26, ఏప్రిల్ 2010, సోమవారం

హై.లో మతకలహాలు ఏనాటివి?

ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 


వీళ్లు చెప్పుకుంటున్న మత సామరస్యం హైదరాబాదులో లేదు. ఇవ్వాళ కాదు, ఎప్పటినుండో లేదు. ఎప్పుడో ఇరవయ్యో శతాబ్దపు రెండవ మూడవ దశకాల నుండీ కూడా ఇక్కడ మతగొడవలు జరుగుతున్నాయి. ఒకర్నొకరు చంపుకున్నారు. జావీద్ ఆలమ్ అనే ప్రొఫెసరు, 19 వ శతాబ్దంలో మాత్రం ఇక్కడ హిందూ ముస్లిముల మధ్య గొడవలేమీ జరగలేదని అంటూ, అయితే "వాళ్ళు పక్కపక్కనే నివసించేవాళ్ళు, కానీ వాళ్ళ మధ్య అంత సామరస్యమేమీ ఉండేది కాదు" అని చెప్పారని ఒక వెబ్‍సైటులో చదివాను. రెందు మతాల ప్రజల మధ్య సామరస్యం ఇలా ఉందని ఓ ప్రొఫెసరు చెబుతోంటే ఇంకో వక్రవాణి ప్రొఫెసరు ’మేమూ చదువుకున్నామండీ..’ అంటూ కెమెరా ముందు చేరి, అబద్ధపు కథలు అల్లాడు. ఆయన చెప్పిన "హైదరాబాదులో మతకలహాలు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే మొదలయ్యాయి" అనే ముక్క ఎంత అబద్ధమో, అయనది వక్రవాణి ఎందుకయిందో చూద్దాం..


హైదరాబాదు నగరంలో మతకలహాలు 1938 లోనే జరిగాయి. 1938 ఏప్రిల్ 5న మొదలైన మతకలహాలు ఏప్రిల్ 9 దాకా కొనసాగాయి. ముస్లిములు తలపెట్టిన ఒక ఊరేగింపుపై హిందూ ’లోథా’లు దాడి చేస్తారనే అనుమానంతో పదివేల మంది ముస్లిములు కత్తులతో సహా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అనుకున్నట్టుగానే గొడవలు జరిగి నలుగురు చనిపోయారు. నాలుగైదు రోజుల పాటు ఏడెనిమిది ప్రాంతాల్లో గొడవలు జరిగాయి.

ఈ గొడవలు జరిగాయి సరే, దానికంటే దారుణమైనది.. ప్రజల మధ్య ఎంత హార్మొనీ ఉందో తెలియచెప్పే సంగతి ఒకటుంది.. ఆ గొడవల తరవాత పద్మజా నాయుడు గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో ’..హిందూ ముస్లిము మేధావులలోని పరస్పర అపనమ్మకాన్ని, ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుమానాలనూ చూసి నేను దిమ్మెరపోయాను’ అని రాసింది.

"From autocracy to integration: political developments in Hyderabad State" (By Lucien D. Benichou) పుస్తకంలో ఈ సంగతులను చదవొచ్చు.

అసలు దీనికంటే ముందే - 1923 లోనే- హై.లో ఆర్యసమాజ్ ఏర్పడి, ముస్లిములను పునర్మతాంతరీకరణ చెయ్యబూనినపుడే హైదరాబాదు సంస్థానంలో మతకలహాలు జరిగాయి. ఇదిగో, ఈ వ్యాసం కూడా అదే ముక్క చెబుతోంది. హైదరాబాదు సంస్థానంలో గిరిజనులను, దళితులను ఇస్లాములోకి మార్చే ధ్యేయంతో బహదూర్ యార్ జంగ్ అనేవాడు ఒక సంస్థను స్థాపించాడు. అలా మారినవాళ్ళను తిరిగి హిందూమతంలోకి మార్చే లక్ష్యంతో ఆర్యసమాజ్ ఏర్పడింది. ఒక్క హైదరాబాదులోనే ఆర్యసమాజ్ కు 20 శాఖలుండేవట. ఇదంతా 1938 నాటి లెక్కలు.

ఓ మూడేళ్ళ కిందట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో వరవరరావు ఇలా రాసాడు: "..కాబట్టి మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తాను స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాలనో లేదా పాకిస్తాన్‌లో కలపాలనో అనుకున్నప్పుడు ఒక రజాకారు సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయబుల్లాఖాన్ వంటి ఉత్తమ సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు". రజాకార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాము వాళ్ళను పెంచి పోషించాడన్నదీ స్పష్టం. రజాకార్లు ఎప్పటివారు? ఈ ఆంధ్రప్రదేశు, ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రమూ ఇవేవీ ఏర్పడటానికి ముందే.. మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో ఏర్పరచిన సేన అది. ఇప్పుడు పాతబస్తీలో ఉన్న మతతత్వ పార్టీల వారసత్వం ఎక్కడిది? - ఆ రజాకార్లదే! రజాకార్ పార్టీ అసలు పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్!

మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో సేన ఏర్పాటు, మెజారిటీ మతస్తుల మతమార్పిడి కోసం ఒక సంస్థ, వాళ్ళను తిరిగి వెనక్కి తెచ్చేందుకు మరో సంస్థ -మతసామరస్యం ఎంత గొప్పగా ఏడిచిందో చెప్పేందుకు ఇది చాలు. తె.వాదులు చూపిస్తున్న హార్మనీ అనే మేడిపండును విప్పిచూస్తే కనబడ్ద పురుగులివి!

-----------------------------------

ఈ తె.వాద ప్రొఫెసర్లు బళ్ళలో ఏం పాఠాలు చెబుతున్నారో ఏమోగానీ టీవీల వేదికలెక్కి మాత్రం ఇలా అబద్ధాలను అల్లేస్తూ ప్రచారంలో పెడుతూ ఉంటారు. మతకలహాల పట్ల అబద్ధాలు గుప్పించబడిన ఈ చర్చలో కూడా ప్రొఫెసరుగారు ఘంట కొట్టినట్టుగా వక్రవాణి వినిపించారు. (పక్కనే ఉన్న కోడెల శివప్రసాదరావు ప్రొఫెసరుగారి వక్రవాణిని అడ్డుకోలేదు.) దేరీజె మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్‍నెస్ అని అంటూంటారు. (మ్యాడ్‍నెస్సులో మెథడున్నా లేకున్నా మెదడు మాత్రం ఉండదనుకోండి.) ఈ వక్రవాది అబద్ధపు ప్రచారాల్లో కూడా మెథడేదో ఉన్నట్టుంది. 

టీవీ కెమెరాల ముందు చేరి లేనిపోని అబద్ధాలను వ్యాప్తి చేసే ఈ మేధావులు ఏ చరిత్రను చదువుకున్నారోగానీ, ప్రొఫెసర్లుగా బళ్ళో కుర్రాళ్ళకు కూడా ఇలాంటి అబద్ధపు చదువులే చెబుతున్నారేమో!

గత డిసెంబరులో విరజాజి బ్లాగులో ఇదే విషయమై ఒక చర్చ జరిగింది. ’అద్భుత మతసామరస్యానికి రాజధాని’ అయిన హైదరాబాదులో ఆంద్రోళ్ళొచ్చి మతకలహాలు రేపారు అంటూ ఒక వ్యాఖ్యాత వ్యాఖ్య రాస్తే, దానిపై జరిగిందా చర్చ.

16 కామెంట్‌లు:

  1. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాల్లు "జనాలకు కూడా చరిత్ర గురించి తెలుసు" అన్న నిజాన్ని ఎలా మర్చిపోతారో అర్థం కాదు. మన దేశములో మత కలహాలు ఈ దేశానికి ముస్లిములూ, క్రిష్టియనులు రాకముందు నుండే వున్నాయి. బౌద్దులకి హిందువులకి జరిగిన యుద్దాల గురించి చదవలేదా? ఇక ముస్లిముల దండయాత్రల అనతరం అవి మరింతగా పెరిగిపోయాయి.

    రిప్లయితొలగించండి
  2. హైదరాబాద్ లో రాజకీయ ఉద్దేశాలతో రేగే మతకల్లోలాలు ఎప్పట్నించీ మొదలయ్యాయండీ?

    రిప్లయితొలగించండి
  3. @కత్తి మహేష్ కుమార్,

    నైజాం కాలంలో జరిగిన గొడవలు మాత్రం పాలించేవాళ్ళ రాజకీయ ఉద్దేశాలతో కాక జనానికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకున్నారనుకున్నారా? ఇక్కడ పాయింట్ కూడా అదే. కాస్త కదిలిస్తే గొడవలకి దిగి కొట్టుకునే ఏరియాలు హై పాత బస్తీలో ఉన్నా, కర్నూలు పాతబస్తీలో ఉన్నా, వాళ్ళను కెలికి రాజకీయ ప్రయోజనాలు పొందేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. హై పాతబస్తీ అంత easily inflammable ఏరియా కాబట్టే, రాష్ట్రం ఏర్పడక ముందైనా, తర్వాతైనా రాజకీయులు అక్కడ చెయ్యి పెట్టి కెలకగలిగారు. కాకపోతే ఆ ఏరియా అంతకముందు మతసామరస్యానికి గుర్తని, మతకలహాలనేవే తెలియదని, ఇప్పుడు ఆంధ్ర రాజకీయులొచ్చి పాడుచేసారని ప్రచారమే అసలు సమస్య. ఇక్కడ చెబుతున్నదల్లా అది అంతక ముందు నుంచే సెన్సిటివ్ ఏరియా అని. అక్కడ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే పాలకుల జోక్యాలు, మత ఘర్షణలు ఉన్నాయని, అదేదో ఈ తెలంగాణావాదులు ప్రచారం చేస్తున్నట్టు రాష్ట్రం ఏర్పడ్డాక జరిగింది కాదని.

    రిప్లయితొలగించండి
  4. హైదరాబాదులోనూ, దేశంలోని అనేక చోట్లా మతకలహాలు ముందునుండే ఉన్నాయి. ముస్లిములు ఎక్కువగా లేని సీమాంధ్రలో కుల కలహాలు, ముఠా కలహాలు కూడా ముందునుండే ఉన్నాయి.

    అయితే వచ్చిన చిక్కల్లా కొందరు సీమంధ్ర నాయకులు తమ పబ్బం కోసం కడప, అవని గడ్డ నుండి గూండాలని దించి రాజకీయ గొడవలని మతకలహాలుగా రంగు పులమడమే. పైగా గొడవల తీవ్రత కూడా బాగా పెంచారు.

    చెన్నారెడ్డి ని దించడానికి జరిగిన కుట్రలో ఒకేసారి ఒకే చోట ఒకే అల్లరి మూక హిందువులు, ముస్లిములపైనా దాడి చేసి దాన్ని మత కలహాలుగా రంగు పులిమింది.

    ఈ వాదన ఎలా ఉందంటే మీ హై.లో ఎలాగూ అప్పుడప్పుడు కొట్టుకుంటున్నారు కదా, మేము కూడా ఇంకాస్త అగ్నికి అజ్యం పోస్తే తప్పేమిటీ అన్నట్టు. హై.లొ ముందు ఉన్నా లేకపోయినా సీమాంధ్ర నాయకులు చేసింది తప్పే. దానిని ఒప్పుకోండి.

    రిప్లయితొలగించండి
  5. ఆకాశరామన్న: :)
    Moham: చక్కగా చెప్పారు. ఆయనకు మనం చెబుతున్నది తెలీక కాదండి. తమ వాదనను సమర్ధించుకునే దారి లేనపుడు ఇలా జోకులెయ్యడం వారికలవాటే.

    Sceptic: అసలు ఆ అబద్ధాలకోరులు అన్నదేంటో మీకు మరోసారి చెబుతాను.. ’ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు హైదరాబాదులో మతకలహాలు లేవు, ప్రజలెంతో సామరస్యంగా ఉండేవారు. ఆంద్రోళ్ళు వచ్చి మతలహాలను మొదలెట్టారు.’ ఖచ్చితంగా ఈ మాటలే కాదుగానీ ఇలాంటి మాటలే మాట్టాడారు. ప్రొఫెసరు వక్రవాణి ’నేను కూడా చరిత్ర చదూకున్నానండీ, నన్ను మాట్టాడనివ్వండి’ అనికూడా అన్నాడు. నేను ఎత్తిచూపించింది ఈ అబద్ధాలను. ఆయన చదువుకున్న చరిత్ర ఈ అబద్ధాల చరిత్రేనా అని అడిగాను. ఈ అబద్ధాలనే అక్కడ పిల్లలకు కూడా చెబుతున్నాడా అని సందేహించాను.

    అంతేగానీ, తమ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం హై.లో గొడవలు సృష్టించారు అన్న సంగతి గురించి కాదు. కోస్తా ప్రాంతంలోని కుల ఘర్షణల గురించి కాదు. అది అసలు ఆ అబద్ధాలకోరుల మాటల్లో ఎక్కడా ధ్వనించలేదు. కనుక మీరు చెప్పేది అప్రస్తుతం! సందర్భం వస్తే దాని గురించి మాట్టాడుకోవచ్చు, ఇప్పుడు కాదు.

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణా ఉద్యమం మత విషయానికి సంబంధించినది కాదు. అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం నిజాంకి బంధువులు. అందుకే అసదుద్దీన్ తెలంగాణాని వ్యతిరేకిస్తున్నాడు. అంతే కానీ ముస్లింలందరూ తెలంగాణాకి వ్యతిరేకం కాదు. కోస్తా ఆంధ్రలో మాత్రం హింస లేదా? కోస్తా ఆంధ్రలో మత ఘర్షణలు జరగలేదు కానీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కాపులు శెట్టి బలిజలకి మధ్య కుల ఘర్షణలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.

    రిప్లయితొలగించండి
  7. ఆంధ్ర(సీమ) వాళ్ళ ప్రమేయంతో హైదరాబాద్ లొ మత ఘర్షణలు జరిగింది చరిత్ర లో ఒక్క సారి. అది చెన్నా రెడ్డి ని దించటానికి...అది అలా చేయించిన రాజకీయనాయకుల తప్పే (రాజశేఖర రెడ్డి). కానీ ఆయననే తరువాత తెలంగాణ వాళ్ళూ గెలిపించారు.
    ఆంధ్ర వాళ్ళ ప్రమేయం లేకుండా హైదరాబాదు లో అనేక సార్లు మత ఘర్షణలు జరిగాయి. అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళనే నిందించటం, మత ఘర్షణలు రెచ్చగొట్టటం తో సమానమైన ఒక పాపపు పనే తప్ప వేరే కాదు. తెలంగాణ వాదులు చేస్తుంది ఇదే.
    అవనిగడ్డ నుండీ గూండా లు ఎప్పుడూ రాలేదు. మాదీ అవని గడ్డే. ఇది కృష్ణా జిల్లా లో ఉంది.ఇక్కడ ఫాక్షన్ రాజకీయాలూ హింసా లేవు. బహుశా పైన కామెంట్ రాసినాయన ఉద్దేశం ఆళ్ళ గడ్డ అయ్యిఉండవచ్చు. ఆళ్ళ గడ్డ కీ అవనిగడ్డ కీ తేడా తెలియని వాళ్ళు కూడా మత ఘర్షణలకి ఆంధ్ర వాళ్ళూ కారణం అనతం దయనీయం.

    రిప్లయితొలగించండి
  8. చెన్నారెడ్డి టైమ్ లో గూండాలని తీసుకొచ్చింది అవనిగడ్డ నుంచే. పోలీసులు కొన్ని సార్లు చిల్లర దొంగలపై కూడా రౌడీ షీట్లు తెరుస్తుంటారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫొటోలు చూసిన రాజకీయ నాయకులు వాళ్ళు నిజంగా గూండాలనుకుని తమ వెనుక తిప్పుకుంటారు.

    రిప్లయితొలగించండి
  9. ఒక మతం హత్యల్ని మరొకరు ఎత్తి చూపే వ్యాసాలు కొనసాగించటంనిష్ప్రయోజనం. అన్ని మతాలలో హింస ఉంది. మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనాలి. అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు. ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే. ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడిపే వారికి వారి పూర్వీకులఅకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే. అశుద్ధం అశుద్ధమే. దాన్ని అందరికీ చూపించటం అనర్ధదాయకం.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా శర్మ గారూ,
    మీరు అనే విషయం ఎలా ఉందంటే: ----రాముణ్ణి పట్టుకొని "నీ పేరు రాముడు కాదు భీముడు" అని వాడికే చెప్పినట్లు ఉంది.
    మా బాబాయి 1990 నుంచీ 1994 వరకూ అవనిగడ్డ మండల కాంగ్రె అధ్యక్షుడి గా పనిచేశారు. మాకు తెలియకుండా గూండాలు (ఇక్కడ రౌడీ షీటర్లను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు) హైదరాబాద్ కి అల్లర్లు సృష్టించటానికి ఎలా వెళ్తారు?ఒక వేళ ఈ వార్త పత్రికల లో వచ్చినా అది నిజం కాబోదు.ఎవడో పనిగట్టుకొని రాసిన నీలి వార్తమాత్రమే! మీకు తెలంగాణ వాదమంటే అభిమానముంటే సమర్ధించుకోండి. కానీ ఇలాంటి పనికి మాలిన వాదనలతో కాదు. మీకు కనీసం అవనిగడ్డ ఏ పార్లమెంటు నియోజక వర్గం లో ఉండేదో తెలుసా?

    రిప్లయితొలగించండి
  11. Nrahamthulla: హై.లో మతకలహాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకే జరిగాయి అని కొందరన్నారు. కాదు ముందునుంచే ఉన్నాయి అన్నాను. అదే నా ఉద్దేశమండి. అంతేగానీ ఏమతం వాళ్ళది తప్పు, ఎవరిది ఒప్పు అనేది కాదిక్కడి చర్చ. జరిగిన మతకలహాల గురించి ఈసరికే రాసి ఉన్నదాన్ని ఇక్కడ ఉదహరించానేగానీ, నేను కొత్తగా రాసినదేమీ లేదు, గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  12. మొత్తానికి వక్రపాణి గారు చాల రొజుల తరవాత మీతో ఒక పొస్ట్ రాయించారు :)

    రిప్లయితొలగించండి
  13. andhrudu: వారికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదండి. మనం చాలా స్పష్టంగా చెప్పామనే అనుకుంటాం, కానీ అలా అనుకోవడం మన పొరపాటని వెంటనే తెలిసివస్తుంది. ఆయన యొక్క ఆ అర్థం చేసుకోలేని శక్తి నన్నెప్పుడూ చకితుణ్ణి చేస్తూంటుంది. :)

    రిప్లయితొలగించండి
  14. ఒకటి కాకపోతే మరొకటి. గూట్లో రాళ్ళేద్దాం. తగిలితే తగులుద్ది. తగలలేదా? ఎన్నికలొచ్చేసరికి ఎవడో ఒకడు "భావ సారూప్యం" ఉండేవాడు తగులుతాడు. ఆడితో పొత్తుకట్టి, ఎలాగోలా నెగ్గేద్దాం. ఇదీ నేటి రాజనీతి వెనుక ఉన్న దివాళాకోరుతనం.

    రిప్లయితొలగించండి
  15. చదువరి గారూ, టెంప్టేషను బలమైనదే ననుకోండి - కానీ ఈ టీవీ మేతావుల్ని మర్చిపోడానికి ప్రయత్నించి చక్కగా మీ ఒరిజినల్ విశ్లేషణలు రాస్తే బెట్రు.

    రిప్లయితొలగించండి
  16. నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు.తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.1946-48 సంవత్సరాల్లో బందగి హత్య నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని సుంకర , వాసిరెడ్డి లు మాభూమి నాటకాన్ని వ్రాసి ఊరూరా ప్రదర్శనలిచ్చారు.మా భూమి నాటకం షేక్ బందగీ సమాధి దగ్గర నిలబడి నివాళులర్పించటంతో ప్రారంభమయింది.1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు.దేవులపల్లి వెంకటేశ్వరరావు 1845లోనే ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు’ పుస్తకం లో బందగీ గురించి వివరంగా రాశారు.తిరునగరి రామాంజనేయులు వీరబందగి పేర బుర్రకథ వ్రాసి ప్రదర్శనలిచ్చారు
    తెలంగాణాలోని ముస్లింలు 'విమోచన' అనే పదాన్ని వ్యతిరేకించినందువల్లఆఅసెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినం'గా జరపాలని జేఏసీ నిర్ణయించింది.సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రజలు గుర్తించాలి. ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయజెండాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగరేయాలి. జాతీయగీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని సంస్మరించుకోవాలి' అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు