10, అక్టోబర్ 2009, శనివారం

ఒబామాకు నోబెలిస్తే మనకెందుకాశ్చర్యం?

ఒబామాకు నోబెలిస్తున్నట్టు ప్రకటించినప్పుడు అక్కడున్న విలేకరులు ఆశ్చర్యంతో ఆవులించారు. ప్రపంచమంతా విస్తుపోయింది. అధ్యక్షపదవిలోకి వచ్చిన 12 రోజుల్లోనే అతడు అంత శాంతిదూత ఎలా అయ్యాడో పాపం ఒబామాకు కూడా అర్థమయ్యుండదు. ఒక రకంగా ఇది ఒబామాను చిన్నబుచ్చడమే. ఒబామాను విమర్శించేందుకు, అతడి మీద కార్టూన్లు జోకులూ వేసుకునేందుకు ప్రజలకిచ్చిన అవకాశమే ఇది. ఇప్పుడు నేనేం చేసానని నాకీ పురస్కారం అని అతడు తలపట్టుకునే పరిస్థితి. దానికితోడు,
ఇప్పుడు కెనడా నుంచి కొరియా దాకా, బ్రెజిల్ నుంచి బ్రూనై దాకా ప్రతి దేశనాయకుడూ ఫోనుచేసి, అభినందనలు చెబుతూంటాడు. నాకు నోబెలు వచ్చిందని తెలీగానే నాలాగే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే ఉంటారుగదా అనే ఆలోచన మనసులో వస్తూనే ఉంటది, ముల్లులా గుచ్చుతూనే ఉంటది. పాపం ఒబామా! ఇది పురస్కారం కాదు, ఉత్తినే ఇచ్చిన బహుమానం.

ప్రపంచమంతా ఆశ్చర్యపోవచ్చు, నోరెళ్ళబెట్టి ఉండొచ్చు.. కానీ మనం మాత్రం కన్నార్పనైనా లేదు. అందులో పెద్ద విస్తుపోవాల్సిందేమైనా ఉందా చెప్పండి. ఆఫ్టరాల్, ఒక పురస్కారాన్ని ఉత్తినే ఇచ్చారు, అంతేగదా! జిల్లాలకు జిల్లాల్నే ఇచ్చిపారేసేవాళ్ళం, మనల్నా ఇవి ఆశ్చర్యపరచేది! హె!

ఎంత అడ్డగోలుగా ఇచ్చినా, నోబెలువాళ్ళు మనకంటే ఎంతో నయం!
ఏమీ సాధించకపోయినా, ఏదో ఒకటి సాధించకపోతాడా అని ఇచ్చారు, వాళ్ళు. ఇక్కడ మనాళ్ళు మాత్రం.. ఏం సాధించాడని ఒక జిల్లాకు రాశేరె పేరు పెడదామని ఆలోచించలా -పెట్టేసారంతే! అడ్డగోలుగా, అక్రమంగా వేలకోట్లు సంపాదించాడని ఆరోపణలున్న వ్యక్తి పేరును, చిరకాలం ఉండిపోయేలా, ఉచితానుచితాలు చూడకుండా ఒక జిల్లాకు పెట్టేసారు. తమ కుటుంబం కోసం, తమవాళ్ళ, తమ అనుయాయుల సుఖసంతోషాల కోసం రాష్ట్ర వనరులను పణంగా పెట్టాడని ఆరోపణలొచ్చిన నాయకుడి కోసం జిల్లా పేరు మార్చడమా? ముందు అతడిమీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాల్సిందిపోయి, ఈ పేర్ల బహుమానాలా? ఎంత అన్యాయం?

మనకంటే మన సినిమాలూ, సినిమా దర్శకులే నయం.
తన అనుంగు అనుచరుడు హత్యానేరంపై శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉంటే అతణ్ణి విడిపించడం కోసం నానా తిప్పలు పడ్డాడు, రాశేరె . ఒకసారి విడిపిస్తే కోర్టు తిట్టింది. మళ్ళీ లోపలికి పంపించాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు, మరుసటేడు మళ్ళీ ప్రయత్నించి మరీ, శిక్ష అనుభవిస్తున్నవాణ్ణి బయటికి తెచ్చిన ఘనుడాయన. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా (మంత్రి హోదా) ఉండి కూడా, జైలుకు పోయి మరీ, ఆ అనుచరుణ్ణి పరామర్శించిన ఘనుడు. మన సినిమాల్లో ఈ రకం నాయకులను విలన్లుగా చూపించారన్న సంగతి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సినిమా దర్శకులను మెచ్చుకోవాలి -ఇలాంటి విలను పాత్రలను ఏనాడో మన సినిమాల్లో కల్పించి, ఆయా విలన్లను - కోట శ్రీనివాసరావు, రావు గోపాలరావు, రామిరెడ్డి వగైరా నటులు ధరించిన పాత్రలను - మనచేత బూతులు తిట్టించారు. ఇప్పుడు దాదాపుగా అలాంటి పనులే నిజజీవితంలో చేసినవాళ్ళ పేర్లు మాత్రం జిల్లాలకు పెట్టేస్తున్నాం. అంచేత, అయ్యా, మనకంటే మన సినిమాలే నయం, సినిమా దర్శకులే నయం. విలనీని విలనీగానే చూపారు, విలన్ను హీరో చెయ్యలేదు.

మనకంటే క్రికెట్ నిర్వాహకులే నయం!
ఒక ప్రాజెక్టు కడుతున్నారంటే 'మనవాళ్ళు ' కొందరు కోట్లకు పడగెత్తినట్టే! కాదు కాదు, " 'మనవాళ్ళు ' కొందరు కోట్లకు పడగెత్తాలంటే ఒక ప్రాజెక్టు కట్టాల్సిందే! " - ఇది సరైనమాట. ఏదైనా ప్రాజెక్టులో పంపకాలు సరిపోలేదనుకుంటే, ప్రాజెక్టు విలువను ఓ నాలుగొందల కోట్లో నాలుగువేల కోట్లో పెంచేసుకోవచ్చు. కారణాలు చెప్పనక్కర్లేదు, ఎవణ్ణీ పట్టించుకోనక్కర్లేదు. ఇలాంటి మ్యాచి ఫిక్సింగులు, ఆరోపణలూ ఎన్నో! ఇంతటి దయామయుడు కాబట్టే 'రాశేరె నన్ను రాజకీయాల్లో పైకి తీసుకువచ్చాడు.. అంచేత ఆయన కొడుకును ముఖ్యమంత్రిని చెయ్యాల్సిందే ' అని అనుంగు మంత్రులు అన్నారు. రాశేరె పట్ల వీళ్ళకంత కృతజ్ఞతే ఉంటే, మంత్రిపదవికి రాజీనామా చేసిపారేసి, ఏ ఇడుపులపాయో పోయి అక్కడ పాలేరు పని చేసుకోవాలి, లేదా అక్కడ ఎస్‌బాస్ పనులేమైనా ఉంటే అవి చేసుకోవాలి. ఇక్కడుండి, ఒక ముఖ్యమంత్రి కొలువులో పనిచేస్తూనే మరొకరు ముఖ్యమంత్రిగా కావాలని కోరడమేంటి? ఇదంతా ఒక మ్యాచిఫిక్సింగు లాగా - ఏదో రకంగా మనక్కావలసినవాణ్ణి ముఖ్యమంత్రిని చేసి, మన అక్రమాలు సక్రమంగా కొనసాగించుకోవాలనే దొంగతెలివితేటల్లాగా అనిపించడం లేదూ? ఈ బాపతు జనమంతా కలిసి, ఏకంగా ఒక జిల్లాకు పేరు మార్చేసారు. ఎంత అన్యాయం! క్రికెట్లో మ్యాచిఫిక్సింగులు చేసుకున్నవాళ్ళు చరిత్రహీనులయ్యారు. వాళ్ల పేరిట ట్రోఫీల పేర్లు మార్చలేదు, కొత్త ట్రోఫీలు పెట్టలేదు, పోటీలు నిర్వహించనూలేదు. (ఇప్పుడిప్పుడే మళ్ళీ తమ శీతాకాలపు కలుగుల్లోంచి బైటికి వస్తున్నారులెండి. అదికూడా ఈ బాపతు నాయకుల చలవ వల్లే! ) అంచేత, మనకంటే క్రికెట్ నిర్వాహకులే నయం!

దక్షిణ కొరియాలో ఒక మాజీ అధ్యక్షుడి అవినీతిపై విచారణ జరుగుతూండగా అతడు ఆత్మహత్య చేసుకున్నా డీమధ్య. ఫిలిప్పీన్సులో ఫెర్డినాండ్ మార్కోస్ అధ్యక్ష పదవినుండి దిగిపోయాక, పెళ్ళాంతో సహా దేశం వదలిపెట్టి పోవాల్సి వచ్చింది. పెరూలో, ఫుజిమోరీ అనేవాణ్ణి జపాను మూలాలున్నవాడని కూడా చూడకుండా అధ్యక్షుడి కుర్చీలో కూచ్చోబెడితే, కుర్చీ అంతా చెరిచాడంట. ఆనక దేశం వదలిపెట్టి జపాను పారిపోయాడు. అతడిమీద కేసులు నడిపారు.

మన కళ్ళెదురుగానే ఇళ్ళను ఎస్టేట్లుగాను, ఎస్టేట్లను సామ్రాజ్యాలుగాను మార్చుకున్నవాళ్ళకు మనం చేస్తున్న సత్కారం చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోంది. అవినీతి చక్రవర్తి అని ఆరోపణలు వచ్చిన వ్యక్తి చచ్చిపోగానే సదరు ఆరోపణలన్నీ సమసిపోతాయా? ఒక్కసారిగా అతడు దేవదూత అయిపోతాడా? హవ్వ!

30 కామెంట్‌లు:

  1. చాలా బాగారాశారు. ఆంధ్రులప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనుభావుని పేరుని ఆయన పుట్టిన జిల్లాకి పెట్టటానికి మనరాజకీయనాయకులకు యాభైయేళ్ళు పట్టింది. అదికూడా తూతూమంత్రముగా ఆజిల్లా ప్రస్తుతపేరుకి ఆ అమరవీరునిపేరు తగిలించి మమ అనిపించారు. ఆతర్వాత ఆవిషయం అందరుమర్చిపోయారు. అదే, ఒక అరాచకీయ(అ)మర(ణ)వీరుడికి, ఆయన ఉద్దరించిన, ఆయన్ని, ఆయన పుత్రపౌత్రాదులను, బంధుగణవర్గన్ని, పరివారన్ని ఇంతకాలం భరించిన జిల్లాకి ఆ (కీర్తీ?)శేషుని పేరుపెట్టాటానికి కేవలం ఐదువారాలుపట్టింది. ఇదేమి ప్ర్రారబ్ధమో?, ఏటువైపు వెళ్తుందో గతమెంతో ఘనకీర్తిగలిగిన మనజాతి?

    రిప్లయితొలగించండి
  2. జిల్లా పేరు మార్పుకి కేంద్ర ఆమోదముద్ర ఉండాలంట . కేంద్రం ఇంకా ఆమోదించలేదంట.

    రిప్లయితొలగించండి
  3. రాజశేఖర రెడ్డికి ఇస్తే గోబెల్స్ బహుమతి కూడా ఇవ్వాలి. శాంతి చర్చల ప్రతినిధిని బూటకపు ఎంకౌంటర్ లో చంపించి, అతను ఎవరో నాకు తెలియదు అన్నందుకు. అతను ఆ శాంతి చర్చల ప్రతినిధితో మాట్లాడుతుండగా తీసిన ఫొటోలు అన్ని పత్రికలలోనూ వచ్చినా కూడా తనకేమీ తెలియనట్టు నటించాడు.

    రిప్లయితొలగించండి
  4. రాజశేఖర రెడ్డి చనిపోయినందుకు అందరికంటే ఎక్కువ సంతోషించింది నేనే అనుకుంటాను. ఎందుకంటే 5 ఏళ్ళ క్రితం నల్లమలలో పులులులాగ తిరిగిన నా అభిమాన మావోయిస్టులు రాజశేఖర రెడ్డి వల్ల నల్లమలలో దాదాపుగా కనుమరుగు అయిపోయి పిల్లులులాగ బొరియల్లో దూరే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ నల్లమల అడవుల్లోనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కొండని గుద్ది చస్తే వాడి శరీరంలోని కొన్ని భాగాలు తీసుకెళ్ళలేక అక్కడే గెద్దలు, రాబందులకి వదిలేశారు. వాడి కొడుకేమో తండ్రి చనిపోయినందుకు బాధ పడకుండా తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ప్రయత్నించాడు. శని వదిలినందుకు సంతోషించకుండా ఆ శనిగాడి నామస్మరణం ఏమిటి?

    రిప్లయితొలగించండి
  5. ఫ్యాక్షనిజాన్ని, రాజకీయాలను కల గలిపి అక్రమ వ్యాపారాలను ఇబ్బడి ముబ్బడి గా పెంచుకోవడ మెలాగో కనిపెట్టి నందుకు రాశేరె కి ఉత్తమ ఆర్థిక వేత్తగా నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే. కోట్లు కోట్లు వాతాపి జీర్ణం చేస్తూ కూడా రైతు బాంధవుడి నంటూ గంగి గోవు ముఖం పెట్ట గలిగి నందుకు ఉత్తమ నటనలో ఆస్కార్ ఇవ్వాల్సిందే. అక్రమంగా ఆక్రమించిన అసైన్డ్ భూములను విధిలేక ప్రభుత్వానికి దఖలు పరిచి కూడా "అభినవ వినోభా" అని తనకు తానే కీర్తించు కున్నందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే. రాయల సీమకే పరిమితమైన ఫ్యాక్షనిజాన్ని రాష్ట్ర్రం మొత్తం వ్యాపింప జేసినందుకు రాష్ట్ర్రానికే ఈయన పేరు పెట్టినా తప్పు లేదేమో?

    రిప్లయితొలగించండి
  6. బడాయి ఎందుకు? మనం మాత్రం తక్కువ గడ్డి తిన్నామా? రాజశేఖర రెడ్డి చనిపోయిన వార్త వచ్చినప్పుడు నేను, కెక్యూబ్ వర్మ గారు తప్ప చాలా మంది బ్లాగర్లు అతన్ని పొగిడారు. జగన్ కి కాకుండా రోశయ్యకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వచ్చినప్పుడే రాజశేఖర రెడ్డి ఫాక్షనిస్ట్ అన్న విషయం గుర్తొచ్చిందా?.

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా రాసారు. నేను ఒబామాకు శాంతి బహుమతి అంటే ముందు నమ్మలేదు. నామినేట్ చేసారేమో అనుకున్నా... అయినా రేస్ లొ ఎవరున్నారో ప్రకటించకుండా ఇలా హఠాత్తుగా ఇచ్చేసారేమిటి?

    రిప్లయితొలగించండి
  8. మీరు చెప్పింది నిజమే ....మనం ఆశ్చర్యపోవటం ఏంటి విడ్డూరంకాకపోతే ! అసలే రోజుకో గందరగోళంలో పడికొట్టుకుంటున్నాం .
    పేపర్లో ఒబామా పెద్దబొమ్మ చూడగానే కొంపదీసిపోయాడా అనుకున్నా( పాపం పరిహరించుబడుకాక) చూపుకాస్త పక్కకితిప్పితే కనిపించింది "ఒబామాకు నోబెల్ శాంతిబహుమతి అని , నేనేమైనా అదిహేనేళ్ళుకోమాలోకి పోయానా అనుకుంటూ పైకి చూద్దునుకదా , మన్మోహనూ..రోశయ్యా జంటగా గగనవిహారం చేస్తూ ఉన్నారు నాకేంకాలేదని రూఢీచేసుకుని " పోనీలే ఎవరో ఎవరికో ఏదో ఇచ్చుకుంటే నాకెందుకు" అని పక్కపేజీకి వెళ్ళిపోయాను.

    రిప్లయితొలగించండి
  9. మా మనసులొ ఉన్నది మీరెలా రాశారబ్బా..?!? అందునా, అచ్చు పొల్లు పోకుండా!
    అనేక ధన్యవాదాలు. శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. ఇస్తే గిస్తే మంచి actor award ఇవ్వాలికాని, జిల్లా కు పేరు పెట్టటం మాత్రం నిజమయిన జోకే. ఇంకో రకంగా అలోచిస్తే ,
    రాత్రి పూట పిల్లిని చూసి భయపడే వాళ్లు ఎన్నికలలో మీసాలు, తోడలు కొడుతుంటే, తనకు అడ్డమవుతారనుకొన్న వాళ్లను వందలలో, పోలీసులను ఉపయోగించుకొని మరీ, చంపినవాడు గాలిలో ముద్దులు వదిలి దేముడు అయిపోవటం అంటే సామాన్యమయినా విషయమా!
    అంతకంటే ఎవరి పొలాలు ఎప్పటికీ రాని సెజ్ లకోసం లాక్కొన్నాడో, వాళ్లతొనే వోట్లు వేయించుకోవటం కూడా సామాన్యం కాదు!
    ఏ మతాన్ని అయితే కాల రాయాలని చూసాడో, ఆ మత పూజారులు, ఈ కిరస్తాని దేముడుకోసం గుళ్లలలో పూజలు చేసారంటే, అంత ఈజీయా!
    కాబట్టి మనం అందరం చనిపోయిన దేముడు కు ఏ భారత రత్నో ఇంకా రానందుకు ఆశ్చర్యపోవాలి కాని, ఓబామా కు నోబుల్ వచ్చినందుకు ఆశ్చర్యమెందుకు?

    రిప్లయితొలగించండి
  11. సూపర్బ్ గా రాసారండీ...మా మనసులో మాటని అలా దింపేసారు. అసలు జిల్లా పేర్లను మార్చడానికి వీళ్ళెవరండీ?? ఏదో వాళ్ళ నాయనలు సంపాదించినట్టు... దొంగ వెదవలు...రెపొద్దున్న ఇందిరమ్మ ఇళ్ళు తీసుకున్న ప్రతీ వాళ్ళు విదిగా వాళ్ళ సంతానం పేరు చివర్ల 'ఇందిర' అని తగిలించమన్నా అడుగుతారు లేదా అసలు గాందీ గారే స్వయంగా రాశేరె గా పుట్టి మనల్ని ఇప్పుడు ఉద్దరించారని అన్నా అంటారు...చీ..చీ..వీళ్ళకు అసలు ఆత్మసాక్షి అనేది ఉండదేమో!

    రిప్లయితొలగించండి
  12. చాలా బాగా వ్రాశారు.

    //మన కళ్ళెదురుగానే ఇళ్ళను ఎస్టేట్లుగాను, ఎస్టేట్లను సామ్రాజ్యాలుగాను మార్చుకున్నవాళ్ళకు మనం చేస్తున్న సత్కారం చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోంది. అవినీతి చక్రవర్తి అని ఆరోపణలు వచ్చిన వ్యక్తి చచ్చిపోగానే సదరు ఆరోపణలన్నీ సమసిపోతాయా? ఒక్కసారిగా అతడు దేవదూత అయిపోతాడా? హవ్వ!

    ఆశ్చర్యమా!, అసహ్యం కూడా కలుగుతుంది. అంత వెర్రి అభిమానమేంటో మరి!

    రిప్లయితొలగించండి
  13. అభిమానం కాదు, నటన. రాజశేఖర రెడ్డి రికమెండేషన్ తో లైసెన్సులు, కాంట్రాక్టులు తెచ్చుకున్న వాళ్ళు ఆడుతున్న నాటకం అది. ఫాక్షనిస్ట్ మీద అభిమానం ఏమిటి, శ్రాద్ధం కాకపోతే?

    రిప్లయితొలగించండి
  14. స్వజన, ఆశ్రిత పక్షపాతాన్ని ఒక సుగుణంగా కీర్తించి జనాల బుర్రల్ని దిమ్మెత్తించిన మీడియాని తిట్టుకోవాలి. జిల్లా పేరు మారుస్తున్నప్పుడయినా అందులోని ఔచిత్యాన్ని ప్రశ్నించగల ఒక్క కంఠస్వరం మీడియాలో వినిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. భావోద్వేగాలకు లొంగక నిష్పక్షపాతంగా అలోచించగలిగిన, నలుగురికీ చెప్పవలసిన బుద్ధిజీవులంతా ఏమయ్యారు?

    రిప్లయితొలగించండి
  15. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు తాను కూడా ఏడుస్తున్నట్టు నటించాడు, మీడియాతో పాటు తాను కూడా నారాయణా అన్నట్టు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అలా నాటకం ఆడినాడు కానీ కొంత మంది ప్రజలు (మన బ్లాగర్లు) కూడా ఏడుస్తున్నట్టు ఎందుకు నటించినట్టు? జగన్ కి కాకుండా రోశయ్యకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వచ్చినప్పుడే బ్లాగర్లు రాజశేఖర రెడ్డిని విమర్శించడం మొదలు పెట్టారు. మీడియా చెప్పినవన్నీ నిజాలు అని ఇంతకు ముందు మీరు నమ్మేశారా? రోశయ్య గారి విషయంలోనే అభిప్రాయం మార్చుకున్నారా? రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల మా బంధువులు ఎవరూ ఏడవలేదు. మా బంధువులలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకే లేని ఏడుపు సాధారణ ప్రజలకి మాత్రం ఎందుకు? రాజశేఖర రెడ్డి మీడియా సృష్టించిన హీరో అని అందరికీ తెలుసు. తెలిసి తెలిసి కూడా లేని ఏడుపు ఉన్నట్టు నటించడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  16. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు వాడు, వాడి కొడుకు చేసిన వ్యాపారాలని విమర్శించిన పత్రికలే వాడు చనిపోయిన తరువాత వాడిని హీరోని చేశాయి. ప్రపంచ బ్యాంక్ కి నెం 1 పెంపుడు తోడేలు అయిన చంద్రబాబుని కూడా పత్రికలు తీవ్రంగా విమర్శించాయి. రేపు వాడు చచ్చినా పత్రికలు వాడిని హీరోని చేస్తాయి. నిషేధించబడిన పార్టీలో పని చేసి ఎంకౌంటర్ లో చనిపోయిన నాయకుల్ని మాత్రం హీరోలని చెయ్యరు. పటేల్ సుధాకర్ రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, యెర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లు చనిపోయినప్పుడు పత్రికలు ఇంత పబ్లిసిటీ ఇవ్వలేదు. ఇప్పుడు చనిపోయిన వాడు కేవలం పాలక వర్గం వాడు కావడం వల్లే ఇంత పబ్లిసిటీ ఇచ్చాయి. పాలక వర్గం వాళ్ళు బతికి ఉన్నప్పుడు చెడ్డవాళ్ళు, చనిపోయిన తరువాత మంచి వాళ్ళు అని అన్ని పత్రికలూ నమ్ముతున్నట్టు నటిస్తాయి.

    రిప్లయితొలగించండి
  17. జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు దేశం పార్టీకి లాభం. ఎందుకంటే జగన్ కి రాజకీయ అనుభవం లేదు. అనుభవం లేకపోవడం వల్ల వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించలేడు. అప్పుడు రాష్ట్రాన్ని హోల్ సేల్ గా అమ్మేసే పొటెన్స్ ఉన్న చంద్రబాబు నాయుడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఔరంగజేబు చేసిన తెలివి తక్కువ పనుల వల్ల ముఘల్ సామ్రాజ్యం ఎలా బలహీన పడిందో, రాష్ట్రంలో కాంగ్రెస్ అలా బలహీన పడుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు దేశంకే లాభం అని తెలియక చాలా మంది తెలుగు దేశం అభిమానులు జగన్ ని విమర్శిస్తున్నారు. ఒక జిల్లాకి ఫాక్షనిస్ట్ పేరు పెట్టడం అంటే ఫాక్షన్ సంస్కృతిని గ్లోరిఫై చెయ్యడమే. అందుకే కడప జిల్లాకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం పై అభ్యంతరం చెప్పాను. అంతే కానీ నేను తెలుగు దేశం అభిమానిని కాదు. నా మనసులో ఏముందో తెలిసిన తెలుగు దేశం అభిమాని ఒకడు మాట్లాడుతూ "జిల్లాలకి ఏ పేర్లు ఉండాలి అనేది అనవసరం, జిల్లాల పేర్లు మార్చడం అవసరమా, కాదా అనేది ఆలోచించు" అంటూ తన మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడాడు.

    రిప్లయితొలగించండి
  18. చదువరిగారూ ! గత కొద్దివారాలుగా మీ బ్లాగంతా ఈ ప్రవీణ్ శర్మ అనే అతని వ్యాఖ్యలతో నిండిపోతోంది. ఇది మీ బ్లాగా ? ప్రవీణ్ శర్మ బ్లాగా ? నాకర్థం కావడంలేదు.

    రిప్లయితొలగించండి
  19. మీరు రాజశేఖర రెడ్డి అభిమానా? మీ ప్రశ్నలు ఆ డౌట్ నే కలిగిస్తున్నాయి. నేను http://maryamnamazie.blogspot.com బ్లాగ్ లో కూడా వ్రాస్తుంటాను. ఆ బ్లాగ్ నాది అనుకోవాలా? ఈ బ్లాగ్ లో నేను వ్రాసినవి తక్కువే. ఈ బ్లాగ్ లో నేను మెసేజెస్ వ్రాయకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు రాజశేఖర రెడ్డి అభిమాని కావడం వల్ల మీకు ఆ వ్యాఖ్యలు నచ్చలేదు అని డైరెక్ట్ గా చెప్పకుండా మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
  20. ప్రవీణ్ అన్నాయ్.. నువ్వు తగ్గొద్దు అన్నాయ్.. :-)

    రిప్లయితొలగించండి
  21. నా పేరులో రెడ్డి ఉంటే ఇంగ నేను వై.ఎస్.ఆర్ అభిమానినైపోతానా ? అసలు అతను రెడ్డే కాదు. ఒక దళితస్త్రీ కుమారుడైన క్రైస్తవుడు. నేనది కాదు. ఆ బేసిస్ మీద నాకతనిమీద అభిమానమేంది ? పగేంది ? అర్థం లేని విషయం. ఇక్కడ సగం కామెంట్లు మీవే కనపడుతూంటేను ఉండబట్టలేక చదువరిగారి నడిగేశాను. అడగొద్దంటే మానేస్తా.

    రిప్లయితొలగించండి
  22. @ ఓబుల్ రెడ్డి
    Please see the below comment

    http://anilroyal.wordpress.com/2009/10/06/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B9%E0%B0%B0%E0%B0%A3%E0%B0%82/#comment-1908

    రిప్లయితొలగించండి
  23. ప్రవీణ్ శర్మ: ఓబుల్ రెడ్డిగారు రాసింది చూసారు కదా, నా అభిప్రాయమూ అదే. టపాతో సంబంధముందా లేదా అన్నది చూడకుండా రాసిపారేసి, నా బ్లాగంతా మీరే కనిపిస్తున్నారు. దానికితోడు అర్థంపర్థంలేని ఆరోపణలు!

    ఇకపై వ్యాఖ్యలను సూటిగా, టపా విషయంపైనే రాయండి. అనుచితమైన దాడులకు పాల్పడకండి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు