5, జులై 2008, శనివారం

వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?

8 కామెంట్‌లు
అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది.

ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు తెలిపితే పద్ధతిగా ఉంటుందని నాక్కూడా అనిపించి అక్కడ రాయలేదు.

ముందుగా ఒక్క విషయం.. పోలీసులు చేసిన తప్పుడు ఎన్‌కౌంటర్లను నేను సమర్ధించడం లేదు. నేనన్నదల్లా - రెండువైపులా తప్పులు జరిగినపుడు ఒక్కరినే ప్రశ్నిస్తారేమిటని! అటువైపు తప్పులు కనబడవేమిటని!!

నక్సలైట్లపై జరిగిన అమానుష హింస గురించి మనం తెలుసుకోవాలి, నిజమే! అలాగే నక్సలైట్ల ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.


ముందుగా.. నక్సలైట్లపై చట్టబద్ధంగా చర్యలెలా తీసుకోవాలి -
ఏకే47లూ, రాకెట్లతో యుద్ధం చేసేవారిని చట్టబద్ధంగా శిక్షించడమెలాగ? (ఆ ఆయుధాలను పట్టుకుని మనపై తెగబడినవారినే అనేకానేక సంఘటనల్లో కాల్చిచంపేసింది - వాటిలో పార్లమెంటుపై దాడి ఒకటి) వాళ్ళని పట్టుకుని, సంకెళ్ళు వేసి తెచ్చేందుకు పోలీసులు ఏ ఆయుధాలు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పట్టుకోవాలి? మందుపాతరలు పెట్టి అటుగా వచ్చే పోలీసులను (మనుషులను) పేల్చేసిన వారిని పట్టుకునేదెలా, శిక్షించేదెలా?

అలాగే నక్సలైట్లు ఇన్నాళ్ళుగా చేస్తున్నదేమిటో, ఇప్పటివరకూ వాళ్ళు సాధించిందేమిటో కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి.

రైల్వే స్టేషన్లు, పోలీసు స్టేషన్లు, టెలిఫోను ఎక్స్ఛేంజీలు, ఆర్టీసీ బస్సులు, సెల్ టవర్లు మొదలైన అనేక ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిందెందుకో కూడా మనం తెలుసుకోవాలి.

ఇన్నేళ్ళుగా వాళ్ళు వాడిన ఆయుధాలు, మందుపాతరలు, మందుగుండు సామాగ్రి ఎక్కడినుండి వచ్చాయో తెలుసుకోవాలి. తమ సాయుధ పోరాటాన్ని నడపడానికి అవసరమైన డబ్బును వాళ్ళు ఎక్కడినుండి ఎలా సమకూర్చుకున్నారో కూడా తెలుసుకోవాలి. ప్రజాప్రతినిధుల లాగానే వీళ్ళు కూడా కాంట్రాక్టర్ల దగ్గరి నుండి రౌడీమామూళ్ళు తీసుకుంటారన్న సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్సలైట్ల పేరు చెప్పుకుని ప్రజల దగ్గరినుండి డబ్బులు గుంజిన (ఎక్స్‌టార్షన్) నకిలీ నక్సలైట్లకు ఆ ఆలోచనలు ఎలా వచ్చాయో, చాలా సందర్భాల్లో ఆ మోసాలు ఎందుకు సఫలమయ్యాయో కూడా తెలుసుకోవాలి. నక్సలైట్లు ఆయుధాల డంపులతో పాటు డబ్బు డంపులు కూడా ఎలా సమకూర్చుకున్నారో తెలుసుకోవాలి. డబ్బులు పట్టుకుని దళాన్నొదిలి పారిపోయినవారి గురించి, డబ్బుల కోసం అయిన గొడవల గురించి కూడా తెలుసుకోవాలి. దళంలోని ఆడవారిపై దాడులు చేసిన సంగతులు కూడా మనం మననం చేసుకోవాలి.

పోలీసులు జీపుల్లో వెళ్ళటానికి భయపడి ఆర్టీసీ బస్సులో వెళ్ళబోతే ప్రజలు అడ్డుచెప్పిన సంఘటనలెందుకు ఎదురయ్యాయో, పోలీసులు అంటరానివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగులు 'పోలీసులు మావెంట రక్షణగా వస్తే మేం వెళ్ళం' అనే పరిస్థితి ఎందుకొచ్చిందో, పోలీసులు వెంటరాకూడనివారు ఎందుకయ్యారో కూడా తెలుసుకోవాలి. 'ఎన్‌కౌంటరు జరిగిన ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడ మృత్యువాసన గుప్పున కొట్టింద'ని అంటూ ఉంటారు విప్లవ కవులు కొందరు, శ్రేష్టులలోకెల్లా శ్రేష్టులు కొందరు - మరి అంటరాని, వెంటరాకూడని ఆ పోలీసుల కళ్ళలో మృత్యువు నీడలు కనబడలేదో ! మందుపాతరల్లో మారుమోగిన మృత్యుఘోష వినబడలేదో!!

దిలీప్ గారన్నారు.. ఆ డబ్బులు ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే నక్సలైట్ల అవసరం ఉండేదే కాదు అని. ఈ నక్సలైట్లు ఉండీ ఉపయోగమేం జరిగిందో నాకు అర్థం కాదు.. ఇవ్వాళ్టికి కూడా చింతపండు అమ్ముకునే దగ్గర గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా - గిరిజనులను దోచుకుంటే ఊరుకునేది లేదని వ్యాపారులను బెదిరించి పోయారట! ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసినా ఎంతో కొంత సాధించి ఉండేవారేమో!

ఇన్నేళ్ళ సాయుధ పోరాటం తరవాత, వాళ్ళు సాధించిన కొన్ని కీర్తి కిరీటాలు: టి.హయగ్రీవాచారి, దుద్దిళ్ళ శ్రీపాదరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, పాల్వాయి పురుషోత్తమరావు, ప్యానెల్ స్పీకరు సి.నర్సిరెడ్డి - ఆయనతోపాటు మరో పది పన్నెండు మంది. (ఇవి నాకు తెలిసినవి, తెలియనివెన్నో!) వీళ్ళెవరూ పోలీసులు కారు.

ఇన్నేళ్ళ వర్గపోరాటం ద్వారా ఏం సాధించారో, ప్రజలకు వీళ్ళెంత ఉపయోగపడ్డారో కూడా తెలుసుకోవాలి. నేపాలు నుండి దండకారణ్యం దాకా (లేక, నల్లమల దాకానో మరి.) ఎర్ర బాట (రివల్యూషనరీ కారిడార్ - RC) పరిచారు కదా! నేపాల్లో చెయ్యాల్సిన హింస అంతా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొని పాలనలో కొచ్చారు. అక్కడంటే ఇన్నాళ్ళూ ప్రజాస్వామ్యం లేదు సరే, కానీ మనకుందే! మరి ఈ హింసా, విధ్వంసం అన్నీ మానేసి, ఎన్నికల్లో పాల్గొనవచ్చుగదా!ఆ బాటలో నడచే కామ్రేడ్లే గదా, వీళ్ళూను!! పోటీ చేసి, అధికారంలోకి వచ్చి, వర్గ నిర్మూలన చెయ్యొచ్చు కదా! వర్గ నిర్మూలన తుపాకీతో సాధ్యపడేదైతే ఈ 40 ఏళ్ళలోనూ జరగలేదే!!

వర్గనిర్మూలన, సమసమాజ స్థాపన అనేది ఉదాత్తమైన ఆశయమే కానీ నలభై ఏళ్ళ తరవాత అది ఉత్త ఆశయం ఐపోయినట్టు కనబడుతోంది.

3, జులై 2008, గురువారం

వాళ్ళు మనకోసం ప్రాణాలర్పించారు

12 కామెంట్‌లు
అది యుద్ధం. గెరిల్లా యుద్ధం. 65 మంది పోలీసులు, ఇతర సిబ్బందీ నదిలో, నడిమజ్జన ఉండగా మావోయిస్టులు రాకెట్లూ తుపాకులతో దాడి చేస్తే పాపం చెల్లాచెదురయ్యారు. 29 మంది మాత్రం బ్రతికి బయట పడ్డారిప్పటికి. మిగిలినవారి జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసుల అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన జరిగిందని ఒక వంక చెబుతున్నారు. ఆ పడవ నడిపే అతను మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడని మరో వాదన కూడా వినవస్తోంది. ఒక పోలీసు శవం నదిలో దొరికింది. అతడి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయని అంటున్నారు. అతడు మావోయిస్టులకు దొరికితే, చేతులు కట్టేసి నదిలోకి తోసేసి ఉంటారు. ఎంత క్రూరత్వం!

ఈ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులను బాగా అణచివేసారు. దాదాపు ప్రతిరోజూ వినబడుతూ ఉండే ఘాతుకాలు ఇప్పుడు ఆగిపోయాయి. బహుశా మితిమీరిన ఆత్మవిశ్వాసం పోలీసుల పాలిట మృత్యు వయ్యుండొచ్చు. అదను చూసి మావోయిస్టులు మాటేసి, కాటేసారు.

భలే జరుగుతోంది యుద్ధం!
-మావోయిస్టులు గెరిల్లా దాడులు చేస్తూ ఉన్నారు.
-పోలీసులు ప్రాణాలకు తెగించి వాళ్ళను వేటాడుతున్నారు.
-రాజధానిలో మాత్రం రాజకీయ నాయకత్వం మావోయిస్టు నాయకత్వంతో కులాసా కబుర్లు చెబుతోంది.వాళ్ళు జైల్లో ఉంటే జైలుకు, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రికీ వెళ్ళి మరీ చర్చలు చేస్తోంది. అడవుల్లో పోలీసులు రక్తం ధారపోస్తుంటే. రాజకీయ నాయకులు ఆసుపత్రులకెళ్ళి అన్నలను పరామర్శిస్తున్నారు.

ఏ రాజన్ననో, రాజక్కనో అరెస్టు చేసారనే పుకారొస్తే చాలు మానవ హక్కులవారు గగ్గోలెడతారు, హడావుడి చేసేస్తారు. వాళ్ళను కోర్టుకప్పజెప్పాలి అంటూ చదును చదును చేస్తారు. (ఓసారిలాగే సుధాకరునో మరో దివాకరునో అరెస్టు చేసారనే వార్తలొచ్చాయి -అంతే ఈ వాదులు నిదర్లు పోలేదు. ఓ రోజో రెండ్రోజులో పోయాక సదరు వీరుడే ఒరిస్సా నుంచి ప్రకటన చేసాడు, అబ్బెబ్బే నేను వాళ్ళకి చిక్కలేదు, బానే ఉన్నానంటూ -అప్పుడాగింది వీళ్ళ హడావుడి.)

ముప్పైఐదు మందికి పైగా కుర్రాళ్ళు మనకోసం పనిచేస్తూ గల్లంతయ్యారు. రెండు రోజులైనా ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. వాళ్ళ సహచరులు.- ఏఁ, మేం మనుషులం కామా, మాకు మానవహక్కులు లేవా? అని అడుగుతున్నారు, ముందు మనుషులం ఆ తరవాతే పోలీసులం అని ఆక్రోశిస్తున్నారు.

ఔను మరి, వాళ్ళకు లేవా హక్కులు?

1, జులై 2008, మంగళవారం

బ్లాగరులో కొత్త అంశాలు

8 కామెంట్‌లు


బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.



ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.

సంబంధిత టపాలు