20, మార్చి 2009, శుక్రవారం

పత్రికలూ నేనూ

(గత టపా తరువాయి)

వీటన్నిటికంటే ముందు యువ వచ్చేది. వడ్డాది పాపయ్య బొమ్మలు తప్ప మరింకేవీ గుర్తు లేవు నాకు.  వపా బొమ్మల వేళ్ళు ఎలా ఉండేవి.. సన్నగా, కోసుగా, చివర్లు నైసుగా వంపు దిరిగి ఉండేవి.  ఎంత హొయలు బోయేవి ఆ బొమ్మలు!! యువలో నాకు అవే నచ్చేవి.  అలాగే చందమామ బాలమిత్ర కూడా వచ్చేవి. కొన్నాళ్ళు బొమ్మరిల్లూ చదివాను. వాటికి నేను ఏకైక పాఠకుణ్ణి అవడం చేత, మాయింట్లో అంత ఆదరణ ఉండేది గాదు. తరవాత్తరవాత కొన్నాళ్ళకి వాటిని మానిపించారు.
ఇహబోతే వనిత కూడా వచ్చేది. మిగతా పత్రికలన్నీ మానేసాక కూడా వనిత చాన్నాళ్ళు వచ్చింది. విజయచిత్ర కూడా కొన్నాళ్ళు తెప్పించారు. చందమామ అనగానే నాకు వపా బొమ్మలు, శంకర్ బొమ్మలు, రామాయణంలో ఆంజనేయుడి సముద్ర లంఘనం సీను (శంకర్ బొమ్మతో) గుర్తుకొస్తాయి. అలాగే, సౌధోపరి అనేమాట కూడా గుర్తొస్తది.  సౌధ ఉపరి అని తెలీకపోయినా  ఆ మాట తెగ నచ్చేసింది.   "..ఆకాశమార్గాన వచ్చి సౌధోపరి భాగాన దిగింది",  "రాకుమారి సౌధోపరి భాగాన విహరిస్తూండగా",.. ఇలాంటి వాక్యాల్లో ఈ సౌధోపరి అనేమాట ఎంతో బావుండేది. అద్దం ముందు మహారాజు ఏకపాత్రాభినయం వేసేటపుడు సౌధోపరి లాంటి గంభీరమైన మాటలు వాడేవాణ్ణి. బాగా  హుందాగా ఉండేవి, మరి. "సౌధోపరీ! ఎం..థటి అహంకారమే నీకు" -ఇలాగ!

చందమామలో సిరిసిల్లా రశీద్ శిక్షక్ అనే రచయిత కథలు రాస్తూండేవాడు. ఆయన కథలన్నీ శిళ్ళంగేరి అనే ఊళ్ళోనే జరుగుతాయి. శిళ్ళంగేరి  అనే ఊళ్ళో ఫలానావాడు ఉండేవాడు అంటూ కొన్ని డజన్ల కథలొచ్చుంటాయి. ఎక్కువగా అరపేజీ కథలే. అర పేజీలో కథ, మిగతా సగం బొమ్మ!

చందమామ పేరు చక్కటి అక్షరాలతో చూడముచ్చటగా ఉండేది. ఈమధ్య ఆ అక్షరాలను మార్చి కొత్త రూపునిచ్చారు - ఏంటో కత్తుల్లాగా ఆ అతలకట్లూ, అవీ.. అస్సలు బాలేదు. చందమామ లాంటి ప్రజాభిమానం పొందినవాటిని, అవి ఎవరి సొంతమైనాకావచ్చుగాక, వాళ్ళిష్టమొచ్చినట్టు మార్పులు చెయ్యకూడదు.

ఆ రోజుల్లో పత్రికల్లో ఒక ప్రకటన వచ్చేది ఎవడో ఢిల్లీవాడు వేసేవాడు దాన్ని.  ఒక 3 X 3 గడి ఇచ్చేవాడు. ఎటు కూడినా ఇరవయ్యొకటో ఎంతో వచ్చేలాగా అంకెలతో పూర్తి చేసి ఉండేది. పక్కనే, అలాంటిదే ఇంకో ఖాళీ గడి ఇచ్చేవాడు. అందులో ఎటుకూడినా ఇరవైనాలుగు వచ్చేలా పూర్తిచెయ్యమనేవాడు. చేస్తే అద్భుతమైన బహుమతి కూడా ఇస్తాననేవాడు. అంటే పూర్తి చేసిన గడిలోని అంకెలకు ఒకటి చొప్పున కలుపుకుంటూ పోతే ఈ ఖాళీ గడిని పూర్తి చెయ్యొచ్చన్నమాట. తేలిగ్గా ఉంది కదా!! అయితే, ఈ సంగతి అ రోజుల్లో నేను తప్ప మరెవ్వరూ కనుక్కోలేకపోయారు. మూడో కంటివాడికి తెలీకుండా పూర్తి చేసి హాజ్‌ఖాస్, ఢిల్లీకి  పంపించాను. (ఈ రకం ప్రకటనలు ఎక్కువగా ఢిల్లీ హాజ్‌ఖాస్ నుండి గానీ, మద్రాసు వళ్ళువరుకోట్టం నుండి గానీ వచ్చేవి.) ఇక అద్భుతమైన బహుమతి కోసం చూసి, చూసి, చూస్తూ ఉండగా, ఓరోజున పోస్టుమ్యానుడో పొట్లాం తెచ్చాడు. మమ్మ నాయకత్వంలో అతగాణ్ణి ఎదుర్కొన్నాను. ఏంటది అనడిగాం.  దీన్ని వీపీపీలో పంపించారు, ఇది కావాలంటే మీరు 60 రూపాయలు కట్టాలన్నాడు. ముందు అదేంటో చెప్పు, అప్పుడు కడతాం అన్నాం. అబ్బే కుదరదు, ముందు డబ్బులు కడితేగానీ ఇవ్వకూడదు, వద్దంటే చెప్పండి, వెనక్కి పంపేస్తానన్నాడు. అద్భుతమైన బహుమతిని, బోడి 60 రూపాయల కోసం వదులుకుంటామా చెప్పండి. మీరు కాబట్టి గభాలున ఒప్పుకున్నారుగానీ, మమ్మ అంత తేలిగ్గా ఒప్పుకోలా. ఎట్టాగోట్టా ఒప్పించి, అరవయ్యీ కట్టేసి, పొట్లాం తీసుకుని విప్పి చూస్తే.. అందులో ఒక చీర ఉంది. అదేదో వాయిలు చీరో, ఏదోనంట, నాకస్సలు నచ్చలేదనుకోండి.  పాపం మమ్మ మాత్రం, "బానే ఉందిలే నానా" అని చెప్పింది నాకు. ఎప్పుడూ కట్టుకున్న పాపాన పోలేదనుకోండి. ఆ తరవాత, వళ్ళువరుకోట్టం నుండి కూడా ఒక అద్భుత బహుమతి తెప్పిద్దామనుకున్నాగానీ, మమ్మ ఇక చాల్లే ఆపమని చెప్పింది. ఇలాటి అద్భుతమైన తెలివితేటలతో మమ్మను అలరిస్తూ ఉండగా...

అప్పట్లో యండమూరి విచ్చలవిడిగా రాసి పడేస్తున్న సీరియళ్ళలో మునకలేస్తూ, తరిస్తూ ఉండేవాళ్ళం.  తులసిదళమో, తులసో, యెన్నెల్లో ఆడపిల్లో చదవకపోతే అనాగరికుడి కిందే లెక్క.  యండమూరికి సీరియలును ఎలా రాయాలో తెలుసు, ఏ వారాని కా వారం దాన్ని ఎలా ముగించాలో కూడా బాగా తెలుసు. (ఇది సికరాజు నేర్పించాడట అప్పటి రచయితలందరికీ.) సీరియలును అర్థాంతరంగా ఆపేవాడు. మామూలు సస్పెన్సైతే మూడు చుక్కలతో ఆగేది. మరీ బిగించాలంటే నాలుగో పదో పదహారో, ఇంకాసినో చుక్కలు పెట్టేవాడు. ఎన్ని చుక్కలుంటే అంత బిగింపన్నమాట. ఉదాహరణకు చెబుతున్నా.. అదేదో సీరియల్లో ఒకడికి గుండు చేసి, గుంజక్కట్టేసి, వాడి తలకు సరిగ్గా పైన, నీళ్ళ కుండను వేలాడదీస్తాడు. ఆ కుండకున్న కంత లోంచి నీళ్ళు ఒక్కొక్క బొట్టే పడుతూంటాయి. టప్.. టప్... ఠప్.... ఠప్ప్..... ఠ్ఠప్ప్...... ఠ్ఠాప్ప్....... అంటూ ఆపుతాడు ఆ వారానికి. (ఇంకో నాలుగు ఠప్పులు రాస్తే కొన్ని అర్భకంగా ఉండే గుండెలు ఠాప్పుమన్నా అంటాయి.)

గత టపాను అలా అర్థంతరంగా ఎందుకాపానో ఇప్పుడు మీకు అర్థమైపోయింది గదా!  నిజానికి రెంటినీ ఒక్కసారే రాసాను.  ఇలా తెగ్గొడితే సస్పెన్సేమైనా వస్తుందేమోనని చూసా. ఐతే యండమూరి చుక్కలకు యమా సస్పెన్సు పుట్టుకొచ్చేది, నా చుక్కలకు కనీసం కింకరుడి పాటి సస్పెన్సు కూడా పుట్టలేదు. సరే..

వెన్నెల్లో ఆడపిల్ల సీరియల్ను ఓ వారం ఇట్టాగే ఆపాడు. అందులో చివరి వాక్యం  -రేవంత్ యనౌన్సెస్ బ్లైండ్‌ఫోల్డ్!  ఇదో, ఇట్టాటిదో ఉంది. అతడికి ఇంగ్లీషులో రాయడం సర్దా. సరే, నా తిప్పలు జూడండి.. బ్లైండ్‌ఫోల్డు అంటే ఏంటని అడిగింది అమ్మ. ఆమాత్రం ఇంగ్లీషు రాకపోతే నామర్దా కదా.  రాకపోవడం కాదు నామర్దా, రాదని చెప్పడం నామర్దా. నేనేనాడూ నామర్దా పనులు చెయ్యలా. అందుకని బ్లైండ్‌ఫోల్డ్ అంటే గుడ్డివాళ్ళతో ఆట్టం అని చెప్పాను.  నమ్మకపోయినా పాపం నమ్మినట్టు నటించింది, మమ్మగదా! పై వారానికి నా సంగతి బయట పడిందనుకోండి. అందుకే యండమూరి అంటే నాకు చిరాకు!  (అద్భుతమైన నా ఇంగ్లీషు పాండిత్యాన్ని బిర్లా వెంకటేశ్వరస్వామి గుళ్ళో పూజారి ముందు ప్రదర్శించిన సంగతి గుర్తొస్తోంది. ఆ ముచ్చట మరోసారి.)

యండమూరి నమిలి, రసమంతా పీల్చి పిప్పిజేసి వదిలేసిన వర్ణనొ కటుంది. ఉత్కంఠ రేపడానికి వాడే ఆ వర్ణన ఇలా ఉంటుంది. "అతనికి అప్పటికింకా తెలీదు, తానెంత పెద్ద తప్పు చేస్తున్నాడో."   లేకపోతే "దాని పర్యవసానం ఎలా ఉండబోతోందో అణుమాత్రం తెలిసినా ఈ పని చేసి ఉండేవాడు కాదు." ఇవో, ఇలాటి అర్థం వచ్చే వాక్యాలనో కొన్ని వందల సార్లు చదివీ చదివీ చిరాకెత్తిపోయింది. ఎంతలా అంటే.. అలాంటిది చదువుతూంటే ఒంటికి దురదగుండాకు రాసుకున్నట్టు ఉంటుంది. ఈ వర్ణనను యండమూరే కాకుండా ఇంకొందరు కాపీరాయుళ్ళు కూడా వాడి దాని ప్రాణం తీసారు. ఇహ,

నేను పదో తరగతిలో ఉండగా - మా పెదనాన్న గారి ఊరు గోవాడలో - మా తమ్ముడు సతీషు ఏడో తరగతి. ఒకే ఇంట్లో ఏడొకడూ పదొకడు. ఇహనూహించుకోండి.. ఆ ఇల్లు ఎలా ఉండి ఉంటుందో!! మా పెదనాన్న మాబడి, పాఠశాల అని రెండు పుస్తకాలు తెప్పించేవాడు.  పాఠాలే ఉండేవి ఆ పుస్తకాల్లో కూడా - ఏడో తరగతి వాడికి మాబడి, పది కోసం పాఠశాల. నెలకోటి వచ్చేది. చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో ఎవరో పుణ్యాత్ముడు వేసేవాడు ఆ పుస్తకాలను. ఇప్పుడున్నాయో లేదో తెలీదు.

కాస్త పెద్దయ్యాక, నేను కొన్ని ఇంగ్లీషు పత్రికలు కూడా చదివాను. (ఇంగ్లీషుతో ఉన్న సౌకర్యమే అది -రాకపోయినా చదివి పారెయ్యొచ్చు.) అప్పట్లో మా బాబాయొకాయన దగ్గర ఇండియా టుడే పత్రికను చూసాను. అది నే జదివిన మొదటి ఇంగ్లీషు పత్రిక. నాకది బాగా నచ్చింది. ఆ తరవాతి కాలంలో చాలా పత్రికలు చదువుతూ ఉండేవాణ్ణి.  ది వీక్ మొదలుపెట్టిన కొత్తలో చాన్నాళ్ళు చదివాను. ఫ్రంట్‌లైన్ చదివేవాణ్ణి.  అన్ని పత్రికలు కూడా ఏ అంశం గురించి రాసినా, ప్రభుత్వాలపై విమర్శలే ఎక్కువగా ఉండేవి.  దేశ దౌర్భాగ్యం గురించి తెగ రాసేవాళ్ళు. ఏది బాగోలేదో, వాటి గురించే ఎక్కువగా రాసేవాళ్ళు.  ఒక్కసారి మాత్రం ఇండియా టుడేలో స్వాతంత్ర్యం తరవాత భారత్ సాధించిన ఘనకార్యాలు అంటూ, స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా అనుకుంటా, వేసారు. చాలా బాగుందా సంచిక.

తరవాత్తరవాత పత్రికలు చదవడం తగ్గిపోయి, కొన్నాళ్ళకు ఆగిపోయింది.  రచన మాత్రం అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. ఇప్పుడు మాత్రం పూర్తిగా సున్నా.  బ్లాగుల్లోకి వచ్చాక, పత్రికలు చదవడం లేదు, బ్లాగులు చదవడమే! లేదా రాయడం!   పత్రికలు చదవడం మానేసినా, పుస్తకాలు చదవడం మొదలెట్టాను. -అదో మంచి పని.

-------------
ఇహనుంటానండీ!

9 కామెంట్‌లు:

  1. చదువరిగారు,

    మీ ఈ పోస్ట్ రెండు భాగాలు చదివాను. అచ్చంగా నన్ను నేను అద్దములో చూసుకున్నట్లు అనిపించింది. ముఖ్యంగా అనంత్పోయ్ మోహన్దాస్ గారి రాము శ్యాము నేను రెగ్యులర్ గా చదివేదాన్ని. అలాగే విజయ చిత్ర, విజయ, వనితా ప్రభ, చందమామ, బొమ్మరిల్లు, ఇందులో మరలా చిన్న పాకెట్ సైజు అచ్చం గా జంతువులతో అంటే ఒక ఎలుగు, కుందేలు, నక్క, తాబేలు పాత్రల తో ( ఇప్పుడు చాలా ట్రై చేశాను మా పిల్లల కోసం దొరకలేదు), బాలాజీ దేవస్థానం వారి భక్తీ కధలు,మీరన్నట్లే యువ వడ్డాది బొమ్మలు , యండమూరి ప్రభంజనం,కాపి రచనలు,హిందూ వారిది ఫోర్ట్ నితే ( నేను మొదటి సారి కనిష్క విమానం దుర్ఘటన అపుడు చదివాను. ముఖ్యంగా పుస్తకం మధ్యలో చక్కటి ఆర్చిడ్స్ వర్ణ చిత్రాలతో ఆర్టికల్ వేసేవారు.). అన్ని మీ పోస్ట్ తో ఒక్కసారి కళ్ళముందుకు వచ్చాయి. థాంక్స్.

    చదువరిగారు,

    మీ ఈ పోస్ట్ రెండు భాగాలు చదివాను. అచ్చంగా నన్ను నేను అద్దములో చూసుకున్నట్లు అనిపించింది. ముఖ్యంగా అనంత్పోయ్ మోహన్దాస్ గారి రాము శ్యాము నేను రెగ్యులర్ గా చదివేదాన్ని. అలాగే విజయ చిత్ర, విజయ, వనితా ప్రభ, చందమామ, బొమ్మరిల్లు, ఇందులో మరలా చిన్న పాకెట్ సైజు అచ్చం గా జంతువులతో అంటే ఒక ఎలుగు, కుందేలు, నక్క, తాబేలు పాత్రల తో ( ఇప్పుడు చాలా ట్రై చేశాను మా పిల్లల కోసం దొరకలేదు), బాలాజీ దేవస్థానం వారి భక్తీ కధలు,మీరన్నట్లే యువ వడ్డాది బొమ్మలు , యండమూరి ప్రభంజనం,కాపి రచనలు,హిందూ వారిది ఫోర్ట్ నితే ( నేను మొదటి సారి కనిష్క విమానం దుర్ఘటన అపుడు చదివాను. ముఖ్యంగా పుస్తకం మధ్యలో చక్కటి ఆర్చిడ్స్ వర్ణ చిత్రాలతో ఆర్టికల్ వేసేవారు.). అన్ని మీ పోస్ట్ తో ఒక్కసారి కళ్ళముందుకు వచ్చాయి. థాంక్స్.

    చదువరిగారు,

    మీ ఈ పోస్ట్ రెండు భాగాలు చదివాను. అచ్చంగా నన్ను నేను అద్దములో చూసుకున్నట్లు అనిపించింది. ముఖ్యంగా అనంత్పోయ్ మోహన్దాస్ గారి రాము శ్యాము నేను రెగ్యులర్ గా చదివేదాన్ని. అలాగే విజయ చిత్ర, విజయ, వనితా ప్రభ, చందమామ, బొమ్మరిల్లు, ఇందులో మరలా చిన్న పాకెట్ సైజు అచ్చం గా జంతువులతో అంటే ఒక ఎలుగు, కుందేలు, నక్క, తాబేలు పాత్రల తో ( ఇప్పుడు చాలా ట్రై చేశాను మా పిల్లల కోసం దొరకలేదు), బాలాజీ దేవస్థానం వారి భక్తీ కధలు,మీరన్నట్లే యువ వడ్డాది బొమ్మలు , యండమూరి ప్రభంజనం,కాపి రచనలు,హిందూ వారిది ఫోర్ట్ నితే ( నేను మొదటి సారి కనిష్క విమానం దుర్ఘటన అపుడు చదివాను. ముఖ్యంగా పుస్తకం మధ్యలో చక్కటి ఆర్చిడ్స్ వర్ణ చిత్రాలతో ఆర్టికల్ వేసేవారు.). అన్ని మీ పోస్ట్ తో ఒక్కసారి కళ్ళముందుకు వచ్చాయి. థాంక్స్.

    రిప్లయితొలగించండి
  2. ayyo post chesaaka server down aiyindi. anduke inni saarlu publish aiyindi. daya chesi moderate cheyandi.
    thanks

    రిప్లయితొలగించండి
  3. మీ పోస్ట్ తో చిన్నప్పటి చందమామతో పాటు యండమూరిగారి రచనల్నీ ...మళ్ళీ చదవాలనిపిస్తోంది థాంక్స్.అన్నట్టు ఆ టప్.. టప్... ఠప్ లు తులసీదళం లోనివి .... :) :)

    రిప్లయితొలగించండి
  4. అంతా బాగుంది కానీ ఒకటే లోటు. మధుబాబు 'షాడో'తో మీ సాహసాల గురించి చెప్పనేలేదేం? ఇవన్నీ చదివినోళ్లు ఆ పాకెట్ పుస్తకాలు చదవలేదంటే నేన్నమ్మను.

    గమనించారా, ఈ మధ్య బ్లాగులోళ్లంతా ఒకళ్ల తర్వాతొకళ్లు సీరియళ్లు మొదలేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  5. మళ్లీ చెప్తున్నా, నాకు ఇవేమీ తెలియదు. వాఁ...

    రిప్లయితొలగించండి
  6. భద్రపరుచు కోవలిసిన టపా

    రిప్లయితొలగించండి
  7. చదువరి గారూ, బావున్నాయి మీ రెండు టపాలు.
    చందమామలో శిళ్ళంగేరి ప్రస్తావనతో కథలు రాసిన రచయిత ‘కోలార్ క్రిష్ణ అయ్యర్’. మీరు రాసిన పేరు సరి కాదు.
    బాల్యపు‘సౌధోపరి భాగం’లో విహరిస్తూ మీరు చెప్పిన ముచ్చట్లు ఆసక్తికరంగా ఉన్నాయండీ.

    రిప్లయితొలగించండి
  8. వేణు: మీరు చెప్పినది నిజమే. మరి.. ఈ సిరిసిల్లా రశీద్ శిక్షక్ ఏమి రాసేవారో మీకేమైనా గుర్తుంటే చెప్పగలరు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు