8, జూన్ 2008, ఆదివారం

మేటి దివిటీలు - 2

బాపు
బామ్మ (బాపు బొమ్మ) గురించి తెలీని తెలుగువారుండరు. మన మేటి చిత్రకారుడు బాపు. మన మేటి సినిమా దర్శకుడు బాపు. మేటి కార్టూనిస్టు బాపు. మేటి రామభక్తుడు బాపు. మేటి దివిటీల్లో బాపు ఒకడు.

స్నేహానికి మేటి ప్రతీకల్లో బాపు ఒకడు. బాపు, రమణల స్నేహం జగద్విదితం. వీరిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని వీరిని ద్వంద్వ సమాసమని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ
ద్వంద్వ సమాసాన్ని ఇక్కడ విడదీసిన పాపం నాదే! బాపు తన సినిమాలకు గాను అనేక మంది సాంకేతికులతో కలిసి పనిచేసాడట. ఒక్క మాటలు కుట్టే పనికి మాత్రం రమణను తప్పించుకోలేకపోయాడు. "ఆ సంకెళ్ళకూ జై" అంటూ స్వయంగా ముళ్ళపూడి వెంకట రమణ చెప్పిన మాటే అది. రచనలోని గొప్పదనాన్ని తన బొమ్మలతో బాపు మింగేస్తాడని రావిశాస్త్రి వాపోయాడట.

బాపు బొమ్మల గురించి చెప్పిన మాటల్లో చిరస్మరణీయమైనది మరొకటుంది..
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో పద్యాభిషేకం చేసాడు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఆ చేతిరాత ఒక ఫాంటై అలరిస్తోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆ మేటి దివిటీకి నా హారతి..
బాపు గీసిన బొమ్మ
చూసినంతనె బ్రహ్మ
కండ్ల మెరిసెను చెమ్మ
తెలుగు బిడ్డా!
ఎనిమిది కళ్ళు చెమ్మగిల్లిన కారణం..
మహిమలున్నను చెంత
మలచలేనని సుంత
ఈర్ష్య తోడను కొంత
ఓ తెలుగు బిడ్డా!
ఈర్ష్యతోనట! కానీ ఆ కారణం కొంతే.. మరి మిగతా కారణమేంటో...
అం..త బాపును కూడ
తానె చేసినవాడ
ననెడి గర్వము తోడ
తెలుగు బిడ్డా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఆ మహానుభావుడికి, ఆ సత్తిరాజు లక్ష్మీనారాయణకు, ఆ బాపుకు పద్మ పురస్కారాన్ని ప్రదానం చేసే అవకాశాన్ని, తద్వారా తమ్ము తాము గౌరవించుకునే అవకాశాన్నీ పొందలేని అజ్ఞానులపై నాకు సానుభూతి కలుగుతోంది.

ప్రజల గుండెల్లో పటం కట్టుకుని ఉన్నవాడికి ఏ పురస్కారాలూ అవసరం లేదులే!

8 కామెంట్‌లు:

 1. తోటి తెలుగువాణ్ణి గౌరవిస్తే వాడు తెలుగువాడెలా అవుతాడు ?

  రిప్లయితొలగించండి
 2. బాగుంది. ఇటివలి కాలంలో పద్మ పురస్కారాలు ఇస్తున్న వ్యక్తులను బట్టి చూస్తే నాకయితే ఆ పద్మాల మీద సదభిప్రాయం లేదు.

  ఆయనకి చాలా మంది పద్మ గ్రహీతలకి లేనంత గుర్తింపు ఉంది. కాబట్టి అది వాళ్ళ ఖర్మే.

  రిప్లయితొలగించండి
 3. బాపు గారికి పద్మ అవార్డు వసే, అది ఆ అవార్డుకు గౌరవమేగానీ ఈయన కళను ప్రేమించడానికి అదొక అర్హత మాత్రం కాదు కదా!

  ఇక తెలుగువాడి ‘కలా పోసన’కొస్తే, పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉందన్నది, అక్షరసత్యం. ఒక కళాకారుడి పేరు చెబితే తన కాళాప్రతిమలు గుర్తుకు రాక, ఆ కళాకారుడి కులమో లేక తన రాజకీయబలిమో,లేక పనికి రాని ‘వాదాలో’ గుర్తొచ్చేంతగా మన మెదళ్ళు మొద్దుబారిపోయాయి. ఇక కళాపోషణకు కావలసిన సున్నితత్వం,సహృదయతా ఎక్కడ మిగిలింది.

  రిప్లయితొలగించండి
 4. బాపు గీతకి పద్మ గుర్తింపు కావాలా?
  పద్మ ఇచ్చేవారికి బాపు కి ఇచ్చిన గుర్తింపు అవసరమా?

  రిప్లయితొలగించండి
 5. ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉందండి.బాపు రమణలకు సినిమాపరిశ్రమకు చెందినవారిగా పద్మ బహుమతి ఇచ్చేపనైతే మొదట ప్రదానం చేసేది పద్మశ్రీ.అది పద్మబహుమతులన్నిటిలో చివరి నుంచి మొదటిది.కానీ బాపురమణలు ఆ ప్రాధమికస్థాయి దాటి ఏనాడో అత్యున్నతకీర్తిశిఖరాలు అధిరోహించారు.కార్టూనిస్టు,రచయితలుగా వారికి బహుశా రొటేషన్లో వస్తాయేమో చూద్దాం.అయినా ఆ ప్రదానాలు,పురస్కారాలు రాకపోయినా,లేకపొయినా వారి కీ,సావిత్రి,యస్వీరంగారావు తదితరులతోపాటు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా?
  దివంగత యన్టీయార్ హయాంలో బాపు,రమణ తెలుగుభాషావికాసం,ప్రాచుర్యం,ప్రాశస్త్యాల కోసం ఎన్నో ప్రాజక్టులకు రూపకల్పన చేసి ఇచ్చారు.అవన్నీ తర్వాతవచ్చిన నారాచంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఏచెత్తబుట్టలోకి చేరుకున్నాయో ఎవరికీ తెలియదు.వాటిని అసలురూపంలో వెలుగులోకి తీసుకురాగలిగేట్టు ప్రయత్నించటం వారికి తెలుగువారు అర్పించగల నిజమైన నివాళి కాగలదు.

  రిప్లయితొలగించండి
 6. నమస్తే చదువరి గారు,

  నేను ఇంటెర్నెట్ లొ బాపు గారి బొమ్మలు వాల్ పేపర్సుగా ఉన్నయెమొ వెతికాను. నాకు దొరకలెదు. మీకేమయినా తైలిస్తే చెప్పగలరు.

  ఢన్యవాదములు,
  భాను ప్రకాష్

  రిప్లయితొలగించండి
 7. వ్యాఖ్యాతలకు నెనరులు.
  భానుప్రకాష్ గారూ, ఈ లింకులు చూడండి:
  http://www.bapubomma.com/
  http://www.bapuart.com
  http://bapuartcollection.com

  అలాగే ఈ వికీపీడియా లింకు (http://te.wikipedia.org/wiki/బాపు) కూడా చూసి, ఆ వ్యాసంలో ఏమైనా మార్పులు చేర్పులూ చెయ్యాలేమో చూడగలరు. పై లింకులను నేను అక్కడినుండే తీసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 8. అవార్డ్ లకు అందని మహొన్నత స్రుజన బాపు గారిది, గతంలొ ఈ అవార్డ్ లను పొందినవారిని చూస్తే నిజానికి వారి సరసన వీటిని స్వీకరించడం బాపుగారికి మహా అవమానం

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు