9, అక్టోబర్ 2008, గురువారం

దూడగడ్డి యాత్రలు

తాడిచెట్టెందుకెక్కావురా అంటే....దూడగడ్డి కోసమన్నాడని సామెత. ఈ మధ్య కొందరు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త, దేశ వ్యాప్త యాత్రలు చూస్తుంటే ఈ సామెత గుర్తుకు రాకమానదు.కొండొకచో ప్రపంచయాత్రలు కూడా చేస్తూంటారు.


ఒకాయన మోటారుసైకిలుపై పోతూంటాడు.. ముందో పెద్ద సంచీ, యెనకో భోషాణం తగిలించుకుని ఉంటాడు. చొక్కామీద ప్రపంచశాంతి కోసం, మనమంతా! అంటూ ఇంగ్లీషులో నాలుగు ముక్కలు రాసి ఉంటాయి. అన్నట్టు ఓ టోపీ కూడా ఉంటది.. దానిమీద పావురాళ్ళ బొమ్మా ఉంటది. ఏవిటి సంగతి అని అడిగామనుకోండి.. ప్రపంచశాంతి కోసం సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తున్నానంటాడు. ప్రపంచశాంతి గురించిన తెలివిడిని ప్రజల్లో కలిగించేందుకు ఆయనీ యాత్ర చేస్తున్నాడన్న మాట! ఈయన యాత్ర చూసి ప్రజల్లో ప్రపంచ శాంతి పట్ల ఆలోచన ఎలా కలుగుతుందో నాకు అర్థం కాదు.

యనక్కి నడుచుకుంటూ పోతూంటాడొకడు. ఎందుకయ్యా అని అడిగి చూడండి.. వెనకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం అని సమాధానం రావచ్చు. ఈ రకంగా యెనక్కి పరిగెత్తేవాళ్ళు, మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, పాక్కుంటూ వెళ్ళేవాళ్ళు, దేక్కుంటూ పోయేవాళ్ళు ఇలా రకరకాలుగా యాత్రలు చేస్తూంటారు. ఎక్కువమంది లక్ష్యం ప్రపంచశాంతే! దానిమీద అంత మోజెందుకో మరి! జాతీయ సమైక్యత, మత సామరస్యం,.. మొదలైనవాటిని కూడా మన యాత్రికులు ఆదరిస్తూ ఉంటారు. ఆయా పేర్లు పెట్టుకుని యాత్రలు చేస్తే ఏ మిషనరీ వాడైనా డబ్బులిస్తాడేమోనని నా డౌటు.

ఈమధ్య కాలంలో బాగా యాత్రికాదరణ పొందింది, మనాళ్ళకి బాగా నచ్చింది, (బహుశా అచ్చొచ్చింది) - ఎయిడ్స్! ఎయిడ్స్ గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సైకిలు మీదో, స్కూటరు మీదో, మరోలాగానో భారతయాత్ర చేసేవాళ్ళు మనకు పేపర్లలో తగులుతూంటారు. అంతా అయ్యాక యాత్రలో తమ అనుభవాలతో పుస్తకాలు రాసేస్తూంటారు. నిన్నో మొన్నో ఈనాడులో వచ్చింది.. పదమూడేళ్ళుగా స్కూటరు మీద ప్రయాణం చేస్తున్న ఒకాయన సిద్ధిపేట వచ్చాడట. జాతీయ సమైక్యత, మత సామరస్యం కోరుతూ ఆయనా యాత్ర చేసాడంట. ఈ యాత్రానుభవాలతో ఇప్పుడిక పుస్తకం రాస్తాడట.

ఇప్పటివరకూ మనం చెప్పుకున్నవన్నీ ఒకళ్ళో ఇద్దరో చేసే ఇండివిడ్యువల్ ఈవెంట్లు. ఇవిగాక గుంపుగా చేసే కార్యక్రమాలు కొన్నుంటాయి. టీమ్ ఈవెంట్లన్నమాట! హైదరాబాదు 10కె రన్ననో 5కె రన్ననో పెడుతూంటారు. వాటిక్కూడా ఎయిడ్సో మరో జబ్బునో అంటిస్తూంటారు. :) ఎయిడ్సని పెట్టుకుంటే ప్రభుత్వం నుండి డబ్బొచ్చే మార్గమేదో ఉండుంటుంది. మరి వాళ్ళు ఎయిడ్స్ నియంత్రణ కోసం కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు కావాలి కదా పాపం!

గ్లోబలు వార్మింగుకు ప్రధాన కారణాల్లో ఒకటి -పెట్రోలియమ్ ఇంధనాన్ని తగలెయ్యడం అని మనందరికీ తెలుసు. సొంత వాహనాల వాడకం తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా వాడటం ఈ వార్మింగును తగ్గించే మార్గాల్లో ఒకటని చెబుతూంటారు. ఈ ముక్కను ప్రపంచానికంతంటికీ చెప్పేందుకు ఆ మధ్య చెన్నై నుంచి ఇద్దరు స్నేహితులు కలిసి కారులో ప్రపంచయాత్రకు పూనుకున్నారు. వీళ్ళిద్దరూ తమ హ్యుందాయ్ టౙన్ జీపేసుకుని ఈ ప్రపంచయాత్ర చేస్తారట! :) (ఎస్యూవీని మా ఊళ్ళో జీపనే అంటారులెండి!)

అన్నట్టు ఈ యాత్రికుల సంగతి పత్రికావిలేకరులకు ఎలా తెలుస్తుందో గానీ వీళ్ళు మనూళ్ళోకి వచ్చీ రాగానే - మరుసటి రోజే - పేపర్లలో పడిపోతారు.
----------------------------------
ఈ యాత్రికులు తమకు వీలైనంత ప్రచారం చేసుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటే, మరో రకం యాత్రికులు చడీచప్పుడూ లేకుండా యాత్రలు చేసొస్తూ ఉంటారు. ఈ రెండో రకం యాత్రికులు తమకు ప్రచారం రాకుండా జాగర్త పడుతూంటారు. వీళ్ళే.. మన మంత్రులు, తదాశ్రితులు, ప్రభుత్వ అధికారులు.. గట్రా. వీళ్ళు చేసేవి అసలు సిసలు దూడగడ్డి మార్కు యాత్రలు.

ఈ బాపతు దూడగడ్డి యాత్రలకు మన హై.పురపాలకులు ఎంతో ప్రసిద్ధికెక్కారు. వీళ్ళీ యాత్రలకు స్టడీటూర్లని పేరు పెట్టారు. ఘనత వహించిన సదరు పురపాలకులు, తమ పదవీకాలం ఐదేళ్ళూ పూర్తై, పదవిని వదులుకోవాల్సి వచ్చిన క్రూర క్షణంలో కూడా హై. ను అభివృద్ధి చేసే పనిని వదల బుద్ధెయ్యక, మరింతగా అభివృద్ధి చెయ్యగల అవకాశాలను పరిశీలించేందుకు స్టడీ టూరొకదానికి ప్లానేసారు. పేపర్లలో వచ్చేసిందా వార్త. పాపం, సిగ్గుపడి ఆపేసినట్టు గుర్తు. ఈ స్టడీ టూర్లలో కొసమెరుపేంటంటే కొన్ని వెనకబడ్డ నగరాల కార్పొరేటర్లు స్టడీ టూరంటూ మనూరు రావడం! వాళ్ళని అప్పుడప్పుడూ పేపర్లలో చూస్తుంటాం కదా.. పాపం జాలేస్తుంది. తలకో లక్షో అరో ఖర్చు పెడితే ఆయా ప్రభుత్వాల సొమ్మేం పోయింది.. సుబ్బరంగా ఏ సింగపూరో హాంకాంగో వెళ్ళొచ్చేవారు కదా అనిపించేది! అనొసరంగా ఇక్కడికి రావల్సొచ్చింది. ఇక్కడికొచ్చి చూడబోతే.. వీళ్ళేమో హాయిగా ఆఫ్రికాలోని పేరేయిన్లా  నగరానికి స్టడీ టూరుకని వెళ్ళి ఉంటారు.

ఇహ పోతే, 11 కోట్లు పారేసుకున్న మంత్రి గారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి..  గుర్తొచ్చారా.. సొమ్ములు పోనాయండి ఫేమ్! ప్రజల కార్ల కంపెనీచేత ఒక ఫ్యాక్టరీని మన రాష్ట్రంలో పెట్టించే పనిలో భాగంగా సదరు మంత్రి జర్మనీ యాత్రకెళ్ళారు పరివార సమేతంగా. అధికార పర్యటన కాబట్టి బంధుమిత్రులుండకూడదు. కానీ మంత్రిగారి తమ్ముడు కూడా వెళ్ళాడా యాత్రకి. ఎందుకని అడిగినవారికి దూడగడ్డి సమాధానమేదో చెప్పారు. ఆ తరవాత, డబ్బులు పోవడం, ఆ 11 కోట్లు ఎవడికిచ్చామో కూడా ప్రభుత్వానికి తెలీకపోవడం జరిగాయి. ఇంతకీ ఆ యాత్రలో తమ్ములుంగారు కూడా వెళ్ళారన్న సంగతి ఈ డబ్బులు పోయాకే బైటపడింది.
-----------------------------------------
పాదయాత్ర చేసి పదవినెక్కాడు రాజశేఖరుడు. ఈ టెక్నిక్కునే వాడి పదవినెక్కాలని యాష్టపడిపోతున్నాడు.. చంద్రబాబు. మీకోసం అనిపేరు పెట్టుకున్నా.. ఇది తన కోసమే అనేది తెలిసిందే! ఇక చిరంజీవి కూడా మనకోసమని చెప్పే తనకోసం యాత్ర మొదలెడుతున్నాడు. ఇవన్నీ రాజకీయ యాత్రలు. సొంత డబ్బును/పార్టీ డబ్బును పెట్టుబడిగా పెట్టి యాత్రలు చెయ్యడం అన్నమాట! -దీన్ని ఖర్చు అనరు, పెట్టుబడి అంటారు. యాత్రలు చేసేది మన క్షేమసమాచారాలు తెలుసుకునేందుకే అని చెబుతున్నప్పటికీ అది దూడగడ్డేనని మనం గ్రహించకపోము. 
------------------------------------

ఇవి కాకుండా, కొందరు సాహసికులు సాహసయాత్రలు చేపడుతూ ఉంటారు. మోటారు సైకిళ్ళేసుకుని లద్దాఖ్ వెళ్ళి రావడం, పడవల్లో గంగకు ఎదురెళ్తూ గంగోత్రిని చేరుకోవడం,.. ఇలాంటివన్నమాట. వీళ్ళు దూడగడ్డి అంటూ కథలు చెప్పరు. సాహసయాత్ర చేస్తున్నాం అంటూ చేసేదేదో సూటిగా చెప్పేస్తారు. భారత సైన్యం తమ సైనికుల చేత ఇలాంటి యాత్రలు చేయిస్తూ ఉంటుంది.
-------------------------------------
నేనూ ఓ సారి ఈ దూడగడ్డి యాత్రకెళ్ళాను (చేసిన పాపం చెబితే పోద్దంటారు!) గత జన్మలో- అనగా పూర్వాశ్రమంలో -  నేను పని చేసిన కంపెనీ తరపున ఉత్తర దేశంలోని ఓ బొగ్గు గనికి వెళ్ళి, వాళ్ళెలా పనిచేస్తున్నారో చూసి, మంచి విషయాలేమైనా ఉంటే నేర్చుకుని (లేదా, మా అలవాట్లను వాళ్లకి నేర్పి) రావడం అసలు పని. నలుగురు సభ్యుల ఈ యాత్రా స్పెషల్లో నేనే అందరికంటే జూనియర్ని. కంపెనీ వారు మాకు అప్పజెప్పిన పని ఉదాత్తమైనదే! కానీ, మాకంతటి ఉదాత్త హృదయం లేదు. అక్కడి పనిని కాస్త ముందే పూర్తి చేసుకుని సంపూర్ణ ఉత్తర ప్రదేశ యాత్ర లాగా తిరిగొచ్చాం. ఏమిటి యాత్ర కబుర్లు అని మావాళ్ళు అడిగితే.. ఉత్తరాదిన జనం పొద్దున్నే టిఫిను కింద స్వీట్లు తింటార్రా అని ఆశ్చర్యపోయాను. ఇంకేంటి కంబుర్లు అనడిగితే.. కాశీ విశ్వేశ్వరుడి గుడి లోపల మసీదును చూసి కోపమొచ్చేసిందిరా అని బాధపడ్డాను. అది సరే ఇంకా ఏంటి సంగతులు అని అడిగారు.. అయోధ్య పోడానికి కుదరలేదురా.. అక్కడంతా పోలీసు కాపలా అంట అన్నాను నిరాశగా. మా విక్రమార్కులూరుకుంటారా.. అసలుపని గురించిన కబుర్లు చెప్పమని అడిగితే.. ఆ ఏముందిరా.. మనలాగే వాళ్ళూ రికార్డనేది రాయరు. కాయితం మీద కలం పెట్టరు. అంచేత అక్కడ చూడ్డానికేమీ లేదు. అని చెప్పాను సంతోషంగా. దాంతో ఈ లోకంలో మా జాతిజనులు మరికొందరు ఉన్నారని సంతోషించి, మా మా కొలువులకు/నెలవులకు పోయి శేషజీవితాన్ని హాయిగా గడిపేసాం.

14 కామెంట్‌లు:

  1. @ చదువరి గారు
    నాకొక అనుమానం. ఇలా ప్రపంచ శాంతి అని, విజయ శాంతి అని తిరిగే వాళ్ళకి ప్రపంచం అంతా తిరగాలి అనే కోరిక ఉంటుందేమో.. ఆ కారణం చెప్తే విరాళాలు వస్తాయేమో... ఏమో... మీరు చెప్పిన మిగిలిన ప్రతి యాత్రలోను స్వార్ధం కనపడుతుంది, అందుకే అలా ఆరా తీసా :-)

    రిప్లయితొలగించండి
  2. (చేసిన పాపం చెబితే పోద్దంటారు!) -- :)) బాగుందండీ, మీ ఓపికని కూడా మెచ్చుకుంటున్నానండీ. నేను కూడా అదే అనుకుంటాను, మరే పనీ లేని వాళ్లు చేసేవే నిజంగా వాటివల్ల లాభం ఎంత అంటే అనుమానమే

    రిప్లయితొలగించండి
  3. :) టపా అదుర్స్!అయితే నేను కూడ ఒక యాత్ర ప్లాన్ చెయ్యలి.కాని ఎవరి డబ్బుతో యాత్ర చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. వీళ్లలో నేను కూడా చేరి పోయానా! నేను కూడా ప్రస్తుతం Study tour చేస్తున్నా. అయితే ఒక తేడా, సొంత ఖర్చుతో.

    -cbrao
    Atlanta,Georgia,USA.

    రిప్లయితొలగించండి
  5. 5k 10k రన్ లలో సెలెబ్రిటీలు చేసే హడావిడీ,buildupను చూస్తే చిరాకేస్తుంటుంది.దానికి తోడు ఈ వెధవ మీడియా ఒకటి అదేదో పేద్ద విషయమని కరవేజీ.ఈకవరేజీ కోసమేనా వాళ్ళ ఫోజులు...

    రిప్లయితొలగించండి
  6. మీ పోస్టు చదువుతుంటే నాకు ఫార్రెస్ట్ గంప్ సినిమా గుర్తొస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. హా, హా, "విజయ శాంతి అని తిరిగే వాళ్ళ" ని చూడలేదేమో కాని, విజయశాంతి కోసం, విజయశాంతి వెనుక తిరుగుతున్నవాళ్ళని చూస్తునే ఉన్నారు కదా..అది కూడ స్టడి చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగున్నాయి మీ యాత్రా ప్రహసనాలు. 'దూడగడ్డి యాత్రలు ' అన్నింటికన్నా ప్రశస్తం అన్న విషయం తెలిసిందే. నేనూ చేశాను చాలా దూడగడ్డి యాత్రలు మా కంపెనీ తరపున.

    రిప్లయితొలగించండి
  9. ఈ తంతేమిటో ఆసక్తికరంగా ఉందే! ఇంత విశదంగా వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

    రిప్లయితొలగించండి
  10. హహ్హహ్హ... ఫారెస్టు గంపు.
    మంచి టపా !

    రిప్లయితొలగించండి
  11. వ్యాఖ్య రాసిన తరువాత చూసాను. ప్రదీపు కూడా అదే కామెంటాడని :)

    రిప్లయితొలగించండి
  12. ఈ యాత్రా విశేషాలేవో బాగున్నాయండి. నేనూ వెళ్ళాలనుకొంటున్న ఎవరన్నా స్పాన్సర్ చేస్తే బాగుండును.
    విహార యాత్రలకు , సాహస యాత్రలకూ, పాదయాత్రలకూ స్పాన్సర్స్ గట్రా ఎందుకూ?
    రాజకీయాలలో చేరిపోతే ప్రచారాల పేరుతో మొత్తం చుట్టేయ్యచ్చోమో!!

    రిప్లయితొలగించండి
  13. టపా అదిరింది. పాద యాత్ర, సైకిల్ యాత్ర చేస్తే ప్రపంచ శాంతి సిద్దిస్తుందా. అగ్ని యాగం చేస్తే ఎండలు వస్తాయా ?? వాళ కేవో స్వలాభాలు ఉండి ఉంటాయి. 11 కోట్లు ఎపిసోడ్ director మంత్రి బొత్స సత్యనారాయణ మహాశాయులం గారు. వీరు కూడా ఒక యాత్ర చేసి గవర్నమెంటుకి 11 కోట్లు బొక్క వేయించారు . (నానో కార్ల ప్రాజక్ట్ మిస్ అయ్యింది.. లేకపోతె గవర్నమెంట్ కి ఇంకో బొక్క పడేదే ) వారు వారి తమ్ముడిని కూడా యాత్ర కి తీసుకెళ్ళారు. ఎందుకయ్యా అని అడిగితె.. నాకు ఇంగ్లిష్ రాదు.. తోడుగా ఉంటాడు అని తీసుకు వెళ్ళాను అని అన్నాడు. మీలో ఎవరికీ అయిన ఇంగ్లిష్ నేర్చు కొవాలంటీ బొత్స గారి తమ్ముడిని సంప్రదించ గలరు. ఈ యాత్రలకి వెళ్ళే మంత్రులు, ఆఫీసర్లు .. చాల మంది నా కొడుకులు ... వాళ్ల పెళ్ళాలని, బావ మర్దులను తీసికేల్తారు... వారి సొమ్ము కాదు కదా.. ఈ పెళ్ళాలు, బామ్మర్ది నాక్కోడుకులకి .. వారి వెళ్ళే పనికి ఏమి సంబంధం?? study tours అంటారు... ఏంటి ఈ నా కొడుకులు చేసే study.. పందుల్లగా తినడం, తాగడం, దొర్లడం, బలాదూర్గా తిరగడం.. ఇంతేగా వీలు చేసే పని.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు