24, ఆగస్టు 2009, సోమవారం

హిందూమతంపై దాడి


* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ' హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ' అని చెప్పాడు.


* మనదేశంలో మతమార్పిడి చెయ్యడం ఎంత చురుగ్గా జరుగుతోందో మనకు తెలుసు. ఈ మతబేహారులు చాపకింద నీరులాగా సమాజమంతా పాకి ఉన్నారు. డబ్బులు ఎరవేసి, ప్రజల మతం మారుస్తారు. కానీ మతం మార్చాక కూడా వాళ్ళను హిందువులుగానే చెలామణీ చేయిస్తారు. హిందువులకుండే రిజర్వేషనులు అనుభవించాలిగదా మరి! హిందువులుగా చెలామణీ అవుతున్న కొందరు హిందువులు కారు. హైందవం వద్దనుకుని బయటికిపోయినవారు .
~~~~~~~~~

కోదండరామస్వామి గుడిలో పూజారి దేవుడి నగలను తాకట్టు పెట్టుకున్నాడు. పూజారి చేసినది తప్పే. అందుకు తగిన శిక్ష పడాల్సిందే. ఇంకా అలాంటి తప్పులెక్కడెక్కడ జరిగాయో అవన్నీ కూడా తేలాలి, శిక్షలూ పడాలి. తప్పు చేసినది పూజారైనా పడాలి, ప్రభుత్వ అధికారైనా పడాలి. అడ్డదారినో దొడ్డిదారినో గుడుల్లోకి జొరబడ్డ రాజకీయులైనా సరే శిక్ష పడాల్సిందే! గతంలో తప్పులుచేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి. హైదరాబాదులోని తితిదే సత్రంలో తాగి తందనాలాడినవాళ్ళను ఏంచేసారో చెప్పాలి. ఆ తాగుబోతుల నాయకుణ్ణి ఏంచేసారో చెప్పాలి. తితిదే పాలక సంస్థలోకి ప్రత్యేక ఆఫీసరు పేరిట అర్హత లేనివాళ్ళు ఎలా వచ్చారో చెప్పాలి.గుడుల్లో అన్యమతప్రచారం చేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి.

~~~~~~~~~

కానీ వీళ్ళందరినీ శిక్షించినంత మాత్రాన పరిస్థితులు చక్కబడతాయా? హైందవ ద్వేషులు అక్కడితో ఆగుతారా? అసలు కథ ఇంకోటుంది. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని గుడులమీద ప్రభుత్వ పెత్తనాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. 'చ్చొ..చ్చొ..చ్చొ చూసారా.. దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. దీనిమీద ప్రభుత్వ ఆజమాయిషీ మరింతగా పెరగాలి' అంటారు. నగల సంగతి చూట్టానికి ఇంకో అధికారిని వెయ్యాలంటారు. ఆ తరవాత ఆ నగలు, డబ్బులన్నిటినీ ఒకచోటికి తరలించి ప్రభుత్వ నియంత్రణలో పెడదామంటారు.  అసలు పూజారులందరూ అధికారుల పర్యవేక్షణలోనే మంత్రాలు చదవాలంటారు. గుడులను, ఆచార వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి తెచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తారు. ప్రభుత్వం మనదే కదా, మనమెందుకు వద్దనాలి?

~~~~~~~~~~

  1. దేవాదాయశాఖ మంత్రి 'హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు' అని చెప్పాడు. ఇలాంటివాళ్ళు మనకు మంత్రులుగా ఉన్నప్పుడు హిందూమతానికి రక్షణ ఏముందిక? హైందవమంటే ఏమీ తెలవనివాడు గుడిలో కార్యక్రమాలను నిర్వహిస్తాడు. హిందవమంటే ద్వేషం కలిగినవాడూ గుడిలో పనులు చేస్తాడు. ఎంత నీచమైన ఆలోచనో చూడండి. పైగా దేవాలయాల వ్యవహారాలను చూడాల్సిన మంత్రి ఆలోచన ఇది.
  2. మతబేహారుల చేతుల్లో మతమార్పిడికి గురై అస్తిత్వం కోల్పోయి, కొత్త ముఖాలు, కొత్తపేర్లు  తెచ్చుకుంటారే.. వీళ్ళు హిందువుల్లాగానే చెలామణీ అవుతూంటారు. ప్రభుత్వ లెక్కల్లో తమను హిందువులుగానే రాయించుకుంటారు. ఈ దొంగ హిందువులు కూడా మిగతావాళ్ళలాగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. అందుకు ఆక్షేపణేమీ లేదు. వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ చేరతారు. వాళ్ళే గుడుల్లో అధికారులూ అవుతారు. వాళ్ళే గుడి రోజువారీ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. హిందువుకానివాళ్ళు హిందూ దేవాలయ వ్యవహారాలు చూస్తూ ఉంటారు! పైకి వాళ్ళు హిందువులే, కానీ కేవలం ప్రభుత్వ లెక్కల్లోనే హిందువులు, అంతే! దేవాలయ వ్యవస్థను కూలగొట్టడానికి ఇది చాలదా?

వీటి పర్యవసానాలు హిందూమతానికి, మత కేంద్రాలైన గుడులకూ చేటు. మనందరం ఈ ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి. గుడుల్లో ఏ పని ఏ కులస్తుడు పనిచేసినా తప్పులేదు. కానీ ఏ మతస్తుడైనా చెయ్యొచ్చనడం మాత్రం తప్పు! అసలా మాట అనడమే హిందువులకు అవమానం! అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?

హైందవాన్ని అణచేద్దామని మాటేసి ఉన్న కేటుగాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మతమార్పిళ్ళను వ్యతిరేకించాలి. మతమార్పిళ్ళను, మతం పేరిట దేశంలోకి డబ్బు రాకడను నిషేధించాలి. మతమార్పిడి రానున్న కాలంలో మనమెదుర్కోబోతున్న అతిపెద్ద సామాజిక సమస్య. హిందువులెందరో, దొంగ హిందువులెందరో, ఇతర మతస్తులెందరో సరిగ్గా లెక్కతేల్చాలి. ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు, ఇతర మతాలు హిందూమతమ్మీద చేస్తున్న గుట్టుచప్పుడు దాడిని ఎదుర్కోవాలి.

----------------------         ---------------------          --------------------

8 కామెంట్‌లు:

  1. అలాగే చర్చి లొ , మసీదుల్లొ పనిచేసెవాళ్ళు ఆ యా మతాల వాళ్ళె కానవసరం లేదు అని కూడా చెప్పరా ఆ మతిలేని మంత్రి గారు?

    రిప్లయితొలగించండి
  2. దొంగదారిలో రిజర్వేషన్లు అనుభవించీ అనుభవించీ వాళ్ళకీ బోరెక్కిందిలెండి. అందుకనే దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లంటూ రాజమార్గంలోనే వాటిని కొట్టెయ్యాలని చూస్తున్నారు.అదేమంటే మతం మారినా కులవిచక్షణకి బలవుతున్నామని రాగాలు తీస్తున్నారు. మరి క్రైస్తవంలో కులాలు లేవని చెప్పి కదా వాళ్ళ ఫాదర్లు వాళ్ళని మతం మార్చారు. మళ్ళీ కులాలున్నాయంటారేంటి ? అని ఆ ఒక్కటీ మనం అడక్కూడదు. దళిత క్రిస్టియన్లకి రిజర్వెషన్లిచ్చాక మతమార్పిళ్ళు ఇంకా విజృంభిస్తాయి. ఎందుకంటే మతం మారిన ప్రతివాడూ తాను దళితుణ్ణనే చెప్పుకోవడం మొదలుపెడతాడు. దళితులు దళితులమని నిరూపించుకునే అవసరం లేదు. అలా క్లెయిమ్ చేస్తే చాలు, వాళ్ళు దళితులే అవుతారు. ఎందుకంటే దళితుల దగ్గర పూర్వీకులిచ్చిన కాయితాలేవీ ఉండవనేది ఒక లోపాయికారీ అవగాహన ప్రభుత్వంలో !

    రిప్లయితొలగించండి
  3. "వీటి పర్యవసానాలు హిందూమతానికి, మత కేంద్రాలైన గుడులకూ చేటు. మనందరం ఈ ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి. గుడుల్లో ఏ పని ఏ కులస్తుడు పనిచేసినా తప్పులేదు. కానీ ఏ మతస్తుడైనా చెయ్యొచ్చనడం మాత్రం తప్పు!"
    This sounds right. Possibly a committee of local representatives, govt. representatives and Hindu scholars? There is an interesting story from Kashmir:
    http://www.tribuneindia.com/2009/20090505/main8.htm
    "Talking to The Tribune, he said, “We have guarded this place for the Hindus. It is their “amanat”. But now the situation has improved. We want that a Hindu priest should take over this holy place. Being Muslims, we tried to do whatever best we could to keep the temple functional, but it should ideally be run by a Hindu priest”.

    Further Abdullah and Hassan say their daily prayer includes a special mention to the Hindus when they say, “Lord, the heaven on earth is here in the valley. Please facilitate the return of our Hindu brothers from the hell outside”."

    రిప్లయితొలగించండి
  4. మీ దృష్టి ఒకచోట గురి మరొక చోటా ఉన్నట్లుంది.

    అసలు సమస్య గుళ్ళపై ప్రభుత్వ ఆధిపత్యం చలాయించాలనుకోవడం. దేవాదాయధర్మాదాయ శాఖ పేరుతో అధికారికంగా హిందూమతసంస్థల ఆర్థిక లావాదేవీల్ని,పరిపాలనా అధికారాల్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. దానికి వ్యతిరేకంగా హిందువుల్ని సంఘటితపరిచి పోరాడదామని పిలుపునివ్వండి. చాలా సాధికారంగా ఉంటుంది.

    కానీ, అసలు విషయాన్ని పక్కనబెట్టి ఈ సమస్యకు (రాజకీయ) భావజాలం రంగుపులిమి, హిందూమతమేదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్లు దానికి మూలకారణాలుగా ఏవేవో చెప్పి భయపెట్టడంద్వారా మీ ఉద్దెశం సాకారం అవుతుందేగానీ, హిందూమతానికి ఒరిగే లాభం ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
  5. "అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?"

    Good point, makes sense.

    రిప్లయితొలగించండి
  6. కత్తి మహేష్ కుమార్:
    "మీ దృష్టి ఒకచోట గురి మరొక చోటా ఉన్నట్లుంది." - కాదు, మీరే అసలు సమస్యను చూట్టానికి మొహమాటపడి మొహం చాటేసారు. టపాను పైపైన తడిమేసి పోయారు. ఎందుకో మీకు తెలుసు. వివరాల్లోకి వెళ్దాం..

    "అసలు సమస్య గుళ్ళపై ప్రభుత్వ ఆధిపత్యం చలాయించాలనుకోవడం. దేవాదాయధర్మాదాయ శాఖ పేరుతో అధికారికంగా హిందూమతసంస్థల ఆర్థిక లావాదేవీల్ని,పరిపాలనా అధికారాల్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం. దానికి వ్యతిరేకంగా హిందువుల్ని సంఘటితపరిచి పోరాడదామని పిలుపునివ్వండి. చాలా సాధికారంగా ఉంటుంది." అని అన్నారు కదా, సరే.., గుళ్ళపై ప్రభుత్వం ఆధిపత్యం చలాయిస్తే హిందూమతానికి చేటు అంటున్నాం సరే, కానీ అది ఎలా? అనే ప్రశ్న మీరు వేసుకున్నారా? వేసుకుంటే మీకు నేను రాసిన సమాధానాలే వచ్చేవి. కానీ మీరా ప్రశ్న వేసుకోలేదు. ఎంచేతంటే మీకు తట్టక కాదు. ఎంచేతంటే ఆ ప్రశ్నకొచ్చే సమాధానాన్ని మీరు జీర్ణం చేసుకోలేరు. ఎంచేతంటే మీరు ఒక భావజాలంలో చిక్కుకుపోయి ఉన్నారు. దాన్నుంచి మీరు విడివడలేరు. ఎంత గింజుకుంటే అంత ఎక్కువగా, గుర్రపుడెక్కలాగా అది మిమ్మల్ని ఇంకా ఇంకా చుట్టేస్తుంది. దాన్నుంచి బైటపడ్డానికి గిలగిలా కొట్టుకుంటే లాభంలేదు.. కుదురుగా, ప్రశాంతంగా ఆలోచించాలి. నిష్పక్షపాతంగా, దొంగ లౌకికవాదాన్ని విడనాడి, పడమటి వాళ్ళ ఆలోచనాదృక్పథం, ధోరణీ నుంచి బైటికివచ్చి ఆలోచించడం ముఖ్యం. అలా ఆలోచించగలరా మీరు? సందేహమే! ఒకవేళ మీరలా ఆలోచించగలిగితే ఆ ఆలోచన అదిగో పైన నేను రాసినదానికే దారితీస్తుంది.

    అసలు దొంగహిందువులున్నారనే ఆలోచనే మీకు నచ్చదు. దానిగురించి మాట్టాడాలంటే మీకు భయం. అంచేతే మీరు లోతుగా అలోచించరు, పైపైన తడిమేసి పోతారు. హిందూమతానికేమైనా మీకు దిగుల్లేదు. నాకలా కాదు. అది నా అస్తిత్వం! అలా ఆలోచించకపోవడంచేతే ఇదిగో ఈ ముక్క రాసారు.. "..ఈ సమస్యకు (రాజకీయ) భావజాలం రంగుపులిమడం" నేను హిందూ కోణం నుండి ఆలోచించడమే మీకు "(రాజకీయ) భావజాలం"గా కనిపిస్తుంది. అసలీ సమస్య అంతా రాజకీయమే అయినపుడు మనం మాట్టాడేది రాజకీయం కాకుండా ఎలా ఉంటుంది? మతం మారినవాడు హిందువునే చెప్పుకోడం రాజకీయం కాకపోతే మరేంటి?

    నల్లడబ్బు ఎలాంటిదో దొంగ హిందువులు కూడా అలాంటివారే!

    రిప్లయితొలగించండి
  7. ఇక్కడ మహేష్ గారి ఆలోచనాధోరణిని కొంచెం అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం :

    ౧. హిందువులు హిందూమతం గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ వారికి ఇతరులు చేస్తున్న అపకారం గురించి మాట్లాడకూడదు. హిందువులు తమ సంస్థల అంతర్గత వ్యవహారాలు చర్చించుకోవడంలో తప్పులేదు. కానీ దానికి ఇతరులు ఎంతవరకు బాధ్యులనేదాని గురించి హిందువులు నోరెత్తకూడదు. కానీ తనలాంటివాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా హిందూమతాన్ని దాని మతగురువుల్ని ఎంత అసహ్యంగానైనా వర్ణించవచ్చు.

    ౨. హిందూమతంలోకి దాని సంస్థల్లోకి రాజకీయనాయకులూ, ప్రభుత్వమూ వేలుపెట్టడం మహేష్ గారికి అభ్యంతరకర విషయంలా కనిపించడంలేదు. కానీ దానికి అభ్యంతరం చెప్పినవాళ్ళు మాత్రం ఆయన దృష్టిలో రాజకీయం చేస్తున్నట్లు లెక్క.

    ఇహపోతే నా మాట :

    అన్ని రంగాల్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రోజులివి. ఆఖరికి సంసారంతో సహా ! ఏ టాపిక్ మాట్లాడదామన్నా రాజకీయనాయకుల గురించి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా చేశారు. కానీ ఆ రాజకీయనాయకులు మాత్రం తమ రంగంలోకి ఇతరులు దిగితే మాత్రం సహించలేరు. వెంఠనే గయ్యిన మీద పడతారు. మతగురువులు రాజకీయాల్లో వేలుపెట్టకూడదట. ఏం మతగురువులు ఈ దేశపౌరులు కారా ? వాళ్ళకి ఓటుహక్కు లేదా ?ఇతరులకి వర్తించే మానవహక్కులు వాళ్ళకి లేవా ? రాజకీయాలనేవి రాజకీయనాయకుల బాబుగాడి సొత్తా ? సినిమా నటుల గురించి కూడా రాజకీయనాయకులు ఇలాంటి కారుకూతలే కూశారు. చూడబోతే వీరు రాజకీయాల్ని తమకి మాత్రమే పేటెంట్ ఉన్న కులవృత్తి అనీ, అందులో ఇంకెవరూ ప్రవేశించకూడదనీ, కనీసం ఆ రాజకీయ టాపిక్కులు సైతం ఎవరూ మాట్లాడకూడదనీ భావిస్తున్నట్లుంది. ఇదేం ప్రజాస్వామ్యమో అర్థం కాదు.

    రిప్లయితొలగించండి
  8. "అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?"
    కరక్టే కాని
    రాజకీయనాయకులకి గుడి, మసీదు అని తేడాలేమీ ఉండవు.
    బెల్లం చుట్టూ ఈగల్లా ఎక్కడ డబ్బు, ఆస్తులు ఉంటే అక్కడ వాలిపోతారు.
    దేవాలయ భూములే కాదు, వక్ఫ్ భూములూ కూడా ఆక్రమిస్తున్నారు కదా.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు