19, మార్చి 2009, గురువారం

నేను చదివిన పత్రికలు

చిన్నప్పుడు మాయింటికి ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్లతో పాటు, వారపత్రికలు కూడా వచ్చేవి. ఈనాడు విజయవాడలో ముద్రణ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా మాయింటికి ఈనాడు వస్తూనే ఉంది. జ్యోతి మధ్యలో కొన్నాళ్ళు ఆపారుగానీ, ఈనాడు మాత్రం ఎప్పుడూ మానలేదు.  అప్పటినుండి ఇప్పటిదాకా మా కుటుంబమంతా కాంగ్రెసు పార్టీవారైనా , నేను మాత్రం ఈనాడు పార్టీనే.  :)  (అనగా కాంగ్రెసు వ్యతిరేకిని). ఇప్పుడు మావాళ్ళు తమ అభిమాన, ముష్టిపార్టీ పత్రికను కూడా వేయించుకుంటున్నారు (పార్టీ ముష్టిది, పత్రిక వీరముష్టిది). ఏం చేస్తాను, ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళవి.
ఆగండాగండి.. ఇకముందు రాజకీయాల్లేవీ టపాలో, ఒట్టు!


మాయింట్లో దినపత్రికలతో పాటు వారపత్రికలు కూడా తెప్పించేవాళ్ళు. నా అభిమాన పత్రిక ఆంధ్రజ్యోతితో పాటు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక  కూడా వచ్చేవి. కొన్నాళ్ళకి ఆంధ్రపత్రికను ఆపేసారు. యండమూరి వీరుడి గాలికి ఆంధ్రభూమి కూడా కొట్టుకొచ్చింది మా యింట్లోకి. పత్రికల్లో నాకస్సలు నచ్చనిది భూమే! సికరాజు ఆంధ్రభూమిలోంచి బయటికిపోయి, సొంతంగా పల్లకి పెట్టుకొన్నాక, దాన్నీ మోసాం.  ఆంధ్ర ప్రభ కాగితం మిగతా పత్రికల కంటే నాణెంగా ఉండేది. అట్టలు నున్నగా జారిపోతూ ఉండేవి. జ్యోతి, పత్రిక అలా ఉండేవి కావు.  పల్లకి మిగతావాటి కంటే వెడల్పుగా ఉండేది. ఆంధ్రజ్యోతి అనగానే సన్నగా తీగలా ఉండే అమ్మాయి మనసులో తడుతుంది నాకు (అవును అప్పట్లోనే నండి! అప్పుడే కాదు, ఇప్పుడు కూడా) ప్రభ అనగానే కాస్త బొద్దుగా ఉండే అమ్మాయి తలపుకొస్తుంది. ఎందుకో చెప్పలేను. ధ్ర, ప్ర, భ ల తలకట్లు కూడా బొద్దుగా సీమచింత కాయల్లాగా (విత్తులున్నచోట లావుగానూ, మిగతా చోట్ల సన్నగానూ ఉంటాయి గదా, అలాగ)  ఉండేవి. ఆ ఆంధ్రప్రభ చేతులు మారి, పద్ధతులు మారి, విధానాలు మారి, నాణ్యత జారి, రూపం మారి,.. పోయిందిగానీ అప్పట్లో బానే ఉండేది. చందమామ, బాలమిత్రలు కూడా అంతే -జ్యోతి, ప్రభల పోలిక లాగా.

ఆంధ్ర ప్రభ వారపత్రికలో రాము శ్యాము అనే కామిక్ వస్తూండేది. అనంతపాయ్ మోహన్‌దాస్ దాని కర్తలు. పేజీలో నిలువుగా కాక, అడ్డంగా వేసేవాళ్ళు దాన్ని. దాని పక్క పేజీలోనే మరో శీర్షిక ఉండేది. అదేదో గుర్తు రావడం లేదుగానీ, దాన్ని కూడా ఇష్టంగా చదివేవాణ్ణి. రాము శ్యాము కవలలు. చొక్కా లాగూ తొడుక్కోని చక్కగా తల దువ్వుకొని ఉండేవారు. తలవెనక, సరిగ్గా సుడి ఉండేచోట, రెండే రెండు వెంట్రుకలు లేచి ఉండేవి ఇద్దరికీ. అవి వాళ్ళ ట్రేడుమార్కు.  నేను చదివిన మొదటి కామిక్ అదే అయ్యుంటుంది. లేదా ఈనాడులో ఆదివారం నాడొచ్చే మాంత్రికుడు మాండ్రేక్ అయ్యుండొచ్చు. మాంత్రికుడు మాండ్రేక్ నా అభిమాన కామిక్.  చక్కగా కోర మీసాలతో, మన రాజులకు ఉన్నట్టు వెనక దుప్పటొకటి వేలాడుతూ భలే ఉండేవాడు మాండ్రేక్. అన్నట్టు, మీరు అలా దుప్పటో తుండుగుడ్డో భుజాల మీద చొక్కాకు  పిన్నీసులతో  పెట్టుకొని, ఎనక్కి వేలాడేసుకుని, ఏకపాత్రాభినయం చేసేవారా? దాన్ని ఒక్క ఊపులో ఈడ్చి ముందుకు లాగి ఎడమ ముంజేతి మీద వేసుకుని "ఏయ్" అంటూ రాచరికం చెలాయించారా? ఆ పోజులో అద్దం ముందుజేరి, కళ్ళెర్రజేసి, మీసమ్మీద చెయ్యేసి నిలుచుంటే, నా సామిరంగా... నన్ను జూసి నాకే భయమేసేదండి. ఇక మా అమ్మనగా ఎంత, అల్లాడిపోయేదనుకోండి!

నా అంత కాకపోయినా మాండ్రేక్ కూడా బానే ఉండేవాడు. లీఫాక్, సైబరీ లు వేసేవాళ్ళు దాన్ని.  తరవాత్తరవాత హై.లో మా మామయ్య వాళ్ళింట్లో హిందూలో డెనిస్ ది మెనేస్ చూసేవాణ్ణి. టీవీలొచ్చాక, టామ్ అండ్ జెర్రీ యానిమేషను చూసాను.  ఇవ్వాళ్టి దాకా డెనిస్‌ను మించిన గడుగ్గాయినిగానీ, టాము, జెర్రీలను మించిన ఆకతాయి, అమాయక, మోసకారి, స్నేహితుల/వైరుల జంటనుగానీ చూళ్ళేదు. ఇహ ముందు చూడలేమేమో కూడా! డెనిస్‌కు సరిజోడులాంటి బుడుగును చూసాను.  బుడుగు కామిక్కాకపోయినా, డెనిస్ లాంటి పిడుగే! బుడుగు ఎక్కడ వెనకబడిపోయాడంటే, మువెంర ఆణ్ణి అక్కడే, అరవైల్లోనే (యాభైల్లోనా?) వదిలేసి వచ్చేసాడు, తనతో ఇరవయ్యొకటో శతికి తీసుకురాలేదు.

మళ్ళీ పత్రికల్లోకి..
ఓ వారం ప్రభలో "రంబ మరికొళందు సెంటు" ('బ'కారం నాది కాదు, వాడిదే. అరవ సెంటు మరి.) అనే ఒక సెంటు ప్రకటన వచ్చింది. ప్రకటనతో పాటు, అట్టలకు సదరు సెంటు పూసి పంపించాడా సెంటువాడు. పుస్తకం ఘుమఘుమలాడిపోయిందనుకోండి. అలాంటి ప్రాక్టికలు ప్రకటన ఈమధ్య ఏదో షాంపూ విషయంలో కూడా చూసిన గుర్తు.. ఈనాడు ఆదివారం పుస్తకానికి ఆ షాంపూ పొట్లాన్ని అతికించి పంపించారు.

బొద్దు భామ తరవాత ఇక మెరుపుతీగ ఆంధ్రజ్యోతి గురించి. జ్యోతంటే పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఇల్లాలిముచ్చట్లు. జ్యోతంటే పప్పు వేణుగోపాలరావు స్వగ'తంబు'. నాకు కథల కంటే ఇలాంటి శీర్షికలే నచ్చేవి. చందమామ కథలు చూడండి, ఎంచక్కా, అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో రామయ్య ఉండేవాడు -ఇలా మొదలౌతాయి హాయిగా. ఈ పత్రికల్లో కథలేమో -"అయితే రానంటావు, ఇదే నీ చివరి మాటా" అని అడిగాడు రాజారావు కోపంగా - ఇలా హఠాత్తుగా మొదలైపోయేవి. (ఈ టపా మొదలైనట్టు)  ఏదో సీరియల్ని మధ్యలో మొదలుపెట్టి చదూతున్నట్టుండేది. ఆ రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ రాసిన హాహాహూహూ అనే సీరియల్ జ్యోతిలో వచ్చేది. అది మొదలైన వారం ఓ పేద్..ద బొమ్మ వేసారు. ఒకడు ఈ పేజీనుంచి పక్క పేజీ దాకా పరచుకోని, పడుకోని ఉంటాడు.  అదీ ఆ బొమ్మ. ఆ బొమ్మ గుర్తుండిపోయింది. 

ఆంధ్ర పత్రికలోగామోసు హైదరాబాదు డైరీ అని వచ్చేది, తిరుమల రామచంద్ర రాసేవారు. ఉప్పల లక్ష్మణరావు కథేదో (ఆయన ఆత్మకథ "అతడు ఆమె" కావచ్చు) జ్యోతిలో వచ్చేది, అదీ చదివేవాణ్ణి.  ఈయన రష్యా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.  రష్యా అనగానే సోవియట్ యూనియన్ పుస్తకాలు - నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం  వగైరాలు - గుర్తుకొస్తున్నాయి. వాటి సంగతి మరోసారి.

అన్నట్టు జ్యోతి మాసపత్రిక కూడా వచ్చేది. వారపత్రిక్కీ దీనికీ సంబంధం లేదు. వేదాంతం రాఘవయ్య నడిపేవారు. మిగతా వాటి సంగతేమోగానీ, ఆరుద్ర గళ్ళ నుడికట్టు కోసం దాన్ని కొనేది మమ్మ.  ఆ గడి పనిబట్టేది.  నేనూ ఊరుకునేవాణ్ణి గాదు. బానే నింపేవాణ్ణి. అయితే, ఒక్కసారి కూడా పూర్తిగా నింపలేకపోయాను. గళ్ళ నుడికట్టు వ్యసనాన్ని మమ్మే కలం చేతబట్టించి, నాకు అలవాటు చేసింది.  ఆ గడి కారణంగానే జ్యోతి మాసపత్రికంటే నాకు చాలా ఇష్టం.

వీటన్నిటికంటే ముందు.......

(...ఏం జరిగిందో వచ్చే టపాలో)

20 కామెంట్‌లు:

  1. మీరు వార పత్రికలను (వారపత్రికలంటే నిజంగా స్త్రీ లింగమే అనిపించడం సహజం) విజువలైజ్ చేసుకోడం చాలా ఆసక్తికరంగా ఉంది.(రాటటూయి సినిమాలో స్ట్రా బెర్రీ రుచిని ఎలుక ఊహించి బొమ్మగా విజువలైజ్ చేసుకున్నట్లు)

    రాము-శ్యాము ప్రభ పాత సంచికల్లో చదివాను నేను కూడా. అది చూసాక "అమ్మలు ఇలా కూడా ఉంటారా?"(అందులో అమ్మ పాత్ర స్లీవ్ లెస్ జాకెట్టుతో సన్నగా తీగలాగా, పోనీటైల్ వేసుకుని ఉంటుంది.)అని ఆశ్చర్యపోవడం ఇంకా గుర్తే!

    ఇక భూమిలో పనికిమాలిన చెత్త సీరియల్స్ అన్నీ వస్తుండేవని గుర్తు. మా అమ్మ తిడుతూనే అన్నీ తెప్పించేది(నా పోలికే వచ్చింది అమ్మకి)ముఖ్యంగా నా చిన్నపుడు "చిన్నారి చెల్లి" అనే సీరియల్ ఒక చెత్తన్నర సబ్జెక్టుతో వచ్చింది అందులో. రాసింది విజయలక్ష్మి మురళీధర్ అనుకుంటా!అలాగే చందు సోంబాబు రచనలకు భూమి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఆయన రాసే చెత్త ని ప్రచురించడానికి వీల్లేనంత అభ్యంతరకరంగా ఉంటే అక్కడ సికరాజు 'ఎడిట్... ఎడిట్ ...అని వేస్తుండేవాడు. ప్రతి రైటరూ,పాఠకుడూ అందరూ అనవసరంగా సికరాజుని తెగ పొగిడేస్తూ ఉండేవాళ్లు. ఆ ప్రభావంతోనే "పల్లకి(నేనెక్కుతా, మీరు మొయ్యండి)అనే టాగ్ లైనుతో పెట్టినట్లున్నాడు.

    ఆంధ్రజ్యోతి,ప్రభ మొదటినుంచి ప్రమాణాలను పాటిస్తూనే ఉండేవి.ప్రభ లో అది ఆగిపోయే దాకా అరుణమణి పేరుతో శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు ఇచ్చే గడి వస్తుండేది. జ్యోతి మాసపత్రికలో ఆరుద్ర గళ్ళ నుడికట్టు వల్లే అసలు క్రాస్ వర్డ్ పజిల్ పిచ్చి పట్టుకుంది నాకు. మా ఇంట్లో అందరూ కలిసి మొత్తానికి పూర్తి చేసి పంపుతుండేవారు.

    విజయ, వనిత, మహిళ,యువ కూడా ఉండేవి!విజయ 4 భాగాలు కలిపి ఒకటే పుస్తకంగా వచ్చేది. దేనికది విడగొట్టి చదువుకోవచ్చు.

    కొన్నాళ్ళకి రూపాయి పత్రిక ఒకటి ఉండాలని మల్లాది వెంకటకృష్ణ మూర్తి 30 పేజీలతో స్రవంతి అనే పత్రికను కొన్నాళ్ళపాటు నడిపారు.

    ఇవన్నీ కాక మా నాన్నగారు కమ్యూనిస్టు కావడం వల్ల సోవియట్ సమీక్ష,భూమి ఇంకా అనేక రష్యా పత్రికలు ఇంటినిండా! సోవియట్ భూమి లో ఆపిల్ పళ్ళ తోటల ఫోటోలు భలే ఉండేవి.పుస్తకాలకు అట్టలు వేసుకోడానికి బాగా పనికొచ్చేవి.

    కందిరీగల తుట్టను కదిపారు మీరు.

    రిప్లయితొలగించండి
  2. Dennis కి సమ ఉజ్జీలు - మన తెలుగులో బుడుగు, మరొకడు - బుజ్జాయి. చాల మంది కి బుజ్జాయి పరిచయంలేడు. మొన్నామధ్య బుజ్జాయి పుస్తకాలని మళ్ళీ ప్రచురించాలని అనుకున్నారు. ఎంత వరకు వచ్చిందో?

    రిప్లయితొలగించండి
  3. బాగుంది బాగుంది. నాకూ అన్ని పత్రికలూ గుర్తే...

    రిప్లయితొలగించండి
  4. "చిట్టి" కార్టూను ఎందులోనండీ వచ్చేది ? ఆంధ్రభూమి అనుకుంట.
    నాకు భలే ఇష్టం.

    అన్ని పత్రికలూ మీ తర్వాతి జనరేషనులో నే చదివినవే!

    రిప్లయితొలగించండి
  5. పత్రికలకి మీపదచిత్రాలు చాలా బాగుందండి. సరిగ్గా నేను వదిలేసిన చోట మీరు అందుకున్నట్టుంది పత్రికలచరిత్రలో. అంచేత నాకు చాలా విషయాలు తెలిసాయి మీ టపాతోనూ, సుజాత వ్యాఖ్యలో విషయాలతోను. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. బహుశా ఇద్దరమూ ఒకే వయస్కులమనుకుంటున్నా !! ఎందుకంటే ఆ పత్రికలు అన్నీ నేను కూడా చదివే వాడిని. పైగా నేను కూడా మండరెక్ ని బాగ ఇష్టపడే వాడిని..ఆ తుండు తో రాజు గారి లా ఎకపాత్రాబినయం చేయని వాల్లు ఉంటారా అని అనిపిస్తుంది? అలా వేసుకుని మా స్నెహితుల్ని శ్రీ శ్రీ ...రాజా గారు వెంచెయుచున్నారొహో !!! బహు పరాక్ బహు పరాక్ అని కూడా అనమనేవాడిని..అది కూడా ఇంకా బాగా గుర్తు ఉంది. ఏ పత్రిక లోనొ గుర్తు రావటం లెదు గాని "కధా శుధా" అని ఒక కధ ల సీర్షిక ని బాగా చదివిన గుర్తు.
    మొత్తానికి బాగుంది అండి ..చిన్న నాటి విషయాలు చాలా గుర్తు వచ్హాయి హాయి గా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. ఇవన్నీ నాకు తెలియదు కానీ. మొదట్లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధానికి నేను పేద్ద పంకాని. అందులో చిలక పందిరి నాకు చచ్చేంత ఇష్టం దానికి మళ్ళీ comments ఇచ్చి దాచుకొనే వాడ్ని. కొద్ది రోజులకవన్ని మాయమైపోయి ఒక మామూలు పుస్తకంలా మిగిలింది. అప్పటికీ ఆశచావక రెండేళ్ళు భరించాను చివరకు peper కొనడమే మానేశాను.

    రిప్లయితొలగించండి
  8. నా చిన్నప్పుడు మా ఇంట్లో ప్రభ వచ్చేది. నాకు భూమి ఇష్టం లేదు కాని కేవలం మల్లిక్ గారి చిట్టి కోసం చదివేవాడిని లైబ్రరీలో.
    అదే తరహాలో ఇప్పుడు ఈనాడు ఆదివారంలో బాలల పేజీలో వచ్చే కార్టూన్ కూడా బాగుంటుంది.
    సోవియట్ భూమి కాగితాన్ని దీపావళికి సిసింద్రీలు తయారు చేయడానికి వాడేవాళ్ళం.
    నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం పుస్తకం గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను.

    రిప్లయితొలగించండి
  9. నేను పుట్టేనాటికి (౧౯౮౬), ఆ తర్వాత కాలంలో వస్తున్న లేదా వచ్చిన పత్రికలలో నేను చదివినవి బాలజ్యోతి, చందమామ, బాలభారతి. కాస్త పెద్దయ్యాక స్వాతి మాసపత్రిక, ఆంధ్రభూమి మాసపత్రిక. నాకు ఇంతకు మించి తెలియవు. నేను చాలా కోల్పోయానేమో అనిపిస్తోంది ఇప్పుడు మీ అందరి కబుర్లూ వింటూంటే. అన్నట్టు ఎవరిదగ్గరైనా ఆరుద్రగారి నుడికట్లుంటే కాస్త అందరికీ పంచిపెడుదురూ.

    రిప్లయితొలగించండి
  10. ఆంధ్ర భూమి విషయంలో సుజాత గారు చెప్పింది కరెక్టు. ఈ పత్రిక విషయంలో ఇంకా చాలా చాలా వింతలు, విడ్డూరాలు, విచిత్రాలు, విశేషాలు ఉన్నాయి. రాద్దామనే ఉంది కాని... ఎందుకనో కొంత మంది కోపాలు తెచ్చుకుంటున్నారు మరి. అట్టహాసంగా ప్రారంబ మయిన ఉదయం వార పత్రిక కూడా బావుండేది. మొదట్లో ఎక్కువ పెజీలు ధరతో ప్రారంబమయింది. తరువాత స్రవంతి కి పోటి గా ధర తగ్గించి పెజీలు తగ్గించారు. ఇంకా ఎన్నో పత్రికలూ వెలిసాయి కొద్ది కాలం నడిచాయి... మూతపడ్డాయి (శ్రీ నరసింహా రావు గారి రేపు పత్రిక లాగన్న మాట). VERI VERI GOOD POST.

    రిప్లయితొలగించండి
  11. లీఫాక్-సైబరీల పాత్ర మాండ్రేక్ కాదు, ఫాంటమ్. ఇది ఈనాడులో వచ్చేది. మిగతా వివరాలు మీరు చెప్పినట్లే ఉండేవి. మాండ్రేక్ ఆంధ్రజ్యోతిలో వచ్చేది. ఈనాడు పుణ్యాన ఫాంటమ్ నాకు ఇప్పటికీ ఇష్టమైన సూపర్ హీరో. ఎటువంటి అతీంద్రియ శక్తుల్లేకుండా స్వశక్తిపై ఆధారపడి సాహసాలు చేస్తాడని ఆ పాత్రంటే అంతిష్టం నాకు.

    మీ జ్ఞాపకాల్లాంటివే నావి కూడా. చాలా చాలా బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  12. భలే భలే భలే .. పల్లకీ మోసెయ్యడం కిసుక్కు.
    అవును, చాన్నాళ్ళునాక్కూడా ఆంప్ర వీక్లీ అభిమాన పత్రిగ్గా ఉండేది. ముఖ్యంగా చివుకుల పురుషోత్తం నవల్ల వల్ల. జ్యోతి మాసపత్రిక రాఘవయ్య గారి పేరు వేదాంతం కాదనుకుంటా. వీరి సతీమణి లీలగార్ని 2003 లో ఒకసారి హైదరాబాదులో కలిశాను. ఆయనతో పాటు ఆవిడకూడా పత్రైకలో సగభాగం పైగానే పని చేస్తుండే వారట. పాత ముచట్లు చాలా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  13. భలే గుర్తు పెట్టుకున్నారండి మీరు చదివిన పుస్తకాల గురించి ! నా చిన్నప్పుడు ఏ కాగితం కనపడిన చదవకుండ వదిలేదాన్ని కాదు కాని మీ జ్ఞాపకాలను చూస్తుంటే మాత్రం ఆశ్చర్యమేస్తుంది.

    రిప్లయితొలగించండి
  14. నాకు ఊహ తెలిసాక నేను ఫస్టు 'ఫాలో' అయింది ఈనాడులో ఫాంటం అనుకుంట, మా అమ్మ చదివినిపించేది (ఫాంటం= మా డాడీ, హీరో(గుర్రం) = స్కూటరు, డెవిల్ (కుక్క) = పెదనాన్నగారి కుక్క (?) డయాన= మా అమ్మ, కిట్, హెలోయిస్ = మేమిద్దరం అని చెప్తూ). మరి నాకు అప్పట్లో చదవటం రాదు కదా. అప్పట్లో అవి కట్ చేసి పుస్తకం లాగ కూడా దాచిందో, లేక అలాంటి పుస్తకం బయట కొన్నారో.

    అప్పట్లోనే రష్యా బాలల పత్రిక "మీషా" తెప్పించేవారు. దాంట్లో, "కాక్కే డూడ్ల్‌డూ" అని అనుకుంటా ఉండేది. వేరు వేరు దేశాల పిల్లలు వేసి పంపించిన బొమ్మలు, కలం స్నేహానికి ఎడ్రస్సులు ఉండేవి. బొమ్మలు, కలం స్నేహం చేస్తూ ఉత్తరాలు పంపించమనేవారు ఇంట్లో. ఎప్పుడూ చేసింది లేదు. మధ్యలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి.

    గడి అలవాటు చేసింది మాత్రం ఈనాడు ఆదివారం అనుబంధం.

    సరేగానీ, "అతడు ఆమె" ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ కాదు కదా.

    రిప్లయితొలగించండి
  15. అబ్రకదబ్ర,
    అవును, బ్లూ కలర్లో ఉండే ఫాంటమ్ అంటే నాకూ చాలా ఇష్టం!

    స్కూలు రోజుల్లో ఉదయం వారపత్రికలో వచ్చిన "వీర తెలంగాణా" అనే తెలంగాణా విముక్తి పోరాట గాథ అనుబంధాన్ని ఎంత జాగ్రత్తగా దాచానంటే ఇప్పటికీ ఉంది నా దగ్గర.

    పల్లకి లో ఆదివిష్ణుగారి సత్యం గారిల్లు సీరియల్ వచ్చేది. ఆ తర్వాత దాన్నే అహనా పెళ్లంట సినిమాగా తీశారు.

    రిప్లయితొలగించండి
  16. టపా చదివి ఆవేశంగా వ్యాఖ్య రాద్దామనుకొని, ముందొకసారి వ్యాఖ్యల్ని చూద్దాం అని చూస్తే , అబ్రకదబ్ర గారు కాస్తా చెప్పేసారు నేను చెప్పాలనుకున్నది.

    ఫాంటం బొమ్మలు ఇప్పటికీ గుర్తే, ఆ పుర్రెబొమ్మ, నదిలో మాంసం తినే చిన్న చిన్న చేపలూ (వాటిపేరు గుర్తు రావటంలేదు, ఫినా, అలాంటిదేదో
    ).. ఆనది పేరు, ఆ చేపలపేరు గుర్తున్నోళ్ళు చెప్పి పుణ్యం కట్టుకోండి నాకిక నిద్రపట్టదు తెలుసుకొనేవరకూ..

    ఆంధ్రభూమి చాలా బాగుండేది మొదట్లో, "సిక రాజకీయం", " అచె(అడగండి చెబుతా), కాలందాటని కధలు, ఇంకా మైనంపాటి, యర్రం శెట్టి లాంటి చెయ్యి తిరిగిన రచయితల రచనలతో..ఆ తరువాత తెలుగు రాయగలిగిన వాళ్ళందరూ రచయితలే అన్నరీతిలో దాని రూపు రేఖల్ని మార్చేశారు.. సీరియల్ వస్తున్నప్పుడు "రచయితతో ముఖా ముఖి" అని మొదలెట్టింది భూమేననుకుంటా...

    లల్లాదేవి శ్వేతనాగు, ప్రభలో అనుకుంటా మాలతీ చందూర్ గారి సమాధానాలు.. అలానే వీటన్నికంటే ముందు కధల విషయంలో ఆంధ్ర సచిత్ర వార పత్రిక చాలా బాగుండేది.

    ఆంధ్రజ్యోతి దినపత్రిక సినీపరిశ్రమ కి ఇష్టమయిన పత్రిక అనుకుంటా.. సినిమా షూటింగు మొదలయితే చాలు "ప్రొడక్షన్ నంబర్ 1,2,3 " ఇలా ఆప్పట్లోనే నలభై పైచిలుకు పేజీలతో వచ్చేది..(రోజూ కాదనుకోండి) , అగ్ర తారల జన్మదినాలప్పుడు కూడా అంతే..

    అలానే ముఖ్యమైన పండగలకు ప్రత్యేక సంచికలు చాలా బావుండేవి మరిన్ని పేజీలతో ఎక్కువరోజులు చదువుకొనేలా ( వుత్తినే, ఒక్కరోజులో చదివిపడేసేవాణ్ణి).
    చదువరి గారూ, పాత రోజుల్ని గుర్తుకు తెచ్చారు.. ధన్యవాదాలు.. ఎంతైనా ఈనాడు ఈనాడే ( రాజకీయాలు తీసేసి :) )

    సుజాత గారూ,
    ఫాంటం కలర్లోకూడా వచ్చాడన్నమాట. ఎందుకో నా బుర్రలో రిజిస్టరు కాలేదు.. నాకు నలుపు తెలుపు ఫాంటమే గుర్తు..

    రిప్లయితొలగించండి
  17. కొత్త సంగతులు చాలా తెలిసాయి. అందరికీ నెనరులు.
    అబ్రకదబ్ర: నిజమే, నేను పొరబడ్డాను.. మాండ్రేక్ జ్యోతిలో వచ్చేది. ఫాంటమ్ ఈనాడులో వచ్చేది. అయితే రెండు కామిక్కులూ లీఫాక్, సైబరీలవేననుకుంటా. సరిజేసినందుకు నెనరులు.
    సుజాత: బాగా గుర్తు చేసారు.. ఆ చందుసోంబాబుకు పెద్ద హీరో ఇమేజీ ఇచ్చేవాళ్ళు ఆంధ్రభూమిలో. అతడు ప్రేమజ్వాల అని నవలేదో రాసాడు. వడ్డెర చండీదాసు హిమజ్వాల రాసాడు గదా, నాకా రెంటిమధ్య తికమక. రెండూ ఒకటే అనుకునేవాణ్ణి కొన్నాళ్ళు. నేనా రెండూ చదవలేదు.
    Krishna: మీరు నాకంటే ఓ ఇరవయ్యేళ్ళు చిన్న :)
    కృష్ణారావు: "రేపు" ఒకటో రెండోసార్లు చూసానంతే. కానీ కమెండో, ఎన్‌కౌంటర్ (దశరథరామ్) పత్రికలు మాత్రం బానే చదివేవాణ్ణి. వాటిని ఇంట్లో తెప్పించేవాళ్ళు కాదు, బయట పట్టేవాణ్ణి.
    కొత్తపాళీ: రాఘవయ్య గారి ఇంటిపేరు వేమూరి?
    చేతన: తప్పే.., లక్ష్మణరావు గారి ఆత్మకథ బతుకు పుస్తకమనుకుంటా. ఇది నేను చదవలేదు.
    ఉమాశంకర్: ఆ చేపల పేరు ఫిరానా అండి. ఆ నది బంగాల్లా? ఆంధ్రజ్యోతికీ, తెలుగు సినిమా పరిశ్రమకీ మధ్య అనుబంధం మీరన్నట్టు చాలా గట్టిది. పండగలకీ, సినిమా ప్రాంభోత్సవాలకీ, విడుదలలకూ ప్రకటనలు తెగ వచ్చేవి. కృష్ణ పుట్టినరోజుకు పేజీలకు పేజీలే వచ్చేవి, అనుబంధాలు తీసేవాడు. నాబోటిగాళ్ళకు కారం రాసుకున్నట్టుండేది, వాటిని చూస్తంటే.:)

    రిప్లయితొలగించండి
  18. chala baga rasarandi.ma annayya chadivesi padesina books anni nenu continue chesevadini.mee abhi ruchula tho chala mandiki similarities vuntayanukunta aa generation lo vallaki.

    రిప్లయితొలగించండి
  19. మా రోజుల్లో ఆంధ్రప్రభ తో పాటు ఆంధ్రసచిత్రవారపత్రిక కూడా వచ్చేది. ఆంధ్ర ప్రభ తో పోటీ చెయ్యలేక అది తర్వాత మూ సేసారు. పత్రిక ప్రభకంటే ముందే ఉందనుకుంటాను.ఆరోజుల్లో ఈ రెండే పత్రికలు ఆంధ్రాలో. మిగిలినవన్నీ ఆ తర్వాత వచ్చినవే.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు