28, జూన్ 2008, శనివారం

దేశం తలపట్టుకుంది

నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

ప్రధాని తన ఇంట్లో, తన గదిలోనే తలపట్టుకుని కూచ్చుని ఉన్నాడు. ఆఫీసుకు పోలేదు. యావైందని అడిగాడు, నారదుడు.

"అయ్యా నారదుడు గారూ, ఏం చెప్పమంటారు, ఏనాడన్నా కుర్చీలో కూచ్చుని ఉంటే తెలిసేది మీకు, గమ్మెంట్ నడపడం ఎంత కష్టమో! బాధ్యతలను మాత్రం తనకప్పజెప్పి, అధికారాలన్నిటినీ ఇంద్రుడికిస్తే యమధర్మరాజు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు! ప్రస్తుతం నా పరిస్థితీ అలానే ఉంది. బుష్షేమో పొద్దునోసారి, రాత్రికోసారీ ఫోను చేసి, 'వాట్ మ్యాన్, మీటింగుకు వస్తన్నావా' అని అడుగుతున్నాడు. ఎర్రదొరలేమో నా కాల్జేతులు కట్టేసారు. ప్చ్! ఏంజెయ్యాలో అర్థం కావడం లేదు" అని చెప్పి మన్మోహన్ సింగు తన రెండు అరచేతుల వెనక భాగాలతో రెండు కళ్ళను తుడుచుకున్నాడు.

నారదుడు ఆయనపై జాలిపడుతూ, సోనియా ఇంటికేసి వెళ్ళాడు. ఆమె కూడా తలపట్టుకుని ఉంది. హామెక్కూడా అంత అవసరం ఏమొచ్చిందని హాశ్చర్యపోయాడు నారదుడు. ఏంటి సంగతని అడిగాడు. హిందీ ఇంగ్లీషుల్లో ఏదో చెప్పిందిగానీ, అర్థం కాలేదు. 'పోన్లే ఇటాలియనులో చెప్పమ్మా' అని ఇటాలియనులో అడిగాడు. గండి పడిన చెరువు పరిస్థితి ఐపోయింది ఆమెది. ప్రవాహంలా మాట్టాడేసింది. దానర్థం తెలుగులో ఇది:

"మీరెవరో నాకు తెలీదుగానీ, గత ఐదేళ్ళలోనూ ఈ ముక్క నన్నడిగినవాడే లేడు. అందుకు మీకు నా గ్రేజీ! ఈ ఎర్రపార్టీ వాళ్ళని చూసారుగా.. ఇంత మొండిఘటాలను నేనెక్కడా చూళ్ళేదండి. ప్రతీ పనికీ అడ్డం పడతన్నారు. ఏ మాట మాట్టాడాలన్నా, ఏ పని చెయ్యాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలంట. మొన్న మా మనవరాలి పుట్టినరోజునాడు గౌను కొందామని చాందినీ చౌకుకు వెళ్ళాను. మమ్మల్నడక్కుండా ఎందుకెళ్ళావని ఏచూరి సీతారామ్ గారి పియ్యే గారి పియ్యే ఫోనుచేసి అడిగాడు. ఆ సంగతి మాట్టాడేందుకు రేపు యూపీయే సమావేశం పెట్టాం, అక్కడికొచ్చి సమాధానం చెప్పుకొమ్మని కూడా చెప్పాడు. ఇది చాలదన్నట్టు బర్దన్, మ్యాన్‌మోను మళ్ళీ బెదిరించాడట."

బర్దన్ అనగానే ఎవరో నారదుడికి అర్థమైంది గానీ, ఈ మ్యాన్‌మో ఎవరో అర్థం కాలేదు. "మ్యాన్‌మో నా? ఆయనెవరూ?"

"అదేనండీ మా మ్యాన్‌మోహన్ సింగ్! నిన్న సంతకాల రిపోర్టు పంపడం మర్చిపోయాడట."

'ఓహో, మన్మోహన్ సింగు పేరుకొచ్చిన బాధలా ఇవి!!' అని నారదుడు మనసులో అనుకుని "సంతకాల రిపోర్టా? అదేంటి?" అని ఆమెను అడిగాడు.

"అదేనండి, ప్రతిరోజూ ఎన్నెన్ని సంతకాలు ఎక్కడెక్కడ పెడుతున్నాడో చెప్పే రిపోర్టు. కమ్యూనిస్టుల కోసం ప్రతిరోజూ ఆ రిపోర్టు తయారుచేసి, పంపించాలి. అది పంపించకపోయేసరికి బర్దన్‌కు కోపమొచ్చింది. తనకు ఫోను చెయ్యమని పియ్యేతో చెప్పించాడట. పాపం మ్యాన్‌మో ఫోను చేస్తే 'మీ ప్రభుత్వం ఎన్నాళ్ళుంటుందో చెప్పలేనుగానీ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా నిన్నటిదీ, ఇవ్వాళ్టిదీ, రేపటిదీ సంతకాల రిపోర్టులు గనక రాకపోతే.. ఆరూ ఒకటికి మేం రాష్ట్రపతి దగ్గరకు బయల్దేరతాం' అని అన్నాడట."

"రేపటి రిపోర్టు ఇవ్వాళా!!!" నారదుడు ఆశ్చర్యపోయాడు. సోనియాకు మాత్రం అది తనకు మామూలేనన్నట్టు ఆయన ఆశ్చర్యాన్ని కించిత్తు గూడా పట్టించుకోలేదు.

"ఇన్ని కష్టాలా? పాపం!" అని మళ్ళీ తనే అన్నాడు నారదుడు.

"అంతేనా.. ఇంకా వినండి. ఇప్పుడు ఇంకో కష్టమొచ్చింది. ఈ ఎరుపు బెదిరింపులు విని భరించలేక మ్యాన్‌మో మళ్ళీ అలిగాడట. అన్నం తినను, ఆఫీసుకు పోను అని ఇంట్లోనే తలుపులేసుకుని కూచ్చున్నాడట. ఎంత పిలిచినా తీయడం లేదు. కిటికీలోంచి రాజీనామా కాగితం విసిరేసాడట. ఇప్పుడే కబురొచ్చింది. నే వెళ్తున్నా మరి!" అని వెళ్ళిపోయింది.

అక్కడి నుండి బయల్దేరి, కమ్యూనిస్టుల ఆఫీసుల మీదుగా పోతూండగా అక్కడ అన్ని రకాల కమ్యూనిస్టులూ ఒకచోట చేరి తలలు పట్టుకుని ఉండడం చూసేసరికి నారదుడు చాలా ఆశ్చర్యపోయాడు. సంగతేంటయ్యలూ అని అడిగాడు వెళ్ళి. చూడగానే నారదుణ్ణి గుర్తుపట్టేసారు అక్కడివాళ్ళు. నలుగురైదుగురు తప్పించి అందరూ కాళ్ళ మీదపడిపోయారు - నన్ను దీవించండంటే, నన్నే దీవించండంటూ! అందరికీ కలిపి దీర్ఘాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించి ఇప్పుడు చెప్పండని అడిగాడు. అందరూ ఒక్కసారే మాట్టాడ్డం మొదలెట్టారు. 'అలాక్కాదు ఆగ'మని చెప్పి, 'అందరి తరపునా నువ్వు చెప్పు కారత్' అన్నాడు.

"అధికారం మా కనుసన్నల్లో ఉందన్నమాటేగానీ మేం అనుకున్నవేమీ చెయ్యలేకపోతున్నాం. చైనా వెళ్ళి తియానాన్మెన్ స్క్వేర్‌లో పొర్లు దండాలు పెట్టుకు రమ్మని ప్రధానమంత్రికి చెప్పాం -వెళ్లలేదు. బుస్ష్షుని ఫోన్లో పిలిచి, సాలే కుత్తే కమీనే అని తిట్టమని అడిగాం -చెయ్యలేదు. పెట్రోలు ధరలు పెంచే ముందు మాకు చెప్పనే చెప్పొద్దని చెప్పాం. మాకు చెప్పకుండా పెంచేసారని ఆ తరవాత ఉద్యమం చెయ్యొచ్చు గదా అని అనుకున్నాంలెండి. కానీ ముందే సమావేశం పెట్టి మరీ మాకు చెప్పారు. ఇలా మేమనుకున్నవి ఒక్కటీ జరగలేదు. మేమంటే అస్సలు లెక్కలేకుండా పోయింది. పైగా ఈ మధ్య సమావేశాల్లో మరీ మ్యారీ బిస్కట్లు, వన్ బైటూ చాయితో సరిపెడుతున్నారు కామ్రేడ్! ఆలోచించుకోండి మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో!"

"మరి ఇన్ని కష్టాలను ఎందుకు భరించాలయ్యా? ఛీ పో అని పక్కకు తప్పుకోవచ్చుగా?"

"అదేకదండీ మా బాధ! ఆ మతవాద శక్తులు బలపడతాయేమోనని కదా మేము లౌకిక శక్తులకు మద్దతు ఇస్తున్నది. ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటే ఎలా!!" అని, నారదుడికి బాగా దగ్గరగా జరిగి, గొంతు తగ్గించి, "బాధ్యతలేమీ లేకుండా అధికారాన్ని అనుభవించే అవకాశాన్నెవడొదులుకుంటాడు, నారదా!? నువ్వు మరీనూ!" అన్నాడు కారత్.

నారదుడు కూడా గుసగుసగానే "ఔనౌను నిజమే, నిజమే!" అని, మళ్ళీ బిగ్గరగా "అవునూ.., మతవాద శక్తులంటే ఏవి?" అని అడిగాడు.

కారత్ వెంటనే లేచి, కాస్త ముందుకెళ్ళి, వీళ్ళందరివైపు తిరిగి నిలబడి, చేతిలో మైకు పట్టుకున్నట్టు అభినయిస్తూ, "కామ్రేడ్స్, మతవాద శక్తులనగా బీజేపీ" అని అన్నాడు. అక్కడితో ఆగకుండా "అది మతవాద శక్తే కాదు, సామ్రాజ్యవాద, బూర్జువా, నయా రివిజనిస్టు.."

ఆయన మాటలను అలా వింటూంటే, నార తీసెయ్యగలడని గ్రహించిన నారదుడు కారత్ ఇలా మాట్టాడుతూండగానే మాయమై సురలోకానికి పయనమయ్యాడు.

యమధర్మరాజును కలిసి చాన్నాళ్ళైందని గుర్తొచ్చి, ఓ సారి పలకరించిపోదామని అటుగా వెళ్ళాడు. అక్కడ ఆయన కూడా తలపట్టుకు కూచ్చున్నాడు. దండధరుణ్ణి ఆ విధంగా చూసేసరికి నారదుడికి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. "యమరాజా ఏంటి సంగతి అలా ఉన్నావు?" అనడిగాడు.

"నారదా, తెలుగు సినిమావాళ్ళ కారణంగా నేను ఇప్పటికే నవ్వుల పాలయ్యాను. ఇప్పుడు రాజశేఖరు చూడు, నన్ను తన పార్టీలోకి రమ్మంటున్నాడు." అన్నాడు యముడు.

"ఇతర దిక్పాలకులను ఇప్పటికే కబ్జా చేసాడు. కుబేరుణ్ణి ఏకంగా ఇంటోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు నీతో కూడా పనిబడిందా? ఏంటో పని?" అని మనసులో అనుకున్నట్టుగా బయటికే అన్నాడు నారదుడు.

మళ్ళీ తనే "అయినా వెళ్తేనే నీకు మంచిది సమవర్తీ! తనమాట వినకపోతే ఎంతటివాడినైనా వెంటాడి, వేటాడి, హింసించే గుణముంది అతడిలో."

"ఇప్పుడు నన్ను రమ్మంటున్నది కూడా అందుకేనయ్యా, నారదా. ఈమధ్య ఆంధ్రదేశాన ఆయనకు శత్రువులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారట. వాళ్లందరినీ దారిలో పెట్టేందుకు నేను ఆయనతో చేరాలట. చూడు ఎంత అన్యాయమో!"

"హతోస్మి, వెళ్ళిరా!" అని చెప్పి. 'నేనూ ఓసారి ఆంధ్ర దేశానికి వెళ్ళి అక్కడి పరిస్థితి చూసి రావాలి' అని అనుకుంటూ సత్యలోకం వైపు సాగిపోయాడు.

13 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హ చాలా బావుంది... విషయాన్ని ఎటు తిప్పినా, మళ్ళీ దేవుడి గారి దగ్గరికే వచ్చి ఆగింది కదా!!!

    రిప్లయితొలగించండి
  2. వీళ్ళు చేస్తున్న పనుల్తో సామాన్య జనం కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు వీళ్ళ పీడ మనకెప్పుడు పోతుందా అని.

    రిప్లయితొలగించండి
  3. యముణ్ణి పార్టీలోకి రమ్మనడం హైలైట్

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్ర దేశంలో నారదుడి అనుభవాలు ఎలా ఉన్నాయో చదువుదామని ఆసక్తిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. బాలకిషన్: వ్యాసం చాలా బాగుంది.అలాగే సామాన్య ప్రజలు కూడా నిత్య అవసర వస్తువుల ధరలపై చింతిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  6. యముడు ఆల్రేడీ పార్టీలోనే ఉన్నాడూ.
    ఎర్రపార్టీలే అసలయిన మతతత్వ పార్టీలు .
    వాళ్లు ఓట్ల కోసం బంగ్లాదేశ్ ముస్లింలకు గేట్లు ఎత్తి వేయటంతో వాళ్లు మన మీద పడి బాంబులు వేస్తున్నారు.

    బిజెపి పాకిస్తాని టెర్రరిజాన్ని సమర్దంగా అరికట్టింది. ఇప్పుడు మనకి బంగ్లాదెశ్ వాల్ల నుంచే ముప్పు. హైదరాబాద్ ,జైపూర్ బాంబు పే్లుల్లు వాళ్ల చలువే.

    రిప్లయితొలగించండి
  7. నారదుడుకి, ఈనాడు విశాలాంధ్రభూమిలో తిరిగేటప్పుడు, ముందు జ్యోతిని, పక్కన సాక్షి ని పెట్టుకుని, ప్రజాశక్తి వార్తలను సూర్యుడి వెలుతుర్లో పరికించకపోతే కష్టమని చెప్పండి!

    రిప్లయితొలగించండి
  8. వ్యాఖ్యాతలందరికీ..
    నెనరులు. నారదుడు మనూరెప్పుడొస్తాడో నేను గమనిస్తూనే ఉంటానులెండి.

    నెటిజెన్, నారదుడు రేలంగీ ఏవీయెస్సుల్లా సాత్వికంగా కనబడతాడుగానీ, సీయెస్సారులా చతురుడు సుమండీ! ఆయనకన్నీ తెలుసు!!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు