22, అక్టోబర్ 2008, బుధవారం

ప్రయాణం మొదలైంది - చంద్రయాన్-1 (Chandrayaan-1)

చంద్రయాన్ (Chandrayan) ప్రయాణం మొదలైంది, విజయవంతంగా మొదలైంది. మన గుండెలు ఉప్పొంగిస్తూ, మన కళ్ళలో ఆనంద బాష్పాలు తెప్పిస్తూ, మనపై మనకున్న నమ్మకాన్ని మరో కక్ష్యను దాటిస్తూ ఇస్రో పీయెస్సెల్వీని, దాంతోటి చంద్రయాన్‌ను ప్రయోగించింది.


శ్రీహరికోటలోని ఆ లాంచి కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలంతా వరసగా కూచ్చొని ఉన్నారు. అందరి దృష్టీ ఎదురుగా ఉన్న తెరలమీదే. అనుకున్న సమయానికి ఇంజన్లను మండించారు. పీయెస్సెల్వీ ఎగసింది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగాలన్నిటినీ ఏ వార్తల్లోనో రీప్లేలుగా చూస్తూ ఉన్నాం. వాటిలో స్లోమోషనులో చూపిస్తారు.. లాంచిప్యాడు మీంచి పైకి లెగవడం చాలా సేపు కనిపిస్తుంది. కానీ ఇది లైవు.. స్లోమోషను లాంటివి పీయెస్సెల్వీకి తెలవదు, ఇస్రోకీ తెలవదు. దూసుకుపోవడమే వాళ్ళకి తెలిసింది. ఇలా అంటుకుంది, అలా మాయమైంది. కళ్ళు మూసి తెరిచేంతలో మబ్బుల్లోకి మాయమైంది. మధ్యలో ఒక్కసారి మెరుపులా కనబడిందంతే!

పిల్లలతోటి చెప్పాను.., వీళ్ళు చప్పట్లు కొట్టి కౌగలించుకుంటూ ఉంటే అప్పుడు ప్రయోగం విజయవంతమైనట్టేనని. ప్రయోగించిన ఓ ఏడెనిమిది నిముషాల తరవాత అనుకుంటా.. మా ముచ్చట తీరింది. ఇస్రో శాస్త్రజ్ఞులు చప్పట్లు కొడుతూ లేచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. పర్ఫెక్ట్ లాంచ్ అంటూ ఇస్రో అధ్యక్షుడు మాధవన్ నాయర్ చెప్పాడు. ఆ తరవాత, ఒకరి తరవాత ఒకరు తమ వంతుగా మాట్టాడారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మాటలు రావడం లేదంటూ ఒకాయన అన్నాడు. అవును మరి, చూసిన మనకే ఆనందంతో మాటలు రాలేదు.. ప్రయోగాన్ని స్వయంగా చేసినవాళ్ళు.. ఇక వాళ్ళకేం వస్తాయి!

ఇస్రో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే విజయం వాళ్ళకి అలవాటైపోయిందని అనిపిస్తుంది. నల్లేరుపై నడక, కొట్టినపిండి లాంటి జాతీయాలు గుర్తుకు రాకమానవు. ఇస్రో ఇంకో రాకెట్టును విజయవంతంగా ప్రయోగించిందంటే ఓహో విశేషమేముంది, ఇది మామూలేగా అనుకునే పరిస్థితి.

ప్రకృతి కూడా ఇస్రోను ఆశీర్వదించింది. గత కొన్ని రోజులుగా వాన, ఉరుములు మెరుపులతో ఉన్న వాతావరణం ఇవ్వాళ మాత్రం హాయిగా, ప్రశాంతంగా ఉందట. మామూలు సమయం ప్రకారం సూర్యోదయమూ అయింది. బహుశా చంద్రయాన ప్రయోగాన్ని సూర్యుడూ చూడదలచాడేమో! వీళ్ళసాధ్యులు, రేపు సూర్యయాన్‌నూ ప్రయోగించరు గదా! అని అనుకొని ఉంటాడు.

శభాష్ ఇస్రో!

15 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాశారు. చదువుతూంటే నిజంగానే ఆనందబాష్పాలు వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  2. " ఇస్రో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే విజయం వాళ్ళకి అలవాటైపోయిందని అనిపిస్తుంది. నల్లేరుపై నడక, కొట్టినపిండి లాంటి జాతీయాలు గుర్తుకు రాకమానవు. "

    ఇది చాలా నిజం అండీ ఒకప్పుడు వీళ్ళ పరాజయాలమీద జోకులు వేసుకునే పరిస్తితి నుండి ఇప్పుడు విజయానికి చిరునామాగా ఎదగడం నిజం గా గర్వించదగిన విషయం.

    రిప్లయితొలగించండి
  3. "విజయాలు చూస్తుంటే విజయం వాళ్ళకి అలవాటైపోయిందని అనిపిస్తుంది"
    ప్రతి భారతీయుడు గర్వ పడాల్సిన క్షణం.

    రిప్లయితొలగించండి
  4. ఇస్రోలో పని చేసి, చంద్రయాన్ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలూ కష్టపడి, దాని ఫలితం కళ్ళారా చూసుకోకుండానే బయటకి వచ్చేసిన దురద్రుష్టవంతురాలిని నేను. నిజంగానే మనం కష్టపడి పని చేసిన సాటిలైట్ మన కళ్ళ ముందు అలా నింగికేసి దూసుకుపోతూ ఉంటే కలిగే ఆనందం అనిర్వచనీయం.

    Anyways, Congratulations to all the fellow Indians and I'm proud of being an ISROIAN

    Jai Bharat maata ki :)

    రిప్లయితొలగించండి
  5. laxmi గారు మీరు ISRO లో పని చేసారా? ISRO లో పని చేయడం అనేది నా చిన్ననాటి కల. కల గానే ఉండిపోయింది అనుకోండి. మన దేశం గర్వించదగ్గ ప్రయోగం లో మీరు పాలు పంచుకున్నారంటే, బ్లాగు లోకం లో మాతో ఉన్నారంటే great. మీకు నా అభినందనలు.

    ఈ శుభ వార్త కోసమే ఉదయాన్నే ఆరింటికి లేచి TV చూసా ఈ రోజు. భారతీయులందరు గర్వించదగ్గ విషయం ఇది.

    రిప్లయితొలగించండి
  6. వాళ్ల లాంచ్ ఏమోగానీ మీరు చాలా భాగా రాశారు, ఆ క్షణంలోని ఆర్ద్రతని వొడిసిపట్టుకుని

    రిప్లయితొలగించండి
  7. సూపర్. మా అమ్మాయితో కూడా ప్రయోగం ఏ లోటు లేకుండా జరగాలని దణ్ణం పెట్టుకోమని ప్రార్ధన చేయించి మరీ, విజయవంతంగా జరిగిన ప్రయోగం చూసాం. బహుశా నా వ్యక్తిగత విషయాలకి కూడా నేను కూడా అలా ప్రార్ధన చేయించనేమో. అదో తృప్తి, ఆనందం.

    మాకే ఇంత టెన్షన్, గర్వం ఉంటే, ఆ శాస్త్రవేత్తలు, ఆ ఇస్రో సిబ్బంది శ్రమ అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

    అధ్భుతం, లక్కీగా మేము యూఎస్ నుంచే "టైమ్ నౌ" ఛానెల్ వాడి పుణ్యమా అని లైవ్ టెలికాస్ట్ చూసాం.

    అభినందనలు లక్ష్మి గారికి, ఇస్రోకి.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనం.
    లక్ష్మి: అక్కడ పనిచెయ్యడమే అదృష్టం. మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఇంతకాలంగా "చందమామ రావే... జాబిల్లి రావే" అని పాడుకునేవాళ్లం. ఇక ఇప్పుడూ చందమామ ఆగు మేమే నీ దగ్గరకు వస్తున్నాము అని చెప్పుకోవచ్చు. జై భారత్..

    లక్ష్మిగారు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. భారతీయుల అందరి మనో భావాలకు అద్దం పట్టినట్టుగావుంది మీ రచన. అభినందనలు.
    చింతా రామ కృష్ణా రావు.

    రిప్లయితొలగించండి
  11. ఆ ఆనందం వర్ణనాతీతం.
    మీ టపా చక్కగా ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
    ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.
    భారతమాతకి జేజేలు!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు