13, ఆగస్టు 2008, బుధవారం

శతకోటికొక్కడు !

2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా!

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు "అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి." అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా అభినందనలు కూడా!

వందకోట్ల మంది ఉన్న దేశంలో బంగారాన్ని గెలుచుకు రాగల మొనగాడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి బంగారం తెచ్చుకోడానికి వందేళ్ళు పట్టింది. కానీ.. జనాభాకీ ఆటల్లో పతకాలకీ సంబంధం ఉందా అనేది ప్రశ్న. లేదని కొన్ని వాస్తవాలను చూస్తే అనిపిస్తోంది. జనసంఖ్యలో మనతో పోలిస్తే పిపీలికాలనిపించుకునే దేశాలకు కూడా బోలెడన్ని పతకాలు వస్తూంటాయి. అర్మేనియాలు, అజర్బైజాన్లూ, బుర్కినాఫాసోలు, ఇంకా బోలెడు పేర్లు వినని దేశాలు కూడా బంగారు, వెండి పతకాలు పట్టుకుపోతూ ఉంటాయి. బయటి దేశాల సంగతే ఎందుకు.. మన దేశంలోనే జాతీయ ఆటల పోటీలు పెడితే కేరళ, హర్యానా, పంజాబులే ముందు! ఇంకా విశేషమేంటంటే మణిపూరు, అసోంలు, వాటి మిగతా సోదరీమణులు కూడా కొన్నిసార్లు మనకంటే ముందే ఉంటాయి. (చంద్రబాబు హయాంలో జరిగిన జాతీయ ఆటల పోటీల్లో బయటి రాష్ట్రాల నుండి ఆటగాళ్ళను పట్టుకొచ్చి, మనల్ని బాగా ముందుకు తీసుకుపోయాడు, అది వేరే విషయం!) అంచేత..

తేడా జనాభాలో లేదు, మరెక్కడో ఉంది.

ఆటలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మనం హాకీలో వెనకబడిపోవడానికి ఒక ముఖ్య కారణం చాన్నాళ్ళపాటు మనకు ఏస్ట్రో టర్ఫు లేకపోవడమేనని చెబుతారు (తరవాత్తరవాత గిల్లుడు కూడా కారణమని తేల్చారనుకోండి). అలాగే ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష, తాదాత్మ్యం ఉండాలంటే వాళ్లకు జీవిక గురించిన చింత ఉండకూడదు. రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!? వాళ్లకు అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామా? ఉద్యోగాలిచ్చినా, మరోటిచ్చినా.. మన ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలన్నీ ఆటల్లో ఒక స్థాయికి వచ్చినవారికే! తగు చేయూతనిస్తే ఆ స్థాయికి చేరగలవాళ్ళు అనేకమంది ఉంటారు. తన స్మృతి బ్లాగులో ప్రవీణ్ ఇదేమాట చెప్పారు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను చేరదీసి, ఆటగాళ్ళుగా తీర్చిదిద్దే ప్రణాళికలుండాలి. వాళ్ళకు జీవన భద్రత కల్పించాలి. ఆటల సంస్కృతి ఒకటి అవసరం మనకు!

ఆటల్లో రాజకీయుల ప్రత్యక్ష జోక్యం ఉండకూడదు. ఎంతటి గొప్ప సంస్థనైనా తెల్లారేలోగా గబ్బు పట్టించగల సామర్థ్యం వాళ్ళ సొత్తు. వాళ్ళు లేకపోతే ఈ సంస్థల్లో రాజకీయాలు కూడా తగ్గుతాయి. (రాజకీయాలు అసలే లేకుండా ఉండవనుకోండి).
ఇంతటితో ఈ జాబును ముగించి..


---------------------------------------

పతకాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్న సురేష్ కల్మాడి గురించి రెండు ముక్కలు.. అతడో కాంగ్రెసు ఎంపీ! ఎన్నేళ్ళుగా ఉంటున్నాడో తెలీదుగానీ చాన్నాళ్ళుగా - కొన్ని ఒలింపిక్కులుగా - అతడే భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఆటల పేరెత్తగానే గుర్తొచ్చేది గడ్డం పెంచుకున్న కల్మాడియే! అతని అర్హతలేమిటో తెలీదుగానీ, ఆటల పోటీలంటే చాలు ఆ పేరే వినిపిస్తుంది. ఒలింపిక్, కామన్‌వెల్త్, ఏషియన్, ఆఫ్రో ఏషియన్,ఏషియో ఆఫ్రికన్, ఏషియో అమెరికన్, అమెరికో ఏషియన్, ఏషియో ఆర్కిటిక్, ఆర్కిటికో ఏషియన్,.. ఇలా ఎన్ని రకాల ఆటలుంటే అన్నిట్లోనూ అతడే! (ఒకవేళ నేనిక్కడ రాసిన ఆటల పోటీలు లేకపోతే.. వాటిని మొదలుపెట్టినపుడు మాత్రం అధ్యక్షుడుగా అతడే ఉంటాడని చెప్పగలను) భారత అథ్లెటిక్ సమాఖ్యకు అతడు జీవితకాల అధ్యక్షుడు కూడా! 2010లో కామన్‌వెల్తు ఆటలు జరుగుతాయట.. దానికీ నేత ఆయనే! ఇన్నేళ్ళుగా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు చెప్పేమాట ఏంటంటే.. "ఓ.. పతకాలు వచ్చేస్తాయనీ, అద్భుతాలు జరిగిపోతాయనీ భ్రమ పడకండి" అని. ఇదీ ఇతగాడి నిర్వాకం! ఇలాంటివాడే క్రికెట్టుకి జయవంత్ యశ్వంత్ లెలే అని ఉండేవాడు. మనాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళేముందు "చిత్తుగా ఓడిపోయి తిరిగొస్తారు" అని అన్నాడు. ఇలా ఉన్నారు మన ఆటల నిర్వాహకులు!

4 కామెంట్‌లు:

  1. స్కూలు రోజుల్లో షాట్ పుట్ లూ, జావొలిన్ లూ ఎంత దూరం వేయగలమో కొలిచి మన రికార్డులో నమోదు చేయడమే కానీ సీరియస్ గా నేర్పి పోటీలకు తీసుకెళ్ళి, ప్రోత్సహించే టీచర్లు చాలా తక్కువమంది. అలా నేర్పే ప్రైవేట్ సంస్థలూ అరుదే! టెన్నిస్ నేర్పడానికి ఉన్నన్ని అకాడెమీలూ హైదరాబాదులో మిగతా క్రీడలకు ఏమున్నాయి? గచ్చిబౌలి స్టేడియంలో కూడా దీని గురించి info దొరకదు. ఒకవేళ ఉన్నా అన్ని డబ్బులు పోసి నేర్చుకోగలిగే స్థోమత అందరికీ ఉండొద్దూ?(భింద్రా కూడా తన సొంత డబ్బుల్తోనే శిక్షణ తీసుకున్నాడని చదివాను)

    క్రీడలపట్ల ఆసక్తికి స్కూల్లోనే బీజం పడాలి. అవి కెరీర్ గా ఉపయోగపడకపోతే సమయం వృధా అవుతుందేమో అన్న భయాన్ని పిల్లల్లో , వాళ్ల తల్లి దండ్రుల్లో పొగొట్టాలి.

    నాకు తెలిసి ఆడపిల్లల్ని ప్రతిభ చూపినా 'క్లాసులు పోతాయి, ఆటలు ఇప్పుడు సరదాగానే ఉంటాయి, తరవాత కూడు పెట్టవు ' ఇలాంటి భయాలతోనే నిరుత్సాహపరుస్తుంటారు.

    పల్లేటూళ్లలోని స్కూళ్లల్లో స్వతహాగా దేహదార్ఢ్యం కలిగి, మంచి ప్రావీణ్యం చూపే విద్యార్థులుంటారు. వాళ్లని వెతికి పట్టుకుని సానపెడితే మంచి ఫలితాలుంటాయి.

    ఆటలు చాలించిన క్రీడాకరులు కూడా తమ తర్వాత తరాన్ని తయారు చేయాలి, ఉష లాగా! అశ్వనీ నాచప్ప సినిమాల మీద చూపించిన ఇంటరెస్ట్ (ఉషను అధిగమించిన ఆ పోటీ తర్వాత) ఇక దేని మీద చూపించిందో, అసలెక్కడ ఉందో కూడా తెలియదు.

    కల్మాడీ లాంటి వాళ్లుంటే మళ్ళీ స్వర్ణపతకం కోసం మరొక వందేళ్ళు వేచి చూడాలి

    రిప్లయితొలగించండి
  2. సుజాత గారూ,

    మీరు అప్పుడు కనీసం సంవత్సరానికొకసారన్నా షాట్‌పుట్, జావెలిన్ త్రో ఆడినట్టున్నారు(ఆడించినట్టున్నారు!). మాకొచ్చేసరికి అవికూడా లేవు. ఏదో టెలివిజన్‌లోనో, డిగ్రీకాలేజీలో వేరే వాళ్ళు ఆడుతుంటే చూడ్డం తప్ప.

    క్లాసులు పోతాయని ఆడపిల్లల్నే కాదండీ, మగపిల్లల్నికూడా ఆడనిచ్చేవారుకాదు చాలామంది.

    రిప్లయితొలగించండి
  3. అభినవ్ బింద్రా నిజంగా అద్భుతమే సాధించాడు.112 ఏళ్ళ ఆధునిక ఒలంపిక్ చరిత్రలో భారతదేశానికి దక్కిన మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణమిది. ఇది నిజంగా ఆనందించవలసిన విషయమే… దానితోపాటు మన దుస్థితిని మరోసారి తలచుకోవలసిన సందర్భం కూడా.ఎందుకంటే మరిన్ని పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలబడగల సత్తా మన ఆటగాళ్ళలో ఉన్నది… మనదేశానికి ఉన్నది. అయితే ఆదిశగా ప్రయత్నమే లేదు…ఆ స్ఫూర్తే లేదు.

    “ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష,తాదాత్మ్యం ఉండాలంటే వాళ్ళకు జీవిక గురించిన చింత ఉండకూడదు.రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!?”…. ఇది చాలా ప్రాముఖ్యత గలిగిన అభిప్రాయం.మన దేశంలో ఒక్క ఆటగాళ్ళకే కాదు… దాదాపుగా సగం జనాభాకు ఈ చింత తోనె తమ మానసిక శక్తుల్ని, కాలాన్ని వృధా చేసుకోక తప్పటంలేదు.

    రాజకీయులంతా నిరంతరం తమ అస్తిత్వాన్ని,తమ అధికారాన్ని కాపాడుకోవటంలోనే తలమునకలయ్యే విధంగా వ్యవస్థ నిర్మాణం ఉంటే ఇక క్రీడలెలా ప్రోత్సహించబడతాయి. వారికి క్రీడలే కాదు ఎక్కడైనా సరే వారి స్వార్థ,సంకుచిత ప్రయోజనాలే ముఖ్యంగానీ మరేదీ ముఖ్యం కాదు. అందువలన వారెక్కడున్నా కొట్టేది గబ్బే.

    రిప్లయితొలగించండి
  4. ఈ దేశంలో క్రికెట్ పిచ్చి గణనీయంగా తగ్గితే తప్ప మనం ఒలింపిక్సులాంటి ప్రపంచ క్రీడల్లో పతకాలు సాధించే స్థాయికి చేరుకోలేం. దేశం దృష్టంతా ఎల్లప్పుడూ ఆ 11 మంది మీదే. మిగతా క్రీడల సాధకుల్ని పట్టించుకునేదెవరు ?

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు