11, అక్టోబర్ 2008, శనివారం

కంధమాల్ కథేమిటి?

ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. "రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?" అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, "ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి" అని చెప్పుండాల్సింది. కనీసం "అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే" అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?

అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...

---------------------------------
కంధమాల్ జిల్లా జనాభాలో ఎస్సీలు, ఎస్టీలదే ప్రాబల్యం. ఎస్సీలు  17 శాతం ఉంటే, ఎస్టీలు 52 శాతం. బ్రిటిషువారి కాలంలోనే మిషనరీలు కంధమాల్ జిల్లాలో ప్రవేశించి ఇక్కడి ప్రజలను క్రైస్తవంలోకి మార్పిడి చెయ్యడం మొదలుపెట్టాయి. అసలు బ్రిటిషు సైన్యం అక్కడ కాలూనలేని పరిస్థితిలో మిషనరీలను ముందు పంపించారట. దేశంలోని ఇతర ప్రాంతాల్లో లాగానే ఇక్కడ కూడా స్వాతంత్ర్యం తరవాత మత మార్పిళ్ళు వేగం పుంజుకున్నాయి. కంధమాల్ జిల్లాలో ఈ మార్పిళ్ళు మరింత ఎక్కువగా జరిగాయి. అక్కడ మొత్తం క్రైస్తవుల్లో 60 శాతం మంది ఎస్సీలు కాగా, మిగిలిన వాళ్ళలో అత్యధికులు ఎస్టీలు.

ఇక్కడొక ప్రధానమైన విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవం తీసుకున్నవారిలో (ఇప్పించబడ్డవారు) - ముఖ్యంగా దళితుల్లో - ఎక్కువమంది అధికారికంగా తమను తాము క్రైస్తవులుగా నమోదు చేసుకోరు  జనగణకులకు తాము హిందువులమని చెబుతారు. మిగతా ప్రపంచానికంతటికీ వాళ్ళు క్రైస్తవులే! మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. అలా ఎందుకు, తన మతమేదో గర్వంగా చెప్పుకోవచ్చు గదా అని! దానికి ప్రధానమైన కారణం.. హిందువుగా చెప్పుకుంటే తప్ప మన ప్రభుత్వం కులపరమైన రిజర్వేషను వంటి సౌకర్యాలను వాడుకోనివ్వదు. ఈ కారణాన అసలైన క్రైస్తవుల జనాభా లెక్కలు బయటికి రావు. కొన్ని లక్షల మంది ఉద్యోగులను పెట్టి, దేశవ్యాప్తంగా, ఇంటింటికీ వెళ్ళి జనాభా లెక్కలను తయారు చేసే జనగణన వారి నిర్వాకమేంటంటే.. తప్పుడు లెక్కలు! క్రైస్తవ మిషనరీలు, ప్రచార సంస్థలకు ఉన్న నెట్‌వర్కును దృష్టిలో పెట్టుకుని చూస్తే.. వాళ్ళ దగ్గర ఈ విషయమై ఖచ్చితమైన లెక్కలు దొరకొచ్చని నా ఉద్దేశ్యం.

ఇలా హిందువుగా చెప్పుకోడానికి నా ఉద్దేశ్యంలో మరో కారణముంది.. క్రైస్తవ ప్రచారకుల, మిషనరీల భయం. నిజమైన లెక్కలు బయటికి వస్తే ప్రజల్లో ఆందోళన కలగవచ్చు, తమ మత మార్పిడి పనులకు అభ్యంతరాలు ఎదురవచ్చు అనే కారణమొకటి. మరొకటేంటంటే.. నిజం చెబితే, తత్కారణంగా  రిజర్వేషను సౌకర్యం పోతే మతం  మార్చాల్సిన మిగతా ప్రజలు ఒప్పుకోరనే భయం.

మతమార్పిళ్ళూ, కుల రిజర్వేషన్ల అంతరార్థం, అందులో కేంద్రప్రభుత్వం వారి దృష్టిలోపం, మొదలైనవాటి కథ ఇది! ఇది చాలదన్నట్టు, ప్రభుత్వం వారిదే మరో ఫర్మానా ఉంది.. మతం మారిపోతే ఎస్సీలు కుల రిజర్వేషన్లు కోల్పోతారు. ఎస్టీలకు మాత్రం మతం మారినంత మాత్రాన, సదరు సౌకర్యాలకు లోటేం ఉండదు. అంటే...

నేను ఎస్సీని, మతం పుచ్చుకున్నాను. మీరు ఎస్టీ, మీరూ మతం పుచ్చుకున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకున్నందుకు గాను, నా కుల రిజర్వేషను పోయింది. మీరు ఎస్టీ కాబట్టి, మీకు మాత్రం ఆ సౌకర్యం అలానే ఉంది. ఈ పరిస్థితిలో రిజర్వేషను సౌకర్యాన్ని వొదులుకోకూడదంటే నేనేం చెయ్యాలి.. "నేను క్రైస్తవుణ్ణి కాదు, హిందువునే" అని చెప్పుకోవాలి లేదా నేను ఎస్టీనని చెప్పుకోవాలి. 2000 దాకా కంధమాల్ ఎస్సీలు మొదటి మార్గాన్నే నడచారు. ఆ తరువాత, 2001 జనగణనలో వాళ్లను క్రైస్తవులుగా గుర్తించారు - ఎలా జరిగిందో మరి! ఇహ అప్పటి నుండి వాళ్ళకు, ఎస్టీలమని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

భూమి తగాదాలు: దీనికి తోడు, ఎప్పటినుండో భూమి తగాదాలూ ఉన్నాయి. ఎస్సీలు ఎస్టీల కంటే చదూకున్నవారు, ధనబలం, రాజకీయబలం కలిగినవారు. జిల్లాలోని ఎస్టీల భూమిని తనఖాల రూపంలోగానీ, ఆక్రమించుకోవడం ద్వారాగానీ, ఎస్సీలు తమ సొంతం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ భూముల్లో చర్చీలు కూడా కట్టారు. గిరిజన చట్టాల ప్రకారం ఎస్టీల భూమిని మరొకరికి బదిలీ చెయ్యడం కుదరదు - అమ్మడం ద్వారాగానీ, మరే విధంగాగానీ! (ఇది మన రాష్ట్రంలో కూడా ఉంది. దీన్నే 1/70 చట్టం అని అంటారు. ఖమ్మం, పశ్చిమ తూర్పు గోదావరులు, ఇంకా కొన్ని  జిల్లాల్లోని ప్రాంతాల్లో ఈ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం కారణంగా జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో గొడవలు జరిగేవి కూడా! గిరిజనులు మైదాన ప్రాంతాల వారు సాగు చేసుకునే పొలాల్లో పంట కోసుకుపోవడం లాంటివి చేసేవారు. కమ్యూనిస్టులు - ముఖ్యంగా సీపీఎమ్ - గిరిజనులకు మద్దతుగా నిలబడింది.) ఈ కారణంగా ఎస్సీల అధీనంలో ఉన్న ఆ భూములను ఎస్టీలకి ఇచ్చేయాల్సి వచ్చింది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ఈ భూములు తమ చేజారకుండా ఉండాలంటే తమకూ ఎస్టీ హోదా ఉండాల్సిందేనని ఎస్సీలు భావించారు.

అసలింతకీ ఈ క్రైస్తవ ఎస్సీలు తాము ఎస్టీలమని చెప్పుకోడానికి ఆధారాలేంటి? ఏదో ఒక ఆధారం చూపించాలి గదా! వాళ్ళేం చేసారంటే.. తము మాట్లాడే కుయి అనే భాషను ఒక ఎస్టీ తెగగా రికార్డుల్లోకి ఎక్కించారు. ఆనక తాము కుయి అనే భాష మాట్లాడుతున్నాం కాబట్టి తాము కుయి తెగకు చెందినవారమే -అంటే ఎస్టీలమే అని వాదించారు. సహజంగానే గిరిజనులైన కోంధులు ఒప్పుకోలేదు. అలా అయితే ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా కుయి భాష మాట్లాడుతారు, వాళ్ళూ కుయి తెగకు చెందిన వారేనా అని అడిగారు. ఒక ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రీ ఎస్సీల పక్షం వహించారు. (దరిమిలా, సదరు మంత్రి చేత ఎలాగో కష్టపడి, నైతిక బాధ్యత వహింపజేసి రాజీనామా చేయించారు.) దొంగ కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ అయ్యాయి. ఇన్ని ఛండాలాలు జరిగినచోట ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎస్సీలకు, ఎస్టీలకు గొడవలు జరిగాయి. ఈ విధంగా మత మార్పిడి కారణంగా కంధమాల్ సమాజం ఉద్రిక్తతకు లోనైంది, తరచూ కల్లోలాల బారిన పడింది. 1994 లోనే గొడవలు జరిగాయి. 2001 తరవాత ఎక్కువయ్యాయి. 2007 క్రిస్ట్‌మస్ రోజున పెద్ద గొడవలే జరిగాయి. స్వామి లక్ష్మణానంద అనే హిందూ మత ప్రచారకుడిపై క్రైస్తవులు హత్యాయత్నం చేసారు. వారి ఇళ్ళను వీళ్ళూ, వీరి ఇళ్ళను వాళ్ళూ తగలబెట్టుకున్నారు. హిందూ దేవాలయాలను క్రైస్తవులూ, చర్చిలను హిందువులూ నాశనం చేసారు.

ఈ మొత్తం ఘటనలలో హిందూ సంస్థల పాత్రేంటి? చప్పట్లకు రెండు చేతులూ అవసరమే! అ రెండో చేయి హిందూ సంస్థలదే! క్రైస్తవ మత ప్రచారకుల దుష్ట పన్నాగాలను తిప్పికొట్టేందుకే కంధమాల్లోకి స్వామి లక్ష్మణానంద ప్రవేశించాడు. అప్పటికి హిందూ సంస్థలు లేవు. వాళ్ళను వ్యతిరేకించడం వల్లనే ఆయనకూ మిషనరీలకు వైరం పెరిగింది. గొడవలయ్యాయి. స్వామి దాదాపు 40 ఏళ్ళుగా క్రైస్తవుల మత మార్పిడులను ఎదుర్కొంటూ కంధమాల్ జిల్లాలో గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు. పాఠశాలలు, గుడులూ స్థాపించి గిరిజనుల్లో మతమార్పిడిని నిరోధించాడు. గిరిజనుల సంస్కృతిని వివరిస్తూ దాన్ని నిలుపుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసాడు. క్రైస్తవ వ్యాప్తికి అడ్డంకిగా నిలిచాడు. ఆయన కారణంగా గిరిజనుల మతమార్పిడి ఆగడమే కాక, పునర్మతాంతరీకరణలు కూడా జరిగాయి. సహజంగానే క్రైస్తవ ప్రచారకులకు ఇది నచ్చలేదు. క్రమేణా ఇది ఘర్షణకు దారితీసింది. గిరిజనులు ఒకవైపు, మతం పుచ్చుకున్న ఎస్సీలు ఒకవైపు చీలిపోయారు. చివరకు 2008 ఆగస్టులో స్వామి హత్య చేయబడ్డాడు.

స్వామి హత్య తరవాత జరిగిన గొడవలను మతఘర్షణలుగా అభివర్ణించారు. కానీ అవి మతఘర్షణల కంటే కూడా అవి ఎస్సీ ఎస్టీల మధ్య మతమార్పిడులు సృష్టించిన తగాదాలని స్పష్టమౌతోంది. స్వామి హత్య ఈ ఉద్రిక్త వాతావరణంలో నిప్పురవ్వయై పేలుడు సృష్టించింది.
----------------------------
ఇదీ కంధమాల్ కథ. మత ప్రచారమూ, మతమార్పిళ్ళూ సృష్టించిన సామాజిక బీభత్సం. గొడవలు ఎవరు చేసినప్పటికీ ఖండించాల్సిందే! దౌర్జన్యాన్ని అణిచెయ్యాల్సిందే! దానవత్వాన్నీ, పాశవికతనూ నిర్ద్వంద్వంగా నిర్మూలించాల్సిందే! అది ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. దుండగుడు హిందువా, క్రైస్తవుడా, దళితుడా, గిరిజనుడా, అగ్రకులస్తుడా అనేది చూడకూడదు. అలాగే, ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా చెయ్యాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పరిష్కారాన్ని అమలు చెయ్యాలి. దూరదృష్టి, సద్వివేచన, పెద్దరికం ఉన్న నాయకులకే ఇది సాధ్యం! గొడవలకు మూలాన్ని పట్టుకుని మళ్ళీ తలెత్తకుండా చావుదెబ్బ కొట్టాలి.మూలకారకుల పీచమణచాలి.

ఈ సమస్యలోని మరో విషాదకర పార్శ్వమేంటంటే.. స్వామి హత్య ఎవరు చేసారనేది ఇంతవరకు తేలలేదు సరికదా, దాని సంగతీ పట్టించుకునేవాడే లేడు. ఉరుకులు పరుగులతో "క్రైస్తవులపై హిందువుల దాడి"ని ఖండించేందుకు అత్యుత్సాహం చూపించే లౌకికవాదులేగానీ, స్వామిని చంపిందెవరని అడిగేవాడే లేడు. స్వామిది వర్గ హత్య అని, ఆ తరవాత జరిగింది మాత్రం మత ఘర్షణ అనీ వ్యాఖ్యానించారు. మాధ్యమాలు కూడా అంతే!

కంధమాల్లో జరిగినది భారతంలో ఎక్కడైనా జరగొచ్చు. అక్కడ ఎస్సీలు, ఎస్టీల మధ్య జరిగింది. ఇతర చోట్ల వేరేవారి మధ్య జరగొచ్చు. ఉదాహరణకు దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకూ జరగొచ్చు. జనగణన లెక్కలు ఖచ్చితంగా జరిగితే ఈ వివాదం బయటపడొచ్చు. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వాలనే వాదనొకటి ఉంది, గమనించే ఉంటారు. ఈ మధ్య అదేదో కమిషనొకటి వేసి దాని చేతా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పించారు. మతమార్పిడికి అనుకూలంగా క్రైస్తవ ప్రచారకులు చెప్పే ప్రధానమైన వాదనేంటంటే.., క్రైస్తవంలో కులాల్లేవు, కులవివక్ష లేదు, అణచివేత లేదు అని. మతమార్పిడి సమర్ధకుల వాదనల్లో కూడా ఇదొకటి. అలా అయితే రిజర్వేషన్లు కావాలని ఎందుకడుగుతున్నారు? హైందవాన్ని దెబ్బతీసే క్రమంలో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న దీర్ఘకాలిక కుట్రలో ఇదీ ఒక భాగమే.

మతం పుచ్చుకున్నవారు హాయిగా జీవిస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారనేది పూర్తిగా అవాస్తవమేమీ కాదు.. కొందరు హాయిగానే ఉన్నారు. గుర్రం జాషువా లాగా వెతలనుభవించినవారూ ఉన్నారు. క్రైస్తవంలోని ఆంక్షలకు, వివక్షకు జాషువా ఒక నిదర్శనం. కంధమాల్లో కూడా రోజుకో గుప్పెడు ధాన్యాన్ని ప్రతి ఒక్కరు చర్చికి సమర్పించాలంట. తమ దొడ్లో పుట్టిన ఆవుదూడగానీ, బర్రెదూడగానీ మొదటిదాన్ని చర్చికి సమర్పించాలంట. వివక్ష పేరుచెప్పి మతాలు మార్చి, క్రైస్తవులు చేసేది ఇది.

మతమార్పిడి, మత ప్రచారమూ లేకపోతే కంధమాల్ జరిగేది కాదు అని స్పష్టం. అంచేత ఈ మతమార్పిడులను ప్రచారాలను నిషేధించాల్సిన అవసరం ఉంది.

18 కామెంట్‌లు:

  1. చదువరి గారు చాలా విషయాలను తెలియచేసారు, నెనరులు.

    రిప్లయితొలగించండి
  2. చాలా రీసర్చి చేసి రాసినట్టున్నారు. బాగుంది. గుడ్డిగా హిందువులని తిట్టడమే పనిగాపెట్టుకున్న కుహనా లౌకికవాదులకు, ప్రసారమాధ్యమాలకు, కిరస్తానీయులకు ఈవిషయాలు పడతాయా? ఆయనెవరో ఈ మధ్య బ్లాగినట్టు, ఇంకొన్నేళ్ళలో హిందువులే మైనారిటీలయితే...?
    హిందువులారా ఏకంకండి... కుహనా లౌకికవాదులనుండి, శాంతిపేరుతో విధ్వంసం చేస్తున్న ఇలాంటి అన్యమతావలంబకుల నుండి మన సంస్కృతిని, మతాన్ని రక్షించుకుందాం.

    రిప్లయితొలగించండి
  3. i want to point out another religion -buddism which has quietly eroded into our midst-mostly in the urban areas-the so called educated and intellectual groups-they offer salvation,state that they do not need funds-these lost souls put in "voluntarily" some amont in the hundis conveniently kept at every corner,bother friends an relatives to attend their camps,and put in money-"whatever you think is appropriate" and in return get a private audience with mr goenka and feel that they have attained a "Height".this is done so subtly that the disciple does not feel that there is any pressure,coersion,a mild hypnotic effect and are ending up donating property,money and man power.i have noticed this especially in andhra pradesh.since this is mostly in middle and upper middle class educated people this does not seem to be a big problem now but slow conversions of family members over a generation or two will occur.already there are families who have converted-most of these people who are attending these camps are people with no self worth/have a mechanical life after acheiving great academic heights/misguided children and grandchildren of converts/people who faced some adversity in life and are looking for something in life/borderline depressed individuals.this is only my opinion based on what i have observed from 2 families very closely.in conclusion i want to point out that an individual with self respect/pride in his roots will not be swayed into another religion.it is time to think about what needs to be done to prevent conversions and ensuing unnecessary physical and psychological trauma/repurcussions.

    రిప్లయితొలగించండి
  4. మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లా ఒక కొంధమాల్ గా మారబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లంకె మీద నొక్కి చూడండి :

    http://www.scribd.com/doc/6032981/Death-of-Hinduism

    రిప్లయితొలగించండి
  5. నేపధ్యాన్ని చాలా బాగా వివరించారు. కాకపోతే, తరువాత జరిగిన ఘటనాక్రమం గురించి ‘కుహానా మతవాదులు’ చేస్తున్న ప్రచారాలలోని సత్యాసత్యాలెంత? ఆ విషయం కూడా చెప్పుంటే వ్యాఖ్యానించడానికి వీలుండేది.

    రిప్లయితొలగించండి
  6. Good article. If anybody intrested to know more
    on conversion topic

    http://www.tehelka.com/story_main.asp?filename=ts013004shashi.asp&id=1

    రిప్లయితొలగించండి
  7. ఈ కాంథమాల్ వ్యవహారం గురించి చాల బాగ విశదీకరించారు.. ధన్యవాదాలు.. కానీ 'కులాన్ని చంపడం' అనే ముసుగులో మనం హిందుత్వాన్నే చంపుకుంటున్నామనిపిస్తోంది... జ్యొతి లో ప్రచురుఇంచిన ఈ కథ http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/12-10/story లో indirect గా హిందుత్వం మీద ద్వేషం కనబడుతోంది నాకు... లేకపోతే కులాన్ని హిందుత్వాన్ని విడదీసి చూడడం కుదరదా ?

    రిప్లయితొలగించండి
  8. సమగ్రమైన విశ్లేషణ!చాలా సమాచారాన్ని అందించారు.

    రిప్లయితొలగించండి
  9. "భైంసా సంగతేంటో?": పూర్తి వివరాలు తెలీలేదండి. అంచేతే రాయలేదు. మీకు తెలిసిన వివరాలతో మీ బ్లాగులో రాయకపోయారా? చాలా బిజీగా ఉన్నట్టున్నారు! :)

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా! చదువరీ! కైమోడ్పులు
    సీ:-కంద మూలములతో కానలన్ జీవించు - కొండవారికి క్రీస్తు అండ యనుచు,
    వారి వద్దకు చేరి "వరముల నొసగెడి - దైవము క్రీస్తంచు" తఱిని చూచి,
    మతముల మార్పిడి సతతము జేయుచు - నితరమతంబుల నేవగించు
    దుర్మతుల్ మనలోన దుష్ట భావము గొల్పి - ఐక్యత పోగొట్టి, యలరుచుండె.
    గీ:- క్రైస్తవుల మాట నమ్ముచు గేస్తులేల
    మోస పోవుచు నుండిరో! ధ్యాసతోడ
    నాలకింపగ జేసిరి మేలిమిగను.
    చదువరికి సాటి చదువరే, చదివి చూడ.
    లోకాన్ని మూయడం మూకుడికి సాధ్యం కాదు. యదార్థాలను దాచడం యెవరి తరం కాదు. కవుల , చదువరుల కలాలు, గళాలు చాలు, ప్రొసీడ్. గుడ్ లక్.
    చింతా రామ కృష్ణా రావు.

    రిప్లయితొలగించండి
  11. మీరు దీనిని పత్రికలకు పంపితె బాగుంటుంది. ప్రజావాక్యం పెరిట పత్రికలలో వస్తుంది పదిమందికి యదార్ధం తెలుస్తుంది.మీ కృషి అభినందనీయము.

    రిప్లయితొలగించండి
  12. Dear Chaduvari Garu,

    Mee Post chaala bagundi. Great work sir. Keep it up.
    with love
    Subba

    రిప్లయితొలగించండి
  13. sodarulaara,
    okkadi kosam 100 mandini champutaaraa?
    Mana desam loni varna vyvastha poye varaku hindutva identity kastame!
    Okka India lone kaadu prapanchamantha christhavula meeda daadulu jarugu toone unnai.
    God Bless India

    రిప్లయితొలగించండి
  14. వ్యాఖ్యాతలందరికీ నెనరులు. చివరి అజ్ఞాత సోదరా! చంపడం తప్పే, కానీ ఆ ఒక్కడిని ఎందుకు చంపారో, ఎవరి కోసం చంపారో గమనించండి. పోవాల్సింది వర్ణవ్యవస్థ కాదు, వర్ణవివక్ష. దానికంటే ముందు పోవాల్సింది మతమార్పిడి మహమ్మారి.

    రిప్లయితొలగించండి
  15. missionaries gurinchi sagam telisi..samgam vini raasi nattu vundi....anyhow bad eggs are there in every religion...u cant blame the religion with the peoples deeds...amma pettadu...adukku tinanivvadu annattu vundi sametha...

    రిప్లయితొలగించండి
  16. అదిరింది...చాలా బాగా రాశారు... వీలుచూసుకుని నేను కూడా తప్పకుండా రాస్తాను... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు