హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు.
అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని ఆకట్టుకోడానికి ఈ ఆటలో బోల్డంత గ్లామరుంది. అంచేత సముద్రం లేకపోయినా, బీచి లేకున్నా ఆడిస్తారు. డబ్బులిచ్చేవాడుంటే ఇదే ఆట సియాచిన్ గ్లేసియరులో కూడా ఆడించగలరు. అంతా మార్కెటింగు మాయ! అందాల సుందరి ఎంపికలు, పిల్లి నడకలు (వాటితో పాటు.. ముందే ఏర్పాటు చేసిన క్యాట్‌వాక్ మిస్‌హ్యాపులు),.. అన్నీ మార్కెటింగు మాయలే! ఏదేమైనా, ఈ బీవా పుణ్యమా అని పత్రికలోళ్ళకి పెద్ద శ్రమ పడకుండానే పేజీలు నింపుకునే అవకాశమొచ్చింది. మామూలుగా ఆటల పేజీల్లో వెయ్యాల్సిన ఈ బొమ్మలు విస్తరించి, ముందు పేజీల్లోకి కూడా వ్యాపించాయి. పేపర్లమ్ముకోవాలి కదా మరి!
ఆవిధంగా.. హై.కి బీచొచ్చేసింది. అయితే హై. లో ఈ పాటికే ఇంకో బీచుంది. అక్కడ ఆడేది, రాజకీయ నాయకులు. వాళ్ళు ఓ బంతాట (రాజకీయుల బంతాట - రాబం) ఆడుతూ ఉంటారు. ఈ రాబం కూడా బీవాలాగే ఉంటుంది. కాకపోతే బంతి.. మనం! అవిశ్వాస, విశ్వాస, శ్వాస,.. ఇలా రకరకాల పేర్లతో పోటీలు పెట్టేసుకుంటూ ఉంటారు.
బీ.వాలో ఎంచక్కా బట్టలు విడిచేసి ఆడతారు. ఆ ఆటకు అదో ముఖ్యమైన నిబంధన. సిగ్గు పడకుండా (లేకుండా), ఒళ్ళు దాచుకోకుండా ఆడాలన్నమాట! రాబం లో కూడా అంతే.. సిగ్గుపడకుండా విలువల వలువలిప్పి ఆడేస్తారు. బీవాలో రెండు ముక్కలన్నా అడ్డం పెట్టుకుంటారు.. రాబంలో అవీ ఉంచరు.
బీవాలో ఆటనెవరూ పట్టించుకోరు. ఆటలో ఎవరు బాగా ఎగిరారు, ఎవరు బాగా ఊగారు, ఎవరు హొయలతో బాగా అలరించారు ఇవే ముఖ్యం. ఎవరు గెలిచారు ఎవరు ఓడారనేది ఎవరికీ పట్టదు - ఆడేవారికీ చూసేవారికీ కూడా. ఎవరు బాగా ఆడారు అనేదాన్ని పట్టించుకునే వారి కంటే.., మన సినిమాల్లో హీరోయిను బాగా నటించిందా లేదా అనేది గమనించేవారే ఎక్కువ!
అలాగే మన రాజకీయులు చేసే చర్చల్లో - ఎవరు ప్రజాసమస్యల గురించి మాట్లాడారు, ఎవరు బాగా మాట్లాడారు, ఎవరు తర్కబద్ధంగా వాదించారు, ఎవరు నిజాయితీగా మాట్లాడారు అనేది ఎవరికీ అక్కరలేదు. ఎవరు గట్టిగా అరిచారు, ఎవరు బాగా బూతులు తిట్టారు, అవతలోణ్ణి మాట్టాడనివ్వకుండా ఎవరు ఎక్కువ గోల చేసారు.. ఇలాంటివే ముఖ్యం. డెసిబల్ స్థాయే కావాలి, అంతే! అదే కొలత. అక్కడ కూడా ఫలితం ముఖ్యం కాదు -గోలే ముఖ్యం.
బీవాలో లేని ప్రత్యేకత ఒకటి రాబంలో ఉంది.. బీవాలో ఆట తప్ప అన్నీ మనం పట్టించుకుంటాం. రాబంలో మాత్రం దేన్నీ పట్టించుకోం. ఎవడెట్టా పోయినా మనకు అనవసరం. బీవాకీ, రాబం కీ అదే తేడా.
అయితే..
బీవాలో కూడా రిఫరీ ధృతరాష్ట్రుడి లాగా, చేతకానివాడి లాగా, బక్కకోపంతో, ఒక పక్షం వారి కనుసన్నలలో డ్యాన్సాడుతూ ఉంటాడా అనేది నాకు తెలీదు. అంచేత ఆ పోలిక చెయ్యలేను.
ఒక్క మాట లో, మన అచ్హ తెలుగు లో చెప్పాలి అంటె కుమ్మేశారు అండి.. అహ ఏమి పోల్చారు.. మీ స్రుజనాత్మక శక్థి కి హాట్సాప్..!!!
రిప్లయితొలగించండిsuper, completely out of the box
రిప్లయితొలగించండిబీవా .. రాబం ...సూపర్!
రిప్లయితొలగించండిఐనా బీవా రిఫరీ ధృతరాష్ట్రుడెందుకవుతాడు. ఐతే గియ్తే ఇంద్రుడవుతాడు. వాడికి రెండేపులా చూసెందుకు బహుశా వొళ్ళంతా కళ్ళే
Dr. Ram$, sriku, కొత్త పాళీ: మీ వ్యాఖ్యలకు సంతోషం! కొత్తపాళీ గారూ.., మీరన్నది రైటే.. ఆ ఆట చూడ్డానికి వెయ్యి కళ్ళు కావాల్సిందే!:)
రిప్లయితొలగించండిచదువరిగారు,
రిప్లయితొలగించండిపోలిక భలే చెప్పారు !!:)
అవునూ మీరు బీవా వెళ్ళి చూసారా????
అన్నా! బాగా వ్రాసినావు. ఇంగో ఆట గుడక ఉంది. ప.పి (పత్రికల పిడకలాట). యాల్ల పొద్దు పొడవంగనే ఒక్క తీర్గ కులం పిచ్చితోని పిడకలు కొట్టెడిది.
రిప్లయితొలగించండిజ్యోతి: చూళ్ళేదండి.
రిప్లయితొలగించండితెలుగు అభిమాని: :)
చాలా బాగా compare చేసారండి.
రిప్లయితొలగించండివావ్! అసెంబ్లీ రసాభాసని ఇంతద్భుతంగా చిత్రించగలగడం మీకే చెల్లింది.
రిప్లయితొలగించండిఈ రాజకీయులు మీ బ్లాగు చదివితే బాగుండును.
--ప్రసాద్
http://blog.charasala.com