5, ఏప్రిల్ 2008, శనివారం

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు - బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..

"...నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని..."

జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.

అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.

శభాష్ అనితా!

2 కామెంట్‌లు:

  1. క్రికెటేతర క్రీడలకు, క్రీడాకారులకు మనదేశంలో ప్రభుత్వానికి, క్రీడా సంఘాలకు ఉన్న ఆసక్తికి ఈ సంఘటన అద్దం పడుతోంది.

    రిప్లయితొలగించండి
  2. పై వ్యాఖతో నేను పూర్తిగా ఏకీభవించలేను. మన దేశంలో మిగతా క్రీడలు ఎందుకు వెనుకబడ్డాయంటే క్రికెట్ కారణంగా అని చెప్పటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్రికెట్ కోసం ప్రభుత్వం చేసిందేముంది? బి.సి.సి.ఐ. ప్రభుత్వ సంస్థ కాదు. ప్రభుత్వ తోడ్పాటు లేకుండా క్రికెట్ ఈ స్థాయికెదగటం వెనుక బి.సి.సి.ఐ. పెద్దల వ్యాపార దక్షత ఉంది. దాన్ని మిగతా క్రీడా సంఘాలు ఆదర్శంగా తీసుకుని ఆయా క్రీడల ఎదుగుదలకు కృషి చెయ్యాలేగానీ క్రికెట్ మీద పడి ఏడవటమెందుకు? జనాలెన్నడూ గెలిచే ఆటల మీదనే మోజు పెంచుకుంటారు. క్రికెట్ లో మనవాళ్లేదో పోటుగాళ్లని కాదుగానీ, మిగతా ఆటలతో పోలిస్తే క్రికెట్ జట్టు సాధించిన విజయాలే ఎక్కువ. గెలుపు బాటలో పడితే హాకీని కూడా అలాగే నెత్తినెత్తుకుంటారు. సెలెక్షన్ లో రీజనల్ రాజకీయాలెన్నున్నా, ఉన్నంతలో క్రికెట్ లోనే ప్రతిభకి పట్టం కట్టటం ఎక్కువ. బోర్డు పెద్దలెంత మింగినా, ఆటగాళ్లకి కూడా లోటు లేకుండా రాబడి వస్తుంది. అవి రెండూ లోపించబట్టే మిగిలిన ఆటలకు జనాల్లో ఆదరణ లేకుండా పోయింది. లోపం అది. దిద్దాల్సింది కూడా దాన్నే. క్రికెట్ ని బూచిగా చూపటం ఈ సమస్యకి విరుగుడు కాదు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు