెప్టెంబరు గడిచిపోయింది (ఇంటర్మీడియెటు కాలేజీలు మాత్రం జూన్ లోనే మొదలౌతాయి). సహజంగానే పదో తరగతిలో మెరుగ్గా ఉన్న కుర్రాళ్ళకే ఐఐఐటీల్లో అవకాశాలొస్తాయి. ఇలాంటి పిల్లలకు ఇంటర్లో చేరేందుకు వలవేసే కార్పొరేటు కాలేజీలవాళ్ళుంటారు. వాళ్ళు, "మీ కుర్రాడికి, అమ్మాయికి ఊరికినే సీటిస్తాం మాదగ్గర చేర్చండి, ఆలస్యమైతే సీట్లయిపోతాయి" అంటూ వెంటపడతారు. ఇటు, ఈ ఐఐఐటీ సీటు సంగతేదో తేలితే వేరేదారి చూసుకోవచ్చుగదా అని అనుకునే పిల్లలకు ఐఐఐటిలు చేసే ఆలస్యం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దానికితోడు, ఈ యేడు చూస్తే ఇదిగో ఈ సీట్ల కోత!


డబ్బుల్లేవని ప్రభుత్వం సీట్ల సంఖ్యలో కోత పెట్టింది. ఇలాంటి చర్యలు తీసుకుంటూంటే వాటిలో చేరాలంటే విద్యార్థులకు ఆందోళనగా ఉండదా? పైగా వాటిలో చేరితే ఆరేళ్ళు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం మధ్యలో చేతులెత్తేస్తే? ప్రభుత్వం కాబట్టి చేతులెత్తెయ్యదులెమ్మనుకున్నా.., సరిగ్గా పట్టించుకోకపోతే? పైగా ఈ పిల్లలేమీ అల్లాటప్పా సరుకు కాదు, ఎక్కడ చదివినా మంచి స్థాయికి పోగలవాళ్ళు. చాకుల్లాంటివాళ్ళు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటూ కూడా చదూకుంటున్నవాళ్ళు. ప్రతిభావంతులైన ఈ పిల్లలు సెప్టెంబరు దాకా వీటి కోసం ఆగటమా లేక, ఏదో ఒక మంచి కాలేజీలో ఇంటరులో చేరటమా అనేది నిశ్చయించుకోవాల్సిన తరుణమిది.

పైగా ఈ యేడు చూడండి.. ప్రవేశార్హతను నిర్ణయించడంలో జాప్యం జరిగింది. గతంలో ఉన్న నిబంధనను మార్చి , ఒక్క పదో తరగతి మాత్రం గ్రామీణ పాఠశాలలో చదివితే చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మొన్నమొన్నే జరిగింది. అర్హతలను మార్చాలనుకున్నపుడు ముందే సదరు ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి. తీరా చివరి నిముషంలో ఇప్పుడు మారిస్తే తగువిధంగా దరఖాస్తులనూ మార్చాలి. ఇదీ, సీట్ల కోత నిర్ణయమూ - ఈ రెండూ కలిసి, ఇదిగో ఇంతవరకూ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే రాలేదు. ఈ వ్యవహారాలన్నీ చూసాక, ఐఐఐటిల మీద మనకు నమ్మకం సడలటం సహజం. పూర్తిగా ఆరేళ్ళూ సరిగ్గా చదువు చెబుతారా అనే సందేహం తలెత్తే అవకాశం లేకపోలేదు. ఈ యేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే ఐఐఐటీల్లో చేరాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడేట్టుంది.

ఐతే ఐఐఐటీలను మరీ తోసిపుచ్చనక్కర్లేదేమో! వాటి భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందన్నమాట నిజమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఐఐఐటీలకొచ్చిన ముప్పు ఏమీ లేదని నా ఉద్దేశం. ఇవ్వాళ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, ఐఐఐటీల్లో చేరేందుకు ప్రతికూలతల కంటే అనుకూలతలే కొద్దిగా ఎక్కువ ఉన్నాయనిపిస్తోంది. ఈ అనుకూల ప్రతికూలతలేంటో చూద్దాం..
  1. డా. రాజ్ రెడ్డి ఇంకా తప్పుకోలేదు .అంటే -ఆయన ఇంకా వాటిమీద ఆశ కోల్పోలేదన్నమాట. (తప్పుకుంటారన్న వార్తలు మాత్రం వచ్చాయి) . ఆయన వంటి వారి వలన , పరిశ్రమతో సంబంధాలు పెట్టుకుని, పిల్లలకు ఉద్యోగావకాశాలు ఏర్పరచే నేర్పు కూడా ఐఐఐటీలకు ఏర్పడుతుంది. ఆయన తప్పుకుంటే అది పెద్ద దెబ్బే!
  2. ఇప్పుడు సీట్లు తగ్గించారు కదా, అంటే తిరోగమనం మొదలైనట్లేనేమో.. నిజమే. సీట్లు తగ్గించారు. మిగిలిన ఈ సీట్లనైనా చక్కగా పద్ధతి ప్రకారం నింపి, పిల్లలకు చక్కటి చదువు చెబుతారని కోరుకుందాం. పైగా ఈ కోత వల్ల చేరే పిల్లలకు నష్టమేమీ లేదు, ఎంతో కొంత ఉపయోగమే.
  3. ముందుముందు ఎలా ఉండబోతోందో, ప్రభుత్వం ఇంకా ఏయే నిర్వాకాలు చేస్తుందో .. ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ముందుముందు అసలే మూసేసే ఆలోచనలు చెయ్యదని ఎలా చెప్పగలం.? ఈ సంస్థలపై ప్రజలు పెంచుకున్న ఆశలను బట్టి చూసినా, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూసినా, ప్రభుత్వం వాటిని మూసెయ్యకపోవచ్చు. పైగా, కోర్సు ఆరేళ్ళది అయినప్పటికీ, రెండేళ్ళ తరవాత బయటికి వచ్చే సౌకర్యం ఉంది. బైటికొచ్చి, ఎమ్సెట్ రాసుకుని ఏదైనా ఇంజనీరింగు కోర్సులో చేరే అవకాశం ఉంది.
  4. మరి సెప్టెంబరు దాకా ఆగేదెలా? అప్పుడు సీటు రాకపోతే రెంటికి చెడ్డ రేవడ కాదూ? నిజమే, అందుగ్గాను, ఐఐఐటీ సీటు కోసం ఎదురు చూడకుండా, ఏదో ఒక కాలేజీలో ఇంటరులో చేరి చదువుకోవాలి. ఆనక ఐఐఐటీలో సీటొస్తే ఇక్కడ మానేసి, వెళ్ళటమే. కాకపోతే ఈ కాలేజీవాళ్ళకు ముందుగానే ఆ సంగతి చెప్పి, ఫీజు కట్టడం వాయిదా వేసుకోవాలి.
ఐఐఐటీల పట్ల ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిపట్ల తమ నిబద్ధతను చూపిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తే ఇప్పుడు చేరదలచిన పిల్లలకు ధైర్యంగా ఉంటుంది.

    2 కామెంట్‌లు:

    1. శీర్షిక బాగుంది :-)
      రెండేళ్ళు గడిచాక పన్నెండు వేలమందికి సరిపడ వసతులు ఉండాలి కదా, ఉన్న వసతులు చేరనున్న విథ్యార్ధులకు సరిపోతాయా అన్న విషయం గుర్తించి. ఇప్పుడు వేసిన తప్పటడుగును సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారనుకుంటానండీ, అందుకే తగ్గించి ఉంటారు.

      రిప్లయితొలగించండి
    2. Triple I T?
      There are 3 of them?
      2000 students per batch in each location?
      Wow!

      బాసర్లో పెట్టింది IIT కాదా?

      But this kind of cavalier attitude towards bright young people's education is unpardonable.

      రిప్లయితొలగించండి

    సంబంధిత టపాలు