3, సెప్టెంబర్ 2009, గురువారం

రాజశేఖరరెడ్డి మరణం, ఆ తరవాత

సంచలనాల జీవితం సంచలనంగానే ముగిసింది. అరవయ్యో యేట రాజకీయాలనుండి విశ్రాంతి తీసుకుందామనుకున్నా, అలా జరగలేదు. ప్రతి మనిషికీ తన జీవితంలో చేసిన పనులను, తను సాధించినవిజయాలను నెమరు వేసుకుని, తన తప్పొప్పులను సమీక్షించుకునే అవకాశం బహుశా వానప్రస్థంలో కలుగుతుంది. కానీ వై.ఎస్‌కు ఆ అవకాశం లేకపోయింది. ముఖ్యమంత్రిగా తీరుబడిలేని జీవితం గడుపుతూండగానే అర్థంతరంగా  జీవిత ప్రయాణం ముగిసింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఐదుగురి కుటుంబసభ్యులకూ నా సానుభూతి.


24 గంటల వెతుకులాట తరవాత దుర్ఘటన స్థలాన్ని కనుక్కోగలిగారు. ఒక ముఖ్యమంత్రి కనబడకుండాపోతే కనుక్కోవడానికింతసేపా అని విమర్శలొచ్చాయిగానీ, బహుశా అది తప్పని ఆలస్యమేమో! ప్రమాదం జరిగిన ప్రాంతం ఎంతో దుర్గమమైనది కావడం, ఆ హెలికాప్టరులోని 'ఈయెల్టీ'యో ఏదో.., దాన్నుండి సిగ్నళ్ళేమీ రాకపోవడం, వాతావరణ ప్రతికూలత, ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ఆలస్యం అర్థం చేసుకోదగినదే ననిపిస్తోంది. అయితే అసలు గాలింపు చర్యలు మొదలవడమే ఆలస్యం జరిగిందని ఒక ఆరోపణ ఉంది -దాని వివరాలు బహుశా రాబోయే రోజుల్లో తెలుస్తాయి.

ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వం బాగా పనిచేసినట్టుగా కనిపించింది. వేలాదిమందితో కూడుకున్న ఆదుకోలు జట్లను సమన్వయపరచడం, కనీసం మూడుచోట్ల యాక్షను కేంద్రాలను నిర్వహించడం, సహజంగా సంఘటన పరంగా ఉండే విపరీతమైన వత్తిడికి తోడు, ప్రజలు నాయకులు, మీడియాల వత్తిడి, దీనికితోడు సంఘటన పట్ల ప్రజల్లో రాగల రాకూడని స్పందన,  వీటిని తట్టుకుని రోశయ్య, రమాకాంతరెడ్డి పనులు చక్కబెట్టిన విధానం బాగానే ఉంది. 

టీవీల వార్తాప్రసారాలు మొత్తమ్మీద బానే ఉన్నాయి. మేం ముందు ప్రసారం చేసామంటే మేమే ముందు చేసామని చెప్పుకోడంలో పోటీ పడ్డారు. చర్చలు చాలావరకూ అర్థరహితంగా సాగాయి. కానీ హైలైటేంటంటే.. హెచ్చెమ్ టీవీవాడు వై.యెస్ గొంతుతో మాట్టాడించిన చివరి సందేశం..  చాలా ఉద్వేగం కలిగించేలా ఉంది. ఆ సందేశంలో ఒక భాగం.. "నేను దూరమైపోతున్నానని బాధపడుతున్నారా? బాధపడకండి.. నిండుగా నీళ్ళతో కళకళ్ళాడే ప్రాజెక్టుల్లో నేనే ఉంటాను. పేదవాడి ఇంటి వెలుగుల్లో నేనే ఉంటాను. ఆడపడుచుల కంటి వెలుగుల్లో నేనే ఉంటాను.."  (సరిగ్గా ఇదే కాదుగానీ, కొద్దిగా ఇలాగే ఉంటుంది.) ఇలా ఉద్వేగంగా సాగింది ఆ సందేశం.  

రాజకీయాలాట మొదలు.. 
ఓ పక్కన వై.యెస్ మరణించాడని తెలిసీ తెలీయగానే , రాజకీయాలాట మొదలైంది.  జగన్నే ముఖ్యమంత్రిని చెయ్యాలని డిమాండ్లు మొదలెట్టారు. కెమెరా ముందుకు రావడం, మైకు పట్టుకోని ఓ ఏడుపేడవడం, ఆపైన 'జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేద'ని చెప్పడం -ఇదీ నాటకం. మంత్రులంతా ఒకచోట చేరి ఒకరి తరవాత ఒకరు ఇదే వరస! అలాగనక జరక్కపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి పారేస్తామని కూడా ఒకళ్ళిద్దరు చెప్పారు. పదవి బదిలీ సమయంలో మరో అభిప్రాయం తలెత్తకుండా ముందే జాగర్తపడుతూ అధిష్ఠానమ్మీద పెడుతున్న వత్తిడిది.

ఆశ్చర్యమేమీ కలిగించడం లేదు కాంగ్రెసు నేతల స్పందన. చూద్దాం అధిష్ఠానం వివేకంతో వ్యవహరిస్తుందో లేక మనల్ని పెనం మీంచి పొయ్యిలోకి తోస్తుందో ! వివేకంతో వ్యవహరించడానికి రోశయ్య రూపంలో అవకాశం ఉంది కూడాను. ఎలాగూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు (ఆపత్థర్మంగా) , ఆయన్నలాగే కొనసాగిస్తే బాగుంటుంది.

తాజా వార్త:  జగన్నే ముఖ్యమంత్రిగా చెయ్యాలని మంత్రివర్గం తీర్మానించిందంట.
ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? లేక కాంగ్రెసు పార్టీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గమా?

33 కామెంట్‌లు:

  1. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మీ కోరిక (రోశయ్య) నెరవేరే అవకాశం కనిపించడం లేదండీ.. కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు.. అయినా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. చూద్దాం.. ఏం జరుగుతుందో... ఎన్నికలు వస్తే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు కదా

    రిప్లయితొలగించండి
  2. రోశయ్య సలహాల వల్లే రాజశేఖర రెడ్డి వరల్డ్ బ్యాంక్ అప్పులు తగ్గించాడు. ఆర్థిక అంశాలలో ఉన్న రోశయ్యని కాకుండా అనుభవం లేని జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యడం ఆశ్చర్యకరమే.

    రిప్లయితొలగించండి
  3. మరణ వార్తను జీర్ణించుకోకముందే ఈరకమైన "ఓవరాక్షను" చూడాల్సిరావడం మన దౌర్భాగ్యం..

    రిప్లయితొలగించండి
  4. రోశయ్య is the best choice.

    "మరణ వార్తను జీర్ణించుకోకముందే ఈరకమైన "ఓవరాక్షను" చూడాల్సిరావడం మన దౌర్భాగ్యం.." RighttO! మనోళ్ళకి తమని తాము నాయకులుగా మల్చుకోవటం తెలియదు. ఇతరులు నాయకులైతే ఆనందించటం తెలుసు. హిహిహి

    రిప్లయితొలగించండి
  5. నేను కూడా మొదట రోశయ్యే ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాను. రోశయ్యని కాకుండా ఇంకొకడిని ముఖ్యమంత్రిని చేస్తే కాలుతున్న కాగడాతో తలగోక్కోవడం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  6. కాంగ్రేస్ కి ఇది దుర్దినం. మళ్ళీ కాంగ్రేస్ వాదులు తమ చెంచాలను కడుక్కుని థళథళ లాడెలా చేస్కుని వస్తారు. మళ్ళీ 1991 పునరావృతం అవుతుంది.

    రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ?
    సమర్ధవంతంగా కాంగ్రేస్ గొర్రెలని కట్టిపడేయగల దమ్ము, సత్తా ఉన్న నాయకుడు ఎవరు?

    రిప్లయితొలగించండి
  7. నా ఉద్దేశ్యం జైపాల్ రెడ్డి అయితే బెటర్ అని. చూద్దాం, కేంద్రం వరకే పరిమితమయిన కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు, ఆంధ్రా కు కూడా అంటకడతారేమో!!. అలా అయితే మాత్రం పెనం లోనుండి , పొయ్యి లో పడినట్లే ప్రజల పరిస్థితి.

    రిప్లయితొలగించండి
  8. పురందరేశ్వరి అయితే.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. అవిడ సమర్దురాలు..+ ఎన్ టి ఆర్ ఫేమిలి. ఇంక చంద్రబాబు కి సీన్ వుండదు.

    రిప్లయితొలగించండి
  9. రొశయ్య కి పురందరేశ్వరికి కి వున్న మాస్ అప్పేల్ వుండదు.

    రిప్లయితొలగించండి
  10. "రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ?" - రాజకీయ వ్యవహారాల విషయంలో లేరు. పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నారు.

    రోశయ్య: పాలనాసమర్ధత, అభ్యర్థిత్వం పట్ల అందరిలోకీ అతి తక్కువ వ్యతిరేకత.
    జైపాల్‌రెడ్డి: పాలనానుభవం ఉన్నప్పటికీ, వై.ఎస్ వర్గం నుండి వ్యతిరేకత ఉంటుంది.
    పురందరేశ్వరి: అనుభవం తక్కువ, వై.ఎస్ వర్గం నుండి వ్యతిరేకత.

    రిప్లయితొలగించండి
  11. రోశయ్య అభ్యర్థిత్వం పట్ల అందరిలోకీ అతి తక్కువ వ్యతిరేకత ఉండే మాట నిజమే కాని, పాలనా సామర్ధ్యం మాత్రం తక్కువ అనే చెప్పాలి. చీరాల నియోజకవర్గ వోటరు గా అది మాత్రం చెప్పగలను. తను ఓ మంత్రి గా మా నియోజకవర్గానికి చేసింది లేకపోగా ప్రస్తుతం ఓ గుండాను ( 2 కోట్లు తీసుకొని మరీ) తెచ్చి మా నియోజకవర్గం నెత్తిన పెట్టాడు. తను ఇచ్చిన వాగ్దానాలను (కొన్నిటినయినా) అమలు చేద్దాము అన్న స్ప్రుహ కనిపించలేదు. మరి ఇప్పుడు పీఠం మీద కూర్చోపెడితే మారి మంచి పరిపాలన్ అందిస్తాడెమో చూడాలి.

    ఇక జైపాల్ రెడ్డి అయినా, పురంధరేశ్వరి అయినా కాస్తో కూస్తో హుందా గలిగిన నాయకులు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడి నుండి అధినాయకత్వానికి అవసరమయిన "మూటలు" పంపగలిగిన సమర్ధత ఉందో లేదో అన్న అనుమానాలు మాత్రం అందరకు ఉన్నాయి.

    ఏది ఏమయినా ఇక ముంది కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు (అధికారం కోసం మతకలహాలు సృష్టించటం లాంటివి) మొదలవకుండా ఉంటే చాలు.

    రిప్లయితొలగించండి
  12. హై కమాండ్ ఆశీస్సులు మర్చిపొయారు. హై కమాండ్ లొ ఎవరికి ఎక్కువ ఇంఫ్లుయన్స్ వుంటే వారికే చాన్స్ ఎక్కువ. జైపాల్‌రెడ్డి, పురందరేశ్వరి ఆ విషయం లొ రోశయ్య కన్నా ముందుంటారు.
    జగన్ కాకుండా ఇంక ఎవరయినా ఒకే. నా వొట్ మాత్రం 1. జైపాల్‌రెడ్డి 2. రోశయ్య

    రిప్లయితొలగించండి
  13. Krishna -
    ఇప్పుడు 'కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు' కు సీన్ లెదండి. ఇప్పుడు రిమొట్ అంతా డిల్లి లొ వుంది. 25 సంవత్సరాల క్రితం పరిస్తితి.

    రిప్లయితొలగించండి
  14. >> "పురందరేశ్వరి అయితే.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. అవిడ సమర్దురాలు..+ ఎన్ టి ఆర్ ఫేమిలి. ఇంక చంద్రబాబు కి సీన్ వుండదు"

    ఆ పని జరగదు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల పగ్గాలూ ఒకే కుటుంబం చేతిలో పెట్టినట్లవుతుంది అలా చేస్తే. రామారావు కూతురు కావటమే ఆవిడకున్న మైనస్ ప్రస్తుతం.

    రిప్లయితొలగించండి
  15. జైపాల్ రెడ్డికే అవకాషం ఎక్కువ అనిపిస్తుంది. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్ది లేదా డీయస్ లాంటి వాళ్ళకి రావచ్చు.జగన్ కి అవకాషం లేకపోవచ్చు. అంతగా ఇవ్వాలనుకుంటే కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చు. ఏమైనా సోనియా మంచి నిర్ణయమే తీసుకుంటారనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  16. Krishna: నియోజకవర్గానికి ఏమీ చెయ్యకపోవడం పరిపాలనానుభవానికి సంబంధం ఉన్నప్పటికీ అంత ముఖ్యమైనది కాదేమో.

    మంచు పల్లకీ: నిజమేనండి, అసలు కావాల్సింది హైకమాండు ఆశీస్సులే. అసలందుకే.. హైకమాండుపై వత్తిడి తెచ్చేందుకే, తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పేందుకే ఇప్పటి ఈ సంతకాల ఉద్యమం. అన్నట్టు, సీడబ్ల్యూసీ సమావేశం ఈసరికే ఒకసారి జరిగింది.

    అబ్రకదబ్ర: మంచి పాయింటే!

    శివ బండారు: కిరణ్ కుమార్‌కు అవకాశం లేదనిపిస్తోంది. డీయెస్ కూడా కొంత ఆశావహంగానే ఉన్నట్టుంది, ఆయన చెప్పిన మాటలు చూస్తే. ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తాడేమో.

    రిప్లయితొలగించండి
  17. *జగన్ ముఖ్య మంత్రై - మంత్రివర్గం తీర్మానం*
    మూలం సాక్షి దినపత్రిక
    http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=310383&Categoryid=14&subcatid=0

    రిప్లయితొలగించండి
  18. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు పార్టీలో రోశయ్యని తప్ప వేరే ఎవరినీ నమ్మేవాడు కాదు. స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్య రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న వాడు కనుక రోశయ్యకి ఇవ్వడమే బెటర్.

    రిప్లయితొలగించండి
  19. జగన్ వేస్టు ఛాయిస్! కానీ జగన్ కే అవకాశం! జగన్ ముఖ్యమంత్రి కాకపోతే కొండా సురేఖ మంత్రి వర్గంలో ఉండనని బెదిరిస్తోంది. అమ్మో నాకు భయమేస్తోంది, సురేఖ మంత్రిగా లేకపోతే ఎలా? రాష్ట్ర ప్రజలంతా ఏమైపోతారు?

    రోశయ్య ని కొనసాగించడమే కరక్టు!( లేదంటే జైపాల్ రెడ్డి)! కానీ పట్టుమని పది రోజుల పాటు కూడా ఉండనిచ్చేట్లు లేరు.

    వారసత్వ రాజకీయాలకు రాచబాటలు వేసిన కాంగ్రెస్ జగన్ ని ఎన్నుకోవడం కంటే వివేకవంతమైన నిర్ణయం తీసుకుంటుందని ఎలా అనుకోగలం? "(కాంగ్రెస్)జనాభిప్రాయం" కూడా అలాగే ఉందని మీడియా ఘోషిస్తోందిగా!

    రాజీవ్ హత్య జరిగినపుడు రాహుల్ చిన్నవాడు కాబట్టి కానీ, లేకపోతే పీవీ ప్రధానమంత్రి అయ్యే ఘట్టం భారత చరిత్రలోనే ఉండేది కాదు.

    రిప్లయితొలగించండి
  20. ఇప్పటి పరిస్థితులలో రోశయ్య కే పట్టం కడతారు. పురందరేశ్వరి కట్టనివ్వరు రెడ్డి సమాజ వర్గం. మూడేళ్ళ తరువాత జగన్కు power బదిలీ చేస్తారు.

    ఏది ఏమైనా పాపం రోజా. పది కోట్లు & TTD చైర్మన్షిప్పు వర్షంలో కొట్టుకు పాయె...ఐరన్ లెగ్గు రోజాకి ముందు రోజులు కష్టమే.

    రిప్లయితొలగించండి
  21. రోశయ్య గారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనడం విచారకరం. అది కాంగ్రెస్ లో జగన్ వర్గీయుల ఆకాంక్షే తప్ప అసలు అలాంటి పోస్టేదీ రాజ్యాంగం ప్రకారం లేదు. ఉన్నది ముఖ్యమంత్రిపోస్ట్ ఒక్కటే, సర్వకాల సర్వావస్థల్లోను ! వాస్తవం ఇది కాగా మన మీడియా కూడా ఈ అజ్ఞానపూరిత వాడుకలు చెయ్యడం - ఈ దేశంలో అనుభవానికీ, సమర్థతకీ కాక సంచలనాలకీ, వారసత్వాలకీ ఎంత ప్రాధాన్యం సృష్టించబడిందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో రోశయ్యగారు తప్పకుండా కొనసాగుతారు. కొనసాగాలి కూడా. రాష్ట్రకాంగ్రెస్ లో అంతకంటే పెద్దదిక్కు లేరు. ఒకప్పుడు పి.వి.నరసింహారావు గుఱించి ఇలాగే తాత్కాలికం అనుకున్నారు. మన్మోహన్ సింగ్ గుఱించి కూడా అలాగే అన్నారు. కానీ ఆ వ్యక్తి చేతుల్లోనే భారతదేశ జాతకం ఒక మలుపు తిరగబోతుందని ఊహించలేకపోయారు. ఏకుల్లా ప్రవేశించినవాళ్ళే కాలక్రమంలో మేకులవుతారు.

    ముఖ్యమంత్రి అవ్వడానికి జగన్ కి ప్రస్తుతం ఏ అర్హతా లేదు. వయసు కూడా చాలా చిన్నది (36 ఏళ్ళు) అతను ఈ మధ్యనే ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించాడు. కనీసం ఒక్కసారైనా ఒక ఎమ్మెల్యేగా చేసిన అనుభవం లేదు. అదీ గాక కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్రంలోనే తప్ప రాష్ట్రాల్లో ఆనువంశిక పాలనని అనుమతించిన దాఖలాలు లేవు. జగన్ ప్రస్తుతానికి ఒక ముఠానాయకుడుగా మిగలక తప్పదు. వచ్చే ఎన్నికల దాకా ఓర్పుపట్టకా తప్పదు.

    రిప్లయితొలగించండి
  22. రెండు ప్రధాన రాజకీయ కులాలు (కమ్మ, రెడ్డి) డామినేషన్ తగ్గాలంటే రోశయ్య ముఖ్యమంత్రి కావలసిందే. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రాష్ట్రాన్ని బ్రాహ్మణులు ఏలితే ఇప్పుడు కమ్మ, రెడ్డి కులస్తులు ఏలుతున్నారు. రోశయ్య ఆర్థికంగా ముందున్న వైశ్య కులానికి చెందినవాడైనప్పటికీ రెండు భూస్వామ్య కులాల డామినేషన్ తగ్గాలంటే అతనికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి
  23. రోశయ్యే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అర్హుడూ, సమర్థుడూ కూడా. అయితే రోశయ్యకు ఒక బలమైన ఆసరా ఒకటి కావాలి. (పీవీకి మన్మోహన్ లభించినట్లుగా) ఏ పొన్నాల లక్ష్మయ్యో, జైపాల్ రెడ్డో, పురందేశ్వరో ఆ ఆసరా అందివ్వగలిగితే కాంగ్రెస్ ను తిరిగి అగ్రస్థానాన నిలబెట్టగలడు.

    "ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? లేక కాంగ్రెసు పార్టీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గమా?"

    అంటే ఇదివరకు ఉన్న మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్ మీద అవ్యాజానురాగాలతో ఏర్పాటు చేశారని మీ అభిప్రాయమా? మీకు కాంగ్రెస్ మీద ఇంత సదభిప్రాయం ఉన్నందుకు మెచ్చుకోవాల్సిందే.

    రిప్లయితొలగించండి
  24. "ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? లేక కాంగ్రెసు పార్టీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గమా?"
    ఇంతవరకూ, నవీనకాలంలో *ఆంధ్రపదేష్ కోసం ఏర్పడిన మంత్రివర్గం* ఏప్పుడైనా ఏర్పడిఉంటే దయచేసి ఎవరైనా తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  25. భాస్కర్ రామరాజు: రేపు ఇదే మంత్రివర్గం - మంత్రివర్గం, కాంగ్రెసుపార్టీ కాదు సుమండీ - ఫలానా గన్నయ్య గారి అబ్బాయి ఇంజనీరింగులో మెకానికలే తీసుకోవాలి, ఎలక్ట్రానిక్సు తీసుకోకూడదు అని తీర్మానం చేసిందనుకోండి.. అప్పుడు కూడా నవీనకాలంలో.. అని స్టేట్‌మెంటిస్తారా? లేక ఆడెవుడి సంగతో మీకెందుకురా, ముందు మీరు పరిపాలన సంగతి చూడండి అంటారా?

    గన్నయ్యగారి అబ్బాయి ఏ బ్రాంచిలో చేరాలనేది, కాంగ్రెసు పార్టీకి ఎవరు నాయకుడిగా ఉండాలనేది మంత్రివర్గానికి సంబంధించినంతవరకు - మంత్రివర్గానికి సంబంధించినంతవరకు - ఒక్ఖటే! మీరేమంటారు?

    రిప్లయితొలగించండి
  26. ....బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రాష్ట్రాన్ని బ్రాహ్మణులు..."

    ఇది సరికాదు. బ్రాహ్మణులు ఒక వర్గంగా, కులంగా ఎప్పుడూ సమాజాన్ని డామినేట్ చెయ్యలేదు. ఇది చాలా అపార్థం చేసుకోబడ్డ విషయం. బ్రాహ్మల ఆధిపత్యం ఆధిపత్యం కిందికి రాదు. ఎందుకంటే వాళ్ళకి చరిత్రలో సాఫ్ట్ పవరే తప్ప హార్డ్ పవర్ ఎప్పుడూ లేదు. వాళ్ళు దాన్ని కోరుకోలేదు కూడా ! కొంతమంది బ్రాహ్మణులు తమ వ్యక్తిగత ప్రతిభతో పైకొచ్చినట్లు చారిత్రిక ధారాలున్నాయి. కానీ అటువంటివాళ్ళకి కులపరంగా ఏ విధమైన సపోర్టు లేదు. వాళ్ళు స్వయంగా ఏ పై పదవుల్నీ అధిష్ఠించలేదు. వాళ్ళని ఇతరులు ప్రేమతో ఆదరించి ఎంపిక చేసి కూర్చోబెడితే కూర్చున్నారు. ఇప్పుడలా ఆదరించేవారు లేరు కనుక కూర్చోవడంలేదు. వాళ్ళ నాయకత్వాన్ని ఈనాటి ఆధిపత్య కులాల సామూహిక డామినేషన్ తో ఎంతమాత్రం పోల్చలేం.

    --తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  27. టంగుటూరి ప్రకాశం పంతులు గారి కాలం తరువాత రాష్ట్రం రెండు భూస్వామ్య కులాల పొలిటికల్ ఎస్టేట్ గా మారింది. ఓ సారి ఇంకో ప్రధాన భూస్వామ్య కులం (వెలమ) నుంచి జళగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య (మాజీ కేంద్ర మంత్రి) లాంటి సీనియర్ నాయకులు ఇతర కులాల నుంచి వచ్చారు. రోశయ్య కూడా సీనియర్ నాయకుడే. రోశయ్యకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పరిస్థితి కొంత వరకు మారుతుంది.

    రిప్లయితొలగించండి
  28. మద్యలొ కులం ఎందుకు కానీ ఎవరు సమర్దులొ చూడండి. జైపాల్ రెడ్డి గారు, రొశయ్య గారు, పురందరేశ్వరి గారు, పళ్ళం రాజు గారు(కాకినాడ) , జగన్ గారు.
    ఎవరికి చాన్స్ వుందొ..

    రిప్లయితొలగించండి
  29. చదువరి గారూ -
    ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, వాళ్ళవాళ్ళ రాజకీయ పరిధుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారే కాని, నిజమైన ప్రజాసేవ *అవసరమైన* పరిపాలన చేయరు చేయలేరు కూడా అని నా భావం.
    ప్రతీవాడు తన స్వార్ధంకోసం, తన కోటరీకోసం, తన వెనుకన ఉన్న బిజినెస్ వర్గం లాభం కోసమే చూస్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా. ఐతే, మిగతావాళ్ళకి మనకి తేడా చట్టం+న్యాయం+ఫెవీకాల్+రాజకీయకోటరీ.
    కాబట్టి *రాష్ట్రం కోసం ఏర్పడిన ప్రభుత్వాలు* బహుశా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డపుడో ఆతర్వాతదో ఐఉండవచ్చు కానీ, తర్వాత లేవు. ఇక రావేమో కూడా.

    రిప్లయితొలగించండి
  30. భాస్కర్ గారూ, ఏ ముఖ్యమంత్రైనా తన పరిధుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు -నిజమే! తన స్వార్ధం, తన కోటరీ, తన వెనుకన ఉన్న బిజినెస్ వర్గం -నిజమే!
    కానీ, మాకు ఫలానా వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని స్వయానా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ రాజకీయపార్టీ నాయకుడికి మంత్రివర్గతీర్మానం ద్వారా అర్జీ పెట్టుకుంటాడా? అదీ ఇదీ ఒకటేనా?

    రిప్లయితొలగించండి
  31. రవి: :) కాంగ్రెసు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఔను, దానికిది సహజగుణం!

    రిప్లయితొలగించండి
  32. మన రాష్ట్రంలో ఇప్పుడు ఇలా ఆలోచించే వివేకవంతులు ఉండరేమో అనుకున్న. కొందరికైనా వివేకంతో అలోచిస్తున్నందుకు సంతోషంగా వుంది.

    రిప్లయితొలగించండి
  33. ఏది ఎలా జరిగినా మళ్ళీ రష్ట్రంలో 1990-1994 శకం రాకూడదని నా ఫ్రార్ధన. చెన్నారెడ్డి , కోట్ల , నేదురుమల్లి పాలించిన కాలం లో అంతటా అరాచకాలే కదా. ప్రస్తుతం ఒక్క దివాకర్ రెడ్డి తప్ప అలాంటివారెవరూ లెరు . రోశయ్య ని CM గా ఉండనిచ్చి జగన్ కి మంచి కాబినెట్ పదవి ఇస్తేనే మంచిది .

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు