28, ఆగస్టు 2008, గురువారం

ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.


'తాను భిన్నమైన పనులేమీ చెయ్యననీ, ఇతరులు చేసే పనులనే విభిన్నంగా చేస్తాన'ని ఆగస్టు 17 న తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించినపుడు చిరంజీవి చెప్పాడు. సరిగ్గా అలానే జరిగింది. పార్టీ ఆవిర్భావ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రసంగంలో ఆయన విభిన్నంగా చెప్పిందేమీ లేదు. తమది పేదల పార్టీ, యువత పార్టీ, మహిళల పార్టీ, దళితుల పార్టీ,.. అంటూ అన్ని పార్టీలవాళ్ళు చెప్పే మాటలే చెప్పాడు. విధానాల సంగతి ఎలా ఉన్నా, ప్రసంగం ఉత్తేజకరంగా ఉంటుందని, మెరుపులు మెరిపిస్తుందనీ నేను అనుకున్నాను. కానీ అంతలా లేదు.

ముఖ్య విశేషాలు:

  1. తన మొట్టమొదటి రాజకీయ ప్రసంగంలో చిరంజీవి ఏ ఒక్క నాయకుడినీ, పార్టీనీ విమర్శించలేదు. ఈ రోజుల్లో ఇది ఆశ్చర్యకరం, అభినందనీయం. అశేషంగా ఉన్న తన అభిమానులను తన శైలిలో అలరించాడు.
  2. ప్రసంగం రెండు భాగాలుగా ఉంది. తాను చెప్పినది, తాను చదివినదీ. తన జీవితం గురించి తాను చెప్పుకున్నది మొదటి భాగం. చదవడం కాక, చెప్పడం కాబట్టి కృతకంగా కాక, బాగుంది. అయితే, నేనూ నా పేదరికం, నేనూ నా వ్యవసాయం లాంటి విషయాల గురించి అంతలా ఎందుకు చెప్పుకున్నాడో అర్థం కాలేదు. ఒకపూట తిండి లేక అర్థాకలితో పడుకున్నానని చెప్పుకొచ్చాడు.
  3. తన పార్టీ విధానాలను ప్రకటించే రెండో భాగాన్ని చదివిన విధానం బావోలేదు. దాన్ని ముందే బాగా చదువుకుని ఉంటే తడబాట్లు లేకుండా సాగేది. వాక్యం మధ్యలో తాను చదివే అంశపు ప్రాశస్త్యం అర్థమై, దానికి కొంత ఆవేశాన్ని జోడించాల్సిన అవసరాన్ని గ్రహించి, ఆఫళాన గొంతులో అవేశంతెచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఆ సీన్లు అంతగా పండలేదు. ప్రసంగ పాఠాన్ని ముందే బాగా చదివి జీర్ణించుకోవాల్సింది.
  4. ఏ వర్గాన్నీ విదలిపెట్టకుండా అందరినీ స్పృశిస్తూ సాగిపోయింది ప్రసంగం. ఏ పార్టీవారైనా చేసే పనే ఇది. కాకపోతే మధ్యతరగతి వారి గురించి ఓ పేరా ఎక్కువ రాయించినట్టు కనబడింది.
  5. ప్రధానమైన అంశాలపై చిరంజీవి దాటవేసాడు. తెలంగాణా గురించి, ఎస్సీ వర్గీకరణ, కాపులకు రిజర్వేషను గురించి తమ విధానాన్ని మేధావులతో చర్చించాక నిర్ణయిస్తాడట. ఇలాంటి ప్రధాన సమస్యలపై ఒక విధానం కలిగి ఉండటం ఒక రాజకీయ పార్టీకి ప్రధాన ఆవశ్యకం. కాంగ్రెసు తెదేపాలు దాటేసినట్టే ప్రజారాజ్యం తన పద్ధతిలో తానూ ఈ సమస్యలను దాటేసింది.
  6. తెలంగాణాపై కాంగ్రెసుకూ, తెదేపాకు కూడా ఇదమిత్థమైన అభిప్రాయం లేదు. కాంగ్రెసుదేమో మోసం చేసే ధోరణి. తెదేపాది సరైన-సమయంలో-సరైన-నిర్ణయం తీసుకునే దొంగ ధోరణి, గోడమీది పిల్లి వాటం. చిరంజీవిది వీటికంటే మెరుగైన ధోరణేమీ కాదు. మేధోమథనం జరిపి, ఆపై తన విధానాన్ని బయటపెడతాడట. ఎప్పుడు జరుగుతుందది? ఎన్నికలకు ముందా, అవి అయ్యాకా? తొమ్మిది నెల్లకు పైగా పార్టీ పెట్టే విషయమై చర్చ జరుగుతున్నపుడు, ఇలాంటి ప్రధాన విషయాలపై ఎందుకు చర్చ జరపలేదు? రెండు మూడు నెలలుగా కార్యకర్తల శిక్షణ, సమాజంలోని వివిధ వర్గాల సమీకరణ జరుపుతున్నపుడే ఈ మేధోమథనమేదో జరిపి, వీటిపై ఒక విధానం ఎంచేత ఏర్పాటు చేసుకోలేదు? ఒకే కారణం కనిపిస్తోంది.. ఎన్నికలలోపు వివాదాస్పద విషయాల జోలికి పోకుండా, ఎవరినీ వ్యతిరేకం చేసుకోకుండా ఎన్నికలను గడుపుకోవడం! మిగతా రెండు పార్టీల లాగానే ప్రజారాజ్యం కూడా! ఎస్సీ వర్గీకరణ సంగతి కూడా మేధోమథనం జరిగాకేనట! అలాగే, కాపులను బీసీల్లో కలిపే విషయం కూడా!
  7. ఇవన్నీ ఎలా ఉన్నా, అవినీతి మీద విస్పష్టమైన విధాన ప్రకటన ఉంటుందని ఆశించాను. అయితే అలాంటిదేమీ చెయ్యలేదు.
  8. మద్య నియంత్రణ అట! నిషేధం గురించి మాట్టాడలేదు, నియంత్రిస్తారట. ఎలాగో చెప్పలేదు. బెల్టుషాపులను తీసెయ్యడమా? నియంత్రించడమంటే ఏంటో చెప్పలేదు.
చిరంజీవి ప్రసంగంపై నేను చూసిన ఒక స్పందన గురించి రాస్తాను. ఆగస్టు 27న మాజీ అయ్యేయెస్ అధికారి డీసీ రోశయ్య చేత తొమ్మిదో టీవీ వాళ్ళు కొన్ని మాటలు చెప్పించారు.. దళిత బలహీన వర్గాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు. గుండెలో లేంది పెదవి మీద ఎందుకుంటుందిలే అని విమర్శించాడాయన. ఈ రోశయ్యే ఒకప్పుడు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన వాడు. అందుకు పశ్చాత్తాపం చేసుకుంటానంటూ ఆవేశపడిపోతున్నాడు. ఈ రోశయ్యే - పదవీ విరమణ చేసేందుకు కొద్దిరోజుల ముందు వందల కోట్ల విలువ చేసే కాందిశీకుల భూమిని అప్పనంగా కొందరికి అప్పజెప్పాడు. ఆ భూపందేరంలో బెంగళూరు బుల్లినేతకు అనగా భావినేతకు లాభం చేకూరిందని కథనం!

చిరంజీవి ప్రసంగం తన అభిమానులను ఉద్దేశించి మాత్రమే చేసినట్టు అనిపించింది. గతంలో చిరంజీవి ఏం మాట్లాడినా చెల్లేది. ఎందుకంటే వాటికి శ్రోతలు వీరాభిమానులే కాబట్టి! ఇప్పుడలా కాదు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చెప్పేమాటలు తన అభిమానులే కాక మొత్తం ప్రజలందరూ వింటారు. ఈ మేధో మథనాల కోసం, తమ విధివిధానాల విపులీకరణ కోసం, చిరంజీవి చెయ్యబోయే ప్రసంగాల కోసం చూద్దాం.

24 కామెంట్‌లు:

  1. మంచి విశ్లేషణ. బాగుంది. నేనూ ప్రసంగం మొదట్లో కొంతసేపుచూసి మానేసాను.

    రిప్లయితొలగించండి
  2. మన తెలుగు భాష గుఱించి ఒక్క నాయకుడైనా మాట్లాడతాడేమో నని ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తాను నేను. ఒక్కడు - కనీసం ఒక్కడంటే ఒక్కడూ మాట్లాడడు. ఇదేం జాతో అర్థం కాదు. ఆత్మగౌరవం లేని ఈ తెలుగుజాతిలో పుట్టడం ఒక శాపం.

    ఎప్పుడూ 'కులం..కులం... కులం.' ఈ దేశంలో మాట్లాడుకోవడానికి వేఱే ప్రస్తావన లేదు. పంచాల్సినవాళ్ళందఱికీ రిజర్వేషన్లు పంచెయ్యడం అయిపోయింది. ఇంక పంచడానికి అక్కడ ఏమీ లేదు. అయినా "ప్రభుత్వం మా కులానికి ఇంకా ఏదో చెయ్యలే"దని ఏడుస్తూంటారు జనం.

    చిరంజీవి కూడా 'సామాజిక న్యాయం' వగైరా రొడ్డకొట్టుడు భాష ఎత్తుకున్నాక నాకు నీరసం వచ్చేసింది, "ఈయనేమీ పెద్ద విభిన్నమైన నాయకుడు కాదు" అని తేలిపోయి.

    రిప్లయితొలగించండి
  3. ఈ ఎన్నికలనుండీ నేనోమాట మానేశాను ఆ మాట పేరు ’కులం’ దాని బదులుగా సామాజిక వర్గం అంటే అదో క్లాసు

    రిప్లయితొలగించండి
  4. తన పేదరికం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకూ అర్థం కాలేదు. వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్ మెంట్ లో ASI గా పని చేసాడని ఎక్కడో చదివాను. మరి పస్తులుండాల్సిన పరిస్థితి ఏమిటో, తరవాణి తాగాల్సిన దుస్థితి ఎందుకో ఏమీ బుర్రకెక్కలేదు. నారు పోశాడట, పొలం దున్నాడట, బస్తాల కొద్దీ ధాన్యం(మరి ఇంకెందుకూ పస్తులు, బస్తాలు తెస్తూ) బళ్ల మీద వేసుకొచ్చాడట! మొదటి సినిమాలోనే దళిత యువకుడి పాత్ర వేశాడట. ఇవన్నీ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాయనుకుంటున్నాడు?

    జనం దృష్టి వేటి మీద ఉందో(ఎస్సీల వర్గీకరణ, కాపుల సమస్య, మద్యం, తెలంగాణ) వాటిని తప్పించి సొంత గొడవ బాగానే చెప్పుకున్నాడు.

    మీరు చెప్పిన నెం.3 పాయింట్ బాగుంది.భలే పరిశీలించారు!

    దేవుడి దర్శనం కూడా మానేసి రిహార్సల్ చేసినందుకు ఫలితం బాగానే ఉందనుకుంటా!

    రిప్లయితొలగించండి
  5. మంచి తెలుగు భాష లో ప్రసంగిస్తాడనుకున్నాను. సగం అవసరం లేని ఆంగ్ల పదాలే. Anxiety అట Piller అట

    రిప్లయితొలగించండి
  6. నెను కూడా చాలా ఎక్ష్పెక్ట్ చెసాను. బాగా నిరుత్సాహపరిచాడు. చివరికి ఇది కుడా తెలుగు దేశం ని, కాగెశు ని కలిపి కాసెపు మిక్సి లొ వేసి తీస్తె యల ఉంటుందొ అల ఉంతుంది అనిపిస్తుంది

    రిప్లయితొలగించండి
  7. sinimaallO Trai chEsETappuDu pastulumDiumTaaDu leMDi.

    రిప్లయితొలగించండి
  8. నిజమే, మిగతా పార్టీకి, చిరు పార్టీకి పెద్ద తేడా కనిపించడం లేదు. ఎంతైనా మనకి కొత్తొక వింత పాతొక రోత కదా?

    రిప్లయితొలగించండి
  9. [..]మొదటి సినిమాలోనే దళిత యువకుడి పాత్ర వేశాడట[..]

    రిప్లయితొలగించండి
  10. మీ సంగతి ఏమో గానీ నన్ను మాత్రం చాలా ఆశ్చర్యపరచాడు చిరంజీవి.అసలు మాటలు రాలేదు నాకు.ఏనాడో టీవీ తాడు తెంపిననాకు తెల్లారి పత్రికల్లో చదువుదామని బీవీరాఘవులు గారి దివ్యప్రవచనాలు చదువుకుంటుంటే ఈ లోపు నవగ్రహటీవీ వాడు తనవెబ్సైట్లో సదరు చారిత్రాత్మకఒప్పును లైవ్ గా ప్రసారం చేశాడు.ఇక తప్పలేదు.అన్ని లక్షల మంది ముందు ఆ మాత్రం మాట్లాడినందుకు మధ్యలో మంచినీళ్ళు కూడా తాక్కుండా సెబ్బాస్ అన్నా.తెల్లారి ఈనాడు,ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూసి తల ఎక్కడ పెట్టుకుందామా అని ఇల్లంతా వెతికి మెడమీదే సర్దుకున్నా...

    రిప్లయితొలగించండి
  11. మీరు చెప్పింది నిజమే.. చాలా disappoint అయ్యాను నేను. మద్యపానం గురించి మాట్లాడినప్పుడు నిషేదం అంటాడేమో అనుకున్నాను కాని 'నియంత్రణ ' అని నిరుత్సాహపరిచాడు.

    రిప్లయితొలగించండి
  12. చాలా జాగ్రత్తగా మాట్లాడాడు, అలానే అన్ని పార్టీల లాగానే మాట్లాడారు. నిజంగా ఈ మేధావులెవరో, మేతావులేవరో నాకు మాత్రం అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  13. మన రాష్ట్రంలో నాయుడు గారు రెడ్డి గారు ఇప్పటికే చాలా దోచేశారు. ఇక మిగిలిందానికోసం ఈయన వస్తున్నట్టున్నారు. విధానాల్లేవు. విలువల్లేవు. కనీసం దేనిమీదా నిర్ధిష్టమైన అభిప్రాయాల్లేవు. చాలా నిరాశ పరిచింది. దీనికంటే తెదేపా, కంగ్రెస్స్ లే మేలు. లోక్ సత్తా లాంటి హుందా ఐన పార్టీలకు చాలా కాలం పట్టవచ్చునేమో. ఇటువంటి పార్టీలు ఆదర్శాలనే కాకుండా ఆచరణ కుడా అలవరచుకోవాలి. కార్య సాధనను నేర్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  14. హమ్మయ్య .. సంబరాల సందోహమే గానీ ఒక్కటైనా విచక్షణతో కూడిన సమీక్ష కనబడదేమా అని ఆరాటపడిపోతున్నా. తీర్చారు. స్పీచి "చదివిన" పార్టుని మా చిన బూషయ్య గారు చదివిన ష్టైల్లో చదివాడన్నమాట.

    ఆవిష్కరణ సభలోనే మొత్తం మేనిఫెస్టో ప్రకటించనక్కర్లేదు గానీ కనీసం ఇంకో నెల రోజుల్లో అలాంటిదేవీ బయటపడక పోతే ఈ ప్రజారాజ్యాన్ని చాలా అనుమాన దృష్టితో చూడాల్సి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  15. రాజేంద్ర గారు,
    "ఏనాడో టీవీ తాడు తెంపిన నాకు...."
    "బివి రాఘవులు గారి దివ్య ప్రవచానాలు.."
    "నవగ్రహ టివీ..."
    "చారిత్రాత్మక ఒప్పు.."
    "తలెక్కడ పెట్టుకుందామా అని ఇల్లంతా వెదికి చివరకు మెడ మీదే సర్దుకున్నా..."

    మీరూ కామెడీ మనుషులే!

    రిప్లయితొలగించండి
  16. hello,
    aa sabha 24hrs sabha kaadu anni vivaramga cheppataaniki.....ee blog meeru oka 3 nelala tharvataha raayandi..ayana vidhanaalu avi appudu thelusthaayi.

    రిప్లయితొలగించండి
  17. అవినీతి అవినీతి అవినీతి
    దీని గురించి మాట్లాడతాడని నేనూ ఎంతో ఆశ పెట్టుకున్నాను. ఈ ఒక్క మాట వాడినట్టయితే నేను వోటేసేసేవాడిని!
    చిరంజీవికి ప్రజాసేవాపరాయణత్వం ఎంతుందో నాకు అర్థం కావట్లేదు. అభ్యుదయ ఆశ చూపి అందరు ప్రజానాయకుల్లా ప్రజారాజ్యాన్ని ఏలతాడో ఏఁవో ..

    అన్నట్టు బెంగుళూరు బుల్లిరాజు అంటే ఈయనేనే ..

    రిప్లయితొలగించండి
  18. మీరంతా అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. ఈ స్థాయిలో ఓట్లేసేవాళ్లంతా ఆలోచిస్తే దేశమీ తీరున ఈసురోమంటుండేదా? అదో బలప్రదర్శన సభ. మ్యానిఫెస్టోలూ గట్రా పట్టించుకునేవాడు మన లాగా టివిల్లో చూసో పత్రికల్లో చదివో ఉండేవాడు కానీ తిరపతెళ్లుండడు కదా. అలా వెళ్లినోళ్ల కోసం అదో బ్రహ్మాండమైన షో. సిరంజీవి సినిమాల్లో డవిలాగులు ఎంత అర్ధం పర్ధం లేకుండా ఉంటాయో ఇక్కడ స్పీచీ అంతే. రేపు బాలయ్య బాబు గుంటూర్లోనో ఎక్కడో దీనికి పోటీ బలప్రదర్శన చెయ్యబోతున్నట్లున్నాడు. అప్పుడక్కడ తొడ కొడుతూ మీసం మెలేస్తూ ఆయన చెప్పబోయే డవిలాగులు ఇంకెంత పసందుగా ఉంటాయో చూస్కోండి :)

    రిప్లయితొలగించండి
  19. లైవ్ చూసే అదృష్టం కలగలేదు కానీ చదివినంతలో నాకూ పెద్ద తేడా కనిపించలేదు మిగతా పార్టీలతో పోలిస్తే.
    ఇంకా చెప్పాలంటే లోక్‌సత్తా పార్టీ అజెండా చిరంజీవి పార్టీ దాని కంటే క్లియర్ గా ఉందనిపిస్తుంది.

    కానీ ఇంకా వేచి చూద్దాం...

    రిప్లయితొలగించండి
  20. అంతా బాగుంది కానీ, నాకు అర్థం కాని విషయం - తెలంగాణ, ఎస్సీల వర్గీకరణ, కాపుల రిజర్వేషన్లు ప్రధాన సమస్యలా అని! రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి వీటిని ప్రధాన సమస్యలుగా చిత్రిస్తున్నాయేమో ననిపింస్తుంది నాకు. వ్యవస్థీకృతమైన అవినీతిని అస్తవ్యస్తం చేసే ఆలోచనుంది అనే మాటేమయినా వస్తుందేమో అనుకున్నాను. తొలి రాజకీయ ప్రసంగం చప్పగా వుందనే చెప్పాలి. మీరన్నట్టు చిరంజీవి ప్రసంగం తన అభిమానులను ఉద్దేశించి మాత్రమే చేసినట్టు అనిపించింది.

    రిప్లయితొలగించండి
  21. @తాడేపల్లి సుబ్రమణ్యంగారు,

    మీ వ్యాఖ్య చూసిన మీదట కుతూహలం కొద్ది, కొన్ని విశ్వాసనీయ వర్గాల ద్వారా(ప్రజారాజ్యంలో వున్న) ఈ ప్రశ్న అడిగించాను.
    ఎందుకు తెలుగు గురించి మాట్లాడలేదు అని.

    ఒక్క సెకను కూడా అలోచించ కుండ వచ్చిన సమాధానం .." తెలంగాణ " - ప్రత్యేక భాషగా చూస్తున్న వారి నుంచి విమర్సలు ఎదురవుతాయి అని ....వగయిర ....

    పార్టీ మీటింగుల్లో ఏమి మాట్లాడాలో చర్చిస్తున్న సమయంలో ఇది ద్రుష్టికి వచ్చిందనిన్నూ ... తెలంగాణ సమస్యల్లో భాష కూడా ఒకటి కనుక దాన్ని కదిలించటం అంత సబబు కాదు అని ...చెబుతూ... పార్టీ అధికారం లోకి వచినప్పుడు .... తెలంగాణ , మరియు తెలుగు అభివ్రుద్దికొసం కార్యాచరణ ప్రణాలికలు రూపోందిస్తున్నరు(పాత పార్తేల్లోకి కూడా వున్నయి ఇలాంటివి అంటే నా దగ్గర సమాధనాం లేదు ..) అని వినికిడి ...

    రిప్లయితొలగించండి
  22. @chandramouli
    ఓహో ఒకప్పుడు రాజభాషగా చేయటానికి హిందీని తయారుచేసినట్టుగానే ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర భాషగా తెలంగాణా భాషను తయారు చేస్తున్నారన్నమాట.

    చిరంజీవి వామపక్ష పార్టీల్లో చేరి ఉంటే బాగుండేదేమో? జండాలకు, సభలకు డబ్బులు దండగా కాకుండా ఉండేది

    రిప్లయితొలగించండి
  23. వ్యాఖ్యాతలకు నెనరులు.

    రాకేశ్వరరావు: మిగతా రాజకీయుల కంటే ఎక్కువేమీ చిరంజీవి నుండి మనం ఆశించకూడదనిపిస్తోంది. కాకపోతే కొత్తగా వస్తున్నాడు కాబట్టి, అవినీతిని అరికట్టడం లాంటి వాటిని భుజానికెత్తుకుంటాడేమోనని ఆశ అంతే! బెంగళూరు బుల్లిరాజు ఆయనే! :)

    ప్రజారాజ్యపు విధానాల కోసం ఇంకొంత కాలం ఆగాలి. త్వరలో బయటికి రావచ్చు. ఇప్పుడిప్పుడే రాజకీయపు భాష మాట్టాడ్డం మొదలుపెడుతున్నారు.

    రానారె, మీరన్న సమస్యల కాడికొస్తే.. కాపుల రిజర్వేషన్లు ఇతర పార్టీలకు పెద్ద సమస్య కాదు, నిజమే. కానీ చిరంజీవికి అది గొంతుకడ్డం పడే మాంసం ముక్కే! పోతే, తెలంగాణా, ఎస్సీ రిజర్వేషన్లు మనమెదుర్కొంటున్న ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యలని నేను అనుకుంటున్నాను. ఏ పార్టీకైనా అవి కొరుకుడు పడనివే! నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ సమస్యల పట్ల పార్టీలు తమతమ విధానాన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. అది కొందరికి కష్టం కలిగించేదైనా సరే! సందిగ్ధత లేకుండా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని ఓట్ల పండగలైపోయాక, తీరుబడిగా దాన్ని బయట పెడదామనే క్రూరాలోచనే అన్ని పార్టీలదీ! ప్రజారాజ్యమూ అలాగే ఆలోచిస్తోందనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు